రెండవ ప్రపంచ యుద్ధం - అక్షరాజ్యాల ముందంజ
ఈ వ్యాసాన్ని వికీపీడియా ఆకృతి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించాల్సి ఉంది.(జూలై 2021) |
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ప్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ యుద్ధం
పోలాండ్ ఆక్రమణ తరువాత సోవియెట్ సేనలు బాల్టిక్ దేశాల దిశగా సాగాయి. ఫిన్ లాండ్ కొద్దిపాటి ప్రతిఘటన చూపినా, నాలుగు నెలల యుద్ధం తరువాత సోవియెట్లకు లొంగిపోయింది. 1940 వేసవికాలానికి సోవియెట్ యూనియన్ బాల్టిక్ దేశాలను ఆక్రమించి ఆయా దేశాల్లో తమకు అనుకూన ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
పశ్చిమ ఐరోపాలో బ్రిటిష్ సేనలు మొహరించాయి, కానీ రెండు పక్షాలూ కాల్పులకు దిగకుండా సహనం వహించాయి. ఏప్రిల్ నెలలో జెర్మనీ డెన్మార్క్, నార్వేలపై దాడి చేసింది. డెన్మార్క్ వెంటనే లొంగిపోయింది కానీ నార్వే మిత్ర రాజ్యాల సహకారంతో రెండు నెలలపాటు ప్రతిఘటించి చివరకు లొంగిపోయింది. నార్వేలో ఓటమి కారణంగా నెవిల్ ఛాంబర్లేన్ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి నుండి దిగిపోవలసి వచ్చింది.
1940 మే 10న విన్ స్టన్ చర్చిల్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు జెర్మనీ ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ లపై మెరుపు దాడి చేసింది. ఆ నెలాఖరుకల్లా బ్రిటిష్ సైన్యాలు ఐరోపా ప్రధాన భూభాగం నుండి తరిమివేయబడ్డాయి. వారి భారీ యుద్ధ సామాగ్రి కూడా చాలా వరకు జెర్మనీ వశమైంది. జూన్ మొదట్లో ఇటలీ కూడా ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లపై యుద్ధం ప్రకటించి వెను వెంటనే దాడులు మొదలు పెట్టింది. జూన్ 14న ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్ జెర్మనీ వశమయింది. జూన్ 22న ఫ్రాన్స్ అక్ష రాజ్యాలకు లొంగిపోయింది. ఫ్రాన్స్‌ను ఇటలీ, జెర్మనీ రెండు భాగాలుగా చేసి తలో భాగాన్నీ తమ అధీనంలో ఉంచుకున్నాయి.
జూలై మొదట్లో బ్రిటిష్ నౌకా దళం అల్జీరియా సమీపంలో లంగరు వేసి ఉన్న ఫ్రెంచ్ యుద్ధ నౌకలపై దాడి చేసి వాటిని సముద్రంలో ముంచి వేసింది. తోటి మిత్ర రాజ్యంపై బ్రిటన్ ఈ విధంగా దాడి చేయటం ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యం రేకెత్తించింది. అయితే, బ్రిటన్ మాత్రం ఫ్రెంచ్ యుద్ధ నౌకలు జెర్మనీ వశం కాకుండా చూడటానికే అలా చేయవలసి వచ్చిందని వివరణ ఇచ్చింది.
ఫ్రాన్స్ లొంగుబాటుతో అక్షరాజ్యాలకు మరింత ధైర్యం వచ్చింది. తొలుత బ్రిటన్ ఆకాశ మార్గాలపై పట్టు సాధించి తద్వారా బ్రిటన్ పై పూర్తి స్థాయిలో ఆక్రమణ మొదలు పెట్టే దిశగా జెర్మనీ వ్యూహాలు సాగాయి. ఆ దిశలో మొదటగా జెర్మనీ బ్రిటిష్ నౌకా దళంపై గురిపెట్టింది. బ్రిటిష్ యుద్ధ నౌకలు అట్లాంటిక్ మహా సముద్రంలో దూర దూరంగా విస్తరించి ఉండటంతో వాటిపై జెర్మనీ యు-బోట్లతో చేసిన దాడులు మొదట్లో బాగానే విజయవంతమయ్యాయి. ఈ క్రమంలో జెర్మనీ బ్రిటిష్ వాణిజ్య నౌకలపై కూడా దాడులు చేసింది. మధ్యధరా సముద్రంలో ఇటలీ కూడా బ్రిటిష్ నౌకలపై దాడులు మొదలు పెట్టింది. ఈ దాడుల్లో ఇటలీ పెద్దగా పురోగతి సాధించక పోయినా, సెప్టెంబరు నాటికి బ్రిటన్ అధీనంలోని ఈజిప్ట్ లోకి కొద్దిగా చొచ్చుకుపోగలిగింది. ఆసియాలో, జపాన్ ఉత్తరచైనాలోని చాలా సైనిక స్థావరాలను వశపరచుకుంది.
