Jump to content

లైంగిక సంక్రమణ వ్యాధి

వికీపీడియా నుండి
(సుఖవ్యాధులు నుండి దారిమార్పు చెందింది)
సిఫిలిస్, ప్రమాదకర లైంగిక సంక్రమణ వ్యాధి

సుఖ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు (Venereal or Sexually transmitted disease; VD or STD) ప్రధానంగా రతి క్రియ (Sex) ద్వారా వ్యాపించే వ్యాధులు. ఇవి అతి ప్రాచీనమైన వ్యాధులు.ఈ వ్యాధుల బారిన పడిన వ్యక్తి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేకుండా బయటకు ఆరోగ్యంగా కనిపిస్తారు. అందువలన వీరితో సంబంధమున్న వారికి ఈ వ్యాధుల్ని సంక్రమింపజేస్తారు. ఇలాంటి కొంతమంది సూది మందు ద్వారా మరొకరికి చేర్చే అవకాశం ఉన్నది. కొందరు స్త్రీల నుండి తమ పిల్లలకు కూడా ఇవి వ్యాపించవచ్చును.

వీటి గురించి బయటకు చెప్పుకోలేక.. ఆ బాధ అనుభవించలేక ఎంతోమంది నిత్యం నరకం చూస్తున్నారు. ఇవి లైంగికంగా సంక్రమించే సమస్యలు కాబట్టి వీటి గురించి వైద్యులను సంప్రదించేందుకు కూడా వెనకాడుతుంటారు. దీంతో ఇవి ముదిరిపోయి.. భాగస్వాములకు కూడా అంటుకుని.. అంతిమంగా సంసారం దుర్భరంగా తయారవుతుంది.

చరిత్ర

ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా వంటి బ్యాక్టీరియా కారణంగా సంక్రమించే సుఖవ్యాధులు మానవాళిని భయంకరంగా కబళించాయి. అయితే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కనిబెట్టిన తర్వాత.. ఇక సుఖవ్యాధులను జయించటం చాలా తేలిక అనుకున్నారు అంతా. కానీ ఆశ్చర్యకరంగా వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి. వీటిని నిర్మూలించటం మహా కష్టం. నియంత్రించటమూ తేలిక కాదు. మరోవైపు ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏమాత్రం లొంగకుండా.. మొండిగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అసలు సుఖవ్యాధులు దరిజేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించటం ఒక్కటే సరైన మార్గం.

బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే సిఫిలిస్, గనేరియా, క్లమీడియా, ట్రైకోమొనాసిస్ వంటి సుఖవ్యాధులకు ఆధునిక కాలంలో మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే తొలిదశలో సరైన చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో ఇవి కూడా చాలా ప్రమాదాలు తెచ్చిపెడతాయి. వైరస్‌ల కారణంగా వచ్చే హెర్పిస్ పొక్కులు, పులిపుర్ల వంటి సమస్యలకు ఇప్పటికీ పూర్తిస్థాయి చికిత్స లేదు. ఇవి రాన్రానూ మహా మొండిగా తయారవుతాయి. ఇక లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే హెపటైటిస్-బి వంటి వైరల్ వ్యాధులు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇలాంటి వైరల్ వ్యాధులను పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేకపోవటం వల్ల నివారణ ఒక్కటే సరైన మార్గం.

ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమంటే- హెర్పిస్, సిఫిలిస్ వంటి సుఖవ్యాధులున్న వారికి హెచ్ఐవీ సోకే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి సుఖవ్యాధులను ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

స్త్రీలు - సుఖవ్యాధులు

శరీర నిర్మాణపరంగా స్త్రీలకు సహజంగానే సుఖవ్యాధులు సంప్రాప్తించే అవకాశం ఎక్కువ. పైగా వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే పెద్దగా లక్షణాలేమీ కనబడకపోవచ్చు కూడా. దీంతో వ్యాధి బాగా ముదిరే వరకూ కూడా చాలామంది వైద్యసహాయం తీసుకోవటం లేదు. కొన్ని రకాల సుఖవ్యాధుల మూలంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన లేమి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటివి ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిరకాల సుఖవ్యాధుల బారినపడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో స్త్రీలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు.

