పల్లెల్లో విద్యావిధానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పల్లెల్లో విద్యా విధానము: ఆ రోజుల్లో

పూర్వ కాలం గురుకుల పాఠశాలలు వుండేవని, రాజులు, ఇతర ప్రముఖులు తమ పిల్లలను గురువుల వద్దకు పంపించే వారని వారు సకల విద్యాపారంగతులైన తర్వాత కొన్ని సంవత్సరాలకు తమ ఇళ్లకు వచ్చే వారని పుస్తకాలలో చదువు కున్నాము. ఆ విద్య రాజులకు, ఇతర ప్రముఖులకు తప్ప ఇతరులకు అందుబాటులో వుండేది కాదు. అలాంటి విద్యా విధానము కాకపోయినా దాని వాసనలు కొంత ఉన్న విద్యా విధానము భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు పల్లెల్లో అమలులో వుండేది. ఆ విద్యావిధానము ఎలా వుండేదో కొంత అవగాహన చేసుకుందాం.

అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి కొద్ది కాలమే అయినందున అప్పటికింకా ప్రభుత్వ బడులు పల్లెల్లో లేవు. పాత కాలపు విద్యా విధానమే అమలులో వుండేది. వాటిని వీధి బడులు అనే వారు (పలుకొటం అని కూడా అనే వారు. ఇది అరవ మాట). ఊరి పెద్దలు చదువుకున్న ఒకతన్ని తీసుకొచ్చి అతనికి సకల సౌకర్యాలు కల్పించి ఎక్కడైనా ఖాళీ ఇంట్లో గాని, అందు కొరకు కట్టిన సపారులో గాని, పెద్ద ఇండ్లలోని తాళావారంలో గాని, లేదా చెట్ల క్రింద గాని నేలమీద గాని బడిని ఏర్పాటు చేసేవారు, నేల మీద ఇసుక పోసి దాని పై పిల్లలు కూర్చునేవారు. అయ్యవారు కూర్చోడానికి ఒక మట్టితో కట్టిన దిమ్మ 'అరుగు ' వుండి దాని పైన చాప వేసి వుండేది. అదే వీధిబడి. బడి సమయం: తెల్లవారుఝాము నుండి సాయంకాలం వరకు బడి వుంటుంది. పొద్దున తొమ్మిది గంటలకు, సద్ది తిన డానికి మధ్యాహ్నం అన్నానికి ఒక్కో గంట విరామం వుండేది. పొద్దున బడికి ఎవరు ముందు వస్తే వారు సురి (శ్రీ) , రెండో వాడు చుక్క మూడో వాడు దెబ్బ. మూడో వానికి ఒక దెబ్బ, ఆ తర్వాత వచ్చినవారి వారి ఆలస్యాన్ని బట్టి అన్ని దెబ్బలు. నాల్గో వానికి నాలుగు దెబ్బలు, ఐదో వానికి ఐదు దెబ్బలు ఇలా వుండేవి. అయ్యవారి చేతిలో సదా ఒక బెత్తం వుండేది.

ఇప్పట్లో ఉన్నట్టు ఆ రోజుల్లో బడిలో తరగతులు వుండేవి కాదు. చిన్న పిల్లలకు ఇసుక లోనో, అరుదుగా వుండే పలకల లోనో అక్షరాలు దిద్దించే వారు. అక్షరాలు పూర్తిగా నేర్వక ముందే పిల్లలకు చాలా పద్యాలు, శ్లోకాలు బట్టీ పట్టించే వారు. పొద్దున అయ్యవారు అల్లంత దూరంలో బడికి వస్తున్నాడనగానే పిల్లలందరు జనగణ మన పాట మొదలెట్టే వారు. అప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ప్రభావ మేమో "జనగణ మన పాటకు అంత ప్రాముఖ్యత. సాయంకాలం బడి 'జనగణ మన' పాటతోనే ముగిసేది. ప్రతి పండక్కు సెలవే, ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు కూడ సెలవే. ఇప్పటి లాగ ఆదివారం సెలవు అనే ఆచారం లేదు. అయ్యవారికి ప్రతి ఫలం: ప్రతి పిల్లవాడు నెలకు ఒకరూపాయి ఇవ్వాలి. అది గాక ఆ రైతుకు వున్న, పాలుగాని, కూరగాయలు, మొదలగునవి అతనికవసర మైనప్పుడు ఇవ్వాలి. ఇవి గాక పండగ సందర్బాలలో అయ్యవారికి సంభావన బాగానే వుంటుంది. ప్రతి ఫలంగా అయ్యవారు పిల్లలకు చదువే గాక రైతులకు వారం, వర్జ్యం, రాహుకాలం. ఇలా దినఫలాలు కూడా చెప్పేవాడు. అవే కాకుండా బల్లి పడే శాస్త్రం, వారశూల మొదలగు వాటిని కూడా చెప్పేవాడు. ఈ విధంగా అయ్యవారు సర్వ విషయాలు తెలిసిన వాడుగా ప్రసిద్దుడు. అందుకే పల్లెల్లో ఎవరైనా కొంచె తెలివిగా మాట్లాడు తుంటే..... పెద్ద అయ్యోరు వచ్చాడు..... అని వ్యంగంగా అంటారు.

