Jump to content

అరిస్టాటిల్

వికీపీడియా నుండి
అరిస్టాటిల్
జననంక్రీ.పూ.384
ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరం
మరణంక్రీ.పూ.322
"యూబోయా" ద్వీపం
జాతీయతగ్రీసు
రంగములుతత్వ శాస్త్రము,రాజనీతి శాస్త్రము,గణిత శాస్త్రము,ఖగోళ శాస్త్రము,జీవ శాస్త్రము
పరిశోధనా సలహాదారుడు(లు)ప్లేటో
డాక్టొరల్ విద్యార్థులుఅలెగ్జాండర్
ప్రసిద్ధిజీవ శాస్త్రపిత

అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటోకి శిష్యుడు, అలెగ్జాండర్కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.[1] తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.

విజ్ఞాన శాస్త్రంపై అరిస్టాటిల్ ప్రభావం

[మార్చు]

ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడని ప్రతీతి. విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు. ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవుపోసన పట్టి వెయ్యికి పైగా గ్రంథాలను రచించాడు. దాదాపు 2000 సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేసాడు. క్రైస్తవ దేశాలలో సుమారు 1000 సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించారు. అతడి రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు.

విజ్ఞానార్జన, విద్యాబోధన

[మార్చు]

అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల వయసులో ప్లేటో అకాడమీలో చేరి ప్లేటోకు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు.తత్వ శాస్త్రం, రాజనీతి శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము మొదలైన వాటిని అరిస్టాటిల్ పూర్తిగా అధ్యయనం చేసాడు. ఊహాగానాల కన్న పరిశోధనల ద్వారా రూఢి అయ్యే వాస్తవాలే విజ్ఞాన శాస్త్ర వికాసానికి దోహద పడాతాయని పదే పదే చెప్పేవాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్ళపాటు గడిపాడు. ఆచరణలో కూడా అదే విధంగా ఉండేవాడు. క్రీ.పూ 347 లో ప్లేటో మరణించిన తరువాత ప్లేటో వారసునిగా స్పేయుసిప్పన్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఇది నచ్చని అరిస్టాటిల్ హెర్మియన్ రాజ్యానికి వెళ్ళాడు. హిర్మియన్ సోదరిని పెళ్ళి చేసుకున్నాడు.మాసిడోనియా రాజైన ఫిలిప్ - హెర్మియన్ ద్వారా అరిస్టాటిల్ ఘనతను విని తన కుమారుడైన అలెగ్జాండర్కు విద్యా బోధన చేయవలసినదిగా కోరాడు. అరిస్టాటిల్ అందుకు సమ్మతించి అలెగ్జాండర్ కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన మాసిడోనియాకు చేరాడు.గురువుగారి పరిశోధనల కోసం అలెగ్జాండర్ ఎంతోమంది సేవకులను, భారీ నిధులను సమకూర్చిపెట్టాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్ళీ ఏథెన్స్ చేరుకుని ప్లేటో అకాడమీకి పోటీగా లైజియం అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు.

పరిశోధనలు

[మార్చు]

అరిస్టాటిల్ స్పృశించని విషయాలంటూ లేవు కాని "జీవ శాస్త్ర పిత"గా బహళ ప్రాచుర్యం పొందాడు. వివిధ జీవ జాతుల వర్గీకరణ పట్ల ఎక్కువగా శ్రద్ద చూపి - దేహనిర్మాణం, సంతానోత్పత్తి విధానాలు, రక్త గుణాలు, జంతువుల ప్రవర్తన ఆధారంగా వర్గీకరణం చేశాడు. 18వ శతాబ్దంలో లిన్నెయస్ వర్గీకరణ వచ్చేదాకా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ అరిస్టాటిల్ వర్గీకరణన నే ప్రామాణికంగా తీసుకునేవారు.

భూమి ఆవిర్భావం,పర్వతాలు రూపొందే విధానం గురించి కూడా ఈయన విపులంగా చర్చించాడు. ఈ చర్చలో వాస్తవం లేకపోలేదని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆంగీకరిస్తున్నారు.

