Jump to content

ఆల్కహాలు

వికీపీడియా నుండి
Functional group of an alcohol molecule. The carbon atom is bound to hydrogen atoms and may bind to other carbon atom (s) to form a carbon chain. Methanol, an alcohol with a single carbon atom, is pictured. Ethanol, which is drinking alcohol, has two carbon atoms.

పేరు, ఉచ్చారణ

[మార్చు]

రసాయన శాస్త్రములో పేర్లు పెట్టడం ఒక క్రమ పద్ధతిలో జరగకపోతే చాల చిక్కులు వచ్చి పడతాయి. ఉదాహరణకి "ఆల్కహాలు" అనేది ఒక జాతి పేరు, ఒక ఇంటి పేరు లాంటిది. ఇదే జాతి (ఇంటి) పేరుతో ఎన్నో "ఆల్కహాలు"లు ఉన్నాయి: మెతల్ ఆల్కహాలు, ఎతల్ ఆల్కహాలు, ఐసోప్రోపైల్ ఆల్కహాలు,...., వగైరా. వీటన్నిటికి కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు అర్థం కావాలంటే ఈ రసాయన బణువునిర్మాణక్రమం తెలియాలి. ఉదాహరణకి, ఆల్కహాలు జాతి పదార్థాలన్నిటిలోను ఒక హైడ్రాక్సిల్ గుంపు (అనగా OH) ఉండి తీరుతుంది. ఒక బణువు నిర్మాణక్రమంలో -OH గుంపు కనిపిస్తే అది మూడొంతులు ముప్పాతిక ఆల్కహాలు జాతికి చెందిన రసాయనమే అయి ఉంటుంది.

ఆల్కహాలు జాతిలో ప్రధానమైనది ఈథైల్ ఆల్కహాలు లేదా ఎతల్‍ ఆల్కహాలు. దీనిని అమెరికాలో "ఎతల్" ఆనీ, భారతదేశంలో "ఈథైల్" అనీ ఉచ్చరిస్తారు. మరొక చిన్న ఉచ్చారణా భేదం కూడా ఉంది - జాగ్రత్తగా వింటే కాని పట్టుబడదు. ఉదాహరణకి ఒక అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఆల్కహాలు జాతి పదార్థాల పేర్లు అన్నీ "ఓల్" (-ol) తో అంతం అవాలనిన్నీ, ఆల్డిహైడ్ జాతి పదార్థాలన్నీ "ఆల్" (-al) తో అంతం అవాలనిన్నీ ఈ ఒప్పందం సారాంశం. అందుకని "ఎతల్ ఆల్కహాల్" పేరు మార్చేసి, ఎతనోల్ (ethanol) అని కొత్త పేరు పెట్టేరు. ఇదే ఒప్పందం ప్రకారం ఎసిటాల్డిహైడ్ పేరు ఎతనాల్ (ethanal) అయింది. ఈ రెండు ఇంగ్లీషు వర్ణక్రమాలలో తేడా అతి స్వల్పం, ఉచ్చారణలో తేడా పట్టడం అతి కష్టం: ఒకటి ఎతనోల్, రెండవది ఎతనాల్!

మాదక పానీయాలలో మత్తునిచ్చేది, "కిక్కు" నిచ్చేది ఈ రకం ఆల్కహాలే. రసాయన పరిశ్రమలో ఈ ఎతల్ ఆల్కహాలుకి ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో, కొన్ని దేశాలలో, దీనిని మోటారు వాహనాలలో ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని 'పవర్ ఆల్కహాలు' అని కూడా పిలుస్తారు.

ఒక ఆల్కహాలు గురించి మాట్లాడుతూ అది ఏ రకం ఆల్కహాలో చెప్పకపోతే ఎతల్ ఆల్కహాలు (లేదా, ఎతనోలు) అనే అర్థం అవుతుంది. కనుక ఈ వ్యాసంలో ఇటుపైన ఏ వీశేషణం లేకుండా "ఆల్కహాలు" అంటే అది ఎతల్ ఆల్కహాలు (లేదా ఎతనోలు) అనే అర్థం చేసుకోవాలి. నిజానికి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఆల్కహాలుని ఆల్కహోలు అని ఉచ్చరించాలి - ఎతనోలు అన్నట్లుగా!

రసాయన శాస్త్రం లో. ఈ జాతి అంతటికి వాడే సాధారణ సాంఖ్య క్రమం CnH2n+1OH.

చరిత్ర

[మార్చు]

విభక్తి ప్రత్యయాలతో కొన్ని తెలుగు మాటలని అంతం చేసినట్లే అరబిక్ భాషలో కొన్ని మాటలు “ఆల్” శబ్దంతో ఆరంభమవుతాయి. ఇలా అరబ్బీ భాష నుండి ఎన్నో మాటలు ఇంగ్లీషులోకి వచ్చేయి. ఉదాహరణకి: అల్గరిథం, ఆల్కహాల్, ఆల్కలీ.

ఆరబ్బీ భాషలో “కలి” (kali) అనే మూల శబ్దానికి భస్మం అనే అర్థం ఉంది. కాని ఈ మూల శబ్దం వాడాలంటే దానికి ముందు విధిగా “ఆల్” శబ్దం చేర్చాలి. కనుక భస్మాన్ని అరబిక్ లో ఏమంటారు? ఆల్, కలి కలిసి “ఆల్‌కలి” అంటారు. అరబ్బీ భాషలో ఆల్కలీ అంటే బూడిద. ఇప్పుడు ఆల్కహాలు సంగతి చూద్దాం. నిజానికి “ఆల్ కోల్” అనే అరబ్బీ మాట నుండి వచ్చింది “ఆల్కహాలు” అన్న మాట. బెడిసికొట్టిన భాషాంతరీకరణానికి ఇది ఒక ఉదాహరణ. ఈ “ఆల్-కోల్” అనే పదార్థాన్ని తెలుగులో నీలాంజనం అనీ, కపోతాంజనం అనీ, సౌవ్వీరం అనీ పిలుస్తారు. ఈ పదార్థాన్నే ఇంగ్లీషులో ఏంటిమొనీ (Antimony) అంటారు. ఇది ఒక రసాయన మూలకం. వెండి, బంగారం, సీసం, తగరం, పాదరసం వంటిదే ఈ కపోతాంజనం. దీనికీ మనం ఇక్కడ ప్రస్తావించబోయే ఆల్కహాలుకీ ఏ విధమైన సంబంధమూ లేదు. కాని ఐరోపాలో ఎవరో పప్పులో కాలేసేరు. వారి ప్రభావం వల్ల “ఆల్-కోల్” అర్థం మారిపోయింది. ఇప్పుడు ఆల్కహాలు అంటే కల్లు, సారా వంటి మాదక ద్రవ్యాలలో ఉండే మత్తు ఎక్కించే పదార్థం అని సామాన్యార్థం.

