కడూర్ వెంకటలక్షమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడూర్ వెంకటలక్షమ్మ
జననం
కె.వెంకటలక్షమ్మ

(1906-05-29)1906 మే 29
మరణం2002 జూలై 1(2002-07-01) (వయసు 98)
కడూర్, కర్ణాటక, భారతదేశం
క్రియాశీల సంవత్సరాలు1918-2000
పురస్కారాలుపద్మభూషణ్ పురస్కారం: 1992
సంగీత నాటక అకాడమీ పురస్కారం: 1964

కడూర్ వెంకటలక్షమ్మ (29 మే 1906 –1 జూలై 2002) మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. మైసూరు శైలికి చెందిన భరతనాట్యంలో ఈమె ఆరితేరిన కళాకారిణి. భారత ప్రభుత్వం 1992లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ తో ఈమెను సత్కరించింది.[1]

జీవితచరిత్ర[మార్చు]

ఆరంభ జీవితం[మార్చు]

వెంకటలక్షమ్మ మైసూర్ రాజ్యంలోని కడూర్ సమీపంలోని తంగళి తండాలో ఒక లంబాడీ కుటుంబంలో 1906, మే 29వ తేదీన జన్మించింది. ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తాత రామానాయక్ వద్ద పెరిగింది. ఈమె 8 యేళ్ల వయసులో మైసూరు రాజాస్థానంలోని రాజనర్తకి జట్టి తాయమ్మ వద్ద భరతనాట్య శిక్షణకోసం చేరింది.

ఈమె గురుకుల పద్దతితో తన గురువు వద్ద భరతనాట్యం అభ్యసించి తన 12వ యేటనే "రంగప్రవేశం" చేసింది. ఈమె మైసూరు ఆస్థాన సంస్కృత విద్వాంసులు దేవోత్తమ జోషి, శాంతాశాస్త్రి, గిరి భట్టల వద్ద సంస్కృతాన్ని అభ్యసించింది. కర్ణాటక సంగీతంలోని మెళకువలను బి.దేవేంద్రప్ప, సి.రామారావుల వద్ధ నేర్చుకుంది.[2] ఈమె తన గురువు తాయమ్మతో కలిసి 30 సంవత్సరాలు నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.

ఈమె తన గురువు తాయమ్మ ఇంటికి తెల్లవారుఝాముననే వెళ్లి కఠోర శిక్షణను తీసుకునేది. ప్రదర్శనలో ఆహార్యానికంటే అభినయానికి ఎక్కువా ప్రాధాన్యతను ఇచ్చేది.

వృత్తి[మార్చు]

ఈమెను మైసూరు మహారాజా కృష్ణరాజేంద్ర ఒడయార్ IV ఆస్థాన విదుషీమణి (రాజనర్తకి)గా 1939లో నియమించాడు. ఆ తర్వాత భరతనాట్య కళాకారిణిగా ఈమె పేరు ఇంటింటా మారుమ్రోగింది.[3] భరతనాట్యంలో మైసూరు శైలిని ఈమె తారాస్థాయికి తీసుకువెళ్ళింది. ఈమె కృష్ణరాజేంద్ర ఒడయార్ IV, జయచామరాజేంద్ర ఒడయార్‌ల ఆస్థానంలో ఆస్థాన విదుషీమణిగా 40 సంవత్సరాలు సేవలను అందించింది. ప్యాలెస్‌లో చాముండి ఉత్సవాలలోను, దసరా నవరాత్రి ఉత్సవాలలోను, మహారాజా వర్ధంతి ఉత్సవాలలోను ఈమె నృత్యప్రదర్శన తప్పనిసరిగా ఉండేది.

మైసూరు ప్యాలెస్‌లో 40 యేళ్ల సేవ అనంతరం వెంకటలక్ష్మమ్మ తన స్వంత శిక్షణా సంస్థ "భారతీయ నృత్య నికేతన" ను ప్రారంభించింది.

మైసూరు విశ్వవిద్యాలయం 1965లో మొదటి సారి నాట్యశాస్త్రాన్ని ఒక కోర్సుగా ప్రవేశ పెట్టినప్పుడు దానికి ఈమెను తొలి రీడర్‌గా నియమించింది. ఈమె 9 సంవత్సరాల పాటు పనిచేసి పదవీ విరమణ చేసింది. ఈమె తరువాత ఈమె మనవరాలు శకుంతలమ్మ రీడర్‌గా పనిచేసింది. వెంకటలక్షమ్మ ఎందరో దేశీయ, విదేశీ విద్యార్థులకు గురువుగా భరతనాట్యాన్ని నేర్పించింది. బెంగుళూరులోని "నూపుర స్కూల్ ఆఫ్ భరతనాట్యం"కు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించింది.

పురస్కారాలు, సత్కారాలు[మార్చు]

  • కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం. (1964) (కర్ణాటక రాష్ట్రం నుండి తొలి పురస్కార గ్రహీత)
  • సంగీత నృత్య అకాడమీ అవార్డు (1976)
  • మైసూరు విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ (1977)
  • కన్నడ రాజ్యోత్సవ పురస్కారం (1988)
  • బెంగళూరు గాయన సమాజం వారిచే సంగీత కళారత్న(1989)
  • పద్మభూషణ్ పురస్కారం (1992)
  • నాట్యరాణి శాంతల రాష్ట్ర పురస్కారం (కర్ణాటక రాష్ట్రంలో నాట్య కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం) (1995)
  • హంపి విశ్వవిద్యాలయం నుండి నాడోజ ప్రశస్తి (2001)[4]

మూలాలు[మార్చు]

  1. India.gov list of Padma Bhushan awardees
  2. Nidamboor, Rajgopal. "A Zealous Servant Of Her Art". Wordoscope.[permanent dead link]
  3. "Dancer Venkatalakshamma dead". Times of India. TNN. Jul 3, 2002.
  4. Keshava, Dasappa. "My mentor Dr. K Venkatalakshamma". Narthaki.com. Narthaki Online. Retrieved 7 June 2015.