వికీపీడియా:విధానాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

వికీపీడియా విధానాలన్నీ వర్గం:వికీపీడియా విధానాలలో ఉంటాయి. మార్గదర్శకాలను కూడా కలిగి ఉన్న జాబితా విధానాలు, మార్గదర్శకాల జాబితా పేజీలో ఉంది. ఈ పేజీని క్రింది విభాగాలుగా విభజించాం:

  • ఎడిటర్లు ఎలా విజయవంతంగా సహకరించగలరో ఏ ప్రవర్తన ఆమోదయోగ్యమైనదో వివరించే ప్రవర్తన
  • విజ్ఞానసర్వస్వ పరిధినీ, దానికి తగిన సమాచారాన్నీ నిర్వచించే కంటెంట్
  • తొలగింపు - ఇది పేజీలు, కూర్పులు, లాగ్‌లను తొలగించే ప్రక్రియలను వివరిస్తుంది
  • అమలు - ఇది ప్రమాణాలను అమలు చేయడానికి వివిధ మార్గాలను తెలుపుతుంది
  • చట్టపరమైన అంశాలు - ఇందులో చట్టపరమైన అంశాల వలన ప్రభావితమయ్యే నియమాలు, వాటి దుర్వినియోగం జరిగితే అందుకు తగ్గ పరిష్కారాలు ఇందులో ఉంటాయి
  • పద్ధతులు (ప్రొసీజరల్) - ఇది తెలుగు వికీపీడియా నిర్వహించే వివిధ ప్రక్రియలను, పద్ధతులనూ వివరిస్తుంది