ఈ పూర్వ వృత్తాంతం తెలియకపోయినా ఆల్కహాలు అంటే తెలియనివాళ్లు ఉండరంటే అది అతిశయోక్తి కానేరదు. వేదకాలం నుండి భారతీయ సంస్కృతిలో ఈ ఆల్కహాలు ఉంది, పేరులో తేడా అంతే. అమరకోశంలో “సురా హలిప్రియా హాలా పరిస్రుద్వరుణాత్మజా గంధోత్తమా ప్రసన్నేరా కాదంబర్యః పరిశ్రుతా మదిరా కశ్య మధ్యే చాప్య వదంశ” అని కల్లుకి కనీసం పదమూడు పేర్లు ఉన్నాయి. కల్లులో రకరకాలకి సంస్కృతంలో వివిధమైన పేర్లు ఉన్నాయి. ఇప్ప పువ్వుతో చేసిన కల్లుకి ఒక పేరు, చెరుకు రసంతో చేసిన కల్లుకి – చేసే పద్ధతిని బట్టి – మూడు పేర్లు. ఈ రకాలన్నీ కలుపుకుంటే దరిదాపు నలభై పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు అన్నింటిలోకి “సుర” అన్న మాటకి అగ్రతాంబూలం ఇవ్వవచ్చు. సుర అంటే సారా అని ఒక అర్థం, దేవతలని మరొక అర్థం.

మెథైల్ ఆల్కహాలు

[మార్చు]

ఆధునిక రసాయనశాస్త్రపు దృక్పథంతో చూస్తే ఆల్కహాలు అనేది ఆమ్లజనితో కూడిన ఉదకర్బనం. ఉదకర్బనాలన్నిటిలోకి సూక్ష్మమైనది మెతేను వాయువు. ఈ మెతేను బణువులో ఒకే ఒక కర్బనపు అణువు, నాలుగు ఉదజని అణువులు ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒక ఉదజని అణువుని తీసేసి ఆ స్థానంలో “ఉదజని-ఆమ్లజని" జంట లేదా (-OH) ని తగిలిస్తే లభించేది మెథైల్ ఆల్కహాలు (methyl alcohol). మెతేనుకీ, మెథైల్ ఆల్కహాలుకీ ఒకే ఒక అణు ప్రమాణంలో తేడా, అంతే! ఈ రెండింటి నిర్మాణక్రమము పరిశీలించి చూస్తే ఈ తేడా ఏమిటో అవగతం అవుతుంది.

మెతనోల్

మెథైల్ ఆల్కహాలులో ఉన్న ఈ (-OH) గుంపుని ఇంగ్లీషులో “హైడ్రాక్సిల్ గ్రూప్” (hydroxyl group) అంటారు. “హైడ్రొజన్”, “ఆక్సిజన్” అన్న మాటలని సంధించగా వచ్చింది ఈ హైడ్రాక్సిల్ అన్న పదం. ఒక పదార్థపు బణువులో కర్బనంతో పాటు ఈ హైడ్రాక్సిల్ గుంపు ఎప్పుడు ఉన్నా ఆ పదార్థాన్ని “ఆల్కహాలు” అనే పిలుస్తారు. అంటే, ఈ ఆల్కహాలు అనేది ఇంటిపేరు లాంటిది. ఒకే ఇంటిపేరుతో ఎంతోమంది మనుష్యులు ఉన్నట్లు, ఆల్కహాలు పేరుతో ఎన్నో రసాయనాలు ఉన్నాయి. మెథైల్ గుంపు (-CH3) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే మెథైల్ ఆల్కహాలు వస్తుంది. ఎతల్ గుంపు (-C2H5) తో హైడ్రాక్సిల్ గుంపు (-OH) కలిస్తే ఎతల్ ఆల్కహాలు వస్తుంది. ఇదే బాణీలో ప్రొపైల్ ఆల్కహాలు, బ్యుటైల్ ఆల్కహాలు, … అలా ఎన్నో ఉన్నాయి.

ఈ మెథైల్ ఆల్కహాలుని శాస్త్రీయపు భాషలో కాకుండా సామాన్యులు వాడే ఇంగ్లీషులో “ఉడ్ ఆల్కహాల్” (wood alcohol) అంటారు. (అంటే కర్రసారా అన్న మాట. కర్రలని ఆవంలో పెట్టి బట్టీ పడితే కర్రసారా వస్తుంది.) నిజానికి ఈ మెథైల్ ఆల్కహాలుకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? గ్రీకు భాషలో “మెథీ” అంటే సారా, “హాల్” అంటే చిట్టడవి. ఇంగ్లీషులో చిట్టడవిని “ఉడ్” (wood) అంటారు. కనుక “మెథైల్ ఆల్కహాల్”కి ఇంగ్లీషులో wood alcohol అని పేరు వచ్చింది కనుక తెలుగులో “అడవి సారా” అవాలి. కాని ఇంగ్లీషు వచ్చుననుకునే తెలుగు వాళ్లు “ఉడ్” అన్న మాటని “కర్ర” అని తెలిగించి దీనిని "కర్రసారా" అన్నారు. ఒక విధంగా "అడవి సారా" కంటే "కర్ర సారా" అన్న మాటే బాగుందనిపిస్తుంది.

ఒకే పదార్థానికి ఇన్నేసి పేర్లు ఉండటంతో ఒకరి మాట మరొకరికి అర్థం కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు శాస్త్రవేత్తలంతా జినీవాలో సమావేశమయి ఒక ఒప్పందానికి వచ్చేరు. ఈ ఒప్పందం ప్రకారం ఆల్కహాలు జాతి పదార్థాలన్నిటికి పేరులో చివర “ఓల్” (-ol) శబ్దం రావాలన్నారు. ఈ ఒప్పందం ప్రకారం మెథైల్ ఆల్కహాలు పేరుని “మెథనోల్” (మెతనాలు కాదు) గా మార్చమన్నారు. ఉచ్చారణ దోషం లేకుండా పలకమన్నారు. వర్ణక్రమదోషం లేకుండా రాయమన్నారు. ఆల్కహాలుని ఆల్కహోలు అనక్కరలేదు కాని, మెథైల్ ఆల్కహాలుని మెతనోల్ అనాలి. ఇదే విధంగా ప్రొపైల్ ఆల్కహాలుని ప్రొపనోల్ అనాలి. బ్యుటైల్ ఆల్కహాలు బ్యుటనోల్ అవుతుంది.

