సూర్యా ధనుంజయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యా ధనుంజయ్
Surya Dhanunjay.jpeg
జననం03 ఎప్రిల్,1970
జాతీయతభారతీయురాలు
వృత్తితెలుగు సాహిత్యకారిణి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ప్రొఫెసర్

ఆచార్య సూర్యా ధనుంజయ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సాహిత్యకారిణి. 2017 నుండి 2022 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విభాగాధిపతిగా పనిచేసింది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహిత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

సూర్యా ధనంజయ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం భల్లునాయక్ తండాలో జన్మించింది. తల్లిదండ్రులు స్వర్గీయ శ్రీమతి ధ్వాళీబాయి, శ్రీ భల్లునాయక్ లు. ఆమె తండ్రి సంఘసంస్కరణ భావాలు కల్గినవాడు. ఆయన పేరు మీదనే ఆ తండా ఏర్పడింది. చదువు ప్రాధాన్యతను తెలిసినవాడిగా ఆయన ఆనాడే తండాలో పాఠశాలను ఏర్పాటు చేయించాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆడపిల్లలు పుడితేనే భారంగా భావించే తండా సమాజంలో ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో పసిగట్టిన కుటుంబం కనుక వారి బిడ్డ సూర్యాను బడిలో చేర్పించారు. సూర్యా జన్మించిన కొద్దిరోజులకే తండ్రిని కోల్పోయింది. తల్లి ద్వాళీబాయి తానే కుటుంబ భారాన్ని మోసింది, బిడ్డలందరిని కష్టపడి పెంచింది. సూర్యా చిన్ననాటి నుండి చదువుమీద చూపిన ఆసక్తిని గమనించి ఎన్ని కష్టాలైనా భరించి ఆమెను చదివించాలనుకుంది. కాని తండ్రి మరణం తర్వాత ఊళ్లోని పాఠశాల మూతపడింది. పక్క తండాలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాక ఉన్నత పాఠశాల మిర్యాలగూడకు వెళ్లలేని ఆర్థిక పరిస్థితి. ఆరోజుల్లో తండాకు బస్సు సౌకర్యం లేదు. అటువంటి స్థితిలో తనకు చదువు నేర్పిన గురువులు ధ్వాళీబాయికి నచ్చజెప్పడంతో మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో చేరింది.తండా నుండి మిర్యాలగూడకు రోజు నడిచి వెళ్ళేది. కొంతకాలానికి ఎస్సి బాలికల హాస్టల్లో సీటు రావడంతో అక్కడే ఉండి పదవ తరగతి పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఆమె వివాహం డా.ధనంజయ్ నాయక్ తో జరిగింది. రెండవ సంవత్సరంలో బాబు సంజయ్ జన్మించాడు. దానితో చదువు మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం భర్త ప్రోత్సాహంతో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా బీఏ పూర్తిచేసి ఆంధ్ర మహిళా సభలో బీఈడీ,ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు,బిఎల్ఐఎస్సి చేశారు. అనంతరం "రామాయణ అరణ్య కాండలోని ఆశ్రమాలు-శ్రీరాముని దర్శనాలు" అనే అంశంపై ఎంఫిల్,"నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం -జీవన చిత్రణ" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తాను చదువుకున్న తెలుగుశాఖలోనే ప్రొఫెసర్ ఉద్యోగాన్ని సంపాదించింది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖకు రెండవసారి అధ్యక్షులుగా, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ కు డైరెక్టర్ గా కొనసాగుతోంది.[2]

సాహిత్యకృషి[మార్చు]

సూర్యా ధనుంజయ్ 20 ఏళ్ళుగా సాహిత్యరంగంలో కృషి చేస్తోంది. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేస్తూ దూసుకుపోతున్న వారిలో ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ ఒకరు. .