ప్రవర్తన

[మార్చు]
నాగరికత
దురుసుతనం, సహానుభూతి లేకపోవడం వంటివి ఉద్దేశపూర్వకంగా చేసినా కాకున్నా, మనల్ని పని నుండి దృష్టి మరల్చుతాయి. పనిలో అడ్డంకులు కలిగిస్తాయి. చర్చ మర్యాద, హేతుబద్ధత నుండి దూరంగా జరిగినపుడు వివాద పరిష్కార వేదికలు అందుబాటులో ఉంటాయి.
క్లీన్ స్టార్ట్
ఖాతాపై దిద్దుబాట్లు చెయ్యకుండా ఆంక్షలేమీ లేకుండా ఉంటే, ఏ వాడుకరి అయినా ఆ ఖాతాను విడిచిపెట్టి, ఓ కొత్త ఖాతా తెరిచి దిద్దుబాట్లు చేపట్టవచ్చు.
ఏకాభిప్రాయం
కంటెంట్ వివాదాలను పరిష్కరించడానికి ఉన్న ఏకైక సాధనం - సమానుల మధ్య ఏకాభిప్రాయం. ఇతర వివాదాలను పరిష్కరించేందుకు కూడా ఇదే మా ప్రధాన సాధనం.
వివాద పరిష్కారం
ఏదైనా వివాదాన్ని పరిష్కరించడంలో తొలి అడుగు - మీతో ఏకీభవించని వారితో మాట్లాడటం. అది విఫలమైతే, మరింత నిర్మాణాత్మకంగా చర్చ చేసే పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
దిద్దుబాటు యుద్ధం
ఎవరైనా మీ సవరణలను సవాలు చేస్తే, వారితో చర్చించి, ఒక నిర్ణయానికి రండి. లేదా వివాద పరిష్కారం కోరండి. తగాదాలు పెట్టుకోవద్దు. ఏదైనా పేజీలోని ఏదైనా భాగాన్ని ఇరవై నాలుగు గంటల్లో మూడు సార్లు కంటే ఎక్కువ తిరగవేయడం జరిగినా, లేదా చాలాకాలంగా దిద్దుబాటు యుద్ధం జరుగుతోందని స్పష్టంగా తెలుస్తున్న సందర్భంలో ఒక్కసారి తిరగదోడినా, మీ ఖాతాను నిరోధించవచ్చు.
దిద్దుబాటు విధానం
పేజీల్లో మీకు వీలైన చోటనే మెరుగుపరచండి. వాటిని అసంపూర్ణంగా వదిలివేస్తున్నామే అని చింతించకండి. చేసిన మార్పులలో ప్రధానమైనవాటిని వివరించడం మంచిది.
వేధింపు
తోటి సంపాదకులపై బెదిరింపులు చేయడం, సదుద్దేశంతో చేసిన సవరణల్లో రంధ్రాన్వేషణ చెయ్యడం, చికాకు పరచేలా పదేపదే సంప్రదించడం, పదేపదే వ్యక్తిగత దాడులు చెయ్యడం, వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేయడం చేయకండి. వికీపీడియాలో పనిచెయ్యడాన్ని వారిని ఆస్వాదించనివ్వండి.
వ్యక్తిగత దాడులు కూడదు
వికీపీడియాలో ఎక్కడా వ్యక్తిగత దాడులు చేయవద్దు. కంటెంట్ మీద వ్యాఖ్యానించండి, ఎడిటర్ మీద కాదు. వ్యక్తిగత దాడులు సమాజాన్ని దెబ్బతీస్తాయి, సంపాదకులను అడ్డుకుంటాయి.
కంటెంట్ నిర్వహణ
వికీపీడియా కాపీరైట్ నిబంధనల ప్రకారం మీరు కొన్ని హక్కులను కలిగి ఉన్నప్పటికీ, ఇక్కడ మీరు సృష్టించి, సవరించే పేజీలన్నీ సముదాయానికి చెందుతాయి. ఇతరులు "మీ" విషయాలను కనికరం లేకుండా సవరించవచ్చు.
సాక్‌ పపెట్రీ
ఒక వాదనకు ఎక్కువ మద్దతు ఉంది అనే భ్రమను సృష్టించడానికి, ఇతరులను తప్పుదోవ పట్టించడానికి లేదా అడ్డంకిని తప్పించుకోవడానికి బహుళ ఖాతాలను ఉపయోగించవద్దు. మీకోసమో, మరెవరి కోసమో మద్దతుగా ఖాతాలను సృష్టించమని మీ స్నేహితులను అడగవద్దు.
వాడుకరిపేరు విధానం
మీకు ఇష్టమైన, తటస్థంగా ఉండే వాడుకరిపేరును ఎంచుకోండి. కావలంటే మీ వాడుకరిపేరును మార్పించుకోవచ్చు. కానీ మీరు దానిని తొలగించలేరు.
దుశ్చర్య
దుశ్చర్య అంటే విజ్ఞానసర్వస్వ సమగ్రతను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా అదనంగా కంటెంటును చేర్చడం, తొలగించడం లేదా మార్పు చేయడం. ఆన్లైన్ విజ్ఞానసర్వస్వానికి సంబంధించి ఇది అనుచితమైన ప్రవర్తన.