సుఖవ్యాధుల వ్యాప్తి

శృంగారం అంటే కేవలం సంభోగమే కావాల్సిన అవసరం లేదు. సిఫిలిస్, హెర్పిస్, హెచ్ఐవీ వంటివి ముద్దులు, అంగచూషణం వంటి వాటి ద్వారానూ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవటం చాలా అవసరం. సుఖవ్యాధులు రాకుండా చూసుకోవటానికి దీన్ని మించిన మార్గం మరోటి లేదు. ఒకవేళ ఇతరులతో ఎప్పుడైనా సంభోగం లో పాల్గొంటే తప్పనిసరిగా తొడుగు ధరించాలి. భార్యాభర్తల్లో ఎవరికైనా జననాంగాల వద్ద ఇబ్బందిగా అనిపించినా, ఇతరత్రా లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించటం మేలు. నిర్లక్ష్యం చెయ్యకుండా చికిత్స తీసుకోవాలి. మందులు కూడా పూర్తికాలం వేసుకోవాలి. దీర్ఘకాలిక దుష్ప్రభావాల నివారణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

కొన్ని రకాల సుఖవ్యాధులు

  1. హెర్పస్ జెనిటాలిస్ లేదా హెర్పిస్ :ది హెర్పిస్ సింప్లెక్స్ టైప్-2 అనే వైరస్ మూలంగా వస్తుంది. దీని బారినపడ్డ వారితో సెక్స్‌లో పాల్గొంటే.. 2-7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముందుగా పురుషాంగం మీద, స్త్రీ జననావయాల మీద నీటి పొక్కుల్లాంటివి వస్తాయి. తర్వాత ఇవి చితికి పుండ్లు పడతాయి. చికిత్స తీసుకుంటే అప్పటికి తగ్గినప్పటికీ.. ఒంట్లో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడల్లా ఈ పొక్కులు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. హెర్పిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే వైరస్ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. దీంతో మెదడు పొరల వాపు, నడుము వద్ద నాడులు దెబ్బతినటం, పురుషుల్లో నంపుసకత్వం కూడా రావొచ్చు. గర్భిణులకైతే అబార్షన్ ముప్పూ పెరుగుతుంది. ఇది తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించి రకరకాల సమస్యలు తెచ్చిపెడుతుంది. లైంగిక కలయిక తరువాత పురుషాంగం మీద చెమట పొక్కుల ఆకారంలో నీటి పొక్కులు కనిపిస్తాయి. అవి ఎర్రగా వుండి దురదగా కలిగిస్తాయి. అవి పగిలి ఎర్రగా పుండు పోతుంది. స్త్రీలలో కూడా జననాంగం మీద చిన్నచిన్న పొక్కుల్లాగా వచ్చి ఎర్రగా మారి విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన అబార్షన్ రావడం, లైంగిక సమస్యలు రావచ్చు.
  2. గనేరియా: ఇది కూడా లైంగిక వ్యాధి. శృంగారం తరువాత మొదటగా కనిపించే లక్షణం మూత్రంలో మంట, మూత్రనాళం దగ్గర దురదగా ఉంటుంది. జిగురుగా ద్రవం వస్తుంది. కొందరిలో పొత్తి కడుపులో నొప్పి, వీర్యంలో మంట, రక్తం వస్తాయి.
  3. జననాంగాలపై పులిపిర్లు :వీటినే 'వైరల్ వార్ట్స్' అంటారు. ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా వస్తాయి. సెక్స్‌లో పాల్గొన్న ఐదారు నెలల్లో జననావయాలపై పులిపిర్లు వస్తాయి.. ఇవి గుత్తులు గుత్తులుగా క్యాలీఫ్లవర్‌లాగ తయారవుతాయి రోగనిరోధకశక్తి తక్కువగా గలవారిలో నెలలోపే బయటపడొచ్చు. దీనివల్ల రకరకాల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు తేలికగా వస్తాయి కూడా. సమస్య తీవ్రమైతే మూత్రం నిలిచిపోవచ్చు. కొన్నిరకాల పులిపిర్లు మూత్ర మార్గంలోనూ పెరుగుతాయి. వీటితో జననావయాల్లో క్యాన్సర్ల ముప్పూ ఎక్కువ అవుతుంది. స్త్రీలల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో దాదాపు 40% వీటి మూలంగా వచ్చేవే కావటం గమనార్హం.
  4. షాంకరాయిడ్ పుండ్లు: ఇవి కూడా లైంగికంగా సంక్రమిస్తాయి. లైంగిక సంపర్కం తరువాత 3-5 రోజులలోపు ఈ వ్యాధి బయటపడవచ్చు. జననాంగం మీద రెండు, మూడు పుండ్లు ఏర్పడతాయి. ఎర్రగా వుండి, రుద్దినప్పుడు నొప్పి వస్తుంది. కొద్ది మందిలో జ్వరం, నొప్పులు వుంటాయి.
  5. హెచ్ఐవీ ఎయిడ్స్: హెచ్ఐవీ వైరస్ మానవ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తూ చివరకు ఎయిడ్స్ వ్యాధి రూపంలో బయటపడుతుంది. నెల రోజులుగా జ్వరం వుండటం, విరేచనాలు, నెలలో శరీర బరువు పది శాతం తగ్గడం, దగ్గు, బొడ్డుభాగంలో దద్దుర్లు, గొంతు బొంగురు పోవడం, దీర్ఘకాలిక జలుబు, జ్ఞాపకశక్తి తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  6. హెపటైటిస్- బి: సుమారు 4కోట్ల మంది మనదేశంలో హెపటైటిస్‌తో బాధపడుతున్నారు. ప్రతి ఏటా లక్షమందికి పైగా ఈ వైరస్‌తో చనిపోతున్నారు. రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో హెపటైటిస్-బి వైరస్ ఉంటుంది. లైంగిక సంపర్కం, లాలాజలం, తల్లిపాలు, స్టెరైజ్ చేయని సిరంజీలు ఉపయోగించడం, డ్రగ్స్, పచ్చబొట్టు, ఉపయోగించిన బ్లేడ్స్, టూత్ బ్రష్ వాడటం వలన హెపటైటిస్-బి రావచ్చు. అయితే అది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు బయటపడవు. కాళ్లవాపు, పొట్ట ఉబ్బడం, వాంతులు, ఆకలి తగ్గడం, మూత్రం పచ్చగా రావడం, కళ్లు పసుపు పచ్చగా మారడం, జ్వరం, ఒళ్లంతా నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జాగ్రత్తలు - నివారణా పద్దతులు

