షౌకత్ అలీ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షౌకత్ అలీ

మౌలానా షౌకత్ అలీ, భారతీయ ముస్లిం జాతీయవాది. ఖిలాఫత్ ఉద్యమం నడిపించిన నాయకునిగా సుప్రసిద్ధులు.అతను భారత జాతీయోద్యమ రాజకీయాల్లో ప్రఖ్యాతి వహించిన అలీ సోదరులలో ఒకరు.[1][2]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

మౌలానా షౌకత్ అలీ పూర్వులు అప్పటి యునైటెడ్ ప్రావిన్స్ (నేటి ఉత్తర ప్రదేశ్)కు చెందిన వారు. మొదట్లో నజీబాబాద్ లో నివసించేవారు, ఐతే అలీ సోదరుల తాత అలీ బక్ష్ 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటీష్ వారికి అనుకూలంగా పోరాడడంతో సంతోషించిన బ్రిటీష్ ప్రభుత్వం తిరుగుబాటు తర్వాత మొరాదాబాద్ సమీపంలోని ఓ జాగీరు బహుమానంగా ఇవ్వడంతో అక్కడికి వలసవెళ్ళారు. అతని తండ్రి అబ్దుల్ అలీఖాన్ ను రాంపూర్ నవాబు యూసఫ్ అలీఖాన్ నాజిమ్ తన దివానుగా నియమించాడు. దానితో అతను రాంపూర్ లో స్థిరపడ్డాడు. 1873 మార్చి 10 న అబ్దుల్ అలీఖాన్, అబదీ బానో దంపతులకు షౌకత్ అలీ జన్మించాడు. అబ్దుల్ అలీఖాన్, బానో దంపతుల కడగొట్టు సంతానంగా అలీ సోదరుల్లో రెండవ వారైన మౌలానా మహమ్మద్ అలీ 1878లో జన్మించాడు.
షౌకత్ అలీ తండ్రి అబ్దుల్ అలీఖాన్ కలరా వ్యాధి కారణంగా 1880లో మరణించాడు. అలీఖాన్ మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ అబదీ బానో వహించింది. ఆనాటి సాంఘిక పరిస్థితుల కారణంగా ముస్లిం కుటుంబాల్లో సామాన్యంగా పిల్లలను మత పాఠశాలలైన మదరసాలకే పంపేవారు.ఐతే సాంఘిక స్థితిగతుల్లో మార్పులు, ఆంగ్ల విద్యాభ్యాసం అవసరం గమనించిన అబదీ బానో తన కుమారులను స్కూలుకు పంపించాలని నిర్ణయించుకుంది. బంధువుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తట్టుకుని మొదటి కుమారుడు షౌకత్ అలీని పాఠశాలకు పంపింది. కుటుంబంలో ఒక్కరికి ఆమాత్రం చదువు చాలని, మిగిలినవారి చదువుకై తాను ఖర్చుపెట్టలేనని పిల్లల మేనమామ తెగేసి చెప్పాడు. అలా ఆగిపోవాల్సిన షౌకత్ అలీ చదువు తల్లి సంకల్ప బలం వల్ల కొనసాగింది. ఆమె పొరుగునే ఉన్న హిందూ కుటుంబం సహాయంతో తన నగలు తాకట్టు పెట్టి మరీ కుమారుణ్ణి బరైలీలో స్కూలుకు పంపి చదివించింది. ముందు బరైలీలోనూ, ఆపైన అలీగఢ్ లోనూ అతని చదువు కొనసాగింది.షౌకత్ అలీ 1895లో పట్టభద్రులు అయ్యాడు. ఆపైన ఉద్యోగం స్వీకరించి ఉద్యోగ విధులు నిర్వర్తించాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు అలీగఢ్ కళాశాల (అప్పటికి విశ్వవిద్యాలయం కాదు) కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. విద్యార్థుల సంఘానికి నాయకునిగా వ్యవహరించాడు. ఓల్డ్ బాయ్స్ పేరిట నిర్వహించిన సంఘ పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు.[2]

రాజకీయ రంగ ప్రవేశం

[మార్చు]

అలీగఢ్ విశ్వవిద్యాలయ ఏర్పాటు ఉద్యమం

[మార్చు]

17 సంవత్సరాల పాటు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చాకా షౌకత్ అలీ ఉద్యోగ విరమణ చేశాడు. అప్పటివరకూ రాజకీయాల్లో చురుకుగానే ఉన్న అతను, ఆపైన పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యాడు. ఉద్యోగ విరమణ చేయగానే అలీగఢ్ కు చెందిన సుప్రసిద్ధ ఎం.ఎ.ఓ.కళాశాల (ఆనాటికి)ను పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం చేయాలని చేసిన ఉద్యమంలో అతను పాలుపంచుకున్నాడు. ఈ ఉద్యమంలో భాగంగా ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు, విరాళాలు సేకరించేందుకు ఉద్యమ సారధి అగాఖాన్ దేశమంతటా ప్రయాణం చేయగా కార్యదర్శి హోదాలో షౌకత్ అలీ కూడా దేశాటన చేశాడు. ఈ ఉద్యమ ఫలితంగా ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పడింది. [2]

అంజుమన్ ఖుద్దమ్-ఇ-కాబా

[మార్చు]

