సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) అనేవి, 2030 నాటికి ప్రపంచంలోని బహుముఖ రంగాలలో పేదరికాన్ని రూపు మాపడానికి, సమస్త విశ్వ శ్రేయోసమృద్ధి కోసం ఒక సమానమైన, న్యాయమైన, సురక్షితమైన ప్రపంచాన్ని రూపొందించడానికై తీసుకొన్న ఒక దృఢమైన, సార్వత్రిక ఒప్పందము. మన ప్రపంచమును రూపాంతరం చేయుటలో ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 169 నిర్దేశిత లక్ష్యాలు ఒక భాగం. సుస్థిర అభివృద్ధి కొరకు 2030 ఎజెండా, 2015 సెప్టెంబరులో జరిగిన చారిత్రాత్మక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమ్మేళనంలో 193 సభ్యరాజ్యాలచే స్వీకరించబడి, 2016, జనవరి 1 వ తేదీ నుండి అమలులోనికి వచ్చింది.[1]

ఆశాదాయకమైన ఈ ఎజెండా గురించి చర్చించి ఆచరించడానికై, జాతీయ ప్రభుత్వాలు, ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్ది పౌరులను ఒక చోట చేర్చి మునుపెన్నడూ జరగని రీతిలో నిర్వహించబడిన సంప్రదింపు ప్రక్రియల ద్వారా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రూపొందించబడ్డాయి.[2]

లక్ష్యాల వివరాలు[మార్చు]

గ్రామీణ[permanent dead link] భారతదేశంలో ఆరోగ్యవంతమైన పిల్లలతో తల్లుగు

17 లక్ష్యాలు ఉన్నాయి.

 1. పేదరికాన్ని నిర్మూలించడం
 2. ఆకలి బాధలను నివారించి ఆహార భద్రతను కల్పించి, పోషకత్వాన్ని మెరుగుపర్చడం
 3. ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలు పెంపు
 4. నాణ్యమైన విద్య
 5. లింగ సమానత్వం సాధించి మహిళా సాధికారతను పెంపొందించడం
 6. అందరికీ తాగునీటి వసతిని కల్పించడం, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం
 7. అందరికీ అందుబాటులో ఉండే విధంగా చౌకగా సుస్థిర శక్తి వనరులు అందించడం
 8. గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థికవృద్ధి
 9. పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు
 10. అసమానతల తొలగింపు
 11. సుస్థిర నగరాలు, సమూహాలు
 12. బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి
 13. వాతావరణ పరిరక్షణ
 14. సముద్ర, జల జీవుల పరిరక్షణ
 15. (నేల) పై జీవుల పరిరక్షణ
 16. శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు
 17. లక్ష్యాల సాధనకు భాగస్వామ్యాలు

నీతి ఆయోగ్ సూచి[మార్చు]

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాలను ప్రతిపాదికగా తీసుకొని నీతిఆయోగ్ రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను మదింపు చేస్తుంది. అయితే, సుస్థిరాభివృద్ధిలోని 17 లక్ష్యాల్లో 13 లక్ష్యాలనే నీతిఆయోగ్ ప్రతిపాదికగా తీసుకుంటుంది. (లక్ష్యాలు 12,13,14,17లను పరిగణించదు). కేంద్ర గణాంకాలు, కేంద్ర పథకాలనే మూలాలుగా వాడతారు.[3]

2021[మార్చు]

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) సూచీలో 2020-21గానూ రాష్ట్రాల విభాగంలో కేరళ 75 పాయింట్లను సాధించి తన తొలి స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. బీహార్ ఈ సూచిలో చివరిస్థాయిలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఒక్కొక్కటి 74 పాయింట్లతో రెండో స్థానంలో, 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి చేరుకోగా, 69 పాయింట్లతో తెలంగాణ ఆరో స్థానానికి దిగజారింది.[4]

2018[మార్చు]

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను ప్రామాణికంగా తీసుకొని వివిధ రాష్ట్రాల పనితీరు, అభివృద్ధిని నీతి ఆయోగ్ మదింపు చేసింది. ఈ వివరాలను 'సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి - 2018' పేరిట ఒక నివేదిక రూపంలో తొలిసారిగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రమాణాల్లో కలిపి మంచి పనితీరు వర్గంలో నిలవగా, నిర్దేశించిన కొన్ని లక్ష్యాల సాధనలో మరింత మెరుగైన పనితీరు కనబరిచి పై స్థాయికి వెళ్లాయి. వివిధ రంగాల్లో 64 పాయింట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవగా, 61 పాయింట్లతో తెలంగాణ ఐదో స్థానం సాధించింది.[3]

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన ఆకలి నిర్మూలనలో గోవా ముందజలో ఉండగా 53 స్కోర్‌తో తెలంగాణ 15వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 50 స్కోర్‌తో 18వ స్థానంలో ఉన్నాయి.

పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానం, తెలంగాణ 18వ స్థానం పొందాయి.

ఆరోగ్యం, సంక్షేమంలో తెలంగాణ మూడో స్థానం, ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం పొందాయి.

లింగసమానత్వ సూచిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఐదు, ఆరు స్థానాలు సాధించాయి.

అసమానతల తొలగింపులో వందకు వంద స్కోరు సాధించి తెలంగాణ తొలిస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది.

శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థాగత సంస్థల నిర్మాణంలో ఏపీ రెండోస్థానంలో నిలవగా, తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది.

భారత్‌లోని పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 5.41 శాతం మంది మురికివాడల్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 12.04 శాతం పట్టణ జనాభా మురికివాడల్లోనే నివసిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.[5]

మూలాలు[మార్చు]

 1. "The Global Goals". The Global Goals (in ఇంగ్లీష్). Retrieved 2021-04-30.
 2. "Sustainable Development Goals: A Handbook" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-30. Retrieved 2021-04-30.
 3. 3.0 3.1 "SDG India Index - Baseline Report 2018 | NITI Aayog". niti.gov.in. 2018-12-21. Archived from the original on 2021-04-28. Retrieved 2021-05-01.
 4. "సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో మళ్లీ కేరళనే టాప్". ప్రజాశక్తి. 2021-06-03. Retrieved 2021-06-05.
 5. "'అసమానతల తొలగింపులో తెలంగాణకు 100కు వంద మార్కులు.. సన్ రైజ్ విజన్‌‌తో ముందుకు వెళ్తున్న ఏపీ'". BBC News తెలుగు. 2021-12-22. Retrieved 2021-05-01.

బయటిలింకులు[మార్చు]

Kumar