ఉచ్చారణ విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం అని మీరు అనుకోవచ్చు. ఆల్కహాలు అనే మాటని ఇంగ్లీషులో రాసినప్పుడు “ఒలంతం” (ఒతో అంతం అయేవిధంగా) రాసినా, మాట పలికేటప్పుడు “అలంతం” (అతో అంతం అవుతూన్నట్లు) గానే పలుకుతారు. కాని ఈ జినీవా ఒప్పందం వచ్చిన తరువాత మెథనోల్ని జాగ్రత్తగా మెథనోల్ అనే పలకాలి కాని మెతనాలు అనకూడదు. ఎందుకంటే జినీవా ఒప్పందం ప్రకారం మతనాలు అనే పదార్థం ఆల్కహాలు కాదు; అది మరొక జాతిథి. ఆ జాతి పేరు ఆల్డిహైడ్. మెతనాలు ఆల్డిహైడ్ జాతిథి, మెథనోల్ ఆల్కహాలు జాతిథి. హైడ్రాక్సిల్ గుంపు ఉన్నవన్నీ ఆల్కహాలు జాతివి.

ఈ మెథైల్ ఆల్కహాలు (మెథనోల్) రసాయన పరిశ్రమలలో చాల ముఖ్యమైన ముడి పదార్థం. రెండు రసాయన పదార్థాలు సంయోగం చెందాలంటే వాటిని పక్క పక్కలని పెట్టినంత మాత్రాన సరిపోదు; వాటిని బాగా దగ్గరగా తీసుకు రావాలి. అంటే రెండింటిని బాగా కలిసేలా ప్రోత్సహించాలి. ఉప్పుని, పంచదారని బాగా కలపాలంటే వాటిని ఏ అమాందస్తాలోనో వేసి దంచవచ్చు. కాని ఇంకా బాగా కలియాలంటే, రెండింటిని నీళ్లల్లో కరిగించి, అప్పుడు ఆ రెండింటిని కలిపితే బాగా కలుస్తాయి కదా. చాల పదార్థాలు నీళ్లల్లో కరుగుతాయి. కాని నీళ్లల్లో కరగనివి ఎన్నో మెథైల్ ఆల్కహాలులో కరుగుతాయి. అప్పుడు వాటిని మెథైల్ ఆల్కహాలులో కరిగించి, అప్పుడు ఆ రెండింటిని కలుపుతారు. పని అయిపోయిన తరువాత వేడి చేస్తారు. మెథైల్ ఆల్కహాలు తేలికగా, 65 డిగ్రీల దగ్గరే, మరిగిపోతుంది కనుక దానిని వెలికి తీసి తిరిగి వాడుకోడానికి పెద్దగా ఖర్చు అవదు.

మెథనోల్ రుచికి కొద్దిగా తీపిగా ఉన్నా ఇది ఒక విష పదార్థం. తెలిసో, తెలియకో దీనిని తాగడం కాని చేస్తే ఇది శరీరంలోకి వెళ్లి “ఫార్మిక్ ఆమ్లం”గా మారినప్పుడు దానిని మన నాడీతంతువులు తట్టుకోలేవు. ప్రత్యేకించి కంటికి సంబంధించిన నాడీతంతువులు త్వరగా దెబ్బ తింటాయి; అప్పుడు కళ్ళు పోతాయి. కల్తీ సారా తాగి కళ్లు పోగొట్టుకున్నవారి కథలు తరచు వార్తా పత్రికలలో వస్తూనే ఉంటాయి.

ఇథైల్ ఆల్కహాలు

[మార్చు]

మెతేను నుండి మెతల్ ఆల్కహాలుని తయారు చేసినట్లే ఎతేను బణువులో ఒక ఉదజని అణువుని తొలగించి ఆ స్థానంలో హైడ్రాక్సిల్ గుంపుని ప్రవేశపెడితే ఎతల్ ఆల్కహాలు వస్తుంది. ఈ ఎతల్ ఆల్కహాలు నిర్మాణక్రమం బొమ్మలో చూపిస్తున్నాను.

ఎతనోల్

జినీవా ఒప్పందం ప్రకారం మెతల్ ఆల్కహాలుని మెతనోలు అన్నట్లే ఎతల్ ఆల్కహాలుని ఎతనోలు (ethanol) అనాలి. మెతల్ ఆల్కహాలుని కర్రలు బట్టీపట్టి చేస్తాం. ఎతల్ ఆల్కహాలుని చెయ్యడానికి దినుసులని కాని, పళ్ళని కాని పులియబెట్టి చేస్తారు. మెతల్ ఆల్కహాలు విషం. సాధారణ మోతాదులలో ఎతల్ ఆల్కహాలు ఆహ్లాదాన్ని ఇచ్చే పానీయం! సంస్కృతంలో అమృతానికీ, ఎతల్ ఆల్కహాలుకీ “సుర” అన్న మాటనే వాడతారు.

“ఒకసూర్యుండు సమస్త జీవులకు తానొకొక్కడైతోచు పోలిక” అనే పద్యంలోలా ఈ ఎతల్ ఆల్కహాలు ఒకొక్కళ్లకి ఒకొక్క విధంగా ఉపయోగపడుతుంది. ప్రయోగశాలలో ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలకి ఇది ఎంతో ఉపయోగకరమైన ముడి పదార్థం. రసాయనశాస్త్రపు పొలిమేరలకి కూడా రాని సామాన్య ప్రజలకి ఇది ఎంతో ప్రియమైన పదార్థం. ఆతి పురాతన కాలం నుండి ఈ పదార్థం ఉనికి మానవుడికి తెలుసు. దేవతలకి తెలుసు. రాక్షసులకి తెలుసు. రాక్షసులకి గురువైన శుక్రాచార్యులవారికి ఇది ప్రీతిపాత్రమైన పానీయం. ఈ దురలవాటుకి దాసుడైన శుక్రాచార్యులు, గత్యంతరం లేక, బృహస్పతి కొడుకైన కచుడికి చచ్చిపోయిన వారిని తిరిగి బతికించే సంజీవనీ మంత్రం ఉపదేశిస్తాడు. అటు తరువాత పశ్చాత్తాపపడి ఆల్కహాలు తాగకూడదని నిషేధిస్తాడు. శుక్రాచార్యులవారు చెప్పేరని ఎవ్వరూ తాగుడు మానలేదు. తర్వాత గాంధి గారు చెప్పేరు; కల్లు తాగి, ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవద్దని.