 • "రామాయణ అరణ్య కాండలోని ఆశ్రమాలు - శ్రీరాముని దర్శనాలు" గ్రంథం పరిశోధకులకు మార్గదర్శనంగా ఉపయోగపడుతోంది.
 • పరిశోధన సిద్ధాంత గ్రంథం"నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం జీవన చిత్రణ" ద్వారా తొలిసారిగా బంజారా సాహిత్యాన్ని తెలుగు పాఠకలోకానికి అందించింది.
 • "బంజారా నానీలు" బంజారాల వ్యథలకు ప్రతిరూపాలయ్యాయి.
 • "తాంగ్డీ"సాహిత్య వ్యాస సంపుటిలో బంజారాల జీవనాన్ని హృద్యంగా మలిచింది.
 • "గమనం" వ్యాస సంపుటితో సాహిత్యంలోని విభిన్న కోణాలను, రచయితల కవితా హృదయాన్ని ఆవిష్కరించింది.
 • అనువాదకురాలిగా 'చతురాయికి బహుమాన్' అనే హిందీ కావ్యాన్ని తెలుగులోకి 'చతురతకు బహుమానం' అన్న పేరుతో అనువాదం చేసింది.
 • 'సినారె సాహితీ వైభవం","తెలంగాణ సాహిత్యం సమాలోచన" వంటి సాహిత్య వ్యాస సంకలనాలకు సంపాదకురాలిగా ఉంది.
 • "శత వాసంతిక" నూరేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విజ్ఞాన సర్వస్వం లాంటి గ్రంథం. దీనికి సంపాదకురాలిగా వ్యవహరించింది.
 • వ్యాసకర్తగా 70కి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో తన బాణిని వినిపించింది.
 • "అమెరికన్ ఫోక్లోర్ సొసైటీ" వారు అమెరికాలో నిర్వహించిన సదస్సుకు హాజరై "భారతీయ సంస్కృతిలో బంజారాల వస్త్ర, ఆభరణాల ప్రాముఖ్యత" అనే అంశంపై పత్ర సమర్పణ చేసింది. నాడు చేసిన ప్రసంగం ఎందరో మేధావులను భారతదేశం వైపు చూసేలా చేసింది.

నిర్వహించిన సాహితీ కార్యక్రమాలు, సదస్సులు:

 • 2017 ఆగస్టు30,31 వ తేదీల్లో "సినారె సాహితీ వైభవం" రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించి స్వర్గీయ ఆచార్య సి. నారాయణరెడ్డికి ఘనమైన సాహితీ నివాళిని సమర్పించింది.
 • ప్రపంచ తెలుగు మహాసభలు 2017 సందర్భంగా "తెలుగుకు వెలుగు"చర్చా కార్యక్రమం, సృజనాత్మక పోటీలు నిర్వహించింది.
 • తెలుగుశాఖ శతాబ్ది సంబరాలను 2019 జనవరి 31వ తేదీన కనీవినీఎరుగని రీతిలో గొప్ప వేడుకగా ప్రారంభించి, ఇందులో భాగంగా "తెలుగుశాఖ అపూర్వ విద్యార్థిని, తొలి ఎంఏ పట్టా పొందిన మహిళా అయిన ఇల్లిందుల సుజాత గారిని సగౌరవంగా సన్మానించడంలో పాత్ర పోషించింది.
 • తెలుగుశాఖ వెబ్సైట్ ను ఆవిష్కరించుకోవడం,ఆలమ్ని అసోసియేషన్ ఏర్పాటు" చేయడంలో కృషి చేసింది.
 • తెలుగుశాఖ విశ్రాంత ఆచార్యులను వారి సేవలను స్మరిస్తూ వారిని ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
 • "తెలంగాణ సాహిత్యం సమాలోచన" అన్న అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును పరిశోధక విద్యార్థుల కోసం నిర్వహించింది.
 • "తెలంగాణ గిరిజన సంస్కృతి, సాహిత్యం" అన్న అంశంపై ఒకరోజు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించింది.
 • "తెలంగాణ చరిత్రలో రెడ్డి పాలకులు సాహిత్యం,సమాజం" రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించింది.
 • "తెలుగుశాఖ ఆచార్యుల సాహిత్యం సమాలోచన" రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది.
 • "కవయిత్రుల కవితా గానం" కార్యక్రమం నిర్వహించి కవయిత్రులను సన్మానించింది.
 • ఉమెన్స్ స్టడీస్, కేంద్ర సాహిత్య అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో "కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత్రుల సాహిత్యం"(లిటరసీ ఫోరం) పై ఒకరోజు సదస్సు నిర్వహించింది.
 • డిగ్రీ అధ్యాపకుల బోధనా సామర్థ్యాన్ని మెరుగులు దిద్దే "పునశ్చరణ తరగతులు"(రిఫ్రెషర్ కోర్స్)ను 2018,2019 సంవత్సరాల్లో రెండుసార్లు నిర్వహించింది.
 • పరిశోధక విద్యార్థుల కోసం అవగాహన తరగతులు, విస్తరణోపన్యాసాలు వంటివి చేపట్టింది.[3]

