తిక్కన

వికీపీడియా నుండి
(తిక్కన్న నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తిక్కనసోమయాజి చిత్రపటం

తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

తిక్కన శిష్యుడు మారన. ఇతడు రాసిన మార్కండేయ పురాణం ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను. గణపతిదేవుని ఆస్థానంలోకి చేరేటప్పటికి తిక్కన సోమయాజి యజ్ఞము చేయలేదు. భారతమును కూడా రచించలేదు.

అతని తల్లిదండ్రులు కొమ్మన, అన్నమ్మలు. కేతన, మల్లన, పెద్దన ఇతని పెదతండ్రులు. తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహోదరుడు ఖడ్గతిక్కన. తిక్కన కుమారుడు కొమ్మన. తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి. ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న. ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి. తిక్కనసోమయాజి తాత మంత్రి భాస్కరుడు. తిక్కన కవి గౌతమిగోత్రుడు.

ఈ తిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామం. ఉద్యోగరీత్య ఇతని తాత కాలమున గుంటూరునకు వచ్చారు. తరువాత నెల్లూరు రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరుకి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచాడు. కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది. తిక్కనకి అంకితం చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది.

తిక్కన తను రచించిన నిర్వచనోత్తర రామాయణము నందు

సారకవి తాభిరామ గుంటూరివిభుని
మంత్రి భాస్కరు మత్పితామహునిన్ దలచి
యైన మన్ననమెయి లోక మాదరించు
వేఱ నాకృతి గుణములు వేయు నేత?

అని తన కావ్యము స్వగుణముచేత కాకపోయిననూ తన తాత అయిన మంత్రిభాస్కరుని సారకవిత్వమహిమచేత అయిననూ లోకాదరణమునకు పాత్రయగునని చెప్పియున్నాడు. సూర్యవంశపు రాజైన మనుమసిద్ది ఆస్థానకవిగా తిక్కన ఉండడమే కాదు అతనితో సమానుడిగా గౌరవం పొందేవాడు. రాజునకు, కవికి మామవరుస ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణముని మనుమసిద్దికి అంకితం చేసెను. దీనితో మనుమసిద్ది

ఏనిన్ను మామ యనియెడ
దీనికిన్ దగనిమ్ము భారతీకన్యక నా
కీ నర్హుడావగు దనినని
భూ నాయకు పలుకు చిత్తమునకిం పగుడున్

నిన్ను మామా అని పిలుచునందుకైనా భారతమును నాకు అంకితం ఇమ్మని అడిగినట్లు చెప్పబడియున్నది.

తిక్కన నన్నయని ఆదికవిగా చెప్పలేదు. భారతమున మొదట మూడుపర్వాలను వ్రాసెనని చెప్పాడు.

తిక్కన కావ్యములు రెండు.1. నిర్వచనోత్తర రామాయణం. దీనినంతటిని పద్యములుగానే రచించెను. ఇది బాల్యమునందు రచించబడింది. ఇందలికథ సంస్కృతంలో ఉన్నంత లేక మిక్కిలి సంగ్రహపరచబడింది. పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును. అందుచేత ఈ గ్రంథం భారతమువలె సర్వత్ర వ్యాపింపకున్నది. యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగింపలేదు. రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు కృష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచింపకయే యుండవలెను. తిక్కన భారతమును మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీ భద్రాద్రిరామునికి అంకితం

హరిహరోపాసన

[మార్చు]

తన కాలం నాటి సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టింఛాడు. సంఘసంస్కర్తగా నిలిచాడు. తన భారత రచనను హరిహరనాధునకు అంకితమిచ్చారు. శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు:

శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

మంత్రిత్వ పటిమ

[మార్చు]

మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్దికి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించాడు.

సమకాలీనులు, శిష్యులు

[మార్చు]

మారన, కేతన, గురునాధుడు

మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం

[మార్చు]

మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. నెల్లూరులో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని పెన్నానది ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని . మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగం రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. అరణ్యపర్వము వరకును నన్నయ వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో యజ్ఞము చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన.

