బమియాన్ బుద్ధ విగ్రహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Cultural Landscape and Archeological Remains of the Bamiyan Valley
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
రకంCultural
ఎంపిక ప్రమాణంi, ii, iii, iv, vi.
మూలం208
యునెస్కో ప్రాంతంAsia-Pacific
శిలాశాసన చరిత్ర
శాసనాలు2003 (27th సమావేశం)
అంతరించిపోతున్న సంస్కృతి2003–present

బమియాన్ బుద్ధ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్ లోని ఆరవ శతాబ్దానికి చెందిన పెద్ద బుద్ధ విగ్రహాలు. ఈ విగ్రహాలు మధ్య ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హజరాజత్ అనే ప్రాంతంలో బమియాన్ లోయ దగ్గర ఇసుకరాతి కొండల్లో చెక్కబడ్డాయి. ఈ ప్రదేశం కాబూల్ కు 213 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిల్పాలు గాంధార శిల్పకళ పద్ధతిలో చెక్కారు.

శిథిలమైన బమియాన్ బుద్ధ విగ్రహం

బమియాన్‌ అనేది హిందుకుష్ పర్వత ప్రాంతంలో ఓ అందమైన లోయ. ఇక్కడ ఎన్నో బుద్ధవిగ్రహాలున్నాయి. అందమైన గుహలున్నాయి. ఈ శిల్పాలు కుషాణుల కాలం నాటివి. ఇక్కడి శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై పాడయ్యాయి. బమియాన్‌లోని రెండు పెద్ద విగ్రహాలను 2011 లో తాలిబన్లు, తమ నాయకుడు ముల్లా ఒమర్ ఆదేశానుసారం ధ్వంసం చేసారు.

చరిత్ర[మార్చు]

Drawing of the Buddhas of Bamiyan by Alexander Burnes 1832

బమియాన్ హిందూకుష్ పర్వతాల గుండా సాగిపోయే సిల్కు రోడ్డులో ఉంది. చారిత్రికంగా సిల్కు రోడ్డు చైనాను పాశ్చాత్య దేశాలతో కలిపే బిడారు వర్తకుల మార్గం. బమియాన్ అనేక బౌద్ధారామాలు వెలసిన ప్రదేశం. ఆధ్యాత్మికత, తాత్వికత, కళలూ విలసిల్లిన స్థలం. బమియాన్ కొండల్లో తొలిచిన గుహల్లో బౌద్ధ సన్యాసులు నివసించేవారు. సన్యాసులు ఈ గుహలను విగ్రహాలతో రంగురంగుల కుడ్య చిత్రాలతో అలంకరించేవారు. రెండవ శతాబ్ది నుండి 7 వ శతాబ్దిలో ఇస్లామిక దండయాత్రల వరకూ అది బౌద్ధ ఆధ్యాత్మిక స్థలంగా ఉండేది. 9 వ శతాబ్దిలో పూర్తిగా ముస్లిముల ఆక్రమణలోకి వెళ్ళేవరకూ బమియాన్‌లో గాంధార సంస్కృతి విలసిల్లింది.

పెద బుద్ధ విగ్రహం ధ్వంసానికి ముందు 1963 లో, ధ్వంసం చేసాక 2008 లో

అన్నిటికంటే ప్రముఖమైనవి నిలబడిన భంగిమలో ఉన్న వైరోచనుడు, శాక్యముని విగ్రహాలు. పెద్ద విగ్రహాన్ని స్థానికులు సోల్‌సోల్ అని పిలిచేవారు. ఇది 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీన్ని ముందుగా రాయితో చెక్కి దానిపై మట్టీ గోధుమ గడ్డితో చేసిన మిశ్రమాన్ని పూశారు. దానిపై జిప్సమ్‌ ప్లాస్టర్‌ వేశారు. ఆపై రంగులూ వస్త్రాలతో అలంకరణలున్నాయి. ఈ విగ్రహం చుట్టూ ఉన్న గోడలపైనా అందమైన చిత్రాలున్నాయి. బంగారు రథంపై దూసుకెళ్తున్న సూర్యభగవానుడూ అతడి చుట్టూ ఎగిరే పక్షులూ అప్సరసలూ ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ గుహ వెనక ఓ పెద్ద సభామంటపం కూడా ఉంది.

