నంబూరి పరిపూర్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంబూరి పరిపూర్ణ
జననం1931, జులై 1
మరణం2024 జనవరి 26(2024-01-26) (వయసు 92)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత్రి
జీవిత భాగస్వామిదాసరి నాగభూషణరావు
పిల్లలుదాసరి శిరీష,
దాసరి అమరేంద్ర,
దాసరి శైలేంద్ర

నంబూరి పరిపూర్ణ (ఆంగ్లం: Namburi Paripurna) తెలుగు రచయిత్రి. ఆమె రాసిన కథలు, నవలలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. పుస్తకాలుగా కూడా వచ్చాయి. "వెలుగుదారులలో" అన్న పేరిట ఆమె ఆత్మకథ 2017 లో పుస్తకం గా వచ్చింది.

జీవిత విశేషాలు[1]

[మార్చు]

నంబూరి పరిపూర్ణ 1931, జులై 1న కృష్ణాజిల్లా బొమ్ములూరు గ్రామంలో నంబూరి లక్ష్మమ్మ, లక్ష్మయ్య లకు జన్మించింది. ఆమె తోబుట్టువులు శ్రీనివాసరావు, దూర్వాసరావు, వెంగమాంబ, జనార్థనరావు. ప్రాథమిక విద్యాభ్యాసం బండారిగూడెం, విజయవాడలోనూ, హైస్కూలు చదువు మద్రాసు, రాజమండ్రి లలో సాగింది. ఇంటర్మీడియట్ చదువు కాకినాడ పి.ఆర్. కాలేజీ లో సాగింది. ఏలూరులోని సెయింట్ థెరెసా మహిళా కళాశాలలో టీచర్ ట్రెయినింగ్ పొంది ప్రవేటుగా బి.ఎ. పట్టాను పొందింది. 1949లో కమ్యూనిస్టు నాయకుడు దాసరి నాగభూషణరావుతో వివాహం అయింది. ఆమెకు ముగ్గురు సంతానం: దాసరి శిరీష, దాసరి అమరేంద్ర, దాసరి శైలేంద్ర. వీరిలో శిరీష, అమరేంద్ర కూడా రచయితలు.

1955-58 మధ్య అధ్యాపక వృత్తి చేపట్టి నూజివీడు, ఏలూరు, గోపన్న పాలెం లలో పనిచేసింది. 1958 నుండి 1989 దాకా కాలంలో ముప్పై ఏళ్ళపాటు ప్రభుత్వోద్యోగిగా పంచాయతీ రాజ్, శ్త్రీ శిశు సంక్షేమ శాఖ, హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లలో పనిచేసి పలుచోట్ల నివసించింది. సామాజిక కార్యకర్తగా కూడా పరిపూర్ణ అనేక సంవత్సరాలు కృషి చేసింది. వామపక్ష ఉద్యమాలలో విద్యార్థి కార్యకర్తగా, నేతగా (1944-1949) పనిచేసి, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా నిర్భంధం, అజ్ఞాత జీవితం అనుభవించింది (1950-52). "ఆలంబన" సేవాసంస్థతో ఇరవై ఏళ్ళకి పైగా అనుబంధం కలిగి క్రియాశీలక పాత్ర పోషించింది.

ఈమె 2024, జనవరి 26వ తేదీన బెంగళూరులో తన 92వ యేట తుదిశ్వాసను విడిచింది.[2]

సాంస్కృతిక కృషి

[మార్చు]

చిన్నతనం నుండే స్టేజీ నాటకాలలో పాల్గొనడం అలవాటు ఉన్న పరిపూర్ణ 1942 లో విడుదలైన "భక్త ప్రహ్లాద" తెలుగు చిత్రంలో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో జి.వరలక్ష్మి వంటి ప్రముఖ నటుల సరసన ప్రహ్లాదుడి పాత్ర వేసింది. 1943లో బాలాంత్రపు రజనీకాంతరావు ప్రోద్బలంతో రేడియో నాటకాలలో పాల్గొన్నది. 1944 లో కమ్యూనిస్టు పార్టి ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాజమండ్రిలో ప్రచార గీతాలు పాడటం, నాటకాల ప్రదర్శనలో పాలు పంచుకుంది. 1986లో అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో వచ్చిన టెలీఫిల్మ్ "ఇద్దరూ ఒక్కటే" లో ప్రధానపాత్ర పోషించింది. సర్రాజు ప్రసన్నకుమార్ సంగీత దర్శకత్వంలో 2004లో "స్వర పూర్ణిమ" పేరిట ఆమె పాటల ఆల్బం విడుదలైంది.

రచనల జాబితా[3]

[మార్చు]
  1. మాకు రావు సూర్యోదయాలు, నవలిక, 1985.
  2. ఉంటాయి మాకు ఉషస్సులు, కథా సంపుటి, తొలిముద్రణ 1998, మలిముద్రణ 2018.
  3. కథా పరిపూర్ణం, కథా సంకలనం, 2006 (తన సంతానం శిరీష, అమరేంద్ర, శైలేంద్రలతో కలిసి).
  4. శిఖరారోహణ[4], వివిధ సామాజిక అంశాలపై, స్త్రీ సమస్యలపై వ్యాసాలు, కథల సంపుటి, 2016.
  5. వెలుగుదారులలో[5][6], ఆత్మకథ, 2017.
  6. పొలిమేర, నవల, 2018.

నంబూరి పరిపూర్ణ 91 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "ఒక దీపం-వేయి వెలుగులు, నంబూరి పరిపూర్ణ జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం" అన్న పుస్తకం సాహితీమిత్రుల, కుటుంబ సభ్యుల కూర్పుతో 2022 ఆగస్టులో ముద్రించబడినది.

మూలాలు

[మార్చు]
  1. ఎ.కె.ప్రభాకర్, నంబూరి మనోజ(సంపాదకులు). ఒక దీపం-వేయి వెలుగులు, నంబూరి పరిపూర్ణ జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం (2022 ed.). Alambana Prachuranalu. p. 370.
  2. విలేకరి (January 2024). "స్వాతంత్య్ర సమరయోధురాలు పరిపూర్ణ కన్నుమూత". ఆంధ్రజ్యోతి దినపత్రిక. No. 27. Archived from the original on 27 జనవరి 2024. Retrieved 28 January 2024.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Nilayam, Katha. "రచయిత: నంబూరి పరిపూర్ణ". Kathanilayam.com. Katha Nilayam. Retrieved 26 August 2022.
  4. వల్లూరి, వల్లూరి. "శిఖరారోహణ ప్రయత్నం!". andhrajyothy.com. Andhra Jyothy. Retrieved 26 August 2022.
  5. కొల్లూరి, సోమశంకర్. ""వెలుగు దారులలో…" పుస్తక పరిచయం". pustakam.net. pustakam.net. Retrieved 26 August 2022.
  6. భట్టిప్రోలు, అక్కిరాజు. "వెలుగు దారులలో… నంబూరి పరిపూర్ణ". pustakam.net. pustakam.net. Retrieved 26 August 2022.