ఏది ఏమైతేనేమి. ఎప్పుడో, ఎవ్వరో కనిపెట్టేరు. పళ్లనీ, పళ్ల రసాలనీ అలా ఆరు బయట వదిలెస్తే అవి పులిసి, క్రమేణా ఆల్కహాలుగా మారతాయని. ఏమవుతుందంటే మన కంటికి కనబడని ఈస్ట్ (yeast), లేదా తెలుగులో మధుశిలీంధ్రం, అనే పుట్టగొడుగు జాతికి చెందిన సూక్ష్మజీవులు ఈ రసంలో పడి, రసంలోని చక్కెరని ఆల్కహాలుగా మార్చెస్తాయి. దీనినే పులియబెట్టడం అని కాని, కిణ్వప్రక్రియ అని కాని, ఫేనీకరణం అని కాని తెలుగులోనూ, ఫెర్మెంటేషన్ (fermentation) అని ఇంగ్లీషులోనూ అంటారు. తెలిసో, తెలియకో అనాది మానవుడు ఇలా పులిసిన పదార్థాలు తిన్నాడు. తదౄపేణా కలిగే చిరు ఆనందానుభూతిని చవి చూసేడు. అనుభవించిన మానవుడు రుచి మరిగేడు. ప్రత్యేకం పనిగట్టుకుని పదార్థాలని పులియబెట్టి ఆ సారాన్ని సారాబుడ్లలో పోసి తాగడం మొదలు పెట్టేడు. మొట్టమొదటి వ్యాపారం వ్యభిచారం అయితే మొట్టమొదటి పరిశ్రమ సారా చెయ్యడం అయి ఉంటుంది. మొట్టమొదట మానవుడు మచ్చిక చేసుకున్న జీవి – గుర్రమూ కాదు, కుక్కా కాదు, కోడీ కాదు – ఈ మధుశిలీంద్రం అని ఢంకా కొట్టి చెప్పవచ్చు.

ఈ ఈస్ట్ సర్వాంతర్యామి. ఇది గాలిలో తేలియాడుతూ సర్వత్రా వ్యాప్తి చెందిన జీవి. ఇది మన శరీరం మీదా, లోపలా కూడా ఉంటుంది. మనలోలాగే ఈ ఈస్టులో రకరకాల జాతులు ఉన్నాయి. వీటిల్లో ఒక జాతి ఫేనీకరణంలో అందే వేసిన చెయ్యి. అందుకనే పెరుగు బాగా తోడుకోవాలంటే పక్కింటికి వెళ్లి ఈ ఈస్టు “తోడు” తెచ్చుకుంటాం. తరవాణీ తయారు చెయ్యాలన్నా ఈ రకం “తోడు” కావాలి.

ఈ ఫేనీకరణం (పులియబెట్టడం) అనే ప్రక్రియ వెనక ఉన్న శాస్త్రంలో పెద్ద రాచరహశ్యం ఏమీ లేదు. ఈ మధుశిలీంధ్రం కణాలు చక్కెరని తిని “మలమూత్రాల” వలె రెండు వ్యర్ధ పదార్థాలని విడుదల చేస్తాయి: ఒకటి ఎతల్ ఆల్కహాలు, రెండవది బొగ్గుపులుసు వాయువు లేదా కార్బన్ డై ఆక్సైడ్ (carbon dioxide). రసాయనశాస్త్రపు దృష్టిలో, మనం వందలు పోసి కొనుక్కున్న “షివాస్ రీగల్” సీసాలో ఉన్నది మిలియన్ల పైబడి ఈస్టు కణాలు విసర్జించిన “దేహజలాలు.”

ఈ ఫేనీకరణ ఒక తొట్టెలో జరిగినప్పుడు వాయురూపంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ గాలిలో కలిసిపోతుంది. బీరు లాంటి పానీయాలలో బుడగలు వస్తే చూడడానికి బాగుంటుంది కనుక ఈ కార్బన్ డై ఆక్సైడ్ వాయువు అంతా బయటకి పోకుండా కొంత వాయువుని బీరులో నొక్కి అట్టేపెడతారు. చంపాగ్ని (షేంపెయిన్) లాంటి ద్రవ్యాలని సీసాలో పోసి, కొద్దిగా అందులో ఈస్టుని కలిపి, సీసా మూతికి బిరడా తగిలించి బిగించేస్తారు. అప్పుడు సీసాలో మరి కొంత మేర పులుపు ప్రక్రియ జరిగినప్పుడు విడుదల అయే వాయువు బయటకి పోలేక లోపలే ఒత్తిడితో ఉండిపోతుంది. మనం బిరడా తీసినప్పుడు – సోడాకాయ కొట్టినప్పుడు మాదిరి – వాయువు బుసబుస పొంగుతూ బయటకి వస్తుంది. చూడడానికి అదొక వేడుక!

పోతే, మన ఈస్టు విసర్జించిన రెండవ పదార్థం పేరు ఎతల్ ఆల్కహాలు. ఇదే మనం పరమ ప్రీతితో పుచ్చుకునే పానీయం. ఇది మనకి ప్రీతిపాత్రమైనదే కావచ్చు గాక, కాని ఈస్టుకి మాత్రం కాదు. ఎవరి మలమూత్రాదులు వారికి అసహ్యమే కాదు, వాటి తాకిడి ఆరోగ్యానికి భంగ కారకం కూడా. ఆల్కహాలు పాలు పెరగడంతో “ఆ కూపం”లో బతకలేక ఈస్టు చచ్చిపోతుంది. అందుకనే పులిసిన పానీయంలో 15 శాతం వరకు ఆల్కహాలు పేరుకొని ఉంటే ఆ పానీయంలో ఇక ఈస్టు బతకలేదు. అందుకనే దిగమరగించడం (అభిషవించడం) అనే ప్రక్రియ తెలియక పూర్వం బీరుని పోలిన మాదక ద్రవ్యాలు తప్ప విస్కీని పోలిన త్రాణ గల పదార్థాలు మన పూర్వీకులకి తెలియవు.