1969, 1976 మధ్య భారత ప్రభుత్వ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్‌.సేన్‌గుప్తా నాయకత్వంలో ఈ గుహలను పునరుద్ధరించింది.

35 మీటర్ల ఎత్తున్న చిన్న విగ్రహాన్ని షామామా అని పిలుస్తారు. ఈ విగ్రహాలున్న గుహల (కొండను తొలిచిన భాగం) ఎత్తు 58 మీటర్లు, 38 మీటర్లు[1][2] ధ్వంసం చెయ్యకముందు ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద నిలబడిన భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహాలు. ఈ విగ్రహాలను కూల్చేసాక, చైనాలో 128 మీటర్ల వైరోచన బుద్ధుని విగ్రహాన్ని నిర్మించారు.

చిన్న బుద్ధ విగ్రహాన్ని సా.శ 544 - 595 లలో నిర్మించగా, పెద్ద విగ్రహాన్ని సా.శ 591 - 644 మధ్య నిర్మించారు.[3] పెద్ద విగ్రహం దీపాంకర బుద్ధుణ్ణి తలపిస్తుందని కూడా చెబుతారు. ఈ ప్రాంతంలో ఈ విగ్రహాలు అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఈ స్థలాన్ని యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది కాలక్రమంలో వాటి రంగు వెలిసిపోతూ వచ్చింది.[4]

సా.శ 630 ఏప్రిల్ 30 న చైనా యాత్రికుడు షువాన్‌జాంగ్ ఈ స్థలాన్ని సందర్శించాడు.[5][6][7] పదికి మించిన ఆరామాలు, పదివేల పైచిలుకు సన్యాసులతో పరిఢవిల్లిన బౌద్ధ మత కేంద్రంగా దాన్ని అభివర్ణించాడు. బుద్ధ విగ్రహాలు బంగారంతోటి, రత్నాలతోటీ అలంకరించారని కూడా అతడు రాసాడు (Wriggins, 1995). వీటికంటే పెద్దదైన మూడో విగ్రహం, పడుకున్న స్థితిలో, కూడా అక్కడ ఉన్నట్లు అతడు రాసాడు.[8][7] ఇక్కడి విగ్రహాలకు సరిపోలే, కూర్చున్న స్థితిలో ఉన్న, విగ్రహం చైనాలోని గన్‌షు ప్రావిన్సులో బింగ్‌లింగ్ దేవాలయ గుహల్లో ఉంది.

ఈ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఉన్న కక్రక్‌ వ్యాలీలోని బుద్ధవిగ్రహమూ తాలిబన్ల దాడుల్లో రూపు కోల్పోయింది. ఈ ప్రాంతంలో గుహలన్నింటినీ మహ్మద్‌ గజనీ కొల్లకొట్టాడు. ఆ తరువాతే ఇక్కడ బౌద్ధం నెమ్మదిగా క్షీణించింది. ఇస్లాం విస్తరణ ఊపందుకుంది.

