వేదాంతం పార్వతీశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేదాంతం పార్వతీశం
వ్యక్తిగత సమాచారం
జననం(1920-09-24)1920 సెప్టెంబరు 24
కూచిపూడి
మరణం2005
సంగీత శైలినాట్యం
వృత్తికూచిపూడి నృత్య కళాకారుడు,
కూచిపూడి నాట్య గురువు

వేదాంతం పార్వతీశం(1920-2005) కూచిపూడి నాట్యకళాకారుడు.[1]

విశేషాలు

[మార్చు]

ఇతడు 1920, సెప్టెంబరు 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూచిపూడి గ్రామంలో పుణ్యవతమ్మ, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు చింతా వెంకటరామయ్య, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్యల వద్ద కూచిపూడి యక్షగానాలను నేర్చుకున్నాడు. యేలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు ఢిల్లీ, జయపూర్‌లలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో తన నృత్యప్రదర్శన ఇచ్చాడు.

ఇతడు ఎరుక, అర్ధనారీశ్వరుడు, దక్షయజ్ఞం, ప్రవరాఖ్య, పేరణి శంకరప్ప, దాదీనమ్మ, శివమోహినులు మొదలైన కూచిపూడి నృత్యరూపకాలను రచించి వాటికి నృత్యాన్ని సమకూర్చి తన శిష్యులచే నటింపజేశాడు. ఇంకా ఇతడు తిల్లానాలు, జావళీలు ఎన్నో రచించాడు. నాట్యకళ మాసపత్రికలో నృత్యానికి సంబంధించి అనేక రచనలు చేశాడు. సిద్ధేంద్రయోగి భామాకలాపం, ప్రహ్లాద నాటకం, కూచిపూడి నాట్యదర్పణం,[2] కూచిపూడి మేళకర్తలు, గొల్లకలాపం, నృత్య తరంగిణి, ధూర్జటి కలాపం వంటి గ్రంథాలను ప్రచురించాడు. ఇంకా చింతామణి, ఉషాపరిణయం,హరిశ్చంద్ర, పగటివేషాలు, నాట్యమేళా, రాసలీల, జముకుల గేయాలు వంటి అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.

ఇతడు 1952లో బందా కనకలింగేశ్వరరావుతో కలిసి కూచిపూడిలో సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని స్థాపించాడు. ఈ సంస్థ ఆరంభం నుండి దానిలో పనిచేసి దానికి ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశాడు.[3] 1954లో కూచిపూడి పతాకాన్ని ఆవిష్కరించాడు.

ఇతని శిష్యులలో పసుమర్తి రామలింగశాస్త్రి, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం రాధేశ్యాం, పసుమర్తి కేశవప్రసాద్, చింతా సీతారామాంజనేయులు, యేలేశ్వరపు నాగేశ్వర శర్మ, చింతా రామము, భాగవతుల మోహన్ రావు మొదలైనవారు ఉన్నారు.

కేంద్ర సంగీత నాటక అకాడమీ 1994లో ఇతనికి కూచిపూడి నాట్యంలో అవార్డును ప్రకటించింది.

మూలాలు

[మార్చు]
  1. web master. "Vedantam Parvateesam". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 9 మార్చి 2021. Retrieved 13 May 2021.
  2. వేదాంతం పార్వతీశం (1979). కూచిపూడి నృత్యదర్పణం (1 ed.). కూచిపూడి: వేదాంతం పార్వతీశం. p. 216. Retrieved 13 May 2021.
  3. web master. "Vedantam Parvateesam". Kuchipudi Art Academy. Retrieved 13 May 2021.