ఈస్టు విసర్జించే “అపాన ద్రావణం” ఎతల్ ఆల్కహాలు, “అపాన వాయువు” కార్బన్ డై ఆక్సైడు” మాత్రమే అయితే సారా పరిశ్రమ శ్రమ లేకుండా నల్లేరు మీద బండి నడకలా కొనసాగి ఉండేది. ఈస్టు మనలాగే ప్రాణం ఉన్న జీవి కనుక, మనలాగే అన్ని పనులు అవకతవకలు లేకుండా చెయ్యలేదు. ఉదాహారణకి, పళ్లల్లో ఉన్న ఒక రకం చక్కెరని మాత్రమే ఈస్టు ఆల్కహాలుగా మార్చగలదు కాని ఫేనీకరణకి లొంగని చక్కెరలని ఏమీ చెయ్యలేదు. పళ్లరసాలు కూడా ప్రాణి నుండి పుట్టినవే కనుక అవి కూడ దోషరహితాలు కావు. పళ్లరసాలకి రంగు, రుచి, వాసన ఉంటాయి. పళ్ల తొక్కలకి ఒక రకం ఒగరు ఉంటుంది. వీటి సమక్షంలో ఫేనీకరణ సజావుగా సాగకపోవచ్చు. అప్పుడు అసంకల్పితంగా కొన్ని సహజాత రసాయనాలు పుట్టుకొస్తాయి. ఈ సహజాతాలలో కొన్ని విషపదార్థాలు ఉండొచ్చు. అప్పుడు ఆ బీరు కాని, వైను కాని తాగితే ప్రాణం పోవచ్చు. చవకరకం కల్లు, సారాలు తాగి ప్రతి ఏటా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్న వార్తలు మనం వింటూనే ఉంటాం కదా. అందుకనే తాగితే తాగేరు కాని ఆ తాగేదేదో మేలురకం సరుకు తాగితే ప్రాణాలు పోవు.

ఫేనీకరించగా వచ్చిన పానీయాలకి రకరకాల పేర్లు ఉన్నాయి. ద్రాక్ష రసం నుండి చేసిన దానిని ఇంగ్లీషులో వైన్ (wine) అంటారు. దీన్ని మనం కావలిస్తే, తెలుగులో, ద్రాక్ష సారా అనో, టూకీగా సారా అనో అనొచ్చు. బార్లీ, మొక్కజొన్న, మొదలైన ధాన్యాలని నానబెట్టి, మొలకలెత్తే సమయంలో ఫేనీకరిస్తే బీరు (beer) వస్తుంది. ఆ వైను, బీరులలో ఎతల్ ఆల్కహాలు 10 నుండి 15 శాతం వరకు ఉండొచ్చు; మిగిలినదంతా నీళ్లే. ఈ పానీయాలని వేడి చేసి, బట్టీ పట్టి, నీళ్లని చాలమట్టుకి బయటకి వెళ్లగొడితే వీటిలోని ఆల్కహాలు శాతం పెరుగుతుంది. ఇలా రకరకాల బీరులని బట్టీ పట్టి రకరకాల పేర్లతో విష్కీని తయారు చేస్తారు. మొక్కజొన్న బీరు నుండి తయారు చేసిన విష్కీని బర్బన్ (bourbon) అంటారు. వైనుని బట్టీ పట్టి బ్రాందీ (brandy) తయారు చేస్తారు. డచ్చి భాషలో “బ్రాందీ” అంటేనే “దిగమరిగించిన సారా” అని, “మాడబెట్టిన వైను” అని అర్థం. బార్లీ బీరుని అభిషవించగా విష్కీ (whishky) వస్తుంది. బ్రాందీ, విష్కీలలో ఆల్కహాలు శాతం 50 వరకు ఉండొచ్చు. ఫేనీకరించిన చెరకు రసం నుండి రమ్ము (rum) తయారు చేస్తారు. ఈ రమ్మునే సంస్కృతంలో మైరేయం అనీ, ఆసవం అనీ, సీధు అనీ మూడు పేర్లతో పిలుస్తారు. ఈ మూడు పేర్లూ మూడు రకాల రమ్ములని సూచిస్తాయి. అసలు సంస్కృతంలో ఈ మాదక ద్రవ్యాలకి ఉన్నన్ని పేర్లు ఇంగ్లీషులో కూడా లేవేమో. ద్రాక్ష సారాని సంస్కృతంలో మార్ద్వీకం అంటారు. మధ్వాసవం, మాధవకం, మధు అన్నవి ఇప్ప పువ్వుతో చేసిన కల్లుకి పేర్లు.

ఇంతవరకు రెండు రకాల మద్యపానీయాలు చూసేం. పులియబెట్టి, ఫేనీకరించగా వచ్చిన వైను, బీరు, ఏల్ వగైరాలని ఇంగ్లీషులో ఫెర్మెంటెడ్ లిక్కర్స్ (fermented liquors) అంటారు. బట్టీ పట్టగా వచ్చిన విష్కీ, బ్రాందీ, వాద్కా, కోన్యాక్ వంటి వాటిని “డిస్టిల్డ్ లిక్కర్స్ (distilled liquors) అంటారు. ఇలా వైనుని బట్టీ పట్టి బ్రాందీగా చేసే పద్ధతిని సంస్కృతంలో అభిషవం అంటారు. ఏ పేరు పెట్టి పిలచినా బట్టీ పట్టినప్పుడు పానీయంలో ఆల్కహాలు పాలు పెరుగుతుంది. ఒక పానీయంలో ఆల్కహాలు ఎన్ని పాళ్లు ఉందో చెప్పే సంఖ్యని ఇంగ్లీషులో “ప్రూఫ్” (proof) అంటారు. వైనులో ఆల్కహాలు 15 శాతం ఉంటే ఆ వైను 30 ప్రూఫ్. ఆల్కహాలు 50 శాతం ఉన్న పానీయాలు 100 ప్రూఫ్. రసాయన పరిశోధనశాలలో వాడే “ఎతల్ ఆల్కహాలు”లో 95 శాతం పక్కా ఆల్కహాలే. అంటే అది 190 ప్రూఫ్ అన్న మాట. నూటికి నూరు పాళ్లూ ఆల్కహాలే ఉన్న ద్రవం 200 ప్రూఫ్. ఇది అపురూపమైనది. అతి విలువైనది. అరుదైనది. కల్తీ లేనిది. సీసా బిరడా తీసేసరికి గాలి లోని చెమ్మదనం లోపలికి చేరి కల్తీ అయిపోతుంది.

