2006 జనవరి 2వ వారం
స్వరూపం
జనవరి 14 2006, శనివారం
[మార్చు]- రోడ్డు మీదే స్నానం, భోజనం: తెదేపా అధికార ప్రతినిధి ఎం.వి.మైసూరారెడ్డి ఇంట్లోకి వెళ్లే మార్గాన్ని ప్రభుత్వం మూసేసింది. దీనికి నిరసనగా ఆయన రోడ్డునే బసగా చేసుకున్నాడు. కాలకృత్యాలను రోడ్డు పక్కనే తీర్చుకున్నాడు. రోడ్డు మీదే స్నానం, భోజనం చేశాడు. పానీయాలు సేవించాడు. టెంట్ వేసుకుని అక్కడే నిద్రించాడు.
- పాలారు నదిపై ఆనకట్టను వ్యతిరేకిస్తాం: పాలారు నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనకట్ట నిర్మిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని తమిళనాడు గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా తమిళనాడు శాసన సభ సమావేశాలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ స్పష్టం చేశాడు. ఈ నిర్మాణం పూర్తిచేసిన పక్షంలో తమిళనాడులోని వేలూరు, ఆర్కాడు, గుడియాట్టం తదితర ప్రాంతాలలోని రైతులు తీవ్రంగా నష్టపోతారని, తాగునీటి సమస్య కూడా తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.
జనవరి 12 2006, గురువారం
[మార్చు]- బయోడీజిల్‌పై ఆర్టీసీ దృష్టి: డీజిల్ ధర భారంగా మారడంతో దానికి బదులు చౌకైన బయోడీజిల్‌ను వినియోగించడంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ దృష్టి పెట్టింది. అధికారులు కొన్ని నెలలుగా హైదరాబాదులో బయోడీజిల్‌తోనే ఒక బస్సును ప్రయోగాత్మకంగా నడపుతున్నారు. దీనికి నెలకు వంద లీటర్లకు పైగా బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. డీజిల్ ధర లీటరు రూ.34 కాగా, బయోడీజిల్‌ను హైదరాబాదు బస్సుకు లీటరు రూ.25కే సరఫరా చేస్తున్నారు. అయితే బయోడీజిల్ సేకరణే ఆర్టీసీకి కష్టమైన పనిగా మారింది. బయోడిజీల్‌ను ఎంత సరఫరా చేసినా కొనడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ ఆర్టీసీ ఇటీవలే ప్రతికల్లో ప్రకటన ఇచ్చింది. దీనికి పెద్దగా స్పందన రాలేదు. కారణం... రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున బయోడీజిల్ సరఫరా కావట్లేదు. దీన్ని శుద్ధి చేయకుండా తమకు సరఫరా చేసినా తాము శుద్ధి చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈనాడు[permanent dead link]
- స్పీకర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు: లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీకి, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. లోక్ సభలో ప్రశ్నలు అడగడానికి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణపై తనను సభ నుంచి బహిష్కరించడాన్ని లాల్ చందర్ కోల్ సవాలు చేస్తూ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ విజేందర్ జైన్, జస్టిస్ రేఖా శర్మలతో ఏర్పాటైన ధర్మాసనం పరిశీలించి, నోటీసులిచ్చింది. రెండు వారాల్లోపల ఈ నోటీసులకు సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది.
- బోగస్ ఓటర్లు కాదు: ఓటర్ల జాబితాలో పెద్దసంఖ్యలో బోగస్ ఓటర్లు ఉన్నారంటూ వచ్చిన వార్తలపై పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో మీడియా అతిగా స్పందించిందని, గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిందని ఆయన అన్నాడు. అసలు బోగస్ ఓటర్లంటే ఏమిటో నాకర్థం కావడంలేదు. ఓటర్లలో కొందరు చనిపోయుంటారు ..మరికొందరు అడ్రస్ మారి ఉంటారు. అలాంటి వారిని జాబితా నుంచి తొలగించాలి. అదే ప్రక్రియ కొనసాగుతోంది. దీనికింత వివాదమెందుకు అని బసు అన్నాడు.
జనవరి 11 2006, బుధవారం
[మార్చు]- రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తాను ఎమ్మెల్యేనో, ఎంపీనో కావాలనుకుంటే 1998లో అయ్యేవాడినని, నాటి దేశం అధినేత చంద్రబాబు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ ఇచ్చారని చెప్పారు. కానీ తనకు పదవుల కంటే ఎస్సీల వర్గీకరణే ముఖ్యమని పేర్కొన్నారు.