కంటెంట్

[మార్చు]
వర్గం: వికీపీడియా విషయ విధానాలలో ప్రస్తుతం ఉన్న పేజీలు:
వ్యాస శీర్షికలు
వికీపీడియా వ్యాసానికి అనువైన శీర్షిక ఎలా ఉండాలంటే - తెలుగు మాట్లాడేవారు తేళిగ్గా గుర్తించగలిగేలా, తేలిగ్గా వెతకగలిగేలా, వ్యాసవిషయానికి అతికేలా, సంక్షిప్తంగా, ఇతర వ్యాసాల పేర్లకు అనుగుణంగా ఉండాలి
జీవించి ఉన్న వ్యక్తుల జీవిత చరిత్రలు
జీవించి ఉన్న వ్యక్తుల గురించి వ్యాసాల్లోని సమాచారం కొంత సున్నితంగా ఉంటుంది. వికీపీడియా విషయ విధానాలకు ఇది ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మూలాలు మంచి నాణ్యమైనవిగా, ముఖ్యంగా వ్యక్తిగత జీవిత వివరాల విషయంలో మూలాలు చాలా నాణ్యంగా ఉండాలి. మూలం లేని లేదా సరైన మూలం లేని వివాదాస్పదమైన విషయాలను వెంటనే తొలగించాలి.
బొమ్మల వినియోగ విధానం
సాధారణంగా స్వేచ్ఛగా లభించని బొమ్మలను అప్లోడ్ చేయడాన్ని నివారించండి. బొమ్మల మూలాలను, కాపీహక్కుల వివరాలను వాటి వివరణ పేజీలలో పూర్తిగా వివరించండి. బొమ్మలను సాధ్యమైనంత ఉపయోగకరంగా, పునర్వినియోగపరచదగినవిగా ఉండేలా చూడాలి.
తటస్థ దృక్పథం
వ్యాసాలు, మూసలు, వర్గాలతో సహా పాఠకులు చూడగలిగే ప్రతిదీ తటస్థంగా రాయాలి, పక్షపాతం లేకుండా రాయాలి.
మౌలిక పరిశోధన కూడదు
మునుపెక్కడా ప్రచురించని సిద్ధాంతాలు, డేటా, ప్రకటనలు, భావనలు, వాదనలు లేదా ఆలోచనలు వ్యాసాల్లో చేర్చరాదు. అలాగే ఎక్కడైనా ప్రచురించిన డేటా, ప్రకటనలు, భావనలు లేదా వాదనలను కొత్త వివరణ క్లుప్తీకరణ, సంక్షిప్తీకరణ , విశ్లేషణ లేదా సంశ్లేషణ చేయరాదు. వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జింబో వేల్స్ మాటల్లో చెప్పాలంటే, ఇది "వినూత్న కథనం లేదా చారిత్రక వివరణ" కు సమానం.
నిర్థారత్వం
వ్యాసాల్లో అవసరమైన చోటల్లా మూలాలను ఉదహరించాలి. ఉదహరించిన మూలాల లోని ఖచ్చితత్వాన్ని మనం తనిఖీ చేయలేనప్పటికీ, అవి ప్రసిద్ధ ప్రచురణ ద్వారా ప్రచురించబడ్డాయా, సమీక్షలో స్వతంత్ర మూలాలు వాటికి మద్దతు ఇచ్చాయా అని మనం తనిఖీ చేయవచ్చు. మూలం లేని ఏదైనా సమాచారాన్ని సవాలు చేసి తొలగించవచ్చు.
ఏది వికీపీడియా కాదు?
వికీపీడియా ఒక ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా. దయచేసి వికీపీడియాను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దు.