బుద్ధ విగ్రహాలపై దాడులు[మార్చు]

11 - 20 శతాబ్దాల మధ్య[మార్చు]

1221 లో చెంఘీజ్ ఖాన్ ఆగమనంతో "బమియాన్ ఘోర వైపరీత్యానికి గురైంది".[9][10] కానీ విగ్రహాలకు మాత్రం హాని చెయ్యలేదు. తరువాత మొగలు చక్రవర్తి ఔరంగజేబు శతఘ్నులతో విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. తరువాత 18 వ శతాబ్దిలో పర్షియా రాజు నాదర్ అప్ఫ్సర్ కూడా శతఘ్ని గుళ్ళతో వాటిని నాశనం చేసేందుకు ప్రయత్నించాడు.[11]

ఆఫ్ఘన్ రాజు అబ్దుర్ రహమాన్, హజారా తిరుగుబాటుదార్లపై దండెత్తినపుడు పెద్ద విగ్రహపు ముఖాన్ని ధ్వంసం చేసాడు.[12] 1847 లో ఫ్రెంచి దేశస్తుడు దూరో దాని చిత్రాన్ని గీసాడు.[13]

2001 వరకు ప్రస్థానం - తాలిబాన్ నేతృత్వంలో[మార్చు]

అబ్దుల్ వహీద్ అనే తాలిబాన్ కమాండరు, ఈ బుద్ధ విగ్రహాలను పేల్చేస్తానని 1997 లో ప్రకటించాడు. ఇది, అతడు లోయను స్వాధీనం చేసుకోకముందే. 1998 లో అతడు లోయను స్వాధీనం చేసుకోగానే, పేలుడు పదార్థాలను అమర్చేందుకు గాను, విగ్రహాల తలలకు రంధ్రాలు చేయించాడు. అయితే, తాలిబాన్ నాయకుడు ముల్లా మహమ్మద్ ఒమర్ ఆదేశాల పనుపున అతడు ఆ ప్రయత్నాలను విరమించాడు. అయితే అప్పటికే విగ్రహం తలపై టైర్లను ఉంచి కాల్చారు.[14] 1999 జూలైలో, విగ్రహాలను పరిరక్షించాలని ముల్లా ఒమర్ డిక్రీ విడుదల చేసాడు. "ఆఫ్ఘనిస్తాన్‌లో బౌద్ధులు లేరు కాబట్టి, ఆ విగ్రహాలను ఆరాధించేవారు లేరు. విగ్రహాలను చూసేందుకు వచ్చే అంతర్జాతీయ సందర్శకుల నుంచి ఆదాయం వస్తుంది. అంచేత బమియాన్ విగ్రహాలను నాశనం చెయ్యరాదు, వాటిని పరిరక్షించాలి" అని ప్రకటించాడు[15] 2000 తొలినాళ్ళలో, విగ్రహాల వద్ద పడే నీటిని తరలించేందుకు గుంటలు తవ్వేందుకు తాలిబాన్లు ఐక్యరాజ్యసమితి సహాయం కోరారు.[16]

అయితే, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఛాందసులు దేశంలోని ఇస్లామేతర వర్గాలను అదుపు చెయ్యాలని వత్తిడి తీఅవడం మొదలుపెట్టారు. దాంతో తాలిబాన్లు షరియాకు అనుగుణంగా అన్ని రకాల బొమ్మలను, సంగీతాన్ని, ఆటలను, టెలివిజన్నూ నిషేధించారు.[17]

2001 మార్చిలో ముల్లా ఒమర్ విడుదల చేసిన డిక్రీకి అనుగుణంగా విగ్రహాలను ధ్వంసం చేసారు. విగ్రహాల ధ్వంసానికి కారణాలను అతడు ఒక ఇంటర్వ్యూలో ఇలా వివరించాడు:

బమియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చెయ్యాలని నేను అనుకోలేదు. వాస్తవానికి, వర్షాల కారణంగా కొద్దిగా దెబ్బతిన్న విగ్రహాలను బాగు చేస్తామని కొందరు విదేశీయులు నా వద్దకు వచ్చారు. అది విని నేను విస్తుపోయాను. ఆకలితో మరణిస్తున్న వేలాది ఆఫ్ఘన్ల గురించి వీరికి పట్టింపు లేదు కానీ ప్రాణంలేని విగ్రహాల పట్ల మాత్రం బాధపడిపోతున్నారు అని నాకు అనిపించింది. అది అత్యంత హేయం. అందుకే నేను ఆ విగ్రహాల ధ్వంసానికి ఆనతిచ్చాను. వాళ్ళు మానవసేవ కోసం నావద్దకు వచ్చి ఉంటే, నేను విగ్రహాలను ధ్వంసం చేయించేవాణ్ణే కాదు.[18]