తిక్కన మొదట రచించిన పర్వములను చూసి వానియందు విశేషవృత్తములు లేకపోగా పండితులు, అతడు సామాన్య వృత్తములుతో కాలము గడుపుతున్నాడే కాని అపూర్వవృత్తరచనా కుశలుడు కాడని ఆక్షేపించిన మీదట తిక్కన స్త్రీ పర్వమునందు బహువిధ వృత్తములను రచించాడని చెప్పుదురు. తిక్కన రచించిన 15 పర్వములలో 45 ఆశ్వాసముల కంటే ఎక్కువ గ్రంథము లేదు. ఒక్కొక్క ఆశ్వాసమునకు 445 పద్యములు చొప్పున లెక్క చూసిననూ, భారతంలో తిక్కన 25000 పద్యముల కంటే అధికముండవు. దినమునకు 10 పద్యములు చొప్పున రచించినచో ఇంత మహాభారత గ్రంథము 5 లేదా 6 సంవత్సరములలో రచించవచ్చును. కాబట్టి ఇట్టి గ్రంథము ఒకరివల్ల రచించడం అసాధ్యము కాదు. సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాని తిక్కన శైలితో సమానముగా వ్రాయుట మాత్రము ఎవ్వరికి సాధ్యముకాదు. తెలుగుభాష యందు ఎన్నిగ్రంథములు ఉన్నానూ, తిక్కన కవిత్వముతో సమానముగా కాని దానిని మించియున్నట్లుగాని కవిత్వము చెప్పగలిగిన వారు నేటివరకు ఒక్కరును కనబడలేదు. తిక్కన కవిత్వము ద్రాక్షాపాకము మిక్కిలి రసవంతముగా ఉండును. ఇతని కవిత్వమునందు పాదపూరణము కొరకు వాడిన వ్యర్థపదములు అంతగా కనిపించవు. ఈయన కవిత్వము లోలోక్తులతో కూడి జాతీయముగా ఉండును. ఇతని కవిత్వములో ఒకవంతు సంస్కృతము, రెండువంతుల తెలుగుపదములు కనిపిస్తాయి. నన్నయవలె తన గ్రంథమును మూలమునకు సరిగా వ్రాయలేదు. విరాటపర్వమునందు కథ కొంత పెంచెను. తక్కిన పర్వములందు మిక్కిలిగా కథను సంగ్రహపరిచెను. ఉద్యోగపర్వములోని సనత్కుమార ఉపదేశమును మూలమున పదిపండ్రిపత్రములున్నా, తెలుగున 2లేదా 3పద్యములతో సరిపెట్టెను. భగవద్గీతలు, ఉత్తరగీతలు మొదలైనవానిని వ్రాయనేలేదు.

భగవద్గీతలోని కొన్నిశ్లోకములకు దగ్గరగా కొన్ని పద్యములను వ్రాసాడు. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకమును చూడుము.

భగవద్గీత శ్లోకం ;;

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సువః!

మామ కాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః!!

పద్యం ;;

క;;మ్మానుగ ధర్మక్షేత్రం
బైన కురుక్షేత్రమున మహాహవ మునకున్
బూని మనబలమున్ బాండవ
సేనయు నిటు సన్నీ యేమి చేసెంజె పుమా!

అని తిక్కన ఆంధ్రీకరించాడు.భగవద్గీతను అనువదించకపోవడానికి కారణం ఏమిటన్నది చెప్పనకకరలేదు. భగవద్గీత స్వయంగా ఒక గ్రంథంగా ప్రామాణికంగా ఉన్నపుడు తెలుగు భారతంలో విశదీకరించనక్కరలేదని తలచియుండవచ్చును.

ఈయన సంస్కృతమును తెనిగించినరీతిని తెలుపుటకై మూలగ్రంథములోని కొన్ని శ్లోకములను వాని అర్థమును తెలుపు పద్యములును కొన్నింటిని వివరించడం చూడవచ్చును.

విరాటపర్వం శ్లోకము

 ఆలో కయసి కిం వృక్షం సూద దారుక్రుతేనవై !
 యది తే దారుభిః కృత్యం బహిర్వ్రుక్షాన్ని గృహ్యతామ్ !!
అనువాద పద్యము వలలుం డేక్కడన్ జూచె ?నొండెడ నపెవ్యక్ష్మాజముల్ పుట్టవే?
 ఫలితంబై వరశాఖ లోప్పన్ గ ననల్పప్రీతి సంధించుచున్
 విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికి న్విశ్రాంతిన్ గావింపన్ గాన్
 గల యీ భుజము వంట కట్టయలకై ఖండింపన్ గా నేటికిన్ ?

