వేపా కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేపా కృష్ణమూర్తి
జననంవేపా కృష్ణమూర్తి
సెప్టెంబర్ 13, 1910
శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం
మరణంసెప్టెంబర్ 9, 1952
విజయవాడ
మరణ కారణంలాంచీ ప్రమాదం
వృత్తిఇంజనీరు
ప్రసిద్ధిప్రసిద్ధ ఇంజనీరు
మతంహిందూ
తండ్రివేపా అచ్యుతం

వేపా కృష్ణమూర్తి (సెప్టెంబర్ 13, 1910 - సెప్టెంబర్ 9, 1952) తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో ఇంజనీరుగా పనిచేశాడు. ప్రాణం కన్నా విధి నిర్వహణే మిన్నగా భావించి, ఆ విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలిన త్యాగమూర్తి.

జననం[మార్చు]

ఒకప్పటి విశాఖ (నేటి శ్రీకాకుళం) జిల్లాలోని పార్వతీపురం లో, వెలనాటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వేపా అచ్యుతం. చిన్నప్పటి నుంచి ఇతనికి గణితమంటే చాలా ఇష్టం. అందులో ఎప్పుడూ నూటికి నూరు మార్కులు వచ్చేవి. సంగీతం, చిత్రలేఖనం కూడా ఆయనకు ఇష్టం.

విద్యాభ్యాసం[మార్చు]

పార్వతీపురంలో ప్రాథమిక విద్య, మచిలీపట్నం లో ఉన్నత పాఠశాల విద్య, మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి బి.ఇ. (మెకానికల్) పూర్తి చేశాడు. యూనివర్సిటీ ప్రథముడిగా ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించాడు. విద్యార్థి దశలోనే పెలెటన్ చక్రం తయారుచేసి తాను చదువుతున్న కళాశాలకు అందించాడు.ఐ.ఎస్.యు. పరీక్షలో సర్వప్రథముడిగా విజయం సాధించాడు.1931 లో భారతీయ తంతి తపాలా శాఖవారి యాజమాన్యాన నిర్వహించిన సుపిరియర్ టెలిగ్రాఫ్, వైర్లెస్ ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యి, భారతదేశం మొత్తం మీద రెండవ స్థానాన్ని పొందాడు.

ఉద్యోగ జీవితం[మార్చు]

1932 లో రైల్వే లో ఉద్యోగంలో చేరాడు. విద్యుచ్చక్తి సరఫరా విభాగంలో అనేక నూతన పథకాలకు రూపకల్పన చేసి ప్రొఫెసర్ వెల్ఫూచే అభినందనలు అందుకున్నాడు. ఆ తర్వాత పి.డబ్ల్యూ.డి.లో చేరాడు. అనతికాలంలోనే తన ప్రతిభాపాటవాలతో అంచెలంచెలుగా ఎదిగాడు.1946 లో తన 38వ యేట అప్పటి హైదరాబాద్ రాష్ట్రం లో ప్రధానమైన ముఖ్య ఇంజనీరుగా నియమించబడ్డాడు. 1952 లో సూపరింటెండ్ ఇంజనీరుగా నియమింపబడి విజయవాడ కు బదిలీపై వచ్చాడు. అదే సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం విషాదం.

విషాదాంతం[మార్చు]

1952 లో కృష్ణానదికి వరదలు వచ్చాయి. విజయవాడ వద్ద ఆనకట్ట గోడకు నీరు ఎగబ్రాకి 130 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతుగల గండిపడింది. ఆ గండి వలన నీరు వృధా అయి ప్రాజెక్టు ఆయుకట్టు కింద సాగుచేసే పంటలు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని భావించాడు. ప్రాణానికన్నా దేశ శ్రేయస్సే ముఖ్యమని భావించి, ఎలాగైనా ఆ గండిని పూడ్పించాలన్న ఉద్దేశంతో, సాయంత్రం వేళ, ప్రమాదకర ప్రయత్నమని తెలిసినప్పటికీ, పట్టువదలక లాంచీలో ప్రయాణమయ్యి నిపుణులైన పనివారికి సలహాలిచ్చి, తిరుగుప్రయాణమయ్యాడు. ఆ చీకటిలో లాంచీ సుడిగండానికి చిక్కి, ఆయన అశువులు బాసాడు. తెలుగువాడైన ఓ గొప్ప ఇంజనీరును తెలుగునేల సెపెంబర్ 9, 1952 న కోల్పోయింది.

మూలాలు[మార్చు]

  • తెలుగు శాస్త్రజ్ఞలు -ఇంజనీర్లు, రచన: వేమూరి రాధాకృష్ణమూర్తి, రవీంద్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ,1992