బోయకొట్టములు పండ్రెండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోయకొట్టములు పండ్రెండు
బోయకొట్టములు పండ్రెండు నవల ముఖపత్రం
కృతికర్త: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
విడుదల: డిసెంబరు 2013
పేజీలు: 273
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): ETC8KTEL08

బోయకొట్టములు పండ్రెండు అనే గ్రంథం కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె వ్రాసిన చారిత్రిక నవల. 9వ శతాబ్ది నాటి తొలి తెలుగు పద్యశాసనమైన పండరంగని అద్దంకి శాసనమును ఆధారం చేసుకుని దీనిని వ్రాశాడు. ఆ శాసనం తెలుగు పద్యసాహిత్య రచన 9వ శతాబ్ది నాటికే ఉన్నట్టు స్పష్టపరిచేందుకు ఒక ఆధారం. అంతేకాక పన్నెండు బోయకొట్టాలను పండరంగడనే సైన్యవీరుడు ఓడించాడని కూడా తెలుపుతోంది. దీన్ని ఆధారం చేసుకుని రచయిత రెండువందల యేళ్ళ ఆంధ్ర రాజ్యాల చరిత్ర పునఃసృజించి చారిత్రక నవలారచన చేశాడు.[1]

రచన నేపథ్యం

[మార్చు]

బోయకొట్టములు పండ్రెండు నవలను కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై రచించి 2013 డిసెంబరులో ప్రచురించాడు. దీనికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము పాక్షిక ఆర్థిక సహాయం చేసింది.

చారిత్రకత

[మార్చు]

గుణగ విజయాదిత్యుని సేనానిగా పండరంగడు 12 బోయకొట్టాలను విజయం సాధించిన సందర్భంగా ఆయనను ప్రస్తుతిస్తూ చేసిన రచన పద్యరూపాన్ని తీసుకుంది. 12 బోయకొట్టాలు (మండలాలు) గెలిచినందుకు ఈ పద్యశాసనంలో కీర్తించాడు. 848లోనే గుణగ విజయాదిత్యుడు వేయించిన కందుకూరి పద్యశాసనంలో కూడా వర్ణితుడు పండరంగడే కావడం అతని సామర్థ్యాన్ని, ప్రఖ్యాతిని వెల్లడిస్తోంది. ఈ శాసనాన్ని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి, ప్రకటించారు. దీనిలో తరువోజ ఛందస్సుకు చెందిన పద్యం లభిస్తోంది.[2] పండరంగడు అనే చాళుక్య సేనాని పండ్రెండు బోయకొట్టముల మీద దాడి చేసి స్వాధీనంచేసుకొని, బోయరాజ్యపు ప్రధాన కొట్టము, కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడవలె ప్రధాన పట్టణముగా బలిష్టము గావించెను. ఆదిత్య బటరునికి కొంతభూమి దానమిచ్చెను. నెల్లూరును పరశురామప్రీతి గావించెను అన్నది ఈ శాసనానికి సరళమైన నేటి తెలుగులో అనువాదం.[1]

కథావస్తువు

[మార్చు]

చాళుక్య సేనానియైన పండరంగడు 12 బోయకొట్టములు (అనగా బోయవాళ్ళ మండలాలు అనుకోవచ్చు) పడగొట్టి, కందుకూరును బెజవాడలాంటి నగరం చేశారన్న చారిత్రకాధారాన్ని పట్టుకుని రెండువందల యేళ్ళ క్రితపు చరిత్ర కథాంశంగా వ్రాశాడు. క్రీస్తు శకం 614 నుండి 848 వరకూ ఆంధ్రదేశంలో జరిగిన కథకు రూపం ఈ నవల. ఏడుతరాల చరిత్రకు ఈనవల కథావస్తువు విస్తరించింది. వేంగీ చాళుక్యులు, పల్లవుల నడుమ యుద్ధాలు సాగుతున్న కాలం అది. త్రిపురాంతకంలో నివసిస్తున్న బోయలు ఆ యుద్ధాల్లో నలుగుతూ తమదైన రాజ్యాన్ని నిర్మించుకునేందుకు గుండ్లకమ్మ, మూసీ నదుల మధ్య ప్రాంతంలో ప్రయత్నాలు సాగిస్తాడు. రెండు నదుల మధ్యకాలంలో వ్యవసాయ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని జీవిస్తూ పలు పరిపాలన విభాగాలను, ఒక పెద్ద కోటను కట్టుకుంటాడు. కొంతవరకూ పల్లవుల రాజ్యాధికారాన్ని కూలదోసేందుకు చాళుక్యులు పల్లవ సామ్రాజ్యంలోని బోయ రాజ్యాన్ని పడదోసే ప్రయత్నం చేస్తాడు. రెండు వందల సంవత్సరాల వ్యవధిలో నిర్మించిన బోయరాజ్యాన్ని చాళుక్యసేనాని పండరంగడు ఒక్కరోజులో కూలదోసి శాసనం వేసుకుంటాడు. తొలి తెలుగు పద్యమైన పండరంగని తరువోజ పద్యం రూపుదిద్దుకోవడాన్ని కూడా చాలా ఆసక్తికరంగా వ్రాశాడు.[3]

శైలి

[మార్చు]

నవలను వ్యావహారికంగా పిలిచి నేటి ప్రామాణిక భాషలో కాక సరళ గ్రాంథికంలో దీన్ని రచించాడు.

ప్రాచుర్యం

[మార్చు]

నవల తెలుగు సాహిత్యరంగంలో అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. సాహిత్యవేత్తలైన రాళ్ళబండి కవితా ప్రసాద్, శిరా శ్రీ, అంపశయ్య నవీన్ వంటి వారు ప్రశంసించారు. సాహిత్య విశ్లేషకులు ఈ నవలను బాపిరాజు -గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, నోరి నరసింహశాస్త్రి-వాఘిరా, తెన్నేటి సూరి - చంఘీజ్‌ ఖాన్‌, అల్లం రాజయ్య, సాహుల - కొమురం భీం లాంటి నవలల సరసన నిలిపారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 శ్రీనివాసరావు, కారుసాల (జూన్ 16, 2014). "జిల్లా సాహితీ ప్రియులను అలరించేచారిత్రక నవల బోయ కొట్టములు పన్నెండు". ప్రజాశక్తి. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 8 December 2014.
  2. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం.
  3. సిరాశ్రీ. "బోయకొట్టములు పండ్రెండు సమీక్ష". గోతెలుగు.కాం. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 7 December 2014.
  4. "తెలుగు బోయల వీరగాథ బోయకొట్టములు పండ్రెండు". sarasabharati-vuyyuru.com/. సరసభారతి, ఉయ్యూరు. Retrieved 8 December 2014.

బయటి లింకులు

[మార్చు]