ఆయేషా మీరా హత్య కేసు
27 డిసెంబరు 2007 న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటూ, నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 17.5 ఏళ్ళ ఆయేషా మీరా బలాత్కరించబడి, హతమార్చబడినది. అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించినది.
ఉదంతం
[మార్చు]స్నానపుగదిలో కత్తిపోట్లతో నెత్తురోడుతున్న ఆయేషా నగ్న మృతదేహం వద్ద తన ప్రేమను కాదన్నందుకే ఆయేషాకి ఈ గతి పట్టించానని హంతకుడు ఒక లేఖ వదిలి వెళ్ళాడు. [1]
పర్యవసానాలు
[మార్చు]మొదట హాస్టల్ వంటమనిషిని విచారించిన పోలీసులు తర్వాత తెనాలికి చెందిన శివాంజనేయులు పై పలు పరీక్షలు చేసి ఇతనే నేరస్థుడని తెలిపారు. వారి కుటుంబీకులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పోలీసులు అతనిని వదిలివేశారు. తర్వాత దొంగతనం, మానభంగం కేసులను ఎదుర్కొంటున్న జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింఘ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. 15 రోజుల విచారణ అనంతరం ఇతనే నేరస్థుడని ప్రకటించారు. తల్లి లక్ష్మీబాయి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా, అతనిని కూడా వదిలేశారు. అటు తర్వాత గుర్విందర్ సింఘ్ ఆలియాస్ లడ్డు కాలి ముద్రలు ఘటనాస్థలంలో సేకరించినవాటికి సరిపోలుతున్నాయని అతని పై ఛార్జి షీటు దాఖలు చేశారు. ఇతని కుటుంబం కూడా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి, విడుదల చేయించుకొన్నారు. ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కేసులో చేర్చడానికి యత్నించారు. [2] కానీ ఆ తర్వాత అప్పటికే ఇతర నేరాల క్రింద సబ్ జైలులో శిక్షలను అనుభవిస్తున్న పిడతల సత్యనారాయణ ఆలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొంటూ ఆగష్టు 2008 న అతనిని మొదటిసారిగా అదుపులోకి తీసుకొనటం జరిగినది. పోలీసులే పెద్దమొత్తంలో ఇతనికి డబ్బు ముట్టజెప్పి నేరాన్ని అంగీకరించేలా చేశారు. పేద దళిత కుటుంబానికి చెందిన సత్యం బాబు తల్లి-చెల్లి బాధ్యతలు తనపై ఉండటంతో దీనిని ఒప్పుకొన్నాడు. సత్యం బాబు తల్లి మరియమ్మ మాత్రం అసలైన నేరస్థులను తప్పించేందుకే తమ పలుకుబడిని ఉపయోగించి తన కుమారుడిని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, దీనిని ఖండిస్తూ హైదరాబాదులో నిరాహార దీక్ష చేపట్టినది. 21 మే 2010 సత్యం బాబును చికిత్స నిమిత్తం హైదరాబాదు నుండి విజయవాడ తీసుకెళుతుండగా నల్గొండ లోని సూర్యాపేట పోలీసులు భోజనం కోసం ఆగగా సత్యంబాబు తప్పించుకు పారిపోయాడు. కొద్ది గంటలకే మళ్ళీ సత్యం బాబును అదుపులోకి తీసుకొనటం జరిగినది.[3]
విమర్శలు
[మార్చు]సత్యం బాబు బంధువులు, మానవ హక్కుల సంఘాలు అసలైన నేరస్తులను తప్పించటానికే సత్యం బాబును బలిపశువు చేశారని తెలిపారు. నరాల బలహీనత గల సత్యం బాబు సరిగా నడవను కూడా నడవలేడని తెలిపారు. NIMS వైద్యులు పరీక్షలు చేసి సత్యం బాబు నరాల బలహీనత వాస్తవమేనని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు కూడా సత్యం బాబు నిర్దోషి అనే తెలిపారు.
