Jump to content

వేదుల సత్యనారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
వేదుల సత్యనారాయణ శాస్త్రి
జననం(1900-03-22)1900 మార్చి 22
మరణం1976 జనవరి 7(1976-01-07) (వయసు 75)
విద్యాసంస్థఆంధ్ర విశ్వకళాపరిషత్తు
వృత్తిఉపాధ్యాయుడు
గుర్తించదగిన సేవలు
దీపావళి
తల్లిదండ్రులుకృష్ణయ్య, గురమ్మ
పురస్కారాలుమహాకవి

వేదుల సత్యనారాయణ శాస్త్రి (జ: 1900 - మ: 1976) తెలుగు రచయిత, కవి, శతావధానులు.

జీవిత సంగ్రహం

[మార్చు]

వీరి తల్లి: గురమ్మ, తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానం: తూర్పుగోదావరి జిల్లా, ఎటపాక మండలం గొల్లగూడెం. జననం: వికారి సంవత్సర ఫాల్గుణ బహుళ షష్ఠి బుధవారం. (1900 మార్చి 22).

వీరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించే ఉభయ భాషాప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. శాస్త్రిగారు సంస్కృతాంధ్రంలలో చక్కని సాహిత్య సంపత్తి కలవారు. గురుకులవాసముచేసి గొట్టుపుళ్ల శ్రీనివాసాచార్యులు గారివద్ద కావ్యనాటకాలంకారములు పఠించిరి. చిలుకూరి సోమనాధశాస్త్రి సన్నిధానంన వ్యాకరణాధ్యయనం సాగించాడు. చల్లా వేంకట నరసయ్య దగ్గర స్మార్తం కూడా పాఠం చేసాడు.ఇతని కవితాగురువులు కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. విద్వత్పట్టభద్రులైన శాస్త్రి కాకినాడ, పెద్దాపురం, పేరూరు హైస్కూళ్లలో నిరువది నాలుగేండ్లుగా నాంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించాడు. పెక్కురు జమీందారులు ఇతనని గౌరవించి వార్షికబహుమానం లిచ్చారు. శాస్త్రి గారు తాన 'దీపావళి' ఖండకావ్య సంపుటిని ప్రముఖ పరిపాలనా దక్షులు, పారిశ్రామిక వేత్త లోక్ సభ సభ్యులు నూతక్కి రామశేషయ్య గారికి అంకితమిచ్చారు.

1976 జనవరి 7 తేదీన పరమపదించారు.

రచనలు

[మార్చు]
  1. అపరాధిని (నవల)
  2. ఆరాధన
  3. కాలేజీ గరల్ (నాటకం)
  4. దీపావళి
  5. ధర్మపాలుడు : రాఖాలదాస బంధోపాధ్యాయ బెంగాలీలో రచించిన ఈ చారిత్రిక నవలను తెలుగులోకి అనువదించారు.[1] ఇది రెండు భాగాలుగా 1929లో ప్రచురించబడింది.
  6. నవాన్న (నాటకం) (1977) బిజన భట్టాచార్య బెంగాలీలో రచించిన నాటకానికి తెలుగు అనువాదం.[2] దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.
  7. మాతల్లి
  8. ముక్తఝరి (ఖండకావ్యం)[3] దీనిని గౌతమీ కోకిల గ్రంథమాల 1955లో ప్రచురించింది.
  9. రాణా ప్రతాప (నాటకం)
  10. విముక్తి.
  11. వేసవి మబ్బులు (కథా సంపుటం)
  12. సోనా మహల్ (చిన్న నవల)
  13. హితోక్తి రత్నాకరము (1931) [4]
  14. మరికొన్ని నవలలు, నాటకములు, వ్యాసములు ఇత్యాదులు.
  15. కాంక్ష - పద్య ఖండిక[5]

కొన్ని పద్యాలు

[మార్చు]

వేదులవారి ' విముక్తి ' కావ్యమునుండి మూడు ఉదాహరణలు :

ప్రాకుల్ వెట్టిన చిమ్మచీకటుల యీపాషాణ కారాగుహా
ప్రాకారమ్ములు వ్రీలి నాబ్రతుకుపై ప్రాభాత శోభామయా
శాకాంతిప్రసరమ్ము సాగెడిని స్వేచ్ఛామారుతాహ్వాన గీ
తా కోలాహల మేదో నాయెడద నుత్సాహమ్ము లూగెంచెడిన్.

ఊపిరి యాడనీని కఠినోపలబంధములో, కలా కలా
లాపముగాని, నర్తన విలాసముగాని, ధరా పరీమళా
వాపముగాని, లేనిపుటపాకపు చీకటి జీవితంబు నె
ట్లోపితినోగదా, యవలియొ డ్డగుపింపని కాల మీదుచున్.

ఎన్నడు సోకునో తరగ లెత్తగ తెమ్మెర తావియూర్పునా
యన్నువమేన, ఎన్నడు దయారుణరాగ మనోజ్ఞతల్ జగా
వన్నె పసిండిపూత చెలువమ్ముల నాపయి గ్రుమ్మరించునో
యన్న నిరంతరాశ బ్రతుకాపిన దాగిరి గర్భవుం జెరన్.


' మాతల్లి ' కావ్యము నుండి మరిరెండు ఉదాహరణలు :

ఆరనికోర్కెగా బ్రతుకునందు రగుల్కొనుచున్న దొక్కటే
కోరిక, నీకృపావనికి కోయిలనై సతమాలపింతు, మం
దార సుమారుణద్యుతి వితానముగొల్పెడి నీమనోహరా
కారమునన్ మధూదయ వికాసము నింపుము తల్లి, నాయెదన్.

ఏయను భూతిలేక రసమెండి, వివర్ణత దోగి వాసనల్
వోయిన నాహృదంబుజములో నొలికింపు మొకింత సర్వ సం
ధాయకమైన నీయడుగుదమ్ముల పుప్పొడి తోడితేనె; త
ల్లీ యదెచాలు నాకు ఫలియించును ప్రోవిడుకొన్న నాకలల్.

సత్కారాలు

[మార్చు]
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వీరికి విశిష్ట సభ్యత్వం ప్రదానం చేసింది.
  • వీరి గురువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆశీర్వచనాలతో సామర్లకోట సభలో మహాకవి గౌరవం పొందారు.
  • గౌతమి కోకిల, శతావధాని వీరు పొందిన ఇతర గౌరవాలు.

మూలాలు

[మార్చు]
  1. భారత డిజిటల్ లైబ్రరీలో ధర్మపాలుడు పుస్తక ప్రతి.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో నవాన్న నాటకం పుస్తకం.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో ముక్తఝరి పుస్తక ప్రతి.
  4. భారత డిజిటల్ లైబ్రరీలో హితోక్తి రత్నాకరము పుస్తక ప్రతి.
  5. "శ్రీ వేదుల వారి "కాంక్ష"". padyam (in ఇంగ్లీష్). 2009-10-21. Retrieved 2020-07-14.
  • ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 556-9.
  • సత్యనారాయణశాస్త్రి, వేదుల, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 909.