తరగతులు: ఇప్పుడున్నట్టు అప్పట్లో బడిలో తరగతులు లేవు. అక్షరాలు నేర్చిన తర్వాత పెద్దబాల శిక్ష చదవాలి. పెద్ద బాల శిక్ష అయి పోగానే చదువులో ఒక అధ్యాయం ముగిసిందని ప్రజలు భావించే వారు. అంతటితో తమ పిల్లలను బడి మానిపించే వారు. అప్పటి సమాజంలో పెద్దబాలశిక్ష చదవడం ఒక గొప్ప విద్యార్హతగా ఉండేది. అది కాగానే బాలరామాయణం, తర్వాత అమరకోశం, ఆ తర్వాత గజేంద్ర మోక్షం, ఆదిపర్వ చదవాలి. అంత వరకు చదవడము చాల అరదు. దాంతోటి చదువు అంతా పూర్తి అయ్యేది. చివరి వరకు చదివేవారు అతి తక్కువ. అక్షరాలను ఇసుకలో లేక అరుదుగా వుండే పలకలలో నేర్పిస్తారు. ఆ తర్వాత పెద్ద బాల శిక్ష లోని పదాలు, ఇతర అంశాలు నేర్పిస్తారు. పెద్ద బాల శిక్ష పూర్తి కాక ముందే మధ్య మధ్య సుమతి శతకం, వేమన శతకం, కుమారి శతకం, ఇలా అనేక శతకాలు నేర్పిస్తారు. ఆ తర్వాత ఎక్కాలు, గుణకారాలు, భాగహారాలు, తీసి వేతలు, వడ్డి లెక్కలు, లాభనష్టాలు ...... వంటి లెక్కలు నేర్వాలి. పెద్ద బాల శిక్షలో కొలమానాలు తులము, ఫలము, సేరు, వీశ, మణుగులు, బారువాలు ఈ విధంగా వుండేవి. వీసం, మువ్వీసం, పాతిక, ముప్పాతిక ఇవి కూడా లెక్కలే. వడ్డి కట్టే విధానం, బాండు రాసే విధానం, జాబు వ్రాసే విధానము కూడా నేర్పే వారు. అదంత ఎక్కువగా మౌఖికమే. లెక్కలు, పద్యాలు, శ్లోకాలు పిల్లలు కోరస్ గా అరుస్తుంటే కొత్తగా వూర్లోకి వచ్చిన వారికి సైతం వారి అరుపులతో బడి ఎక్కడున్నదో సులభంగా తెలిసిపోయేది. అప్పుడంతానోటి లెక్కలె. అయ్యవారు ఒక లెక్కను నిదానంగా అడుగుతాడు. ఒకడు మరొకనికి నూటికి నెలకు పావాల వడ్డి వంతున ఆరు వందల రూపాయలను ఇచ్చాడు. రెండున్నర సంవత్సరాలకు వడ్డి ఎంత... మొత్తం ఎంత? ప్రశ్న పూర్తి అవగానే ఎవరు ముందు జవాబు చెప్పితే వాడు గొప్ప. అయ్య వారు లెక్క చెప్పుతున్నంత సేపు మనసులోనె లెక్క వేసుకోవాలి. వెంటనే జవాబు చెప్పాలి. శ్లోకాలు, పద్యాలు కూడా అంతె. పలాన పద్యం చెప్పమంటే వెంటనె అర్థాలతో సహా తప్పులు లేకుండా చెప్పేయాలి. ఆ విదంధంగా పెద్ద బాల శిక్ష పూర్తి ఐతే ....తరువాత బాల రామాయణం. చదవాలి. పెద్ద బాల శిక్ష పూర్తి అయినదనడానికి పరీక్ష లాంటిదేమి వుండదు. ఇంత కాలం లోపల పూర్తి చేయాలని కూడా నియమం లేదు. అది పిల్లవాని తెలివి మీద ఆధార పడుతుంది. బాల రామాయణం, ఆ తర్వాత అమర కోశం చదవాలి. అందులో అన్ని శ్లోకాలు అప్ప జెప్పాలి. అయ్యావారు పిల్లలకు కోలాటం, కోలాటం పాటలు కూడా నేర్పే వారు. ఎవరైనా పిల్లవాణ్ని ఏం చదువుతున్నావని అడిగితే, పెద్దబాల శిక్షో, బాల రామాయణమో, అమరకోశమో అని వారు చెప్పె వారు. అదే వారి చదువుకు కొలమానము.