1913లో సౌదీ అరేబియాలోని ఒట్టోమాన్ పాలకులపై చెలరేగిన అంతర్యుద్ధంలో వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒట్టోమాన్ సైనికుల వల్ల ముస్లింలకు పవిత్రమైన కాబాకు ఏ ముప్పూ వాటిల్లకుండా చూసేందుకు అంజుమన్ ఖుద్దమ్-ఇ-కాబా (కాబా సేవకుల సంఘం)ను ఏర్పరిచారు. సంఘంలో కార్యదర్శిని ఖదీమ్ (సేవకుడు)గా వ్యవహరించేవారు, ఆ పదవికి షౌకత్ అలీ ఎన్నిక కాగా ఖదీముల్ ఖదీమ్ (సేవకునికి సేవకుడు) అని పిలిచే అధ్యక్ష పదవిని అతని మత గురువు మహమ్మద్ అబ్దుల్ బరీ చేపట్టాడు. అదే సమయంలో ఆంగ్ల వారపత్రిక కామ్రేడ్, ఉర్దూ పత్రిక హమ్ దర్ద్ ల సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించాడు.[2]

మొదటి ప్రపంచ యుద్ధం - కారాగార వాసం

[మార్చు]

1914లో ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. ప్రపంచయుద్ధంలో ఇంగ్లాండ్, టర్కీ దేశాలు వ్యతిరేక పక్షాల్లో చేరి యుద్ధం సాగించాయి. బ్రిటన్ టర్కీపై యుద్ధం చేయడాన్ని అలీ సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. భారతీయ ముస్లిం ప్రముఖులు ఈ పరిణామంతో ఇంగ్లీష్ ప్రభుత్వాన్ని మత వ్యతిరేకిగా అనుమానించడం ప్రారంభించారు. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం భారతీయ ముస్లిములను ప్రభుత్వ వ్యతిరేకులుగా చేసేందుకు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణపై అలీ సోదరులను 1915 మే నెలలో నిర్బంధించి, వేర్వేరు కారాగారాల్లో పెట్టింది. ప్రభుత్వం షౌకత్ అలీకి ఇస్తున్న ఉపకార వేతనాన్ని రద్దు చేసింది. దాదాపు నాలుగేళ్ళు కొనసాగిన ఈ కారాగారవాసానికి మొదటి ప్రపంచయుద్ధం ముగియడంతో 1919 డిసెంబరులో తెరపడింది. దేశ రాజకీయ పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో ప్రభుత్వం వారిని తప్పనిసరి స్థితిలో విడుదల చేసింది.[2]

ఖిలాఫత్ ఉద్యమ సారధ్యం

[మార్చు]

ప్రధాన వ్యాసం:ఖిలాఫత్ ఉద్యమం
అలీ సోదరులు 1919లో విడుదల అయ్యే సమయానికే మహాత్మా గాంధీ కాంగ్రెస్ కు నేతృత్వం వహిస్తూ, సహాయ నిరాకరణోద్యమం కోసం పిలుపునిస్తున్నారు. ఈ ఉద్యమానికి, మహాత్మా గాంధీ వ్యక్తిత్వానికి ఆకర్షితులైన అలీ సోదరులు కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు. టర్కీలోని ఒట్టోమాన్ సామ్రాజ్యంలో బ్రిటన్, దాని ఇతర మిత్రపక్షాల చేతిలో కీలుబొమ్మలా తయారైన ఖలీఫాను తిరిగి శక్తివంతుణ్ణి చేసి, ఖలీఫా పరంపరను నిలబెట్టాలన్న తలపుతో ప్రారంభమైన ఖిలాఫత్ ఉద్యమానికి నేతృత్వం వహించాడు. సా.శ.1300 సంవత్సరంలో ఏర్పడి సుదీర్ఘ కాలం కొనసాగుతున్న ఒట్టోమాన్ సామ్రాజ్యం పరిపాలకుణ్ణి ఖలీఫా అంటారు. మతపరంగా ఖలీఫా పదవికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం రాజ్యాలన్నీ ఖలీఫాకు సామంతంగా ఉండాలన్నది మత ప్రాతిపదిక. ఇలాంటి ఖలీఫా చివరకు 1919 నాటికి పూర్తి బలహీనమై బ్రిటీష్, ఇతర మిత్రపక్షాలకు పావులా ఉపయోగపడడం భారతీయ ముస్లింలకు మింగుడుపడలేదు. ఖలీఫాను తిరిగి నిలబెట్టాలని ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించారు.ఈ ఉద్యమ కారణాన్ని మహాత్మా గాంధీ పూర్తిగా సమర్థించాడు. పైగా ఖిలాఫత్ ఉద్యమం హిందూ-ముస్లిం ఐక్యతకు మంచి అవకాశంగా భావించాడు. ఈ నేపథ్యంలో ఖిలాఫత్ ఉద్యమానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా అలీ సోదరులు, గాంధీ తదితరులు పర్యటించారు.

మూలాలు

[మార్చు]
  1. "Maulana Shaukat Ali | Former Leader of the Khilafat movement". Story Of Pakistan. 2013-10-17. Retrieved 2021-10-14.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 తిరుమల, రామచంద్ర (ఆగస్టు 1993). "అలీ సోదరులు". బృహదారణ్యకమ్ (1 ed.). హైదరాబాద్: విశాలాంధ్ర ప్రచురణ సంస్థ. pp. 221–233.

వెలుపలి లంకెలు

[మార్చు]