బట్టీ పట్టినప్పుడు ఆల్కహాలు ముందు మరిగిపోయి కావిరి రూపంలో “పైకి” పోతుంది. దానిని ఏ తోకబుడ్డిలోనో పట్టి, చల్లార్చినప్పుడు బ్రాందీ, విష్కీ వగైరాలు వస్తాయి. దిగమరిగించిన గిన్నెలో అడుగున మడ్డి (వెన్న కాచి నెయ్యి చేసినప్పుడు అడుగున మిగిలిన గోదావరి వంటి మడ్డి) మిగులుతుంది. ఈ మడ్డిని “రిజ్వరట్రోల్” (resveratrol) అంటారు. ఇది తింటే వార్ధక్యం వచ్చే జోరు తగ్గి, యవ్వనపు రోజులు పెరుగుతాయని ఈ మధ్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ మన వేదాలలో ఉండే ఉంటాయి. అందుకనే సురా పానం చేసిన వారంతా దేవతలు అయేరేమో? పరిశోధించి చూడాలి.

ఎతల్ ఆల్కహాలుకి క్రిమి సంహారక లక్షణాలు ఉన్నాయి. దీనికి 140 ప్రూఫ్ ఆల్కహాలు వాడతారు. వైద్యుడు సూదిమందు ఇచ్చే ముందు ఈ రకం ఆల్కహాలులో దూదిని ముంచి, ఆ దూదితో జబ్బ మీద పులుముతాడు. ఆ తరువాతనే సూదితో పొడుస్తాడు. ఇలా చెయ్యడం వల్ల శరీరం మీద ఉన్న సూక్ష్మజీవులు సూదితోపాటు లోపలికి జొరబడకుండా జాగ్రత్త పడుతున్నామన్నమాట.

ఎతల్ ఆల్కహాలుకి అగ్గిపుల్ల తగిలితే మంట మండుతుంది. ఇలా మంట పుట్టడానికి కావలసిన ఆమ్లజని అణువు అప్పుడే ఆల్కహాలు బణువులో ఉన్నది కనుక ఆల్కహాలు మండినప్పుడు ఎతేను మంట అంత వేడి పుట్టదు. కాని పెట్రోలుకి కరువు వచ్చినప్పుడు ఈ ఎతల్ ఆల్కహాలుని పెట్రోలులో కలిపి వాడవచ్చు. (కాఫీకి కరువొచ్చినప్పుడు కాఫీ పొడిలో చింతగింజల పొడి కలిపినట్లు అనుకొండి.) మొక్కజొన్నల నుండి తీసిన ఎతనోల్ ని “జీవిక-ఇంధనాలు” (biofuels) గా బ్రెజిల్ వంటి దేశాలలో పెద్ద ఎత్తున వాడుతున్నారు. ఇలాగే జీవిక-ప్రొపనోల్, జీవిక-బ్యుటనోల్ అంటూ తయారు చేస్తున్నారు.

అంతవరకు ఎందుకు? నా చిన్నతనంలో పెట్రోమేక్స్ దీపాలు వెలిగించవలసి వచ్చినప్పుడు ముందుగా దీపంలో ఉన్న “మేంటిల్”ని స్పిరిట్ (spirit)తో వెలిగించి, వేడి చేసేవారు. ఈ స్పిరిట్ ఎతల్ ఆల్కహాలే! అలాగే శాస్త్రీయ పరిశోధనశాలలోను, రసాయన పరిశ్రమలలోను ఎతల్ ఆల్కహాలు విరివిగా వాడతాము కదా. తాగడానికి, వినోదానికి వాడే ఆల్కహాలు మీద ప్రభుత్వం పన్నులు విధించి రాబడి పెంచుకుంటే పరవాలేదు కాని, అవసరమైన చోట్ల వాడే ఆల్కహాలు మీద కూడ పన్నులు వేస్తే ఎలా? అంతే కాదు. పూర్వపు రోజుల్లో కొన్ని దేశాలలో మద్యనిషేధం (“ప్రొహిబిషన్”) ఉండేది. అంటే ఆల్కహాలు కలిసిన పానీయాలు చట్టరీత్యా నిషేధం అన్నమాట. అలాంటప్పుడు దీపాలు వెలిగించుకునే స్పిరిట్‌ని కొనుక్కుని, దానిని దొంగతనంగా తాగేస్తారేమోనని ఆ స్పిరిట్‌లో విషం కలిపేవారు. ఒక్క విషమే కాదు, నోట్లో పెట్టుకుందికి వీలు లేకుండా కంపు కొట్టేటట్టు, వెగటు పుట్టేటట్టు కూడా చేసేవారు. పైగా రంగు పూసేవారు. ఇలా ఉద్దేశపూర్వకంగా పాడుచేసిన స్పిరిట్ ని ఇంగ్లీషులో డినేచర్డ్ స్పిరిట్ (denatured spirit) అనేవారు. ప్రభుత్వం వారు కలిపితే డినేచర్డ్, ప్రజలు కలిపితే కల్తీ!

కల్తీ అంటే గుర్తుకి వస్తున్నాది. మన దేశంలో మద్యనిషేధం ఉన్న రోజులలో కల్తీ పడ్డ కల్లు తాగి కళ్లు పోగొట్టుకున్నవాళ్లూ, ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. సారాని ఇలా కల్తీ చెయ్యడం చాల సులభం. మెతల్ ఆల్కహాలు చాల చవక. అందుకని పేరాశతో కొందరు దీనిని ఎతల్ ఆల్కహాలులో కలిపేసి అమ్మెస్తూ ఉంటారు. స్వర్గపు అంచులు చవి చూద్దామనే సరదాలో చవకరకం సారాలు తాగెస్తే అంచుల వరకు ఏమి కర్మ, స్వర్గం లోగిట్లోకే వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

మోతాదు మించకుండా కల్తీ లేని ఆల్కహాలు తాగితే ఒక విధమైన ఆహ్లాదమూ, ఆనందమూ పుడతాయి. వెచ్చదనాన్నీ, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మంచి చెడ్డల వ్యత్యాసాన్ని మరపింప చేస్తుంది ఆల్కహాలు ప్రభావం. బాగుంది కదా అని బుడ్డిని మరికొంచెం పట్టిస్తే, ఇంద్రియాల మీద పటుత్వం తగ్గుతుంది. ఒంటి మీద స్పృహ సడలి, పేలాపన, తూలుడు మొదలవుతాయి. అదృష్టహీనులైన భార్య, పిల్లలు ఇంటి దగ్గర ఉంటే, వాళ్ల వీపులు విమానం మోతలు మోగుతాయి.