తొలగింపు

[మార్చు]
Graphic of balanced scale of justice
దాడి పేజీ
వికీపీడియా వ్యాసం, పేజీ, వర్గం, దారి మళ్లింపు లేదా చిత్రం ప్రధానంగా దాని అంశాన్ని అగౌరవపరచడానికి ఉన్న ఒక "దాడి పేజీ". ఈ పేజీలు ఏ సమయంలోనైనా ఏ నిర్వాహకుడిచే తొలగించబడతాయి.
సత్వర తొలగింపు కోసం ప్రమాణాలు
వ్యాసాలు, చిత్రాలు, వర్గాలు మొదలైనవి స్పష్టంగా కొన్ని రకాలకు చెందినవి అయితే "త్వరగా తొలగించవచ్చు". సాధారణంగా అసలు కంటెంటే లేని పేజీలు, లేదా విఘాతం కలిగించే పేజీలూ ఈ రకాలై ఉంటాయి. సత్వర తొలగింపు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉందని భావిస్తే, తొలగింపు ప్రక్రియను అనుసరించాలి.
తొలగింపు విధానం
వ్యాసాలను తొలగించడానికి నిర్వాహకుడు అవసరం. ఈ ప్రక్రియలో సాధారణంగా ఏకాభిప్రాయ పద్ధతిని అనుసరిస్తారు. అత్యంత వివాదాస్పదమైన తొలగింపులకు మూడు-దశల ప్రక్రియ, ఒక వారం వేచి ఉండే కాలం అవసరం.
పర్యవేక్షణ
కొన్ని కఠినమైన ప్రమాణాల నేపథ్యంలో వాడుకరులకు నిర్వాహకులకూ కూడా కనబడకుండ కంటెంట్ను దాచవచ్చు.
ప్రతిపాదిత తొలగింపు
తొలగింపు కొరకు వ్యాసాలు ప్రక్రియను అనుసరించకుండా ఒక సత్వరమార్గంగా, వివాదాస్పదం కాని తొలగింపుల కోసం ఒక వ్యాసాన్ని తొలగించడానికి ప్రతిపాదించవచ్చు - కానీ అది ఒకసారి మాత్రమే చెయ్యవచ్చు. ఏడు రోజుల్లోపు ఈ తొలగింపు ప్రతిపాదనను ఎవరూ వ్యతిరేకించకపోతే, నిర్వాహకుడు ఆ వ్యాసాన్ని తొలగించవచ్చు.
జీవించి ఉన్న ప్రజల జీవిత చరిత్రలను తొలగింవే ప్రతిపాదన
జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాల్లో మూలాలు లేని వాటిని ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా తొలగించడానికి ప్రతిపాదించవచ్చు. ఏడు రోజుల్లోపు ప్రతిపాదిత తొలగింపును ఎవరూ వ్యతిరేకించకపోతే, నిర్వాహకుడు ఆ వ్యాసాన్ని తొలగించవచ్చు. ప్రతిపాదిత తొలగింపును వ్యతిరేకించడానికి, వ్యాసంలో కనీసం ఒక ముఖ్యమైన వాక్యానికి మద్దతు ఇచ్చేలా కనీసం ఒక నమ్మదగిన మూలాన్ని జోడించాలి.
సవరణ తొలగింపు
బాగా అనుచితమైన దిద్దుబాట్లను, లాగ్ ఎంట్రీలను తొలగించడానికి నిర్వాహకులకు అందుబాటులో ఉన్న విశేషం ఇది.

