Jump to content

వేగుంట మోహన ప్రసాద్

వికీపీడియా నుండి
(వేగుంట మోహనప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
వేగుంట మోహన ప్రసాద్
వేగుంట మోహన ప్రసాద్
జననంవేగుంట మోహన ప్రసాద్
జనవరి 5, 1942
పశ్చిమగోదావరి జిల్లాఏలూరు మండలం వట్లూరు గ్రామం
మరణంఆగష్టు 3, 2011
విజయవాడ
ఇతర పేర్లుమో
వృత్తిఇంగ్లీషు లెక్చరర్
ప్రసిద్ధిప్రముఖ సాహితీ వేత్త,బహుముఖ ప్రజ్ఞాశాలి,
పదవి పేరుఅధివాస్తవిక కవి
పిల్లలుఏకైక కుమార్తె "మమత"
తండ్రిసుబ్బారావు
తల్లిమస్తానమ్మ

వేగుంట మోహనప్రసాద్ (జనవరి 5, 1942 - ఆగష్టు 3, 2011), ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందాడు . ఆయన తాడికొండ మండలం లాంలో జన్మించారు. స్వస్థలం ఏలూరు సమీపంలోని వట్లూరు . తండ్రి సుబ్బా రావు టీచర్. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందాడు. విజయవాడ లోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడు. అంతకు ముందు మూడేళ్లపాటు నైజీరియాలో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశాడు[1]. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

గుంటూరు సమీపంలో లాం గ్రామంలో 1942, జనవరి 5 న సుబ్బారావు, మస్తానమ్మ దంపతులకు జన్మించారు.ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. చేశారు. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు.సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఆంగ్ల శాఖాధిపతిగా 2000 జూలై 31న ఉద్యోగ విరమణచేసి ఆ తర్వాత ఐదేళ్లు ద్రవిడ విశ్వవిద్యాలయంలో అనువాద విభాగానికి నేతృత్వం వహించారు. కవిగా, అనువాదకునిగా ఆయన అపార ప్రతిభ కనబర్చారు.ఈయనకు భార్య సుజాత, కుమార్తె మమత ఉన్నారు.

సాహితీవేత్తగా

[మార్చు]

ఆయన వ్రాసిన మొట్టమొదట కవిత "హిమానీహృది" 1960 మే నెల భారతి పత్రికలో ప్రచురించబడింది. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ చితి-చింత (1969) మో కి తెలుగు కవుల్లో ఒక ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. తెలుగు పాఠకులకు 1969లో చితి-చింత కవితా సంపుటితో మో పరిచయమయ్యారు. 1970 దశకం దాకా ఉన్న కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయాలన్న తపనతో ది టెన్స్ టైమ్ను ప్రచురించారు. కరచాలనం గ్రంథం (1999), రహస్తంత్రి కవితా సంపుటికి మంచి పేరువచ్చింది. బతికిన క్షణాలు (1990), పునరపి (1993), సాంధ్యభాష (1999), వెన్నెల నీడలు (2004) కవితాసంపుటాలు అపురూప కవిగా స్థిరపరిచాయి. ఈ మధ్య ఖాదర్ మొహియుద్దీన్ -టిఎస్ ఇలియట్ వేస్ట్‌లాండ్ను చవిటిపర్ర (2011) పేరిట చేసిన అనువాదానికి మో టీకా-టిప్పణి సమకూర్చారు. ఆత్మశ్రీయ ధోరణికి పెద్దపీట వేస్తూనే స్వాప్నికునిగా అన్వేషకునిగా తెలుగు సాహిత్యంపై మో చెరగని ముద్ర వేశారు.

అవయవ దానం

[మార్చు]

ఆయన అస్వస్థతగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత రోజైన ఆగష్టు 3, 2011 ఉదయం ఆయన కోమాలోకి వెళ్ళిపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ మీద ఉంచారు. హైదరాబాద్‌లోని మోహన్ ఫౌండేషన్‌కు తన మూత్ర పిండాలు, కాలేయం, నేత్రాలను దానం చేస్తానని వారికి మోహన్ జీవించి ఉన్న కాలంలో అంగీకార పత్రం రాసి ఇచ్చారు. ఆయన తుది కోరిక నెరవేర్చడం కష్టమైన పని అయినప్పటికీ కుటుంబ సభ్యులు వైద్యులకు పూర్తిగా సహకరించారు. మోహన్ కోరిక ప్రకారం దానం చేస్తానన్న అవయవాలను తీసుకోవాలంటే శరీరం, కణాలు పూర్తిగా నిర్జీవం కాకూడదని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో మోహన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు సమ్మతితో తెల్లవారు జామున నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు ప్రత్యేక సర్జరీ ద్వారా మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు తొలగించి భద్రపరిచారు.నేత్రాలను మాత్రం నగరంలోని ఐ బ్యాంక్‌కు ఇచ్చారు. రెండు మూత్రపిండాలు, కాలేయం ఛార్టర్డ్ విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్ళారు.

రచనలు

[మార్చు]
  • చితి-చింత
  • పునరపి
  • రహస్తంత్రి
  • నిషాదం
  • సాంధ్యభాష
  • బతికిన క్షణాలు (జీవిత చరిత్ర)
  • Silent Secret
  • This Tense Time (175 తెలుగుకవుల ఆంగ్లానువాదాల సంకలనం - సంపాదకత్వం)
  • కరచాలనం పేరుతో వ్యాసాల ద్వారా ప్రసిద్ధ రచయితలను పాఠకులకు పరిచయం చేశారు.

అవార్డులు, సత్కారాలు

[మార్చు]
  • ఆయన తొలి కవితా సంకలనం చితి- చింతకు 1969లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది.
  • చివరి కవిత్వం నిషాదం. దీనికి తణికెళ్ల భరణి అవార్డు లభించింది.

సూచికలు

[మార్చు]
  1. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు పుస్తకం నుండి

యితర లింకులు

[మార్చు]