అక్షాంశ రేఖాంశాలు: 13°43′04″N 80°12′00″E / 13.7178°N 80.2000°E / 13.7178; 80.2000

శ్రీహరికోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?శ్రీహరికోట
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 13°43′04″N 80°12′00″E / 13.7178°N 80.2000°E / 13.7178; 80.2000
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం సూళ్ళూరుపేట
జిల్లా (లు) తిరుపతి జిల్లా
కోడులు
పిన్‌కోడ్
వాహనం

• 524121
• AP

శ్రీహరికోట (ఆంగ్లం : Sriharikota) తిరుపతి జిల్లాలోని ఒక తీరప్రాంతపు ద్వీపము, ఆంధ్రప్రదేశ్ లోని కోరమాండల్ తీరంలో గలదు. ఇచ్చట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం గలదు, ఈ కేంద్రాన్ని ఇస్రో వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుండి భారతదేశం తన రాకెట్లను ప్రయోగిస్తుంది. దీనికి దగ్గరలోని పట్టణం సూళ్ళూరుపేట.

నేపథ్యం

[మార్చు]

శ్రీరాముడు ఈదీవిలో అరకోటి లింగాలను ప్రతిష్ఠించి, ఇక్కడ రాక్షస ప్రభావాన్ని తొలగించాడనీ అందువల్లనే ఈ ప్రాంతానికి శ్రీ అరకోటై గా పేరు వచ్చి కాలక్రమంలో ఈ పేరు ప్రజల నోళ్ళలో నాని, శ్రీహరికోటగా మారిందిన అక్కడి ప్రజలు భావిస్తారు. రాకెట్ ప్రయోగ కేంద్రం స్థాపించక మునుపు ఈ ప్రాంతం నాగరికతకు ఎంతో దూరం. అమాయకులైన గిరిజన తెగలు నివసించే ప్రాంతం. 1970 వరకూ అంతరిక్ష పరిశోధనలకు కేరళ లోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంబా అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించేవారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటపడింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయ్ బృందం ఆ విషయాన్ని ఇస్రోకు తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది.

అనుకూలాంశాలు

[మార్చు]

పులికాట్ సరస్సు, బంగాళా ఖాతం, మధ్య శ్రీహరికోట ద్వీపంలా ఉంది. తూర్పు తీరాన సముద్రం ఉండటం, భూమధ్యరేఖకు సమీపంగా ఉండటం, నిర్జీవ పులికాట్ సరస్సు మరో వైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేవీ లేకపోవడం లాంటి కారణాలు కూడా కలిసి రావడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రయోగమేదైనా విఫలమైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు వీలుంది. మరో విశిష్టత, ఈ కేంద్రం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన రాకెట్ భూమ్యాకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్న విధంగా పంపవచ్చు.

భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా శ్రీహరికోట కేంద్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేఫ్ కెన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ, రష్యాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 55 డిగ్రీల అక్షాంశంలోనూ ఉన్నాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మొత్తం 43,360 ఎకరాల్లో విస్తరించి ఉంది.[1]

ప్రయోగాలు

[మార్చు]

రాకెట్ కేంద్రంగా గుర్తింపు పొందిన తర్వాత మొదట షార్ నుంచి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 1971, అక్టోబర్ 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అది మొదలు, ఇప్పుడు చంద్రయాన్-1 దాకా శ్రీహరికోట ఎన్నో కీలక ప్రయోగాలకు వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002, సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు.

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • శ్రీహరికోట వికీట్రావెల్ లో [1]

మూలాలు

[మార్చు]
  1. అక్టోబర్ 12, 2008, ఈనాడు దినపత్రిక, ఆదివారం అనుభంధం