  • మనిషి చూడటానికి బాగున్నంత మాత్రాన వారికి ఎలాంటి సుఖవ్యాధులూ లేనట్లు కాదు. చాలామందికి సుఖవ్యాధి ఉన్నా అసలా విషయం వారికి తెలియకపోవచ్చు కూడా. కొందరిలో పైకి ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా సుఖవ్యాధులు ఉండొచ్చు. కొందరిలో లక్షణాలున్నా కూడా వాటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లుగా, ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా పొరబడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కొత్త వారితో లైంగిక సంపర్కం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
  • ఏరకమైన అనుమానం ఉన్నా అరమరికలు, దాపరికాలు లేకుండా భాగస్వామితో మాట్లాడటం, సంభోగానికి ముందు సురక్షిత విధానాల చర్చించటం మంచిది. 'మనకు ఇలాంటి సమస్యలు రావులే' అన్న లేనిపోని భరోసా పెట్టుకోవద్దు. సుఖవ్యాధులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. మీరు ప్రతిసారీ ఒక్క భాగస్వామితోనే సంభోగంలో పాల్గొంటుండొచ్చుగానీ.. ఆ భాగస్వామికి ఇతరులతో సంబంధాలు లేవన్న భరోసా కష్టం. కాబట్టి ఎవరితోనైనా తగు జాగ్రత్తలు ముఖ్యం. యోని సంభోగమే కానవసరం లేదు.. మలద్వార సంభోగం, అంగచూషణం వంటివి కూడా సుఖవ్యాధులు సంక్రమించటానికి మార్గాలే!
  • సుఖవ్యాధులకు సంబంధించి ఏ కొంచెం అనుమానంగా ఉన్నా ప్రామాణికమైన చికిత్స అందించే వైద్యులకు చూపించుకుని, పరీక్షలు చేయించుకోవటం మంచిది. అంతేగానీ నాటువైద్యుల వంటివారిని ఆశ్రయించటం మంచిది కాదు.
  • కండోమ్ వాడకం చాలా విధాలుగా శ్రేయస్కరం. కానీ ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల నివారణ విషయంలో కండోమ్‌ల ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించటం లేదని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. చాలామంది కండోమ్‌లను కేవలం గర్భనిరోధక సాధనాలుగానే గుర్తిస్తున్నారు. సుఖవ్యాధుల నివారణ విషయంలో వీటికి ఉన్న ప్రాధాన్యం చాలా ఎక్కువ. వీటితో గనోరియా, క్లమీడియా, ట్రైకోమొనియాసిస్ వంటి చాలా రకాల సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ, సక్రమంగా వాడుతుంటే కండోమ్‌లతో 98% వరకూ సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ కండోమ్ వాడుతున్నాం కదా అనుకుంటూ ఒక్కసారి దాన్ని నిర్లక్ష్యం చేసినా సుఖవ్యాధి సంక్రమించొచ్చు. కాబట్టి ప్రతిసారీ సురక్షితచర్యలు తీసుకోవటం ముఖ్యమని తెలుసుకోవాలి.
  • జననాంగాల మీద పండ్లు, రసి, దద్దు, స్రావాల వంటి అసహజ లక్షణాలున్న వారితో సంభోగానికి దూరంగా ఉండటం మంచిది. కొత్తవారితో సంభోగానికి దూరంగా ఉండటం అవసరం. ఎందుకంటే గనోరియా వంటి వ్యాధులున్నా కూడా మహిళల్లో పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. అలాగే పురుషుల్లో కూడా చాలా సుఖవ్యాధుల లక్షణాలు కనబడకపోవచ్చు. కానీ వారి నుంచి సంక్రమించే అవకాశాలు ఉంటాయి.
  • సుఖవ్యాధి ఏదైనా ఉందని గుర్తించిన తర్వాత.. అది పూర్తిగా తగ్గే వరకూ వైద్యుల సలహా లేకుండా సంభోగంలో పాల్గొన వద్దు. భాగస్వాములిద్దరూ వైద్యులను సంప్రదించటం అవసరం. సుఖవ్యాధులకు చికిత్స సూచిస్తే ఆ చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ వైద్యులను కలిసి, పూర్తిగా నయమైందని నిర్ధారించుకోవటం ముఖ్యం.
  • ఎదిగే పిల్లలకు సురక్షిత శృంగార పద్ధతుల గురించి, ప్రయోగాలు చేస్తే పొంచి ఉండే ప్రమాదాల గురించి తెలియజెప్పటం చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల వ్యాప్తి యుక్తవయుసు వారిలోనే చాలా ఎక్కువగా కనబడుతోంది.
  • హెపటైటిస్-బి, హెపీవీ వంటివి సంక్రమించకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యుల సలహా మేరకు వీటిని పిల్లలకు, యుక్తవయస్కులకు ఇప్పించటం అన్ని విధాలా శ్రేయస్కరం.