ఈ కాలంలో అమెరికా మిత్ర రాజ్యాలకు పరోక్షంగా సాయపడిందికానీ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగలేదు. ఆ దిశగా, 1939 నవంబరులో, అమెరికా అప్పటిదాకా అవలంబించిన తటస్థ విధానానాన్ని విడనాడి మిత్రరాజ్యాలకు అవసరమైన యుద్ధ పరికరాలను అమ్మటానికి వీలుగా ఒక శాసనం చేసింది. 1940 సెప్టెంబరులో బ్రిటన్ కు తమ యుద్ధనౌకలను అమ్మటానికి అమెరికా అంగీకరించింది. అదే క్రమంలో జపాన్ కు చమురు, ఇనుము వంటి ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా తీసుకున్న ఈ చర్యలు ప్రధానంగా అప్పుడప్పుడే కుదుటపడుతున్న తమ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించటానికే కావటం గమనార్హం.
సెప్టెంబరు మాసాంతంలో జెర్మనీ, జపాన్, ఇటలీలు అధికారికంగా అక్ష రాజ్య కూటమిగా రూపొందుతూ ఆ మేరకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం అక్ష రాజ్యాలలో ఏ ఒకరిపైన దాడి చేసినా ఆ దేశాన్ని ఈ మూడు దేశాలకూ శత్రువుగానే పరిగణిస్తారు. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం పరోక్షంగా అమెరికాను హెచ్చరించటమే.
ఈ ఒప్పందం కుదిరిన కొద్దినాళ్లకే యుద్ధంలో ఇటలీ అదృష్టం తిరగబడింది. అక్టోబరులో ఇటలీ గ్రీస్ దేశాన్నాక్రమించింది కానీ నవంబరు నాటికి ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. ఇటలీలోని ప్రముఖ నౌకా కేంద్రం టరంటో వద్ద మధ్యధరా సముద్రంలో బ్రిటన్ వైమానిక దళం ఇటలీకి చెందిన యుద్ధనౌకలను ముంచివేసింది. వెంటనే ఇటలీ ఆక్రమిత తూర్పు ఆఫ్రికా, లిబియాలపై బ్రిటన్ సైన్యాల దాడి మొదలయింది. 1941 ఫిబ్రవరి మొదటి వారంలో ఇటలీ సేనలు తూర్పు ఆఫ్రికా నుండి లిబియాలోకి గెంటివేయబడ్డాయి. అక్కడి నుండి గ్రీకు దళాలు ఇటలీ సేనలను అల్బేనియాలోకి నెట్టి వేశాయి.
ఈ దశలో హిట్లర్ ఇటలీకి సహాయంగా జెర్మనీ సేనలను లిబియాకి పంపాడు. జెర్మన్, ఇటాలియన్ దళాలు సంయుక్తంగా ఇంగ్లాండ్, గ్రీస్ దళాలతో పోరాడి మార్చి నాటికి గ్రీస్, యుగోస్లావియాలను తమ అధీనంలోనికి తెచ్చుకున్నాయి. ఏప్రిల్ నెలాఖరుకు బ్రిటిష్ సేనలు ఈజిప్టులోకి నెట్టివేయబడ్డాయి. జెర్మనీ లెబనాన్, సిరియాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడనుండి బ్రిటిష్ వలస రాజ్యం ఇరాక్‌లో తిరుగుబాటును ప్రోత్సహించసాగింది. అయితే మే నెలాఖరుకు బ్రిటన్ ఈ తిరుగుబాటును విజయవంతంగా అణచివేయగలిగింది. అదే నెల చివరలో అట్లాంటిక్ మహా సముద్రంలో జెర్మను యుద్ధనౌక బిస్మార్క్‌ను బ్రిటన్ నౌకాదళం ముంచివేసింది. దీనికి ప్రతిచర్యగా జెర్మనీ ఇంకా బ్రిటన్ అధీనంలోనే ఉన్న గ్రీకు ద్వీపం క్రేట్ని ఆక్రమించింది. జూన్ లో బ్రిటన్ సేనలు సిరియా, లెబనాన్ లను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.
ఆసియాలో, జపాన్-చైనాల మధ్య అడపాదడపా చెదురు మదురు ఘర్షణలు జరుగుతున్నా, 1940 నాటికి ఏ పక్షానికీ పూర్తి విజయం లభించలేదు. మరోవంక, చైనా పాలక పక్షానికీ కమ్యూనిస్టులకూ కీచూలాటలు మళ్లీ మొదలయ్యాయి. 1941 జనవరినాటికి వీరిద్దరి మధ్య గల సహకార ఒప్పందం కూడా రద్దైపోయింది. ఏప్రిల్ మాసంలో జపాన్ ఇంగ్లాండ్, అమెరికాలపై యుద్ధానికి సన్నాహకాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా సోవియెట్ యూనియన్ తో ఒక తటస్థతా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి పూర్తి విరుద్ధంగా జెర్మనీ ఇంగ్లాండ్ పై యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసి సోవియట్ యూనియన్ పై దాడికి సన్నాహకాలు మొదలు పెట్టింది.
ముందు: మొదలు
తరువాత: ప్రపంచ యుద్ధంగా రూపాంతరం