శ్రీరాముల సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాముల సత్యనారాయణ
జననంజనవరి 6, 1952
రేకొండ, చిగురుమామిడి మండలం, కరీంనగర్ జిల్లా
మరణంఏప్రిల్ 9, 2020
వృత్తివ్యవసాయ అధికారి
ప్రసిద్ధిరంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత
భార్య / భర్తవిజయ
పిల్లలుముగ్గురు కుమార్తెలు (విద్య, సంధ్య, స్వాతి), ఇద్దరు కుమారులు (శ్యామ్ చరణ్, శ్రవణ్).
తండ్రిలక్ష్మీనరసయ్య
తల్లిశ్యామల

శ్రీరాముల సత్యనారాయణ (జనవరి 6, 1952 - ఏప్రిల్ 9, 2020) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక రచయిత. 1985లో చైతన్య కళాభారతి అనే సంస్థను స్థాపించి, కరీంనగర్ నాటకరంగానికి గుర్తింపు తీసుకొచ్చాడు.

జీవిత విషయాలు[మార్చు]

సత్యనారాయణ 1952, జనవరి 6న లక్ష్మీనరసయ్య, శ్యామల దంపతులకు కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో జన్మించాడు. బీఎస్సీ అగ్రకల్చర్ పూర్తిచేసిన సత్యనారాయణ వ్యవసాయ అధికారిగా పనిచేశాడు.

సత్యనారాయణకు విజయతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు (విద్య, సంధ్య, స్వాతి), ఇద్దరు కుమారులు (శ్యామ్ చరణ్, శ్రవణ్).

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

1970లో పదవి కోసం అనే నాటికతో నాటకరంగంలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ, తరువాత అనేక నాటకాలలో నటించాడు. 1980 పద్మ కళానికేతన్ సంస్థకు కార్యదర్శిగా రాష్ట్రస్థాయి నాటకపోటీలు నిర్వహించాడు. 1985, మే 1న కునమల్ల రమేష్‌, బండారి శ్రీరాములు, తిప్పర్తి ప్రభాకర్‌, బండారి రవీందర్‌లతో కలిసి ‘చైతన్య కళాభారతి’ నాటక సంస్థను స్థాపించాడు. నటనా జ్యోతి కార్యక్రమం పేరిట ప్రతినెల ఒక నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించడంతోపాటు అందులో నటించేవాడు.

బీహెచ్ఈఎల్, మంచిర్యాల, సంగారెడ్డి, ఇందూరు,వర్ధన్నపేట వంటి ప్రాంతాలలో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీలలో సంస్థ నుండి నాటకాలు ప్రదర్శించి, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ప్రదర్శన మొదలైన బహుమతులు అందుకున్నాడు. చైతన్య కళాభారతి తరపున చాలా ఏళ్ళపాటు తెలంగాణ స్థాయి నాటక పోటీలు నిర్వహించాడు. సంపూర్ణ అక్షరాస్యతపై అవగాహన కలిగించడానికి నాటకాలు కూడా ప్రదర్శించాడు

చైతన్య కళాభారతి సంస్థ ద్వారా మాడిశెట్టి గోపాల్, మంచాల రమేష్, తిప్పర్తి ప్రభు, వడ్నాల కిషన్, కునమల్ల రమేష్, బండారి దేవరాజ్, గద్దె ఉదయ్ కుమార్ వంటి అనేకమంది నటీనటులును నాటకరంగానికి పరిచయం చేశాడు.

కరీంనగర్ జిల్లా కళాకారుల సమాఖ్య తొలి అధ్యక్షుడిగా సేవలందించడంతోపాటు, సమైక్య సాహితీ సంస్థ ప్రతి సంవత్సరం ఉత్తమ నాటక రచయితకు అందించే తుమ్మల రంగస్థల పురస్కారాన్ని గెలుచుకున్నాడు.[1]

రచించిన నాటకాలు[మార్చు]

1981లో విద్యార్థులు, విద్యావిధానం ఇతివృత్తంగా ఈ తరం మారాలి అనే నాటికను రచించాడు. రాసిన నాటకాలు పుస్తకాలుగా ప్రచురించాడు.

 1. ఈ తరం మారాలి
 2. పామరులు
 3. శివమెత్తిన సత్యం
 4. ఆకలి వేట
 5. ప్రేమ పిచ్చోళ్ళు
 6. మనిషి[2]
 7. ఆడది అబల కాదు
 8. నిరసన
 9. కాలచక్రం
 10. నేను పట్నం బోతనే
 11. రైతు రాజ్యం
 12. చదవరా
 13. ఆశాపాశం
 14. అగ్ని పరీక్ష[3]
 15. మలిసంధ్య

సినిమారంగం[మార్చు]

దేవదాస్ కనకాల దర్శకత్వంలో అక్షర ఉజ్జ్వల నిర్మించిన నవోదయం టెలిఫిలింకు కథ, సంభాషణలు అందించి అందులో నటించాడు. బి.ఎస్. నారాయణ దర్శకత్వంలో వచ్చిన మార్గదర్శి సినిమాకు కథ, సంభాషణలు అందించడమేకాకుండా చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టి, అందులో ఒక పాత్రలో కూడా నటించాడు. పరివర్తన, నేను బ్రతికే ఉన్నా,ష్ మొదలైన లఘుచిత్రాలకు కథ మాటలు అందించి దర్శకత్వం వహించాడు.[4]

మరణం[మార్చు]

సత్యనారాయణ 2020, ఏప్రిల్ 9న కరీంనగర్‌లో మరణించాడు.

మూలాలు[మార్చు]

 1. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (9 April 2020). "నాటక నారాయణుడు". ntnews. మాడిశెట్టి గోపాల్‌. Archived from the original on 10 April 2020. Retrieved 10 April 2020.
 2. నవతెలంగాణ, కరీంనగర్ (11 June 2019). "మానవత్వాన్ని చాటిన 'మనిషి'". Retrieved 10 April 2020.
 3. ప్రజాశక్తి, తెలంగాణ (21 February 2017). "మనిషికి సమాజం 'అగ్ని పరీక్ష'". Archived from the original on 22 February 2017. Retrieved 10 April 2020.
 4. ఈనాడు, కరీంనగర్ (10 April 2020). "నాటకరంగానికి జీవం పోసిన సత్యనారాయణ". www.eenadu.net. Archived from the original on 10 April 2020. Retrieved 10 April 2020.