శివాలిక్ కొండలు

వికీపీడియా నుండి
(శివాలిక్ పర్వతాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శివాలిక్ కొండలు, గంగా నది

శివాలిక్ కొండలు సింధు నది నుండి దాదాపు 2,400 కి.మీ. (1,500 మై.) వరకు విస్తరించి ఉన్న బాహ్య హిమాలయాల పర్వత శ్రేణి. వీటిని చురియా కొండలు అని కూడా అంటారు. తూర్పు వైపు బ్రహ్మపుత్ర నదికి దగ్గరగా, భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాలలో 10–50 కి.మీ. (6.2–31.1 మై.) వెడల్పు, 1,500–2,000 మీ. (4,900–6,600 అ.) సగటు ఎత్తుతో ఈ శ్రేణి విస్తరించి ఉంది. అస్సాంలోని తీస్తా, రైడాక్ నదుల మధ్య దాదాపు 90 కి.మీ. (56 మై.) ఈ శ్రేణిలో గ్యాప్ ఉంది.[1] "శివాలిక్" అంటే ' శివుని జటాజూటం' అని అర్థం.[2] శివాలిక్ ప్రాంతం సోనియా (సోన్ నదికి చెందిన) పురావస్తు సంస్కృతికి నిలయం.

భూగర్భ శాస్త్ర విశేషాలు

[మార్చు]
శివాలిక్ కొండల పటం

భౌగోళికంగా, శివాలిక్ కొండలు బాహ్య హిమాలయాల్లో తృతీయ స్థాయి నిక్షేపాలకు చెందినవి. అవి ప్రధానంగా ఇసుకరాయి, సమ్మేళన రాతి నిర్మాణాలతో కూడుకుని ఉంటాయి. ఇవి వాటికి ఉత్తరాన ఉన్న హిమాలయాల లోని శిలలు శిథిలమవగా ఏర్పడిన శిథిలాలు (డైట్రిటస్) గట్టిపడగా ఏర్పడిన కొండలు.[3] వాటికి దృఢత్వం తక్కువగా ఉంటుంది. సిల్ట్‌స్టోన్‌లు, ఇసుకరాళ్లలో ఉన్న అవశేష అయస్కాంతీకరణను బట్టి ఆ శిథిలాలు 1.6 – 0.52 కోట్ల సంవత్సరాల మధ్య నిక్షిప్తమై ఉండవచ్చని తెలుస్తోంది. నేపాల్‌లో, కర్నాలీ నదిలో శివాలిక్ కొండలకు చెందిన అత్యంత పురాతన భాగాన్ని చూడవచ్చు.[4]

శివాలిక్ కొండలకు దక్షిణాన మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్ అనే ఫాల్ట్ వ్యవస్థ సరిహద్దుగా ఉంది. ఆ వైపున వాలు బాగా నిటారుగా ఉంటుంది. దీని దిగువన, ముతక ఒండ్రుతో కూడిన భాబర్ జోన్ మీదుగా దాదాపు సమతలంగా ఉండే మైదానాలకు మారుతుంది. ప్రత్యేకించి వేసవి రుతుపవనాల సమయంలో పడే వర్షపాతం భాబర్‌లోకి పీల్చుకుపోతుంది. ఆపై తెరాయ్ లేదా మైదానాల ఉత్తర అంచున ఉన్న బుగ్గలు, చిత్తడి నేలల జోన్‌లో దాని క్రింద ఉన్న సున్నితమైన ఒండ్రు పొరలు ఆ నీటిని ఉపరితలంపైకి తోస్తాయి.[5]

పూర్వ చరిత్ర

[మార్చు]

శివాలిక్ ప్రాంతంలో సుమారు 5,00,000 నుండి 1,25,000 సంవత్సరాల క్రితం మధ్య వరకు ఉన్న దిగువ ప్రాచీన శిలాయుగం నాటి సోనియా సంస్కృతికి చెందిన అవశేషాలు కనబడ్డాయి. అచెయులియన్‌కు సమకాలీనంగా ఉన్న ఈ సోనియన్ సంస్కృతికి పాకిస్తాన్‌లోని శివాలిక్ కొండలలోని సోన్ వ్యాలీ పేరిట ఆ పేరు పెట్టారు. సోనియా పురావస్తు సంస్కృతి ప్రస్తుత భారతదేశం, నేపాల్, పాకిస్తాన్‌లోని శివాలిక్ ప్రాంతంలో కనుగొన్నారు.[6]

శివాపిథెకస్ (ఒక రకమైన కోతి, గతంలో రామాపిథెకస్ అని పిలిచేవారు) శివాలిక్ ప్రాంతంలో దొరికిన అనేక శిలాజాలలో ఒకటి.[7]

అంతరించిపోయిన ఆసియా ఉష్ట్రపక్షి, డ్రోమైయస్ శివాలెన్సిస్, హైప్సెలోర్నిస్‌లతో సహా అనేక ఎలుకల శిలాజాలను శివాలిక్ కొండలలో కనుగొన్నారు. అయితే, చివరి రెండు జాతులకు వాటి కాలి ఎముకలను బట్టి ఆ పేర్లు పెట్టినప్పటికీ, అవి గిట్టల క్షీరదానికి, మొసలికీ చెందినవిగా తరువాతి కాలంలో గుర్తించారు.[8]

జనాభా వివరాలు

[మార్చు]

శివాలిక్ కొండల లోను, దిగువ హిమాలయ శ్రేణి యొక్క నిటారుగా ఉన్న దక్షిణ వాలుల లోనూ మానవ జనసాంద్రత తక్కువగా ఉంటుంది. దక్షిణాన ఉన్న మైదానాలలోని జనాభాకు, కొండలకు ఆవల ఉన్న జనాభాకూ మధ్య సాంస్కృతిక, భాషా, రాజకీయ బఫర్ జోన్‌ను ఇక్కడీ జనాభా సృష్టించింది, ఇది భాష, సంస్కృతులకు సంబంధించి. విభిన్న పరిణామ మార్గాలకు దారితీసింది.

సంస్కృతిలో

[మార్చు]

భారత నావికాదళానికి చెందిన శివాలిక్ -క్లాస్ ఫ్రిగేట్‌లకు ఈ శ్రేణుల పేరే పెట్టారు. 

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kohli, M. S. (2002). "Shivalik Range". Mountains of India: Tourism, Adventure and Pilgrimage. Indus Publishing. pp. 24–25. ISBN 978-81-7387-135-1.
  2. Balokhra, J. M. (1999). The Wonderland of Himachal Pradesh (Revised and enlarged fourth ed.). New Delhi: H. G. Publications. ISBN 9788184659757.
  3. Chisholm, Hugh, ed. (1911). "Siwalik Hills" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 25 (11th ed.). Cambridge University Press. pp. 163–164.
  4. . "Magnetic polarity stratigraphy of Siwalik Group sediments of Karnali River section in western Nepal".
  5. Mani, M.S. (2012). Ecology and Biogeography in India. Springer Science & Business Media. p. 690.
  6. Chauhan, P. (2016). "A decade of paleoanthropology in the Indian Subcontinent. The Soanian industry reassessed". In Schug, G. R.; Walimbe, S. R. (eds.). A Companion to South Asia in the Past. Oxford, Chichester: John Wiley & Sons. p. 39. ISBN 978-1-119-05547-1.
  7. (1 May 1988). "A new large species of Sivapithecus from the Siwaliks of Pakistan".
  8. Lowe, P. R.. "Some remarks on Hypselornis sivalensis Lydekker.".