Jump to content

శాంతాబాయి తాల్పల్లీకర్

వికీపీడియా నుండి

శాంతాబాయి తాల్పల్లీకర్ హైదరాబాదులో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు. హైదరాబాదు రాష్ట్ర శాసనసభలోని మొట్టమొదటి మహిళల్లో ఒకరు.[1] కాంగ్రేసు పార్టీ శాసనసభ్యురాలు. ఈమె మక్తల్ నుండి ఒకసారి, కల్వకుర్తి నుండి రెండు సార్లు, గగన్ మహల్ నియోజకవర్గం[2] నుండి ఒకసారి గెలుపొందింది. 1978లో హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి కాంగ్రేసు అభ్యర్థి పోటీ చేసినా, జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ చేతిలో ఓడిపోయింది.

శాంతాబాయి 1952లో తొలిసారిగా మక్తల్ శాసనసభా నియోజకవర్గం నుండి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యింది. 1957లో కల్వకుర్తి ద్విసభ్య నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యింది. 1962లో తిరిగి అదే నియోజకవర్గం నుండి కాంగ్రేసు అభ్యర్థిగా పోటీచేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్.వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయింది. కానీ ఎల్.వెంకటరెడ్డి ఎన్నికను న్యాయస్థానాలు రద్దు చేయటంతో, ఈ నియోజకవర్గానికి 1964లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్థిగా తిరిగి శాంతాబాయే పోటీ చేసి గెలిచింది. ఆ తరువాత 1967లో జరిగిన సాధారణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన డి.గోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. డి.గోపాల్ రెడ్డి ఎన్నిక చెల్లదని శాంతాబాయి న్యాయస్థానంలో వ్యాజ్యం వేసి గెలిచింది. న్యాయస్థానం గోపాల్ రెడ్డి ఎన్నికను రద్దు చేసింది కానీ ఆయన స్థానంలో శాంతాబాయి ఎన్నికైనట్టు ప్రకటించకుండా, తిరిగి ఎన్నికలు జరపాలని ఆదేశించింది.[3] 1967లో నియోజకవర్గానికి చెందిన కాంగ్రేసు నాయకులు, తమ పార్టీ ఎన్నికల టికెట్టును బయటి వ్యక్తి (శాంతాబాయి నివాసము హైదరాబాదులో ఉండేది) కి ఇవ్వకుండా స్థానికులకు ఇవ్వాలని ఆశించారు. వారిలో ప్రముఖంగా యువజన నాయకుడైన జైపాల్ రెడ్డి పేరు వినిపించింది. ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ జైపాల్ రెడ్డిని సిఫారసు చేస్తే ఢిల్లీలోని పార్టీ అధిష్టానం మాత్రం తిరిగి శాంతాబాయికే సీటు ఇచ్చింది. దీనికి నిరసనగా కొన్ని కాంగ్రేసు వర్గాల వారు అప్పటిదాకా కాంగ్రేసు పార్టీలో ఉన్న గోపాల్ రెడ్డిని పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని ప్రోత్సహించి, ఎన్నికలలో ఆయనకు పరోక్షంగా సాయపడ్డారు.[3] ప్రాంతీయతా అంశంతో పార్టీలో జరిగిన రాద్ధాంతంతో 1969లో జరిగిన ఎన్నికలలో కల్వకుర్తి శాసనసభా సీటును స్థానికుడైన జైపాల్‌రెడ్డికి ఇవ్వగా, శాంతాబాయి హైదరాబాదు నగర పరిధిలో ఉన్న గగన్ మహల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచింది.[4]

మూలాలు

[మార్చు]
  1. కాసం, ప్రవీణ్ (10 November 2018). "'ఆమె'కు ఎందుకు అంత ప్రాధాన్యం దక్కడం లేదు?". Archived from the original on 3 December 2018. Retrieved 3 December 2018.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-10-22.
  3. 3.0 3.1 R.K.P., Shankardass (1971). Election Law Reports Volume 34 (PDF). New Delhi: Government of India. pp. 195–212. Retrieved 2 November 2014.
  4. EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.