వేమూరి శారదాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమూరి శారదాంబ

వేమూరి శారదాంబ (1881 మే 3 - 1899) - 19వ శతాభ్ధములో స్కృతాంద్రములనభ్యసించి, సంగీత సాహిత్యములలో ప్రావీణ్యత సాధించిన మహిళలు బహు కొద్దిమంది. విద్యా రహితులుగ చేయబడిన సాటి మహిళల దుర్భరస్థితిగతులను వెలిబుచ్చి చరిత్ర సృష్టించి స్త్రీలకువిద్యాబోధన అవసరమని ఉద్యమం ఆరంభించి అభ్యుదయ ధృక్పదముతో రచనలు చేసి వెలుగులోకివచ్చినవారు ఇంకా అరుదు. అట్టి మహిళారత్నములలో నొకరు వేమూరి (దాసు)శారదాంబ. సాంప్రదాయనెపముతో నిబంధనలు, నియమములు విధించి స్త్రీలను గృహబంధితులగ యుంచుట 19వశతాబ్దమునాటి సర్వసాధారణమైన విషయం. అప్పటిసాంఘిక పరిస్థితులలో బాలికలు విద్యనభ్యసించనవసరములేదనీ, సంగీతసాహిత్యములు మొదలగు లలితకళలు స్త్రీలకు తగనివన్న భావనయుండెను. 19 వ శతాబ్దమధ్య కాలములో ప్రవేశించిన సంఘసంస్కరణోద్యమములు తెలుగునాట క్రమేపి ఆదరణపోందెను. సామాజిక నియమ ఉల్లంఘనలకు సంఘబహిష్కరణ, వెలి ప్రాయశ్చిత్తము మొదలగు ఆంక్షలు ఆశతాబ్దపు చివరినాటికింకనూ సాగుచునేయుండెను. స్త్రీలకు విద్యాభ్యాసము, సంగీత సాహిత్యములలో ప్రవేశము అప్పటికింకనూ అరుదుగనేయుండెనని చరిత్రలో కనబడుచున్నది. స్త్రీలపైగల వివక్షత ఆనాడు యుండియున్ననూ తన తండ్రిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్పపలుకుబడిగల్గి పురప్రముఖుడునూ మహాకవి అగు దాసు శ్రీరాములు గారగుట వలన వారి ప్రోత్సాహముతో ఆమె సంస్కృతాంధ్ర విద్యనభ్యసించగల్గెను. అంతేగాక సంగీత సాహిత్యములలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించెను. చిననాట పిత్రుపరిరక్షణలోనే సంగీత కచేరీలు చేసి గాయకురాలుగా గుర్తింపుపొందినది. తంఢ్రిగారి అపార పాండిత్యానికి తగు వారసురాలు గానుండటకునూ, అఖండ కవయిత్రిగానగుటకు తగిన సర్వసతీ కటాక్షముతోనూ జన్మించిన ఆమె అకాలముగా 19 వ ఏటనే 1899 లో మరణించిన పిదప, ఆమె పాండిత్య-కవితా సామర్ధ్యమును చాటునట్టి ఆమె రచనలు రెండు (మాధవ శతకం, నాగ్నజితీ పరిణయం) కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి దృష్టికి రావడం సంభవించినది. ఇంటిపట్టుననే యుండి సాధించిన అఖండ పాండిత్యమును చాటు ఆ పద్యములను చూసిన శాస్త్రిగారు ఆశ్చర్యపడి వాటిని 1901లో తాము సంకలనము చేయుచున్న కళావతి అను మాస పత్రికలో మాధవ శతకముగా మూడు భాగములుగ ప్రచురించి కీ. శే. వేమూరి (దాసు) శారదాంబ గారి అపార కవితా కౌశలాన్ని తెలుగునాట వెలుగులోకి తెచ్చారు.[1] ఆమె రచించిన నాగజితీ పరిణయ కావ్యమును ఎవరు ఎక్కడ ప్రచురించినదీ ఇప్పటకీ తలియనప్పటికినీ ఆ కావ్యము గూడా బహుశః శాస్త్రిగారే ప్రచురించియుందురని ఊహించవచ్చు. కాని కాల క్రమేణా ఆ ప్రచురణలు కాలగర్భములో కలసిపోయి వాటి ప్రతులు కూడా అలభ్యమైనవి. 1973లో స్తాపించిన దాసు శ్రీరాములు స్మారక సమితి వారు కూడా ఆ రెండు రచనల ప్రతులకొరకు చాలా కాలం ప్రయత్నంచేసి విఫలురైరి. ఒక శతాబ్దముపైగా (115 ఏడ్లు) కాలం గడచిపోయిన తరువాత అదృష్టవశాత్తు ఈ మధ్యనే వాటి ప్రతులు సంపాదించి ఈ రెండు రచనలనూ పునర్ముద్రణచేసి 2019 జూలైలో ప్రకటించారు. ఇందలి ముందుమాట, పీఠికల లో శారదాంబ గారి అఖండ కవితాశైలి ఘనంగా వర్ణించబడినది. ఈ రెండు వుస్తకముల ప్రతులకు ఆ సమితి ముఖ్య కార్యకాలీన అధినేత డా. దాసు అచ్యుతరావు (9490023947, 04023734864)ను సంప్రతించ వలయును. స్త్రీలపట్లగల వివక్షతకు వాపోయి వారి దుర్భర స్థితిగతులుమెరుగు పరచుటకు విద్యాభ్యాసము అనివార్యమని ఘోషించి ఆనాటి పరిస్తితులకెదురీది మెట్టింటివారి నిరుత్సాహక వాతావారణమునుకూడ భరించి, భగవత్ప్రార్థనా రూపములో మాధవా అను సంబోధనా మకుటముతో 101 పద్యములు గల మాధవ శతకమునూ , నాగ్నజీతి పరిణయము అను కావ్య ప్రబంధమునూ సాహసించి రచించి తన కవితా కౌశలమును చాటిన శారదాంబగారు చిరస్మరణీయులు.[2][3] ఆకాలము గా మరణించిన తన కుమార్తె యొక్క అసాధారణ కవితా సామర్ధ్యమును తెలియజేయుచూ మహా కవి దాసు శ్రీరాములు గారు రచించిన దేవీ బాగవతములో ని రెండు పద్యములు చెప్పవలసియుండెను:

సీ. తనతొమ్మిదవయేట ననుపమాన ప్రజ్ఞ నింపుగా వీణ వాయింప నేర్చె
    తన పదియవయేట సునిశితంబగు బుధ్ధి దాగొల్పె నేకసంతాగ్రహణము
    తన చర్దశ శరత్తున ముద్దుముద్దుగా నల్లిబిల్లిగ బద్యముల్లనేర్చె
    తనదు పదార్వ వత్సరమున నగ్నజిజ్ఞా వివాహప్రబంధంబు సెప్పే
<poem>
తే.గీ. తనదు పందొమ్మిదవర్షముననె మర్త్య భావమునుమాని శాశ్వత బ్రహ్మలోక
     సిద్ధింగనె శారదాబ నాచిన్నికూత ననుదినంబును మఱువక యాత్మనుంతు

జీవిత విశేషములు[మార్చు]

బాల్యమందే అబ్బిన అపార విద్య[మార్చు]

1881 మే నెల 3 తారీకున ఇప్పటి కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి మండలంలోని అల్లూరు గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్థక నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్ అను ప్రముఖ ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన దాసు నారాయణరావు, మాధవరావు, గోవిందరావు, దాసు విష్ణు రావు, మధుసూదనరావుల సోదరీమణి. వివాహానంతరము సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిధ్ధి చెందెను. తండ్రి దాసు శ్రీరాములు (1846-1908) వృత్తిరీత్యా ఏలూరులో న్యాయవాదేగాక, జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము కలిగియుండి 'దేవీభాగవతము'రచించి మహాకవిగా ప్రసింధ్దిచెందెను. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పెను. రాజమహేంద్రవరములోని సుప్రసిధ్ద సంఘసంస్కరణకర్త, కందుకూరి వీరేశలింగం పంతులు, విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు గారు సమకాలీకులు. ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన కోమండూరి నరసింహాచారి, ఈమని వెంకటరత్నం వద్ద సంగీతము నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి పర్యవేక్షణలో సంగీతముతోపాటు విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. మైసూరు, బెంగుళూరు పట్టణములందు జరిగిన సంగీత సమ్మే్ళణములలో వీణా వాయిద్య కచేరీ చే్సెను. ఆనాటి సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ వివాహం 1888 మే నెలలో బందరువాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది.