రచనలు

[మార్చు]

ఈయన రాసిన "ఆర్గనోన్" సుప్రసిద్ధమైన గ్రంథం. ఇంద్రియాల పరిజ్ఞానం, యోచనా శక్తి, జ్ఞాపక శక్తి, కలలు-మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు. ఈయన సుమారు 1000 రచనలు చేసి యుంటారని ప్రతీతి. వీటిలో ఆర్గనోన్, యూడెమన్, ప్రోటిష్టికన్ వంటివి ముఖ్యమైనవి.సృష్టి జ్ఞాన మీమాంస నితి శాస్త్రం ఈయనకు గననీయమైన ప్రతిష్ఠ తెచ్చి పెట్టింది.

అరిస్టాటిల్ రాజనీతిని ఒక సహజ శాస్త్రంగా రూపొందించినాడు. తాను వ్రాసిన పాలిటిక్స్లో రాజకీయజీవితం స్వభావాన్ని చర్చించాడు.రాజ్యము సహజమైన సంస్థ. దానిని ఏ ప్రజా సముదాయమూ ప్రత్యేకంగా ఒక ప్రయోజన సాధనకు ఒకానొక ప్రత్యేక కాలంలో రూపొందించలేదు. అరిస్టాటిల్ మానవుడిని సాంఘిక జీవి అని నిర్వచించాడు.రాజ్యము ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది.అది వ్యక్తికి పూర్వమే జనించింది.రాజ్యంలో రెండు వర్గాల ప్రజలుంటారు.ఒకటి పాలకులు, రెండు పాలితులు.ఈ రెండు వర్గాల మధ్య సహజమైన సమైక్యత ఉండాలి. లేకపోతే ఈ రెండు వర్గాలు జీవించడం కష్టము.తెలివితేటలు, దూరదృష్టి ఉన్నవాళ్ళు రాజ్యపాలన వహిస్తారు.శారీరిక శక్తి ఉన్నవాళ్ళు పాలక వర్గం నిర్దేశించినట్లు పని చేస్తారు.రాజకీయ వ్యవస్థను ప్రజలు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేటట్లు రూపొందించాలి. రాజ్య ధ్యేయాలు మితంగా, ఆచరణ యోగ్యంగా ఉండాలి అంటాడు అరిస్టాటిల్. ప్లేటో ది లాస్ లో ప్రతిపాదించిన చట్టబద్దమైన రాజ్యాన్ని అంటె ఉత్తమ రాజ్యం లో చట్టానికి సార్వభౌమాధికారం ఉంటుంది కానీ వ్యక్తికి కాదు అనే ప్రతిపాదనను అరిస్టాటిల్ అంగీకరించాడు.చట్టం మానవ బలహీనతలకు సదుపాయంగా అరిస్టాటిల్ భావించలేదు.అందువల్ల అది ఆదర్స రాజ్యంలో ప్రధానభాగం అవుతుంది.చట్టం పాలకులకు పాలితులకు మధ్య సంబంధాలను స్వేచ్చాయుత ప్రజలమధ్య సంబంధాలుగా నైతిక సమానత్వాన్ని ఏర్పరుస్తుంది. రాజ్యాంగ బద్ధమైన పాలన అనేది రాజ్యాన్ని మంచి పరిపాలకులు పరిపాలించేలా, లేదా మంచి చట్టాల ద్వారా పాలన జరిగేలా అనే అంశాన్ని కూడా చర్చనీయంగా చేస్తుంది అంటాడు అరిస్టాటిల్.

అరిస్టాటిల్ ప్రభుత్వాలను గణాత్మకంగానూ, గుణాత్మకంగానూ ఆరు రకాలుగా వర్గీకరించాడు.అవి రాజరికము, శ్రేష్ఠ జనుల పాలన (Aristocracy), పాలిటీ (Polity), క్రూర జనుల పాలన (Tyranny), అల్పజన పాలన (Oligarchy), ప్రజాస్వామ్యము. ఇందులో మొదతి మూడు చట్టబద్దమైనవి, చివరి మూడూ వికృత రూపాలు. ఇందులో అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు రకాలుగా వర్గీకరించాడు.అవి: అధికారాన్ని నిర్వహించేవారి సంఖ్యనుబట్టి ఏర్పడినవి.వాటిలో-ఒక వ్యక్తి పాలన లేదా ఏకస్వామ్యము, శ్రేష్ఠజనుల పాలన-కొద్దిమంది పాలన, పాలిటీ-అధిక సంఖ్యుల పాలన . రాజరికము, శ్రేష్ఠజనుల పాలన, పాలిటీ-వీటిలో అధికారం మొత్తం ప్రజల శ్రేయస్సుకై వినియోగించడం జరుగుతుంది. అధికారాన్ని స్వప్రయోజనం కోసం వినియోగించినప్పుడు రాజరికము క్రూరపాలన, శ్రేష్ఠ జనుల పాలన, అల్పజనుల పాలన , పాలిటీ, ప్రజాస్వామ్యం అవుతాయి అంటాడు అరిస్టాటిల్.