జనవరి 10 2006, మంగళవారం
[మార్చు]- యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ రాదు: తెలంగాణా విషయమై కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి ఇలా అన్నాడు: "కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నంతకాలం తెలంగాణ రాదుగాక రాదు. వస్తుందనుకోవడం బక్వాస్. తెలంగాణ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉన్నా... ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సాధ్యమైతలేదు. తెలంగాణకు అడ్డుకాలేసిన లెఫ్ట్ పార్టీల వద్దే 64 ఎంపీల బలముంది. ఇగ తెలంగాణ ఎట్లొస్తది? సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలి. రెండో ఎస్సార్సీ ఏర్పడాలి. అప్పుడే ప్రత్యేక తెలంగాణ సాధ్యం. రెండో ఎస్సార్సీ ఏర్పడితే దాని ఛైర్మన్ మనోడుంటడు. ఎస్సార్సీ నిబంధనలను, విధి విధానాలనూ మనకు అనుకూలంగా ఖరారు చేసుకోవచ్చు. ఆర్నెల్లలో తెలంగాణ వస్తది. కానీ రెండో ఎస్సార్సీకి తెరాస ఒప్పుకోలేదు. లేదంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేది"
- స్క్రామ్‌జెట్: శబ్ద వేగానికి అనేక రెట్ల వేగంతో ప్రయాణించగల స్క్రామ్‌జెట్ పరిజ్ఞానాన్ని భారత్ సొంతం చేసుకుంది. ప్రపంచంలో అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా చరిత్ర సృష్టించింది. తిరువనంతపురంలోని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో దేశీయంగా రూపొందించిన స్క్రామ్‌జెట్‌ను విజయవంతంగా పరీక్షించారు.
జనవరి 9 2006, సోమవారం
[మార్చు]- ప్రత్యేక తెలంగాణ ఇచ్చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెసు చెప్పలేదని అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా తెరాసతో పొత్తు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్ వెల్లడించాడు.
- పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం సాధ్యం కాదనీ, దానివల్ల ఆశించిన ప్రయోజనాలు అందకుండా పోతాయనీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు టి. హనుమంతరావు, ధర్మారావు, జోగారావు అందజేసిన ప్రతిపాదనలు సాంకేతికంగా, ఆర్థికంగా ఆచరణ సాధ్యం కావని నిర్ధారణకు వచ్చింది.
- ప్రశ్నలకు ముడుపుల విషయంలో సుప్రీం కోర్టు "ఏ చట్టం కింద, ఏ నిబంధన కింద ఎంపీలను సభలనుండి బహిష్కరించారు? రెండు వారాల్లో మీ సమాధానం చెప్పండి" అంటూ కేంద్రానికి, లోక్‌సభ స్పీకరు సోమనాథ ఛటర్జీకి, రాజ్యసభ ఛైర్మన్‌కు, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీచేసింది.
జనవరి 8 2006, ఆదివారం
[మార్చు]- తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయ విమర్శలకు వేదికైంది. ఆలె నరేంద్ర, పి.జనార్ధనరెడ్డి ల మధ్య వాగ్యుద్ధానికి కారణమైంది. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసుకు పుట్టగతులుండవని నరేంద్ర అనగా, మాకు అప్పుడుండవేమో గాని, మీకు ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయాయి అని జనార్ధనరెడ్డి అన్నాడు.
- తెలుగుకు ప్రాచీనభాష హోదా: తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించే విషయమై తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక సదస్సు జరిగింది. ఖేంద్ర మంత్రి దాసరి, సురవరం సుధాకరరెడ్డి ప్రసంగించినవారిలో ఉన్నారు.
- ఐపీఎస్ అధికారి హంతకుడు... లష్కరే తోయిబా అగ్రనేత, కరుడుగట్టిన ఉగ్రవాది ముజీబ్‌కు క్షమాభిక్ష రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఈనాడు[permanent dead link]లో వార్త వచ్చింది.
- ఫోను టాపింగు: నా ఫోను టాపింగు చేసారంటూ అమర్ సింగు బాబుతో చెప్పుకోడానికి వస్తే, బాబు ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ, నా ఫోను కూడా ఏడాదిగా టాపింగవుతోందంటూ అన్నాడు.
- ఎన్‌కౌంటర్: బస్సు దోపిడీల నేరస్థుడు కొక్కుల రాజు పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించాడు.
- జ్ఞానపీఠ అవార్డు: ఆధునిక మరాఠీ కవిత్వంలో సుప్రసిద్ధుడైన వృందా కరందికర్ 2003 వ సంవత్సరపు జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికయ్యాడు.