ఐసోప్రోపైల్ ఆల్కహాలు

[మార్చు]

మెతల్ ఆల్కహాలు (మెతనోలు), ఎతల్ ఆల్కహాలు (ఎతనోలు) తరువాత చెప్పుకోదగ్గది ఐసొప్రోపైల్ ఆల్కహాలు (isopropyl alcohol), లేదా జినీవా ఒప్పందం ప్రకారం ప్రొపనోలు (propanol). ఇందులో మూడు కర్బనపు అణువులు ఉన్నాయి. మధ్యనున్న కర్బనానికి ఎడా, పెడా “సిఎచ్3” (-CH3) గుంపులు ఉన్నాయి. ఆల్కహాలు కనుక “ఒ-ఎచ్” (-OH) గుంపు ఉండి తీరాలి. దీని పేరులో “ఐసో” ఉంది కనుక ఈ బణువు నిర్మాణక్రమంలో పార్శ్వ సౌష్టత (lateral symmetry) ఉండాలి. కనుక “ఒ-ఎచ్” గుంపుని మధ్యనున్న కర్బనానికి తగిలించాలి. ఈ పనులన్నీ చేసిన తరువాత జాగ్రత్తగా చూస్తే మధ్యనున్న కర్బనానికి ఇంకా ఒక ఖాళీ చెయ్యి ఉండిపోయిందని తెలుస్తుంది. ఆ ఖాళీ చేతికి ఒక ఉదజని అణువుని అతికించడమే. ఇప్పుడు దీని అణుక్రమం ( (CH3)2CHOH) అని రాయవచ్చు, లేదా ఈ దిగువ బొమ్మ 15.2కలో చూపినట్లు టూకీ నిర్మాణక్రమం చూపించవచ్చు. చదునుగా ఉన్న నిర్మాణక్రమం చూపించకుండా టూకీ శాల్తీని చూపించేను కనుక ప్రాయశ్చిత్తంగా పూసలు, గొట్టాలతో చేసిన నిర్మాణ క్రమాన్ని కూడా బొమ్మ 15.2చలో చూపిస్తున్నాను. దీన్ని చూసి, చదును నిర్మాణక్రమం ఏమిటో పాఠకులే నిర్ణయించగలరు.

పూసలు-గోట్టాలతో ప్రొపనోల్ లేదా 2-త్రయోల్


ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాలుకి ప్రొపనోల కంటే మంచి పేరు మరొకటి ఉంది; అదే 2-ప్రొపనోలు. ఇక్కడ 2 ని చూడగానే రెండవ (ఎటునుండి లెక్కించినా రెండవదే!) కర్బనపు అణువుకి ప్రత్యేకత ఉంది అని చెబుతోంది. ఏమిటా ప్రత్యేకత? అక్కడ (-OH) గుంపు ఉండడం. కనుక “2-ప్రొపనోల్” అని చెప్పగానే రెండవ (మధ్య) కర్బనపు అణువుకి హైడ్రాక్సిల్ గుంపు తగిలించి ఉంది, మిగిలినవాటికి ఉదజని అణువులే తగిలించి ఉన్నాయి అని అర్థం. ఈ “2-ప్రొపనోల్”ని తెలుగులో “2-త్రయోల్” అని పిలవచ్చు.

ఈ ఐసోప్రోపైల్ ఆల్కహాలు (2-త్రయోల్) లక్షణాలు కొన్ని పరిశీలిద్దాం. ఇది విష పదార్థమే కాని మెతల్ ఆల్కహాలు (మెతనోలు) అంత అన్యాయం కాదు. దీనికున్న ఘాటైన రుచి వల్ల ప్రజలు పరాగ్గా కూడా దీనిని తాగడానికి ఇష్టపడరు. తాగకుండా ఉంటే ఇది ప్రమాదకరమైనది కాదు. ఈ 2–త్రయోల్ శరీరానికి పూసుకుంటే చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే పైపూతలకి వాడే సెంట్లు, అత్తరులు, గీసుకునే ముందు గడ్డానికి పులుముకోడానికి, సిరాలలోను దీనిని విరివిగా వాడతారు. చిన్న పిల్లలకి జ్వరం బాగా వస్తే, ఉష్ణాన్ని త్వరగా తగ్గించడానికి వైద్యులు ఈ 2-త్రయోల్ ని శరీరానికి రాసి, మర్దనా చేస్తారు. మర్దనా చెయ్యడాన్ని ఇంగ్లీషులో “రబ్బింగ్” అంటారు కనుక దీనిని రబ్బింగ్ ఆల్కహాల్ (rubbing alcohol) అని కూడా పిలుస్తారు. ఈ రబ్బింగ్ ఆల్కహాలుకి తెలుగు పేరు మర్దనోలు. ఇది శరీరానికి రాసి మర్దనా చేసే ముందు చర్మం ఎక్కడా పగిలిపోయి కాని, చీరుకుపోయి కాని, తెగిపోయి కాని ఉండకూడదు. పైన ఉన్నంతసేపే దీని ఉపయోగం; లోపలికి వెళితే ప్రమాదం.

ఇంతవరకు చిన్న చిన్న బణువులు ఉన్న ఆల్కహాళ్ల (ఆల్కహాల్ కి బహువచనం) గురించి చూశాం. ఇవన్నీ (అంటే, మెతనోల్, ఎతనోల్, 2-ప్రొపనోల్) నీటిలో ఏ పాళ్లల్లో కలిపినా కలిసిపోతాయి. ఈ లక్షణాన్ని ఇంగ్లీషులో “మిసిబిల్ ఇన్ ఆల్ ప్రపోర్షన్స్” (miscible in all proportions) అంటారు. కాని ఆల్కహాలులో కర్బనపు అణువుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ లక్షణం క్రమేపీ నశించిపోతుంది. ఉదాహరణకి బ్యుటైల్ ఆల్కహాలు (బ్యుటనోలు, లేదా తెలుగులో చతుర్థోలు) బణువులో, గొలుసు మాదిరి, నాలుగు కర్బనపు అణువులు ఉన్నాయి. పది ఔన్సుల బ్యుటనోలు, పది ఔన్సుల నీరు కలిపితే రెండూ క్షీర నీరాలలా కలిసిపోవు. ప్రయోగాత్మకంగా రెండు గాజు కుప్పెలు తీసుకుని, ఒక దాంట్లో ఔన్సు నీళ్లు, మరొక దాంట్లో ఔన్సు బ్యుటనోల్ పోసి, అప్పుడు ఒక కుప్పెని రెండవ కుప్పెలోకి ఒంపి, కలిపితే రెండూ పూర్తిగా కలిసిపోతాయి. ఇదే ప్రయోగాన్ని రెండు ఔన్సుల నీళ్ల తోటీ, రెండు ఔన్సుల బ్యుటనోలు తోటీ చేస్తే – రెండూ ఒకదానిలో మరొకటి కలవవు. నూనె, నీళ్లులా ఒకదానిమీద మరొకటి తేలుతాయి. (దేని మీద ఏది, ఎందుకు తేలుతుందో మీ ఊహకి వదిలెస్తాను.) కరగ లేదు కదా అని గిలకరిస్తే నురగ వస్తుంది. కొద్ది సేపు నిలకడగా వదిలేస్తే రెండు ద్రవాలు విడిపోతాయి. బణువులో కర్బనపు అణువుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ “కలుపుగోలు” లక్షణం క్రమేపీ తగ్గిపోతుంది.

