Jump to content

వేగా కోటేశ్వరమ్మ

వికీపీడియా నుండి

డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ (1925 - 2019) విద్యావేత్త, ఉత్తమ ఉపాద్యాయురాలు.మాంటిస్సోరి మహిళా విద్యాసంస్థల స్థాపకురాలు.భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కార గ్రహీత.

డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ
దస్త్రం:Dr.V.Koteswaramma.jpg
విద్యావేత్త, మాంటిస్సోరి మహిళా విద్యాసంస్థల స్థాపకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
జననం15 సెప్టెంబరు 1925
కృష్ణా జిల్లా గోసాల గ్రామం
మరణం30 జూన్ 2019
విద్యM.A.,B.Ed, Ph.D
సంస్థమాంటిస్సోరి విద్యాసంస్థలు
మతంహిందువు
భార్య / భర్తవి.వి.కృష్ణారావు
తల్లిదండ్రులుశ్రీమతి మీనాక్షి ,వెంకయ్య
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం - 2017

జననం, విద్య

[మార్చు]

కోటేశ్వరమ్మ కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో1925 సెప్టంబరు 15న శ్రీమతి మీనాక్షి, వెంకయ్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి వెంకయ్య ఈడుపుగల్లు ప్రాథమినోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు. కోటేశ్వరమ్మ విద్య పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరిచేవారు. అరిపిరాల సత్యనారాయణనే విద్వాంసుని వద్ద ఆమెకు సంగీతం నేర్పించారు. ఇంటి వద్దనే చదువుకుంటూ తర్వాత విజయవాడ లోని బిషప్‌ హజరయ్య హైస్కూల్లో చేరారు. ఆమె నివసిస్తున్న ఈడుపుగల్లు నుంచి విజయవాడకు ఒకమ్మాయి చదువుకోసం వస్తుంటే అదో పెద్ద నేరమైనట్టు వింతగా చెప్పుకునే వాతావరణంలో అక్కడ నాలుగేళ్లపాటు చదివి, ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తిచేశారు.

ఆ తర్వాత కాకినాడ పిఠాపురం రాజా (పిఆర్‌) కళాశాలలో ఇంటర్‌ చేరారు. పిఠాపురం రాజాకి కందుకూరి వీరేశలింగంపై అభిమానం ఉండటాన ఆ కళాశాలలో మహిళలకు సగం ఫీజు మాత్రమే ఉండేది. ఇంటరు పూర్తయ్యాక గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో చదివి 1945లో బి.ఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. రాజమండ్రిలో బిఇడిలో చేరి1947లో ఆ కోర్సు పూర్తిచేశారామె. విద్యార్థి దశలోనే ఆమెకు వామ పక్ష భావజాలం ఏర్పడింది. 1947 లో ఆమెకు వి.వి. కృష్ణారావు తో గోసాలలో ఆదర్శ వివాహాం అయింది.

బి.ఇడి పూర్తిచేసిన ఆమె ఓ విద్యాసంస్థ పెట్టాలని అనుకొని, గుజరాత్‌లోని సేవాగ్రాంలో గాంధీ ఆశ్రమాన్ని చూడటానికి వెళ్లారు. అక్కడి ఆశ్రమ నిర్వహణ ఆమెనెంతో ముగ్ధురాలిని చేసింది. అంతకుముందు నెల్లూరు నివాసి పొణకా కనకమ్మ మన రాష్ట్రంలో గాంధీజి సతీమణి పేరిట కస్తూరిభా దేవి గరల్స్‌ హైస్కూలు ఏర్పాటు చేశారు. అందులో కోటేశ్వరమ్మ ఉపాధ్యాయినిగా చేరి 1954 వరకూ ఏడేళ్ళు ఉపాధ్యాయినిగా పనిచేశారు.[1] ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి 1972 లో ఎం.ఎ (తెలుగు), 1980లో డాక్టరేట్ చేసారు[2].

మాంటిసోరి విద్యాలయాలు

[మార్చు]

1955 లో విజయవాడలో మాంటిసోరి విద్యాసంస్థ పేరుతో చిన్న చిన్న షెడ్లతో 20 మంది విద్యార్డులతో మాంటిస్సోరి పాఠశాలను స్థాపించారు. రెండేళ్లు గడిచేసరికి ఈ పాఠశాల 1,650 మందికి పెరిగింది. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో ఓ పక్కా భవనం నిర్మాణం చేపట్టారు. ఆనాడే రూ.99 వేలు వచ్చాయి. పాఠశాల పిడబ్ల్యుడి స్థలంలో ఉంది. పాఠశాల అభివృద్ధి, మంచి ఫలితాలు చూసి మంత్రి అల్లూరి సత్యనారాయణ రాజు ఆ స్థలాన్ని మాంటిస్సోరి విద్యాసంస్థలకు ఇప్పించారు. మహిళా విద్యను ప్రోత్సహించాలని ప్రత్యేక మహిళా విద్యాలయాలు స్థాపించారు.

మాంటిస్సోరి విద్యాసంస్థలు ఆధ్వర్యంలో మాంటిస్సోరి మహిళా కళాశాలనేగాక, మాంటిస్సోరి మహిళా పిజి కళాశాల కూడా ఏర్పాటైంది. ఈ విద్యాసంస్థల్లో నాటి నుంచి నేటి వరకూ లక్ష మందికి పైనే విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో ఎంతో మంది దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పేద బాలికలు, యువతులెందరికో ఉచిత విద్య అందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థను ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, నాటి రాష్ట్రపతి వి, వి.గిరి, శాసనమండలి సభాపతి గొట్టిపాటి బ్రహ్మయ్య, ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ బుల్లెయ్య, ఎన్టీ రామారావు తదితరులు ఎంతోమంది సందర్శించారు.

పురస్కారాలు

[మార్చు]
  • 1971లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును నాటి రాష్ట్రపతి వివి గిరి నుంచి స్వీకరించారు.
  • 1980 లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు.
  • 2016 లో 60 సంవత్సరాలు పాటు విద్యాలయాలను నిర్వహించినందులకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
  • 2017 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం[2]

రచనలు

[మార్చు]

డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ ‘ఇల్లు-ఇల్లాలు’ అనే మాసపత్రికను 39 ఏళ్ల పాటు నడిపారు. ఆమె మహిళాభ్యుదయంపై దాదాపు 35 పుస్తకాలు రాశారు. ఈమె అనేక ప్రభుత్వ సంస్థల్లోనూ సభ్యత్వం పొందారు.

మరణం

[మార్చు]

మాంటిసోరి కోటేశ్వరమ్మగా లబ్ధ ప్రతిష్ఠిరాలైన ఈమె విజయవాడలో 2019 జూన్ 30న 94 ఏళ్ళ వయస్సులో మరణించారు. కోటేశ్వరమ్మ ఇప్పుడు భౌతికంగా దూరమైనా ఆమె స్థాపించిన విద్యాసంస్థలూ, అందించిన సేవలూ కలకాలం నిలుస్తాయి. ఒకానొక మహిళా తరం ఎగరేసిన ధైర్య పతాకం కోటేశ్వరమ్మ. ఆమె స్ఫూర్తి ఎప్పటికీ జ్వలిస్తూనే ఉంటుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "మహిళామణులకు ఆదర్శం-మాంటిస్సోరి కోటేశ్వరమ్మ". 2021-07-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "Padma award at ripe age of 92 for Montessori founder". The Times of India. Retrieved 2017-01-26.
  3. "Educationist Koteswaramma dies at 94". The Hindu. Retrieved 2019-07-01.