స్వల్పజీవితకాలం, సాహిత్యకృషి[మార్చు]

1888 సంవత్సరములో వివాహామైనతరువాత శారదాంబ-వేమూరి రామచంద్రరావు దంపతులకు మొదటి సంతానం కుమార్తె, దుర్గాంబ. రెండవ సంతానం, కుమారుడు పార్ధసారథి. 19వ ఏట, 1899 సంవత్సరం డిసెంబరు 26వ తేదిన ఏలూరులో రెండవ సంతానం, కుమారుడైన పార్దసారథినికని శారదాంబ పరమదించెను. వివాహనాంతరం మిట్టింటివారింట సంగీతాభ్యాసమునకు అవరోధములు కలిగినప్పటికినీ భగవత్ప్రార్థన రూపములో సాహిత్య కృషిసాగించెను. 1887 సంవత్సరములో తన 16 వ ఏట ఆమె రచించిన ప్రబంధము ‘నాగ్నజితీ పరిణయము’. ఆనాటి పత్రికలు జ్ఞానోదయ పత్రిక, జనానా పత్రికలలో ఆమె రచించిన దేవీస్తుతి కీర్తనలు ప్రచురించబడినట్లు తెలియుచున్నది.

మాధవశతకము[మార్చు]

ఆ కాలమునాటి స్రీలపై గల వివక్షత ఆమెను చిన్న వయస్సునుండీ కలవర పరచినదని తెలుపుటకు నిదర్శనము ఈ మాధవమ శతకము. మాధవా అను మకుటముతో 101 పద్యములు గల ఈ శతకము భక్తి శతకము గాదు. ఆనాటికి దేశములో స్త్రీలపై చూపుతున్న వివక్షతకు విద్యారహితలుగానుంచి చేయుచున్న అన్యాయమును మానమని పూరాణేతిహాసములలో విద్యనభ్యసించిన స్త్రీలు, స్త్రీవిద్యకు గల ప్రాముఖ్యతను చాటు అనేక ఐతిహాసిక ఉదాహరణల తో పెద్దలను వేడుకుంటూ వ్రాసిన 101 పద్యములు శారదాంబ తన చిననాట పదులాల్గేండ్లు ప్రాయంబున రచించిన పద్యగ్రంధము, మాధవ శతకము. అలనాటి స్త్రీలకు విద్యాభ్యాసములేమిచే కలుగుచున్న దుర్భరస్థితి పట్ల వ్యాకులత వ్యక్తముచేయుచు విద్యను ప్రసాదింపుమని భగవంతుని ప్రార్థన రూపములో శారదాంబ రచించిన పద్యగ్రంధము మాధవ శతకము.[4] దేవలోకములో దేవతా స్త్రీలకు విద్యనభ్యసించుటకెట్టి ఆటంకములేనప్పుడు ఈ భూలోకములో ఎందుకని స్త్రీలను గృహబందితులగా చేసి విద్యాభ్యాసరహితులుగ నుంచెదరనియూ అంతే కాక విద్యాభ్యాసముచేసినంతమాత్రము స్త్రీలు తమ గృహనిర్వాహణ బాధ్యతలు గానీ పాతి వ్రత్యములోగాని ఎట్టి లోపము రాన్నివరని చెప్పుటకు ప్రామాణికముగా విద్యావంతులైన దేవతా స్త్రీలు వినయవిధేయతలుగల గొప్ప పతివ్రతలే గదాయని మాదవ శతకము లోని పద్యాల ద్వారా అప్పటి సమాజమున స్త్రీల విద్యావిషయములో అవరోదములు, అభ్యంతరములు ఉపసంహరించుకోమని శారదాంబగారు నైపుణ్యముగా అభ్యర్థించిరి. ఆయా పద్యములలో శారదాంబ ఉదహరించిన దేవతలలో విద్యలకు దేవతైన సరస్వతితోసహ సీత, లీలావతి, భానుమతి, మొదలగు ఐతిహాసికంగా విద్యావంతులైన పతివ్రతలను ఉదహరించిరి. శారదాంబ గారు కావ్యరూపములో స్త్రీల విద్యాభ్యాసమునకు సామాజికాభ్యంతరములు దూరముచేయుటకు తన కావ్యములో విద్యాభ్యాసముచేసిన దేవతలు, దేవతాస్త్రీల ప్రామాణిక సాక్షాధారములుచూపుతు రచించిన కొన్ని పద్యములు అర్దముతో పాటు డా. దాసు అచ్యుతరావు వ్యాసములో ప్రచురించిరి.[3] “స్త్రీల దుస్తితినద్భుతంబుగా బాపి యిద్భువిన్ బన్నుగ నద్భుదుల్ తగినపట్టున విద్యను ముద్దరాండ్రకున్ గ్రన్నన నేరిపించి మరిజ్ఞానము బుట్టగ జేయుమంటూ ప్రార్దించినది.”