తిక్కన పద్యాలు:

[మార్చు]
ద్రౌపది కీచకునితో

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా

దక్షిణ గోగ్రహణ సమయమున విరాటుడు సుశర్మపై యుద్ధమునకు పోవునపుడు

సీ.        గంధ దంతావళ కర్ణమారుతహతిఁ

గాంతారములు చాఁపకట్టువడఁగ,

రథ ఘోషమునఁ బ్రతిరవమిచ్చునద్రులు

భయమున వాపోవు భంగి నుండఁ,

దురగ ఖురోద్ధూత ధూళి దన్బెరసిన

వననిధి పిండలివండు గాఁగ,

బహుళపదాతి దుర్భరభార మడరిన

నురగకూర్మంబు లొండొదంటిఁ బొంద

తే.        సైన్యముల నడిపించె నుత్సాహలీల

యతిశయిల్లంగ సంరంభ మగ్గలింప

బరవసము మిక్కుటంబుగఁ బసులు సన్న

జాడఁ గై కొని యమ్మత్స్యజనవిభుండు.[1]        


( మదపుటేనుగు సమూహముల చెవులు విదిలించే గాలి దెబ్బలకు అడవులు చాపచుట్టల వలె పడిపోవుచుండ, కదిలే రథముల ధ్వనికి  ప్రతిధ్వనించు పర్వతములు భయముతో దుఃఖించునట్లు కనిపించుచుండ, గుఱ్ఱములు కాలిగిట్టలచే ఎగురకొట్టబడిన ధూళి తనలో కలియుటచే సముద్రము బురదముద్ద అవుచుండ, విస్తృతమైన కాల్బలముల భరించజాలని తాకిడి బరువుకు అణగిన  భూమిని భరించునట్టి ఆదిశేషువు, ఆదికూర్మములు ఒకదానినొకటి ఊతగా దగ్గఱకు రాగా, మత్స్యదేశాధిపతి తన సైన్యములను ఉత్సాహము అధికమవ, ఆటోపము అతిశయించ, ధైర్యము పెంపార పశువులు వెళ్ళిన త్రోవలో నడిపించెను.)

ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు

సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్

కౌరవసేనను చూసి భయభ్రాంతుడైన ఉత్తరకుమారుడుతో అర్జునుడు

[మార్చు]

ఉ.  అంతిపురంబులోనఁ గల యంగన లెల్లను నెమ్మనంబులన్‌

సంతసమందఁగాఁ బసులఁ జయ్యనఁ దెచ్చెద నంచుఁ బూని, నీ

వెంతయు మేటివై, యరదమెక్కి రయంబున వచ్చి, యిచ్చటన్‌

దంతితురంగ సద్భటకదంబముఁ జూచి కలంగు టొప్పునే!’[2]


ఈ కవి ఇంకా కవివాక్భంధనం అనే లక్షణగ్రంథముని కృష్ణశతకముని, విజయసేననము అనువాటిని రచించాడని భావన.


ముగింపు

[మార్చు]

తిక్కన మనుమసిద్ది రాజ్యము అంతరించిన తరువాత కూడా చిరకాలము జీవించి, సర్వజనులచే గౌరవిమ్పబడేవాడైనా, మరణకాలమునకు విశేషవృత్తవంతుడిగా కనబడడు .అందుచే అతని కుమారుడు కొమ్మన పాటూరి కరినణమును సంపాదించవలసి వాడయ్యేన

తిక్కన తిరుగాడిన నేల

[మార్చు]

తిక్కన (1205 - 1288) మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

క్రీస్తు శకం 1253 సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆశయసిద్ధి కోసం ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందువల్ల ఆ ఆలయాన్ని సిద్ధేశ్వరాలయంగా పిలిచారు. యజ్ఞం పూర్తి చేసిన తరువాత తిక్కన సోమయాజిగా మారి మహాభారత రచనకు ఉపక్రమించారు. అప్పటి యజ్ఞానికి సంబంధించిన అనేక అవశేషాలు నేడు శిథిలావస్థకు చేరుకొన్నాయి. తిక్కన తిరుగాడిన జాడలేవీ?'వింటే భారతం వినాలి .... తింటే గారెలు తినాలి' అనే నానుడికి జీవం పోసింది తిక్కన. మహాభారత కథనాలకు అంతటి ఖ్యాతిని ఆర్జించిన కవిబ్రహ్మ తిక్కన మెచ్చిన ప్రదేశం, ఆయన పూజించిన ఆలయం నేడు దయనీయ స్థితికి చేరుకొన్నాయి.

మానవుడు పంజరంలోని చిలుకలాంటి వాడు' అనే ఉపమానం, నానుడి తిక్కన చాలా పర్యాయాలు ఉపయోగించారు. నిర్వచనోత్తర రామా యణంలో మొదటి మనుమసిద్ధిని వర్ణిస్తూ "కీర్తి జాలము త్రిలోకీ శారీకకు అభిరామరాజిత పంజరంబుగజేసి అని చెప్పారు. అలాంటి తిక్కనే పూజించి, యజ్ఞం చేసిన సిద్దేశ్వరాలయం, రాతివిగ్రహాలు నేడు నిర్లక్ష్యమనే పంజరంలో చిక్కుకొని శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయన పూజలు చేసిన నందీశ్వరుడ్ని అపహరించారు. మహాభారతాన్ని రసరమ్యంగా వర్ణించేందుకు తిక్కనకు సహకరించింది కోవూరు ప్రాంతమే.