అమలు

[మార్చు]
నిర్వాహకులు
సంపాదకులందరిలాగే నిర్వాహకులు కూడా పరిపూర్ణమైన వ్యక్తులు కాదు. అయితే, తోటి వాడుకరుల తోటి, కంటెంటు తోటీ వ్యవహరించడంలో వారు మర్యాదగా, మంచి ప్రమాణాలతో, ఆదర్శప్రాయంగా వ్యవహరించాలని సముదాయం భావిస్తుంది. నిర్వాహకులుగా వ్యవహరించేటప్పుడు, వారు న్యాయంగా ఉండాలని, మంచి తీర్పును ఇవ్వాలని, వివరణలు ఇవ్వాలని, అవసరమైన విధంగా సంభాషణాత్మకంగా ఉండాలని కూడా భావిస్తారు.
నిషేధ విధానం
చాలా విఘాతం కలిగించే సంపాదకులను వికీపీడియా నుండి నిషేధించవచ్చు. దయచేసి ఈ నిషేధాన్ని గౌరవించండి, నిషేధించబడిన వినియోగదారులను రెచ్చగొట్టవద్దు, వారికి సహాయం చేయవద్దు. నిషేధం స్వభావాన్ని బట్టి నిషేధాలను సముదాయానికి గాని, వికీమీడియా ఫౌండేషన్ కు గానీ అప్పీల్ చేసుకోవచ్చు.
నిరోధ విధానం
అంతరాయం కలిగించే సంపాదకులను స్వల్ప, సుదీర్ఘ లేదా నిరవధిక కాలానికి సవరణలు చేయకుండా నిరోధించవచ్చు.
పేజీ సంరక్షణ విధానం
విధ్వంసక చర్యల నుండి రక్షించేందుకు గాని, తీవ్రమైన కంటెంట్ వివాదాల సమయంలో గానీ పేజీలను సంరక్షించవచ్చు. సంరక్షిత పేజీలను నిర్వాహకులు సవరించవచ్చు, కానీ సాధారణంగా అలా చేయకూడదు. అదనంగా, చాలా కొత్త వాడుకరులు, నమోదుకాని సంపాదకులు దిద్దుబాట్లు చెయ్యకుండా నిరోధించడానికి తరచుగా విధ్వంసానికి గురయ్యే పేజీలను పాక్షికంగా సంరక్షించవచ్చు.

