గర్భం

వికీపీడియా నుండి
(గర్భము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గర్భం
26 వారాల గర్భవతి
.

స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగ కార్యంలో పురుషుడు తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడం వలన స్త్రీకి మాతృత్వం సిద్ధిస్తుంది. పురుషుని వీర్యంలోని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తుంది. దీనిని గర్భం లేదా కడుపు' (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి లేదా గర్భిణి అంటారు. గ్రామాల్లో స్త్రీకి గర్భం వస్తే ' ఆమె నీళ్ళు పోసుకుంది ' అని అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మిస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు.

గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 – 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది. ఈ సమయంలో వెన్నునొప్పి కూడా రావచ్చు.

ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను 'పిండం' అంటారు. 'శిశువు' అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు.[1][2]

స్త్రీలకు ప్రతి నెల బహిష్టు (Menses) పూర్తైన తర్వాత గర్భాశయంలో అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో స్త్రీ పురుషుడితో సంభోగించినప్పుడు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. చాలా దేశాల్లో మానవుల గర్భావధి కాలాన్ని మూడు ట్రైమిస్టర్ కాలాలుగా విభజిస్తారు. గర్భధారణ సమయం నుండి పన్నెండు వారాల వరకు మొదటి త్రైమాసికం అంటారు. గర్భధారణలో మొదటిగా ఫలదీకరణ చెందిన అండము ఫెలోపియన్ ట్యూబ్ గుండ ప్రయాణించి గర్భాశయం లోపలి గోడకు అతుకుంటుంది. ఇక్కడ పిండం, జరాయువు తయారవుతాయి. మొదటి ట్రైమిస్టర్ కాలంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పదమూడవ వారం నుండి ఇరవై ఎనిమిదవ వారం వరకు రెండవ త్రైమాసికం అంటారు. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. ఇరవై తొమ్మిది వారాల నుండి నలభై వారాల వరకు మూడవ త్రైమాసికం అంటారు. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.[3]

శిశువు జన్మించడానికి ముందు తగు జాగ్రత్తలు తీసుకొనుట చాలా అవసరం. అనగా అదనపు ఫోలిక్ ఆమ్లం తీసుకొనుట, సాధారణ వ్యాయామం చేయుట, రక్త పరీక్షలు చేయించుకోవడం[4]. గర్బవతులకు అధిక రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, తీవ్రమైన వికారం, వాంతులు వచ్చే అవకాశము ఉంది[5]. సాధారణంగా 37, 38 వారాలని అర్లీ టర్మ్ అని, 39, 40 వారాలని ఫుల్ టర్మ్ అని, 41 వారాన్ని లేట్ టర్మ్ అని అంటారు. 37 వారాల కన్నా ముందు శిశువు జన్మిస్తే వారిని అపరిపక్వ శిశువు అంటారు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో గర్భం అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గర్భము నామవాచకంగా వాడితే కడుపు అని అర్ధం. ఏదైనా ప్రదేశంగాని, వస్తువుగాని, ఇతరత్రా లోపలి భాగానికి గర్భం అని పిలవడం పరిపాటి. ఉదా: నదీగర్భము, గర్భగృహము, గర్భాలయం (గర్భాలయము), గర్భాగారం, గర్భశత్రువు మొదలైనవి. గర్బాధానము అనగా హిందువుల వివాహం సమయంలో పరాకాష్ఠ శోభనం కార్యక్రమము.

గర్భ నిర్ధారణ

చాలా మందిలో గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రంలో చివరి రోజుకు రెండు వారాలు కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.

గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన కోరియానిక్ గొనడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలోని కార్పస్ లుటియమ్ నుండి ప్రొజెస్టిరోన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.

ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ, పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది. దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును.[6] శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసింది.[7]

గర్భం రాకపోవడానికి కారణాలు

 • స్త్రీలు పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం
 • జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో అమ్మాయిలు ఆలస్యంగా పెళ్ళి చేసుకోవడం.
 • అమ్మాయిల్లో పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి దులవాట్లు
 • పురుషుల్లో వీర్యకణాల లోపం
 • దంపతుల్లో మానసిక ఒత్తిడులు