సుఖవ్యాధులు-కారకాలు

బాక్టీరియా

సమర్థవంతమైన యాంటీబయాటిక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నయం చేసే అవకాశమైతే ఉంది గానీ.. ఇవి బాగా ముదిరితే ఇతరత్రా చాలా దుష్ప్రభావాలు జీవితాంతం బాధించొచ్చు.

  • * సెగవ్యాధి (నిసీరియా గొనోరియా)
  • ఖాంక్రాయిడ్ :హీమోఫిలస్ డుక్రియీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సంభోగంలో పాల్గొన్న 2-7 రోజుల్లో జననావయావల మీద ఎక్కువ సంఖ్యలో పుండ్లు పడతాయి. నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. గజ్జల్లో బిళ్ల కట్టినట్టు వాపు కనిపిస్తుంది. పురుషాంగం మీది చర్మం కదలికలు బిగుసుకుపోతాయి. మూత్ర విసర్జన కూడా ఇబ్బందిగా ఉంటుంది.
  • క్యాండిడియాసిస్: ఇది ఫంగస్ కారణంగా వచ్చే సమస్య. దీన్ని పూర్తిగా నయం చెయ్యొచ్చు. ప్రధానంగా 'క్యాండిడా అల్బికాన్స్' అనే సూక్ష్మజీవి మూలంగా వస్తుంది. జననాంగాలపై పూత రావటం దీని లక్షణం. పురుషుల్లో అంగంపై ఎర్రటి పూత, స్త్రీలల్లో పెరుగులా చిక్కగా తెల్ల మైల అవుతుంటుంది. బయటి సంబంధాలు లేకున్నా భార్యాభర్తల్లో కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు.
  • ట్రైకోమొనియాసిస్ : ఇది ట్రైకోమొనాస్ వజైనాలిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల వస్తుంది. ఇది సంక్రమిస్తే పురుషులకు అంగంలో ఏదో చెప్పలేని అసౌకర్యం (టింగ్లింగ్ సెన్సేషన్) కలుగుతుంది. స్త్రీలల్లో తెల్లమైల, యోనిలో మంట, దురద వంటివి కనబడతాయి. ఇది భార్యాభర్తల్లో ఒకరి నుంచి మరొకరికీ సంక్రమిస్తుంది .
  • సవాయి రోగం (Treponema pallidum)

శిలీంద్రాలు

వైరస్

పరాన్నజీవులు

ప్రోటోజోవా

మూలాలు