సామాజిక కృషి[మార్చు]

 • "యాడి" (అమ్మ) చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి నిరుపేద గ్రామీణ, తండా బిడ్డల చదువుకు తనవంతు సహకారం అందిస్తోంది.
 • ఉజ్వల్ క్రియేషన్స్, శీతల్ పబ్లికేషన్స్ సంస్థలను స్థాపించి యువ రచయితలను ప్రోత్సహిస్తోంది.

వృత్తిలో భాగంగా చేపట్టిన పదవీ బాధ్యతలు[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులుగా,తెలుగు శాఖ అధ్యక్షులుగా, తమ పాలనాదక్షతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వీరు ఎన్నో పదవులను చేపట్టారు.

01. జాతీయ సేవా పథకం (NSS) నిర్వహణాధికారి (2002-2003)

02. ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా వసతిగృహ వార్డెన్ (2006-2008)

03. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణాధికారి (2010-2015)

04. వరకు ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ సభ్యురాలు (2010-2015)

05. పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షురాలు (2012-2016)

06. విద్యార్థి సంక్షేమాధికారిగా (2012 నుండి)

07. 2012లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ 'యువతరంగ్ ' కార్య క్రమాల నిర్వహణ కమిటీ సభ్యురాలు

08. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షురాలు (2012 నుండి)

09. తెలంగాణ ఉన్నత విద్యామండలి సభ్యురాలు (2014-2017)

10. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు

అందించే పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలు (2015-2017)

11. 2016వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే దాశరథి పురస్కారం ఎంపిక కమిటీ సభ్యురాలు

12. 2017వ సంవత్సరంలో పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు.

13. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు (2017 జూలై నుండి)

13. 2017వ సంవత్సరంలో ఓయూ శతాబ్ది సంబరాల నిర్వహణ కమిటీ సభ్యురాలు

14. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో ఉమెన్స్ సెల్ అధ్యక్షులు (2018-2019)

15. ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ (2018 డిసెంబర్ నుండి)

పొందిన పురస్కారాలు[మార్చు]

01. జ్యోత్స్న కళాపీఠం వారి "ఉగాది పురస్కారం" (2011)

02. "బంజారా అక్షర దివిటి అవార్డు" (2013)

03. జాతీయ బంజారా మహోత్సవాల్లో "వసంత్ భూషణ్ పురస్కారం" (2014)

04. శ్రీ సోమ సీతారాములు తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం" (2014)

05. ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వారి "రామరాజు విజ్ఞాన బహుమతి"(2015)

06. "ఎస్వీఆర్ పురస్కారం" (2016)

07. "ఆచార్య మడుపు కులశేఖర రావు పురస్కారం" (2017)

08. "ఇందిరాగాంధీ స్మారక అవార్డు" (2017)

09. "మదర్ థెరిస్సా స్మారక అవార్డు" (2017)

10. దళిత సాహిత్య అకాడమీ వారి "సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డు" (2018)

11. జానపద సాహిత్య పరిషత్తు వారి "జానపద సాహితీ రత్న పురస్కారం" (2018)

12. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి "విశిష్ట మహిళా పురస్కారం" (2020)[4]

మూలాలు[మార్చు]

 1. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 March 2020. Retrieved 14 March 2020.
 2. The New Indian Express, Hyderabad (11 August 2020). "Need to record history and protect language, traditions of indigenous people: Prof Surya Dhananjay". Saima Afreen. Archived from the original on 11 August 2020. Retrieved 11 August 2020.
 3. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 March 2020. Retrieved 15 March 2020.
 4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 March 2020. Retrieved 14 March 2020.