 చ:మునుపటివారలెల్ల తనుముద్దియలం చదివించలేదోకో
 వినయం పతివ్రతాత్వు సువివేకములం జరియించినట్టి యా
 జనకజంజూడరే మరియుం జంత్రమతింగనరే యింకెందరో
 యునుపమబుధ్దిగీర్తిలందిరి విధ్యవల్ల మాధవా

 చ:వినంగమహెశుమడెప్పుడును వీడక గంగశిరంబందునుం
 చెనుగడ బ్రహ్మతాను తన జివ్హను పెట్టెనుగా సరస్వతిన్
 అనవరతంబు నీహృదయమందున నిలిపితి నీదు కోమలిన్
 గననదియేలకో జనులు కారలవైతురు స్త్రీల మాధవా

 ఉ:పావననామ్ని సద్గణితదెల్పదేబోటికాదె లీ
   లావతి భాస్కరార్యునుతరామయ కాదె సరస్వతింగనన్
   దేవతయయ్యె విద్యలకు దేజమగ మీరగ భోజుభార్య వి
   ద్యావతియైన భానుమతి యారయా నాందుతి కాదె మాధవా

అప్పటి సమాజములోస్త్రీలు నాట్యశాస్త్రమభ్యసించరాదన్న అభిమతమును మార్చుటకు మహాభారతములోని ఉత్తరను ఉదహరించెను.

 చ:అరమరలేక నిచ్చెలు బృహన్నలయొద్దను నాట్యశాస్త్రమున్
   విరటుని కూంతుదాగరచి వినృతకీర్తి వహింపలేదె యు
   త్తర కడు యోగ్యురాలని సదా పోగడంబడలేదె చూడనా
   పరమ పతివ్రతామణి శుభాంగు పరీక్షితుంగాంచె మాధవా”

ఆ విధముగా శారదాంబగారు భారతభాగవతాలనుండి పురాణేతిహాసములనుండి అనేక ప్రమాణికములు చూపెట్టి స్త్రీల విద్యాభ్యాసముపట్ల అప్పటి సమాజమునకల దురభిప్రాయము దూరముచేయ ప్రయత్నించిరి.[1]

నాగ్నజితీ పరిణయము[మార్చు]

వేమూరి శారదాంబ 1896 లో 16 వ ఏట నాగ్నజితీ పరిణయమను ఒక ప్రబంధమును రచించెను. [5]. ఆ ప్రభంధమును ఇప్పటి చెన్నై పట్టణమందలి పార్ధసారథి మందిరములో కూర్చుని రచించినటుల డా. అచ్యుత రావు తమ వ్యాసములో వ్రాశారు.[6] అష్టమహిషులు శ్రీకృష్ణుని ఎనిమిది భార్యలని భాగవవత కథలు చెప్పుచున్నవి. నాగ్నజితి ఆరవ భార్యగా శ్రీకృష్ణని పరిణయమాడుటను గూర్చినది ఈ కావ్యము. పండితులు కొనియాడి మన్ననలందుకున్న ఆ ప్రబంధ కావ్య రచనా శైలి ఆమె సంస్కృతాంధ్ర పాండిత్యమునకు మరొక నిదర్శనము.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "మాధవ శతకము(స్త్రీ క్షేమార్ధక భగవత్ర్పార్ధన పద్యములు) రచయిత్రి వేమూరి(దాసు) శారదాంబ" (2019). pp1-61 మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి
  2. "స్త్రీ జనక్షేమార్ధి శ్రీమతి వేమూరి శారదాంబ" డా. దాసు అచ్యుతరావు(2014) వార్త, హైదరాబాదు శుక్రవారం డిసెంబరు 26, 2014
  3. 3.0 3.1 అలనాటి అభ్యుదయవాది, స్త్రీ విద్యాహితైషిః శ్రీమతి వేమూరి శారదాంబ డా.దాసు అచ్యుతరావు(2015) కిరణసాహితి మాసపత్రిక 28,29. మే 2015
  4. "వేమూరి శారదాంబ 'మాధవ శతకం'" కాత్యాయనీ విద్మహే (2017) సంస్కరణోద్యమ భావజాలానికి , మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంకె నవతెలంగాణా సోపతి ఆదివారం 24 డిసెంబరు 2017. 16,17
  5. "నాగ్నజితీ పరిణయము" (2019), pp1-116. మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి
  6. "Vemuri Saradamba" Dr. Dasu Achuta Rao(2015) Triveni July-September 2015 pp 25-27