Jump to content

నెమిలి పట్టాభి రామారావు

వికీపీడియా నుండి
నెమిలి పట్టాభి రామారావు

దీవాన్ బహుద్దూర్ నెమిలి పట్టాభి రామారావు (1862 - అక్టోబరు 15, 1937) బి.ఏ స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్‌.

పట్టాభి రామారావు 1862లో కడప జిల్లా, సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి రామానుజరావు అప్పట్లో కడప జిల్లాలో తాసీల్దారుగా పనిచేస్తున్నాడు.[1] పట్టాభి రామారావు విద్యాభ్యాసం కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

చిత్తూరు జిల్లాకు చెందిన పట్టాభి రామారావు 1882 ఏప్రిల్ 15న మద్రాసు రాష్ట్ర రెవెన్యూ సెటిల్‌మెంట్ శాఖలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, 1895లో అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి చేరుకున్నాడు.[2] 1888లో దక్షిణ ఆర్కాటులో సూపర్‌వైజరుగా పనిచేశాడు. ఆ తరువాత 1892లో మలబారుకు బదిలీ అయి అక్కడ అన్‌కవెనెంటెడ్ అసిస్టెంటుగా పనిచేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అసిస్టెంటు కమీషనరుగాను, తదనంతరం డిప్యుటీ కమీనషరుగానూ పదవోన్నతి పొందాడు. డిప్యూటి కమీషనరు హోదాలో గోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాలలో పనిచేశాడు.[1] కొచ్చిన్ సంస్థానంలో రెవెన్యూ సెటిల్‌మెంట్ వ్యవస్థను సంస్కరించేందుకు, ఆ విషయాలలో అనుభవమున్న పట్టాభి రామారావును ప్రభుత్వం కొచ్చిన్ సంస్థానం యొక్క దీవాన్‌గా నియమించింది. 1902 నుండి 1907 వరకు దీవాన్ గా పనిచేసిన పట్టాభి రామారావు రెవెన్యూ సెటిల్‌మెంటును పూర్తిచేసి భూమి దస్తావేజులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలను ప్రవేశపెట్టారు. 1908లో ఉద్యోగ జీవితం నుండి విరమించాడు. అప్పట్లో 350 రూపాయల ఉద్యోగవిరమణ భత్యంతో పదవీ విరమణ చేశాడు.

ప్రజాసేవలో

[మార్చు]

పదవీ విరమణానంతరం పట్టాభి రామారావు మద్రాసులోని పూనమల్లి హై రోడ్డుపై శ్రీరామ బ్రిక్ వర్క్స్ అనే ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పనికల్పించాడు. ఈ కర్మాగారంలో 30-40 లక్షల ఇటుకల తయారుచేయబడేవి. తన సొంత వ్యాపార నిర్వహణతో పాటు ఈయన ఆదోనిలోని వెస్ట్రన్ కాటన్ కంపెనీ, ఉన్నిదారం ఎగుమతిచేసే మద్రాసు యార్న్ కంపెనీల నిర్వహణలో పాల్పంచుకోనేవాడు. తెలుగు అకాడమీ, భారతీయ అధికారుల సంఘం, కేంద్ర వ్యవసాయ కమిటీల కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవాడు. చివరకు మదనపల్లెలో స్థిరపడి సబ్ డివిజన్ సంఘానికి అధ్యక్షత వహించి, వాటి కార్యక్రమాలకు పూర్తి సమయాన్ని కేటాయించాడు. సొంత ఖర్చులతో గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచనిలిస్తుండేవాడు.[1]

తొలుత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉత్సుకత చూపించకపోయినా, ఆ తర్వాత మనసు మార్చుకొని ప్రతేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతునిచ్చాడు. ఈయన 1918లో కడపలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు.[3]

పట్టాభిరామారావు 75సంవత్సరాల వయసులో వృద్ధాప్యకారాణాలవల్ల 1937, అక్టోబరు 15 న మద్రాసులో తన స్వగృహంలో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Vuppuluri, Lakshminarayana Sastri (1920). Encyclopaedia of the Madras Presidency and the Adjacent States. Oriental Enclyclopaedic Publishing Company. p. 603. Retrieved 1 December 2014.
  2. The India list and India Office list By Great Britain. India Office
  3. History of modern Andhra P. Raghunadha Rao
  4. The Indian review, Volume 38 - G.A. Natesan