కవి చౌడప్ప

వికీపీడియా నుండి

కవి చౌడప్పగా ప్రసిద్ధి చెందిన కుందవరపు చౌడప్ప 16వ శతాబ్దపు తెలుగు కవి.

తెలుగులో తొలి బూతుకవిగా పేరుతెచ్చుకున్న చౌడప్ప, ఎండలో ఎండనివాడు, వానలో తడవనివాడు లేనట్టే తన నీతి విననివాడుకూడా లోకంలో లేడని సగర్వముగా చెప్పుకున్నాడు. మట్లి అనంతరాజు ఆస్థానములో ఉన్న చౌడప్ప బూతాడక దొరకు నవ్వుపుట్టడు అని తన పద్యాలలో నిర్భయముగా ఉత్తమాంగాల నామవాచకాలు వాడాడు. తాను నీతిపద్యాల రచయితనని చాటుకొన్నా తెలుగు సాహితీ చరిత్రలో బూతుకవిగానే పేరు తెచ్చుకొన్నాడు.

మానవ జీవితములో బూతు సహజమని చౌడప్ప ఉద్దేశము. అయినా బూతు కోసము ఈయన బూతు చెప్పలేదు. కుందవరపు కవిచౌడప్పా! అన్న మకుటముతో ఈయన రాసిన కంద పద్యాలు కవి చౌడప్ప శతకముగా ప్రసిద్ధి చెందినవి. ఈ పద్యాలలో భాష కొంత మితిమీరినా భావములో మాత్రము సూటిగా నిజాన్నే ఎండగట్టాడు.

చౌడప్ప తన కవితా పటిమతో అనేక రాజులను మెప్పించి సరసాగ్రేసర చక్రవర్తి అన్న బిరుదు పొందాడు. ఈయన మెప్పించిన రాజులలో తంజావూరు నేలిన రఘునాథ నాయకుడు కూడా ఒకడు. చౌడప్ప కవే కాక గానవిద్యా ప్రవీణుడు కూడా.

చౌడప్ప శతకాన్నే కాక తెలుగులో మొట్టమొదటిదైన ఒక నిఘంటువును కూడా రచించాడని భావిస్తారు. ఒక శుద్ధాంధ్ర నిఘంటువులో చౌడప్ప సీసాలూ అన్న పేరుతో 30 పద్యాలు దొరికాయి. కానీ అవి కుందవరపు చౌడప్పే రచించాడో లేదో రూఢీ అవలేదు.

స్వయంగా బహుళ ప్రచారం పొందిన కవిచౌడప్ప శతకం వ్రాయడం వల్లనే కాక, వివిధ చాటుపద్యాల్లో సంకీర్తుడు. క్రింది పద్యం ద్వారా చౌడప్ప ఘటనలు మట్ల అనంతుని కొలువులో ఉన్నట్లు తెలుస్తూంది.

ఉ. అన్నిట మంచివారు విమలాత్ములు హాస్యకళా ధురంధరుల్
       నన్నుత నీతిపాలకులు జణలు నైపుణు లెవ్వ రంటిరా ?
   పన్నుగ మ ట్లనంత నరపాలుని కొల్చి మహానుభావులై
       వన్నెకు నెక్కినట్టి గుణవంతులు ఘంటన, చౌడగాండ్లురా !

ఈ పద్యం ఇతడు మంచివాడు, విమలాత్ముడు, హాస్యకళా ధురంధరుడు, నీతిపాలకుడు, జాణ అని కూడా చెబుతూంది. ఇతని శతకం ఈ లక్షణాలన్నింటినీ ప్రతిఫలిస్తూంది. నవ్వించడానికి బూతులు ప్రధానం అని భావించే కాలంలో జన్మించడంవల్ల చౌడప్పలో కూడా అంతో ఇంతో బూతు తొంగి చూస్తున్నా, వేమన లాగ ఈయన కూడా ధర్మకోపంతో తిట్టినవాడుగా కనిపిస్తాడు.

[మార్చు] మూలాలు

  • సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర (9వ సంపుటము) పేజీ:153-159
  • తెలుగు చాటువు పుట్టు పూర్వోత్తరాలు - బాలాంత్రపు నళినీకాంతరావు. పేజీ:102-105
పేజీకి సంభందించిన లింకులు