బడిలో ఇతర సంగతులు: ఆ రోజుల్లో ప్రజల్లో అక్షరాస్యత తక్కువ కాని చాల మంది పెద్దవారి సైతం సుమతి శతకం, వేమన పద్యాలు తప్పొప్పులతో నోటికి వచ్చేవి. బహుశా అవి ఈ బడుల్లో పిల్లలు ప్రతి రోజు కోరస్ గా అరిచి చెప్తున్నందున అవి విని, ఆ పద్యాలు అతి సులబ గ్రాహ్యంగా వున్నందున వారికి వంట బట్టి వుండవచ్చు. అలాంటి కొందరు పెద్ద వారు చుదువు చున్న పిల్లలని "అరె......... అప్పిచ్చు వాడువైద్యుడు పద్యం చెప్పరా? అని అడిగే వారు. కొందరు తాము నేర్చిన పద్యంలోని తప్పులను రహస్యంగా సరిదిద్దు కునేవారు. కొంత మంది తాము నేర్చిన పద్యానికి పిల్లవాడు చెప్పే పద్యానికి కొంత తేడా వుంటే పిల్లవాడు తప్పు చెపుతున్నాడని దబాయించేవారు. పిల్ల వాడు అయోమయంలో పడే వాడు. అయ్యవారిని అడిగే ధైర్యం వుండదు. కాని కొంత మంది పెద్దిరకం కలిగిన పెద్దలు అయ్యవారిని.... పిల్లవాడు పద్యం తప్పు చెప్పుతున్నాడని నిలదీసే వారు. అయ్యవారు పిల్ల వాన్ని పిలిచి ఆ పద్యం అప్పజెప్పమంటే..... ఆ పిల్లవాడు చెప్పినదే సరిమైనదని అయ్యవారు చెప్పితె అట్లనా.. "నాదే తప్పు అన్నమాట...." అని ఒప్పుకునే వారు నిస్సంకోశంగా.... గుట్టుగా సరిదిద్దుకునే వారు. ఆ రోజుల్లో బడిలో ఆడ పిల్లల సంఖ్య అతి తక్కువ. కొన్ని బడులలో అసలే వుండరు. దళితుల పిల్లలు అసలే వుండరు.

మరో విశిష్టమైన సంగతేమంటే..... మగ పిల్లలు కూడా తప్పనిసరిగా నొసటన బొట్టు పెట్టుకొని రావాలి. లేకుంటే కోడి పెంటను బొట్టుగా పెడ్తానని అయ్యవారు బెదిరించే వారు. మరి కొందరు మగ పిల్లలకి ముడేసిన జుట్టు కూడా వుండేది. పెద్దలలో చాల మందికి ముడేసిన జుట్టు వుండేది. మగ పిల్లలకి కొందరికి చెవిలో పోగులు కూడా వుండేవి. కొంత మంది మగ పిల్లలకు చెవిలో చిన్న కమ్మల వంటి ఆభరణాలు కూడా వుండేవి. కాని ఎవరు.... ఎవరినీ గేళి చేసిన సందర్భాలు అసలే లేవు. పిల్లలు పొలం పనులు ఎక్కువగ వున్న రోజుల్లో బడికి వచ్చే వారు కాదు. అయ్యవారుప్రతి నిత్యం పిల్లల తల్లిదండ్రులను కలిసే వారు. ఆ సందర్భంలో పిల్లలు బడికి రానందుకు కారణం తెలుసుకునే వారు. ఆనాటి ఈ విద్యా విధానం: రాజుల కాలంలో రాజుల ఆధర్యంలో వెలసిన గురుకుల పాఠశాలలకు ఈ వీధి బడులు అంతిమ రూప మనిపిస్తుంది. గతంలో రైతులు తమ పిల్లలను బాగా చదివించాలనె కోరిక ఎంత మాత్రము వుండేది కాదు. పిల్లలను చదివించి ఉద్యోగం చేయించాలనే కోరిక అంత కన్నా వుండేది కాదు. నాలుగు అక్షరాలు నేర్చు కొని పొలంలో పని చూసుకుంటే చాలు అని అనుకునేవారు. ఇటు పిల్లలు కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని పై చదువులు చదివి ఏదైనా వుద్యోగంలో చేరు దామని అనుకునే వారు కాదు. ఏదో బడికి వస్తున్నాం... చదువుతున్నాం అని అనుకోవడమే.. ... ప్రభుత్వ పాఠశాలలు వచ్చింతర్వాత కూడా ఇదే పరిస్థితి కొంత కాలం కొనసాగింది. ఆ తర్వాతనే చదువు పై శ్రద్ధ పెరిగింది. వ్యవసాయం గిట్టు బాటు కాక పోవడంతో రైతులు కూడా తమ పిల్లలను బాగా చదివించి ఏదైనా ఉద్యోగంలో చేరితే బాగుండునని ...... ఈ కరవు కాలంలో వ్యవసాయంలో బతక లేరనే నిర్ణయానికి రైతులు వచ్చారు.