జనని సురక్ష యోజన

గర్భిణీ స్త్రీలకు తగినంత పోషక ఆహారాన్ని సమకూర్చే ఈ జనని సురక్ష యోజన పథకం కింద పేద తరగతులకు చెందిన గర్భిణీలకు ఆర్థిక సాయం అందిస్తారు. మూడోనెల నుంచి ప్రసవం వరకు గర్భిణీలకు పౌష్ఠికాహారానికి జనని సురక్ష యోజన' కింద 700 రూపాయలు కేంద్రం సుఖీభవ కింద రాష్ట్రం మరో 300 రూపాయలు రెండు కాన్పులులోపు వెయ్యి రూపాయల చొప్పున అందిస్తారు. మూడోనెల రాగానే గర్భిణీలు తమ పేర్లను నిర్దేశించిన కేంద్రాల్లో నమోదు చేయించాలి. ఆ వెంటనే ఈ పథకం కింద గర్బిణీలకు ఆర్థ్ధిక సాయం చేస్తారు.కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు ఇంతకుముందు 880 రూపాయలు చెల్లించేవారు. దీనిలో 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటాకాగా, 280 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా.

అద్దె గర్భం

William Hunter, Anatomia uteri humani gravidi tabulis illustrata, 1774

సరోగేటెడ్‌ ప్రక్రియకు సంబంధించి మనకు ఎలాంటి చట్టాలు లేవు. దత్తత ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండటంతో సరోగేటెడ్‌ ప్రక్రియకు మొగ్గుచూపుతున్నారు.

అద్దె గర్భాలకు నిబంధనలు

ఇవీ నిబంధనలు

 • సరోగసీ ప్రక్రియను నిర్వహించే క్లినిక్‌లు డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్ల రికార్డులు నిర్వహించాలి
 • సంతానం కావాలనుకునే దంపతులు, సరోగేట్‌ (గర్భాన్ని మోసే) తల్లి మానసిక స్థితి సాధారణంగా ఉండాలి.
 • సరోగేట్‌ తల్లికి గర్భాన్ని మోసేందుకు అయ్యే పూర్తిస్థాయి ఖర్చును సంతానం కావాలనుకుంటున్న దంపతులు చెల్లించాలి.
 • ఈ ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా క్లినిక్‌ల వద్ద ఉండాలి. కానీ వీటిలో క్లినిక్‌ ఎలాంటి జోక్యం చేసుకోకూడదు.
 • ఆర్థికలావాదేవీలన్నీ కూడా దంపతులు, సరోగేట్‌ తల్లి మధ్యే కొనసాగాలి. క్లినిక్‌లు కేవలం వైద్య సేవలకు మాత్రమే ఛార్జీలు తీసుకోవాలి.
 • సరోగెట్‌గా వ్యవహరించే తల్లుల కోసం క్లినిక్‌లు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకూడదు.
 • 30-40 ఏళ్ల మధ్య వయసున్నవారు మాత్రమే సరోగేట్‌ తల్లిగా వ్యవహరించాలి. సంతానం కావాల్సిన దంపతులకు జన్యు సంబంధం ఉన్నవారు, లేనివారు కూడా ఈ పని చేయొచ్చు.
 • ముగ్గురికి పైగా సంతానం ఉన్నవారు సరోగేట్‌ తల్లిగా వ్యవహరించడానికి వీలులేదు...

మూలాలు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. "Embryo Definition". MedicineNet.com. MedicineNet, Inc. Retrieved 2008-01-17.
 2. "Fetus Definition". MedicineNet.com. MedicineNet, Inc. Retrieved 2008-01-17.
 3. "Trimester Definition". MedicineNet.com. MedicineNet, Inc. Retrieved 2008-01-17.
 4. "Prenatal Care" Archived 2012-11-28 at the Wayback Machine."July 12, 2013. Retrieved 14 March 2015".
 5. "Complication of Pregnancy" Archived 2012-11-28 at the Wayback Machine."July 12, 2013. Retrieved 14 March 2015".
 6. Nguyen, T.H. (1999). "Evaluation of ultrasound-estimated date of delivery in 17 450 spontaneous singleton births: do we need to modify Naegele's rule?". Ultrasound in Obstetrics and Gynecology. 14 (1): 23–28. Retrieved 2007-08-18. {{cite journal}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 7. Odutayo, Rotimi (n.d.). "Post Term Pregnancy". Archived from the original on 2007-09-27. Retrieved 2007-08-18. {{cite web}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
"https://te.wikipedia.org/w/index.php?title=గర్భం&oldid=3556844" నుండి వెలికితీశారు