వేదాంతం రాధేశ్యాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాంతం రాధేశ్యాం ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారుడు. కూచిపూడి నాట్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1955 నవంబరు 1 న కూచిపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన వేదాంతం వెంకట సూర్యనారాయణ, సత్యవతమ్మల మూడో కుమారుడు. చిన్ననాటి నుండి తండ్రి, పినతండ్రి, సోదరులు ప్రదర్శించే కూచిపూడి నాట్యం పట్ల ఆకర్షితులైన రాధేశ్యాం ఐదో ఏటనే పిన తండ్రి కళావాచస్పతి వేదాంతం పార్వతీశం వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణకు అంకురార్పణ చేశారు. రాధేశ్యాంలోని ఆసక్తిని గుర్తించిన సోదరుడు సీతారామశాస్ర్తీ నాట్య మెలకువలు నేర్పారు. పివిజి కృష్ణశర్మ వద్ద కర్ణాటక సంగీతం, యక్షగానంలో, పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్య నాటకాలలో, పెదసత్యం వద్ద కూచిపూడి నాట్యంలో, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ వద్ద స్ర్తి వేషంలో, సినీ దర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి వద్ద పదాభినయంలో, బొక్కా కుమారస్వామి వద్ద థిల్లాన, వర్ణాలు, ఏలేశ్వరపు శ్రీనివాస్ వద్ద సంగీతంలో, భాగవతుల సత్యసుందర రామకృష్ణ వద్ద యక్షగానంలో ఆయన శిక్షణ పొందారు. తాను నేర్చిన కూచిపూడి నాట్యంలో వేలాది మంది కళాకారులకు శిక్షణ ఇచ్చి ప్రయోజకులను చేశారు.[2]

కుచిపూడి కళకు ఆయన దేశ విదేశాలలో మంచి ప్రాచుర్యం కల్పించాడు. అమెరికా, ఐరోపా దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి ప్రశంసలను అందుకున్నాడు. ఆయన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పరిధిలోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ, యోగి కూచిపూడి కళాపీఠంలో శిక్షకునిగా ఉన్నాడు.[3][4] సత్యభామగా, గొల్లభామగా, సూత్రధారిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన ఆయన అనేక పురస్కారాలను పొందారు. ఆయన కుమారులైన వేదాంతం సత్యనరసింహశాస్త్రి[5] వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్లు కూడా కూచిపూడి నాట్యకారులు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేస్తున్నారు.[6]

పురస్కారాలు[మార్చు]

  • 2011లో నందన పురస్కారం,
  • 2013లో హంస అవార్డు,
  • 2014లో పసుమర్తి కృష్ణమూర్తి మెమోరియల్ జీవన సాఫల్య పురస్కారం,
  • పీవీజీ కృష్ణశర్మ స్మారక పురస్కారం
  • 2015 సంగీత నాటక అకాడమీ పురస్కారం

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]