బ్రహ్మపుత్రా నది
బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం.
టిబెట్లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నదిగా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది. నైఋతిలో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్ లో జమునగా పారుతుంది. అక్కడా గంగా నదితో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. సుమారు 2900 కిలోమీటర్లు (1800 మైళ్ళు) పొడవున్న ఈ నది వ్యవసాయానికి జల మార్గాలకు ఉపయోగకరంగా ఉంది. దీని ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు గుప్తంగా ఉంది. దీనికి జాంగ్ బో పెనులోయతో గల సంబంధం 1884-86 అన్వేషణ వల్లనే కనుగొనబడింది. ఇది ఇండియా లో మోగ వడి పేరుతో వున్నది
ఈ నది దిగువ ప్రాంతము హిందువులకు పవిత్రమైనది. ఈ నది మెరుపు వరదలకు ప్రసిద్ధి. సాధారణంగా అలలు కేవలం సముద్రంలలోనే వస్తాయి. కానీ ప్రపంచంలో టైడల్ బోర్ (అలలపోటు) ను ప్రదర్శించే అరుదైన నదులలో ఇది ఒకటి.
నదీ ప్రవాహ మార్గం
[మార్చు]టిబెట్‌లో
[మార్చు]ఉత్తర హిమాలయాలలోని కైలాస పర్వతం [1] దగ్గర జిమా యాంగ్ జాంగ్ హిమానీనదం[2]లో పుట్టింది యార్లుంగ్ త్సాంగ్ పో నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత నంచా బార్వ పర్వతాన్ని చుడుతూ యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడింది.[3]
భారతదేశంలో
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్లో నది ప్రవేశించిన చోట ఈ నది పేరు సియాంగ్ అక్కడ చాలా ఎత్తు నుంచి చాల వేగంగా కిందికి దిగుతుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని దిహంగ్ అంటారు. అక్కడ నుండి 35 కిలోమీటర్లు ప్రవహించాక దిబంగ్, లోహిత్ అనే మరో రెండు నదులతో సమాగమం అవుతుంది. ఈ సంగమ కేంద్రం నుండి ఈ నది చాలా వెడల్పు అవుతుంది, ఇక్కడ నుండి ఈ నది బ్రహ్మపుత్రగా పేరొందింది. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమైనవి. భారత ప్రభుత్వం వీటి మీద ఆనకట్టలు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాంలో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలోమీటర్లు దాకా ఉంటుంది. జోర్హాత్ కి దగ్గరలో రెండు పాయలుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన కలవడం ద్వారా ఈ నది మజూలి అనే ద్వీపాన్ని ఏర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. గౌహతి దగ్గర్లో హజో అనే గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోసుకుంటూ ప్రవహించడంవల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. ఎన్నో శత్రు దాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే సరాయ్ ఘాట్ యుద్ధము జరిగింది. ఇక్కడ నదిపై నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు సరాయ్ ఘాట్ వంతెన అని పేరు పెట్టారు. మజొలి ద్వీపం ఈ నది మధ్యలో ఉంది. ఇది జొర్హట్ కు సమీపంలో ఉంది.
బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం లౌహిత్య. దీనినుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు లుయిత్ వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే బోడోలు ఈ నదిని భుల్లం - బుతుర్, అని పిలుస్తారు. అంటే బోడో భాషలో 'గర గర శబ్దం చేసేది' అని అర్ధం. దీన్నే బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారు.
బంగ్లాదేశ్‌లో
[మార్చు]బంగ్లాదేశ్ లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని చాంద్ పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళా ఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగ, బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగ - బ్రహ్మపుత్ర డెల్టాని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది.
