వేదిక:ఆంధ్రప్రదేశ్/పరిచయం1
తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1న హైదరాబాదు రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
ఈ విశాలాంద్ర ఏర్పడటానికి ముందు జరిగిన ఉద్యమాలు, సంభవించిన పరిణామాలు ఎన్నెన్నో. అనేక వ్యక్తుల కృషి, పలువురి త్యాగధనుల ఫలితంగా 1953, అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అంతకు క్రితం తెలుగువారు తమిళనాడు రాష్ట్రంలోనూ, హైదరాబాదు రాష్ట్రంలోనూ ఉండేవారు. 1952, 1953లలో గొల్లపూడి సీతారామశాస్త్రి, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహారదీక్షలు చేశారు. 58 రోజుల నిరాహారదీక్ష అనంతరం ప్రాణాలు కోల్పోయిన పొట్టి శ్రీరాములు కృషి ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇవ్వక తప్పలేదు. కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం మరియు హైదరాబాదు రాష్ట్రం ఇలా తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉండటం రుచించక విశాలాంధ్ర ఉద్యమం ఊపందుకొంది.అనేక మంది జైలుకు వెళ్ళారు. ఉధృతంగా సాగిన ఉద్యమంలో అనేక మంది మరణించారు. అయిననూ ఉద్యమం శాంతించలేదు. చివరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్‌ను ఏర్పాటు చేయడంతో ఆకమిటీ సిఫార్సు చేసిన భాషాప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా దేశంలోనే తొలిసారిగా తెలుగు వారికందరికీ కలిపి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.