తిక్కన పూర్వీకులు 'కొట్టురువు' ఇంటి పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మనుమసిద్ధి కాలంలో తిక్కన ఇంటిపేరు 'పాటూరుగా' మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టం. పదకొండు పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు. వేప, రావి చెట్లు మొలచి ఆలయం ధ్వంసమవుతోంది. ఆలయ ప్రాంగణాన ఉన్న బావిలో తిక్కన నిత్యం స్నానమాచరించి, సంధ్యావందనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బావి వర అంతర్భాగంలో చెక్కిన చంద్రుడు, వినాయకుని శిల్పాలు సుందరంగా ఉండేవట కానీ, బావి పూర్తిగా ముళ్లపొదలతో నిండిపోవడం చేత ఆ శిల్పాల్ని ఇప్పుడు చూడలేము. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించినట్లుగా చెప్పే 'ఘంటం' పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. 'ఘంటం' ఉంచే ఒరకు ఒక వైపు సరస్వతీ దేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారని, తాము చాలా సంవత్సరాల క్రిందట దానిని చూశామని పాటూరు గ్రామ వయోవృద్ధులు చెప్పారు.

నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ 'వర్ధమానసమాజం' కొన్నేళ్ల కిందట నిర్వహించిన 'తిక్కనతిరునాళ్ళ'లో దానిని ప్రదర్శించారు. ఆ తరువాత ఒర చిరునామా లేకుండా పోయింది. తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించారు. ఆయన వర్ణన ఆధారంగా 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించారు. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు పురమందిరంలోని వర్ధమాన సమాజంలో పూజలందుకుంటోంది. 1986 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. అయితే - సిద్ధేశ్వరాలయం, తిక్కన పూజించిన శిలలు అన్నీ తమ సొంతమని, ప్రభుత్వానికీ దేవాదాయశాఖకూ సంబంధం లేదని పాటూరు వంశస్థుడు ఒకాయన ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకొన్నారట. పదేళ్ల కిం దట మాత్రం ఒక భక్తుడు శిథిల ఆలయానికి వెల్ల వేయించి తన భక్తిని చాటుకొన్నారని చెబుతారు.

పాటూరు గ్రామంలో తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటికీ లేకపోవడం విచారకరమని గ్రామస్థులు అన్నారు. తిక్కన గురించి రాసిన వ్యాసాలు, గ్రంథాలతో ఒక గ్రం«థాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. హైదరాబాదులోని టాంకుబండ్‌పై తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన నివసించిన పాటూరు గ్రామాన్ని మరచిపోవడం బాధాకరం. ఆయన పూజించి, యజ్ఞం చేసిన సిద్ధేశ్వరాలయాన్ని ప్రభుత్వం దర్శనీయ స్థలాల జాబితాలో చేర్చాలని జిల్లా వాసులు, సాహిత్యాభిలాషులు కోరుతున్నారు. బ్రిటిషువారు నిర్మించిన కట్టడాల్ని సైతం చారిత్రక కట్టడాలుగా ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తిక్కన తిరుగాడిన నేల స్మృతులు ... శిల్పాల్ని, ఘంటాన్ని, ఒరను, నందీశ్వరుడ్ని పదిలపరచకపోవడం విచారకరం. తెలుగు జాతి గుండెల్లో తీయ తేనియ నుడుల్ని ఆచంద్రార్కం నిల్పిన తిక్కన జ్ఞాపకార్థం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రభారతి - ఆంధ్రమహాభారతము - విరాటపర్వము - తృతీయాశ్వాసము - విరటుఁడు సుశర్మమీఁద యుద్ధం చేయఁబోవుట - కవిత్రయ భారతము - కవిత్రయము - నన్నయ - తిక్కన - ఎఱ్ఱన". andhrabharati.com. Retrieved 2023-08-08.
  2. "ఆంధ్రభారతి - ఆంధ్రమహాభారతము - విరాటపర్వము - చతుర్థాశ్వాసము - ఉత్తరుఁడు కురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుం డగుట - కవిత్రయ భారతము - కవిత్రయము - నన్నయ - తిక్కన - ఎఱ్ఱన". www.andhrabharati.com. Retrieved 2023-11-24.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తిక్కన&oldid=4139307" నుండి వెలికితీశారు