మహిళా కోర్టు తీర్పు
[మార్చు]29 సెప్టెంబరు 2010న విజయవాడ మహిళా కోర్టు హత్యకు గాను 302 సెక్షను క్రింద 14 ఏళ్ళ జైలు శిక్ష, మానభంగానికి గాను 376 సెక్షను క్రింద 10 ఏళ్ళ జైలు శిక్ష విధించినది. తీర్పు వినగనే సత్యం బాబు తల్లి మరియమ్మ కోర్టు లోనే మూర్ఛ పోయినది. సాక్ష్యాధారాలు, ఇతర సాంకేతిక వివరాలు పరిశీలించిన తర్వాత, ఈ నేరాలు సత్యం బాబే చేశాడని కోర్టు నిర్ధారించుకొన్నాకే ఈ శిక్షలు విధించడం జరిగినదని కోర్టు తెలిపినది. సత్యం బాబును జడ్జి "యావజ్జీవ కారాగార శిక్ష, మరణ దండనలో ఏది ఎంచుకొంటావు?" అని అడిగిన ప్రశ్నకు సత్యం బాబు "నా పై వేయబడిన తప్పుడు అభియోగాలు, కోర్టు నిజమని నమ్ముతోంది గనుక, ఇక్కడ బ్రతికి ఉండటం వ్యర్థం కనుక, నేను చావునే కోరుకొంటున్నాను." అని సమాధానం ఇచ్చాడు. [4] ముద్దాయి తరఫు వాదించే లాయర్లు పరిగణలోకి తీసుకొనవలసిన అంశాలు కేవలం సాక్ష్యాధారాలు, సాంకేతిక వివరాలు మాత్రమే కావని, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు గానీ, ప్రత్యక్ష ఆధారాలు గానీ లేవని, కేవలం పోలీసులు తప్పితే, బాధితురాలి తల్లిగానీ, ముద్దాయి తల్లిగానీ, మానవ హక్కుల సంఘాలు గానీ, సత్యం బాబు నేరాలు చేశాడని నమ్మటం లేదని, అతని కుటుంబ, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని తీర్పును సవరించవలసినదిగా కోరారు. అయిననూ కోర్టు తీర్పులో ఏ మాత్రం మార్పు రాలేదు.
హై కోర్టు తీర్పు
[మార్చు]ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అదే ఏడాది అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.[5]
31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబు ను నిర్దోషిగా ప్రకటించినది. నిష్కారణంగా ఒక నిర్ధోషిని 8 ఏళ్ళు జైలులో ఉంచినందుకు పోలీసు యంత్రాంగానికి మొట్టికాయలు వేస్తూ లక్ష రూపాయలను నష్టపరిహారం విధించినది. [6] ఆయేషాను సత్యంబాబే హత్య చేశారనేందుకు నిర్దిష్టమైన ఆధారాలను చూపడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. పోలీసులు చెప్పిన సిద్ధాంతాన్నే కింది కోర్టు విశ్వసించిందని తెలిపింది. సత్యంబాబుపై ఉన్న కేసులను కోర్టులు కొట్టేసినప్పటికీ, అతన్ని పోలీసులు కరగడుగట్టిన నేరస్తుడిగా చిత్రీకరించారని పేర్కొంది. శక్తివంతమైన రాజకీయ కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని సత్యంబాబు చెబుతున్న దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు తమ ముందున్న సాక్ష్యాలు సరిపోవడం లేదని తెలిపింది.
హైకోర్టు వెలువరించిన తీర్పుతో సత్యంబాబు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నందిగామ పట్టణ శివారు అనాసాగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సామాన్యులకు సైతం న్యాయం జరుగుతుందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్న విషయం రుజువైందని అతని తల్లి మరియమ్మ అన్నారు. రోజూ తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. [7]
సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో అసలు దోషులెవరో తేల్చేందుకు కేసును పునర్విచారించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. [8]
పునర్విచారణ
[మార్చు]హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు Special Investigation Team (SIT) కు అప్పగించబడినది. [9]