బ్రహ్మపుత్రపై చైనా జలవిద్యుత్ ప్రాజెక్టు
[మార్చు]బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో ఓ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రను టిబెట్‌లో త్సాంగ్‌పో నదిగా పిలుస్తారు. అక్కడ నామ్చా ప్రాంతంలో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతి పెద్దదైన జలవిద్యుత్ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. 26 టర్బైన్లతో పనిచేసే ఈ ఆనకట్ట గంటకు 40 మిలియను కిలోవాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. 2009 మార్చి 16న దీనికి శంకుస్థాపన జరగగా మార్చి 16న పనులు ప్రారంభమయ్యాయి. చైనాలోని ఐదు పెద్ద విద్యుత్తు కంపెనీలు ఓ వ్యాపారకూటమిగా ఏర్పడి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయి. ఇది పూర్తయితే ఇప్పటివరకు చైనాలో మొదటిస్థానంలో ఉన్న త్రీ గోర్జెస్ డ్యాం కంటే పెద్దదవుతుంది. బ్రహ్మపుత్ర నది భారత్, బంగ్లాదేశ్‌లకు ఎంతో ముఖ్యమైనది. భారతదేశంలో 40 శాతం జలవిద్యుత్తు అవసరాన్ని, 30 శాతం నీటి వనరుల అవసరాలని ఈ నది తీరుస్తోంది. బంగ్లాదేశ్‌లో అయితే మంచినీటికి, సేద్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. దీనిపై భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చుతూ దీంతో తమకు సంబంధం లేదని అది పూర్తిగా ప్రైవేటు సంస్థల వ్యవహారమని పేర్కొంది. మరోవైపు ఆనకట్ట ఇంజనీర్లు మాత్రం ఇది పూర్తయితే భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు చౌకగా విద్యుత్ సరఫరా చేయవచ్చని, బంగ్లాదేశ్‌కు వరదముప్పు తప్పుతుందని అంటున్నారు. (ఈనాడు16.10.2009)
కాలుష్యము
[మార్చు]బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెంది కాలుష్యానికి కారణమవుతున్న మొక్క జలకుంభీ. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) కొత్తరకమైన వానపామును అభివృద్ధి చేశారు. దీనిని వారు జై గోపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది సున్నా నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని జీవిస్తుం దని శాస్త్రవేత్తలు తెలిపారు. జలకుంభీ మొక్కలతో పాటు నీటిలోని నాచును ఇవి ఆహారంగా స్వీకరిస్తుందని ఐవీఆర్ఐ ప్రొఫెస ర్ రణవీర్ సింగ్ తెలిపారు. బ్రహ్మపుత్ర తీరంలో ఈ జలకుంభీ మొక్కల బెడదను తొలగించేందుకు ఇటీవలే గుహవటి ఐఐటీతో ఐవీఆర్ఐ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, వానపాముల అప్పగింత జరుగుతుందన్నారు. కాగా, జలకుంభీని ఆహారంగా స్వీకరించి ఈ వానపాము వెలువరిచే సేంద్రీ య ఎరువును టీ తోటల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందట. అంతేకాదు చక్కెర మిల్లులలో వెలువడే రసాయనిక వ్యర్థాలను కూడా ఈ వానపాము ఆహారంగా స్వీకరిస్తుందన్నారు.
నదీ ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]1947లో భారత దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ, బ్రహ్మపుత్రా నది ఒక పెద్ద జలమార్గంగా ఉపయోగించబడింది. ఎగువ అస్సాం లఖింపూర్ జిల్లాలోని సదియా నుంచి దిగువ అస్సాంలోని ధుబ్రి వరకూ జాతీయ జలమార్గం - 2 గ ప్రకటించబడింది. సరుకుల రవాణాకు ఈ మార్గం అనుగుణంగా ఉండేది. అస్సాం రాష్ట్ర ప్రధాన నగరమైన గౌహతి, గౌహతి, ఉత్తర గౌహతిగ బ్రహ్మపుత్ర నది వల్ల విభజించబడింది. ఉత్తర గౌహతికి పోవుటకు అత్యంత సౌకర్యమైనది నదీ మార్గమే. ఈ మధ్య కాలంలో చాలా నదీ క్రూజ్‌లు కూడా పెరిగాయి. అస్సాం బెంగాల్ నేవిగేషన్ చరైద్యూ అనే క్రూజ్ షిప్ ని కూడా నడుపుతోంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 100gogo.com Archived 2015-11-17 at the Wayback Machine]
- ↑ The New Largest Canyon in the World Archived 2008-02-28 at the Wayback Machinefrom 100gogo.com Archived 2015-11-17 at the Wayback Machine
- ↑ Canyonlands of Tibet and Central Asia Archived 2007-04-25 at the Wayback Machine, from canyonsworldwide.com.
మరిన్ని వనరులు
[మార్చు]- బంగ్లాపీడియా:బ్రహ్మపుత్రా నది Archived 2015-12-08 at the Wayback Machine
- Banglapedia:Old Brahmaputra River
- Banglapedia:Brahmaputra-Jamuna River System Archived 2015-12-08 at the Wayback Machine
- Bibliography on Water Resources and International Law Archived 2011-02-09 at the Wayback Machine See Ganges and Brahmaputra Rivers section.
- Rivers of Dhemaji and Dhakuakhana
- Background to Brahmaputra Flood Scenario