ప్రయోజనాలు

[మార్చు]
  • 50% v/v సజల [[ఇథిలీన్ గ్లైకాల్]] ద్రావణం సాధారణంగా ఏంటీ ఫ్రీజ్ గా ఉపయోగిస్తున్నారు.
Total recorded alcohol per capita consumption (15+), in litres of pure alcohol[1]
  • శానిటైజర్లలో ఇథనాల్ కానీ ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ కానీ వాడుతారు
  • కొన్ని ఆల్కహాలులని, ముఖ్యంగా ఇథనాల్ (ఎతనాల్‍), మిథనాల్ (మెతనాల్‍) వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.
  • ఆల్కహాల్‍ని పరిశ్రమలలోనూ, శాస్త్రీయ ప్రయోగశాల పరీక్షలలోనూ మాత్రమే కాకుండా ద్రావణి (Solvent) గా కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని వైద్య సంబంధమైన మందులు, పరిమళ ద్రవ్యాలు, వెనీలా వంటి పదార్ధాలకు ద్రావకంగా ఉపయోగిస్తున్నారు.
  • ఇథనాల్ క్రిమి సంహారకంగా చర్మం మీద సూదిమందు (injections) ఇచ్చే ముందు కొన్ని సార్లు అయొడిన్ తో కలిపి ఉపయోగిస్తారు. ఇథనాల్ కలిపిన సబ్బులు తయారుచేస్తున్నారు.
  • ఆల్కహాల్ సంగ్రహాలయాలలో కొన్ని శరీరభాగాల్ని నిలవచేయడానికి ఉపయోగిస్తున్నారు.

సాధారణ నామం

[మార్చు]
 రసాయన ఫార్ములా   IUPAC Name   సాధారణ నామం 
Monohydric alcohols
CH3OH మిథనాల్, మెతనోల్ Wood alcohol
C2H5OH ఇథనాల్, ఎతనోల్ ఆల్కహాల్
C3H7OH ఐసోప్రొపైల్ ఆల్కహాల్ Rubbing alcohol
C4H9OH బుటనాల్ బుటైల్ ఆల్కహాల్
C5H11OH పెంటనాల్ అమైల్ ఆల్కహాల్
C16H33OH Hexadecan-1-ol సెటైల్ ఆల్కహాల్
Polyhydric alcohols
C2H4(OH)2 Ethane-1,2-diol [[ఇథిలీన్ గ్లైకాల్]]
C3H6(OH)2 Propane-1,2-diol ప్రొపిలీన్ గ్లైకాల్
C3H5(OH)3 Propane-1,2,3-triol గ్లిజరాల్
C4H6(OH)4 Butane-1,2,3,4-tetraol ఎరిథ్రిటాల్, Threitol
C5H7(OH)5 Pentane-1,2,3,4,5-pentol Xylitol
C6H8(OH)6 Hexane-1,2,3,4,5,6-hexol మానిటాల్, Sorbitol
C7H9(OH)7 Heptane-1,2,3,4,5,6,7-heptol Volemitol
Unsaturated aliphatic alcohols
C3H5OH Prop-2-ene-1-ol Allyl alcohol
C10H17OH 3,7-Dimethylocta-2,6-dien-1-ol Geraniol
C3H3OH Prop-2-in-1-ol Propargyl alcohol
Alicyclic alcohols
C6H6 (OH) 6 Cyclohexane-1,2,3,4,5,6-hexol Inositol
C10H19OH 2 - (2-propyl) -5-methyl-cyclohexane-1-ol మెంథాల్

ఉత్పత్తి

[మార్చు]

పారిశ్రామికంగా

[మార్చు]

ఆల్కహాలు పరిశ్రమలలో వివిధ పద్ధతులలో తయారుచేయవచ్చును:

  • కిణ్వనప్రక్రియ (Fermentation) ద్వారా పిండి పదార్ధాలను జలవిశ్లేషణం (Hydrolysis) ద్వారా విడగొట్టిన చక్కెరల నుండి తయారుచేసిన గ్లూకోజ్ పై ఈస్ట్ను నిర్ధిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించి తయారుచేస్తారు.
  • ముడి చమురు (crude oil) లోని ఇథిలీన్ లేదా ఇతర ఆల్కీనులను విడగొట్టి హైడ్రేషన్ ద్వారా ఇథనాల్ ను తయారుచేస్తారు. ఈ చర్యకు ఫాస్ఫారిక్ ఆమ్లం ఉత్ప్రేరకంగా అధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద జరిపిస్తారు.
  • మిథనాల్ను కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్ వాయువును విలీనం చేసి దానికి రాగి, జింక్ ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్ లను ఉత్ప్రేరకాలుగా 250 °C ఉష్ణోగ్రత వద్ద అధిక పీడనం ఉపయోగించి తయారుచేస్తారు.

అంతర్గతంగా

[మార్చు]

ఎప్పుడూ మద్యం సేవించకపోయినా మానవులందరిలో కొంత ఆల్కహాల్ అంతర్గతంగా (Endogenous ethanol production) తయారౌతుంది. మన శరీరంలో పేగులలోని కొన్ని బాక్టీరియా ఆహారం నుండి కిణ్వనం (Fermentation) ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. దీని ద్వారా ఇథనాల్ వ్యర్ధ పదార్ధంగా తయారై రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ ఆల్కహాల్ ను మనం పరీక్షల వలన గుర్తించవచ్చును.

ఆల్కహాల్ సేవిస్తే వచ్చే ఆరోగ్యసమస్యలు

[మార్చు]

ఆల్కహాల్ సేవించడం వలన వచ్చే నష్టాలు అన్ని ఇన్ని కావు.మద్యం సేవిస్తే అప్పటికప్పుడు ఉత్తేజం కలుగుతుందే గాని కొంతకాలం తర్వాత దానికి బానిస అవుతారు.ఇది సేవిస్తే ముఖ్యంగా కాలేయం పాడైపోతుంది.

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్కహాలు&oldid=4338984" నుండి వెలికితీశారు