చట్టపరమైనవి

[మార్చు]
Graphic of balanced scale of justice

ఇవి చట్టపరమైన చిక్కులు కలిగిన విధానాలు. దిగువ పేర్కొన్న విధానాలు, కార్యాలయ చర్యల వంటివి కాకుండా, వికీపీడియా అభ్యంతరకరమైన లేదా అభ్యంతరకరమైన కంటెంటుకు వ్యతిరేకంగా సెన్సార్ చేయదు. కంటెంటు యునైటెడ్ స్టేట్స్ చట్టానికి కట్టుబడి ఉన్నంత వరకు (హోస్టింగు సర్వర్లు అక్కడ ఉన్నాయి కాబట్టి). వికీమీడియా ఫౌండేషన్కు అధికారిక ఫిర్యాదు చేయడం ద్వారా చట్టపరమైన సమస్యలు లేవనెత్తవచ్చు.

పిల్లల రక్షణ
అనుచితంకైన వయోజన-పిల్లల సంబంధాలను సమర్థించే వారు లేదా వాటిని కొనసాగించడానికి లేదా వాటిని సులభతరం చేయడానికి ప్రయత్నించే వారు లేదా తమను తాము పీడోఫిల్స్ గుర్తించే సంపాదకులను నిరవధికంగా నిరోధించాలి.
కాపీహక్కు ఉల్లంఘనలు
ఇది, పబ్లిక్ డొమైన్ కాని లేదా కాపీహక్కుదారు అనుమతి లేకుండా సరైన లైసెన్సు లేని మూలాల నుండి కాపీ చేసిన విషయాలకు సంబంధించినది. మా విజ్ఞానసర్వస్వంలో కాపీహక్కు ఉల్లంఘనలు జరిగితే వికీపీడియా సహించదు. ఉల్లంఘనలు ఏమైనా జరిగితే వాటిని కనుగొని తొలగించడానికి చురుకుగా ప్రయత్నిస్తాం.
కాపీహక్కులు
వికీపీడియా లోని పాఠ్యాన్ని ఒకటి లేదా అనేక ఉదార లైసెన్సుల క్రింద ప్రజలకు అందించే లైసెన్సు ఇది
లైబెల్
పరువు నష్టం కలిగించే సవరణలను పేజీ చరిత్ర నుండి తొలగించడం వికీపీడియా విధానం. మీకు పరువు నష్టం కలిగించారని మీరు భావిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. వికీపీడియాలో పోస్ట్ చేసిన విషయాలు పరువు నష్టం కలిగించకుండా చూసుకోవడం సంపాదకులందరి బాధ్యత.
చట్టపరమైన బెదిరింపులు కూడదు
పరువు నష్టం లేదా కాపీహక్కు ఉల్లంఘన ఫిర్యాదులకు మేము త్వరగా స్పందిస్తాము కాబట్టి, చట్టపరమైన బెదిరింపులు చేయకుండా వివాద పరిష్కార మార్గాన్ని ఉపయోగించండి. మీరు చట్టపరమైన బెదిరింపులు చేస్తే లేదా వికీపీడియా వివాదంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఇతర ఛానెళ్ల ద్వారా ఈ విషయం తీవ్రతరం కాకుండా ఉండటానికి దిద్దుబాట్లు చెయ్యకుండా మిమ్మల్ని నిరోధిస్తారు. మీరు చట్టపరమైన చర్యలు తీసుకుంటే, అది పరిష్కరించబడే వరకు దయచేసి దిద్దుబాట్ల నుండి దూరంగా ఉండండి.
ఉచితం కాని కంటెంట్ ప్రమాణాలు
తెలుగు వికీపీడియా కోసం మినహాయింపు విధానం ఇది. ఉచితం కాని బొమ్మ, ఆడియో క్లిప్ లేదా వీడియోల వాడకాన్ని "సముచితమైన సదుపయోగం" (ఫెయిర్ యూజ్) గా మీరు ప్రకటించగల సందర్భాలు చాలా తక్కువ. వాటిని ఎక్కించేటపుడు మీరు వాటిని ఏ పేజీలో వాడనున్నారో ఖచ్చితంగా పేర్కొనాలి. ఆ ఒక్క సందర్భంలో మాత్రమే ఆ బొమ్మను లేదా క్లిప్పును ఉపయోగించాలి. ఉచితం కాని కంటెంటును తప్పనిసరైనపుడు, చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించండి.
డబ్బుల కోసం దిద్దుబాట్లు చేసినపుడు వెల్లడి
సంపాదకులు డబ్బుల కోసం దిద్దుబాట్లు చేసినపుడు, తమ యజమాని, క్లయింట్, అనుబంధం మొదలైన వాటి గురించి బహిర్గతం చేయాలి.
వికీపీడియా సమాచారాన్ని పునరుపయోగించుకోవడం
మీ స్వంత ప్రచురణలలో వికీపీడియా కంటెంట్ను ఉపయోగించడానికి సంబంధించినది ఇది. వికీపీడియా లోని చాలా విషయాలను CC BY-SA, GFDL లైసెన్సుల క్రింద ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు రచయితలకు క్రెడిట్ ఇవ్వాలి, CC BY-SA లేదా GFDL కిందనే మెటీరియల్ను తిరిగి లైసెన్సు చేయాలి. దానికి ఉచిత ప్రాప్యతను అనుమతించాలి.
వినియోగ నియమాలు
ఉపయోగ నిబంధనలు వికీమీడియా ఫౌండేషన్ ద్వారా స్థాపించబడ్డాయి.