ప్రజాస్వామ్యంలో అందరికీ సమానత్వం ఉంటుంది. ధనవంతులు, నిరుపేదలు అన్నతేడా ఉండదు.గుణవంతులు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ సమానులు.ఈ ప్రజాస్వామ్యంలో తలలనే లెక్క పెడతారు కాని, అభిప్రాయానికి విలువ ఉండదు.అందువల్ల ప్రజాస్వామ్యం అల్ప సంఖ్యాకులకు, గుణవంతులకు, అధిక సంఖ్యాకులు కలిసినప్పుడు సమానత్వం అనే సూత్రం క్రింద అధిక సంఖ్యాకులనే రోడ్డురోలర్ క్రింద అల్ప సంఖ్యాకులు నలిగిపొతారు.అజ్ఞానులు గుణవంతులపై ఘనవిజయం సాధిస్తారు అంటాడు అరిస్టాటిల్. ప్రజాస్వామ్యం రెండు రకాలు.రాజ్యాంగబద్దమైనది, రాజ్యాంగబద్దంకానిది.రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కొన్ని చట్టాలు, పరిమితులకు లోబడి వ్యవహరిస్తుంది. ఇందులో అల్ప సంఖ్యాక వర్గాలు, వారి హక్కులు రక్షించబడుతాయి.రాజ్యాంగబద్దంకాని దానిలో మూక పాలన (Monarchy) లో ఇటువంటి రక్షణలు ఉండవు అంటాడు అరిస్టాటిల్.

అరిస్టాటిల్ మితవాది.అతడు ఆచరణ సాధ్యమైన భావాలనే రూపొందించాడు.సమస్యలను పరిష్కరించడంలో మధ్యే మార్గాన్ని లేదా మితవాద మార్గాన్ని అవలంబించాడు.దీనిని అనుసరించే రాజ్యంలో ఏ రెండు ప్రబల వర్గాలకీ చందని మధ్య తరగతి మరొకటి ఉంది.ఈ వర్గం ధనిక పేద వర్గాల మధ్య సమతా స్థితిని నెలకొల్పుతుంది.రెండు ప్రబల వర్గాల మధ్య ప్రాబల్యసమతౌల్యాన్ని ఏర్పాటిచేస్తుంది.అరిస్టాటిల్ మధ్యతరగతి ప్రజల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యంలో రాజకీయ సుస్థిరత ఉంటుందని భావించాడు.

పరిశోధనలలో లోపాలు

[మార్చు]
  • బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పాడు. ఇది తప్పని గెలీలియో ఋజువు చేశాడు.
  • శూన్య ప్రదేశం సృష్టించడం అసాధ్యమన్నాడు. కాని సాధ్యమేనని తదుపరి తెలిసింది.
  • వస్తువు కదలాలంటే శక్తి అవసరమని మామూలుగా వస్తువు స్థిరంగా ఉంటుందని చెప్పాడు. కాని న్యూటన్ తప్పని ఋజువు చేశాడు.
  • విశ్వానికి భూమి కేంద్రమని, చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి ఉన్నదని చెప్పాడు. కాని ఈ రెండు తప్పే కదా!

ఆరిస్టాటిల్ భావవాదం

[మార్చు]

ఆరిస్టాటిల్ భావవాద విశ్వాసమైన ఆత్మని నమ్మేవాడు. ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు.

మరణం

[మార్చు]

అలెగ్జాండర్ మరణం తర్వాత ఏథెన్స్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అరిస్టాటిల్ పై దైవద్రోహిగా అభియోగం మోపడంతో తన తల్లి స్వస్థలమైన చాల్సిస్ నగరానికి పారిపోయాడు. అక్కడ ఒక ఏడాది జీవించి అనారోగ్యంతో బాధపడుతూ క్రీ.పూ. 322లో కాలధర్మం చెందాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}

మూలాలు

[మార్చు]