పద్ధతులకు సంబంధించి

[మార్చు]
మధ్యవర్తిత్వ కమిటీ/తనిఖీ వినియోగదారు పర్యవేక్షణ
ఎన్నికలు, నియామకాలు, తొలగింపులు (2024 మార్చి నాటికి ఇవి తెవికీలో లేవు)
మధ్యవర్తిత్వం/విధానం
మధ్యవర్తిత్వ కమిటీ మధ్యవర్తిత్వ అభ్యర్థనలను ఎలా నిర్ణయిస్తుందనే దానిపై నియమాలు. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
బాట్ విధానం
పేజీలను ఉపయోగకరమైన, హానిచేయని రీతిలో ఆటోమాటిగ్గా నవీకరించే కార్యక్రమాలను - వాటి యజమానులు మొదట ఆమోదం కోరినప్పుడు - స్వాగతిస్తాం. వాటిని దుందుడుగ్గా నడపడమ్, లేదా సర్వరు వనరులపై మోయలేని భారం వెయ్యడం వంటివి జరక్కుండా జాగ్రత్తగా ఉండటానికి ఇది అవసరం.
చెక్‌యూజర్
చెక్ యూజర్ అనేది, అంతరాయం, దుశ్చర్యల నుండి వికీపీడియాను రక్షించడం కోసం ఉద్దేశించినది. ఇందుకోసం, వాడుకరి IP సమాచారాన్ని, ఇతర సర్వర్ లాగ్ డేటానూ పరిశీలించడానికీ, ఎంచుకున్న కొద్ది మంది సంపాదకులకు అనుమతి నిస్తారు. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
వడపోత సవరణల సహాయకులు
ఎడిట్ ఫిల్టర్ హెల్పర్ అనేది ప్రైవేట్ ఎడిట్ ఫిల్టర్ల వివరాలు, కోడ్‌ను లాగ్‌లనూ చూడటానికి నిర్వాహకులు కాని వారిని అనుమతించే వాడుకరి గుంపు. అయితే వాటిని సవరించే అనుమతి వీరికి ఉండదు. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
ఈవెంట్ కోఆర్డినేటర్
ఈవెంట్ కోఆర్డినేటర్ వాడుకరి గుంపు, పరిమితులు లేకుండా కొత్త ఖాతాలను సృష్టించడానికి, కొత్త ఖాతాలకు కన్ఫర్మ్‌డ్ వాడుకరి హక్కును తాత్కాలికంగా ప్రసాదించడానికీ అనుమతిస్తుంది. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
ఫైల్ తరలింపు
ఫైల్ తరలింపు వాడుకరి హక్కు, విధానానికి లోబడి ఫైళ్ళ పేరు మార్చడానికి అనుమతిస్తుంది. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
సార్వత్రిక హక్కుల విధానం
ఫౌండేషన్ వారి అన్ని సైట్లలో సార్వత్రిక హక్కులు ఉన్న వాడుకరులపై తెలుగు వికీపీడియా పరిమితులు
ఇంటర్ఫేస్ నిర్వాహకులు
ఇంటర్ఫేస్ నిర్వాహకులు అంటే మీడియావికి పేరుబరి లోని అన్ని స్క్రిప్టులు, సిఎస్‌ఎస్ పేజీలను సవరించగల వాడుకరులు.
ఐపి బ్లాక్ మినహాయింపు
తమకు సంబంధం లేని నిరోధాల వలన సత్ప్రవర్తన కలిగిన సంపాదకులు ఇబ్బంది పడకుండా ఈ IP నిరోధం మినహాయింపును అభ్యర్థించవచ్చు. ఈ మినహాయింపు వలన నిరోధించబడిన IP చిరునామా నుండి కూడా దిద్దుబాట్లు చేసేందుకు వీలు కలుగుతుంది.
కొత్త పేజీల తనిఖీ/సమీక్షకులు
కొత్తగా సృష్టించిన పేజీలను పరిశీలించడానికి, ఆమోదించడానికి లేదా ట్యాగులు పెట్టడానికి కొత్త పేజీల సమీక్షకులకు అనుమతి ఉంటుంది. న్యూ పేజీస్ ఫీడ్, పేజ్ క్యూరేషన్ పరికరాలను వాడతారు. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
ఓపెన్ ప్రాక్సీలు
సవరణ దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ఓపెన్ ప్రాక్సీలను ఎప్పుడైనా దిద్దుబాట్లు చెయ్యకుండా నిరోధించవచ్చు. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
పేజీ తరలింపుదారులు
పేజీని తరలించే అనుమతి వలన సంపాదకులు, దారిమార్పు పేజీలను సృష్టించకుండానే పేజీలను, ఉప పేజీలను తరలించే వీలు ఉంటుంది. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
విధానాలు, మార్గదర్శకాలు
విధానాలు, మార్గదర్శకాలను అర్థం చేసుకోవడం, మార్చడం
మూస ఎడిటర్
టెంప్లేట్ ఎడిటర్ అనుమతి వలన సంరక్షణలో ఉన్న మూసలు, మాడ్యూళ్ళలో మార్పులు చేయడానికి వీలు కలుగుతుంది. (2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
స్వచ్ఛంద ప్రతిస్పందన బృందం
(2024 మార్చి నాటికి ఇది తెవికీలో లేదు)
వికీమీడియా విధానం
వికీపీడియన్లకు ఆసక్తి కలిగించే వికీమీడియా విధాన లింకులు, CC BY-SA, GFDL లైసెన్సుల పాఠాలకు లింకులు

ఇతరత్రా

[మార్చు]
అన్ని నియమాలను విస్మరించండి
"వికీపీడియాను మెరుగుపరచకుండా లేదా నిర్వహించకుండా ఏదైనా నియమం మీకు అడ్డుగా ఉంటే, దానిని పట్టించుకోకండి".
సంకేతపద బలం అవసరాలు
బలమైన సంకేతపదం పెట్టుకోవాలని వాడుకరులందరినీ కోరుతున్నప్పటికీ, ఉన్నత అనుమతులు ఉన్న కొంతమంది వాడుకరులు మాత్రం అలా చేయడం తప్పనిసరి. వారి సంకేతపదం బలాన్ని వికీమీడియా ఫౌండేషన్ ఆడిట్ చేయవచ్చు కూడా.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • సలహా పేజీలు-వికీప్రాజెక్ట్స్ రాసిన సలహా పేజీల గురించి. 
  • విధానాల జాబితా-వికీమీడియా ఫౌండేషన్ యొక్క అధికారిక విధానాలు. 
శిక్షణ
  • విధానాలు, మార్గదర్శకాలను పరిచయం చేయడం-సరికొత్త వాడుకరుల కోసం ప్రధానమైన విధానాలు, మార్గదర్శిని గురించి చేసే శీఘ్ర పరిచయం.