చిన్న్న బుద్ధ విగ్రహం -1977 లో

తాలిబాన్ల సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి, దేశవ్యాప్తంగా ఉన్న 400 మంది మతపెద్దలు విగ్రహాలు ఇస్లాముకు వ్యతిరేకమని ప్రకటించారని వెల్లడించాడు.

యునెస్కో డైరెక్టర్-జనరల్ కోయిచిరో మట్సూరా ప్రకారం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్‌కు చెందిన 54 సభ్య దేశాల రాయబారులతో ఒక సమావేశం జరిపాం. తాలిబాన్లను గుర్తించిన పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా అన్ని దేశాలూ విగ్రహాల ధ్వంసాన్ని వ్యతిరేకించాయి.[19] తరువాత సౌదీ, యూఏయీలు విగ్రహాల ధ్వంసాన్ని క్రౌర్యంగా వర్ణించాయి.[20] భారత్, తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ, విగ్రహాలను భారత్‌కు తరలించి, "సమస్త మానవాళి కోసం వాటిని భద్రంగా పరిరక్షిస్తామ"ని ప్రకటించింది. తాలిబాన్, ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.[21] విగ్రహాల ధ్వంసం ఇస్లాముకు వ్యతిరేకమని, మున్నెన్నడూ జరగలేదనీ చెప్పి తాలిబాన్లను ఒప్పించేందుకు పాకిస్తాన్ తన దూతను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించింది.[22] తాలిబాన్ మంత్రి అబ్దుల్ సలామ్ జయీఫ్ ప్రకారం ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ యునెస్కో 36 ఉత్తరాలు రాసిందని తెలిపాడు. చైనా, జపాన్, శ్రీలంకలు బుద్ధ విగ్రహాల పరిరక్షణకు తీవ్రంగా ప్రయత్నించారు. జపాఅన్ అయితే ధ్వంసాన్ని ఆపేందుకు అనేక ప్రత్యామ్నాయాలు సూచించింది. విగ్రహాలను జపానుకు తరలించడం, వాటిని ముసుగుతో కప్పి ఉంచడం, డబ్బును ఇవ్వడం వంటివి వీటిలో కొన్ని.[23][24]

తాలిబాన్ల మతవ్యవహారాల మంత్రిత్వ శాఖ, విగ్రహాల ధ్వంసం ఇస్లామిక్ చట్టం ప్రకారం సరైఅనదేనని సమర్ధించుకుంది.[25] అంతిమంగా బుద్ధ విగ్రహాల ధ్వంసాన్ని మంచిని వ్యాప్తి చేసి, చెడును నిర్మూలించే మంత్రిత్వ శాఖా మంత్రి అబ్దుల్ వలీ ఆదేశించాడని అబ్దుల్ సలామ్ జయీఫ్ వెల్లడించాడు.[26]

2001 మార్చి - డైనమైట్లతో విధ్వంసం[మార్చు]

పెద్ద విగ్రహం ధ్వంసమయ్యాక ఆ స్థానం
చిన్న విగ్రహం ధ్వంసమయ్యాక, ఆ స్థానం - 2005 ఫోటో

2001 మార్చి 2 న మొదలుపెట్టి, కొన్ని వారాలపాటు డైనమైట్లతో పేల్చి ధ్వంసం చేసారు.[27] ఇది వివిధ దశల్లో సాగింది. ముందుగా విగ్రహాలపై విమాన విధ్వంసక బాంబులను పేల్చారు. దీనివలన విగ్రహాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అవి రూపు కోల్పోలేదు. "విధ్వంసం అనుకున్నంత తేలికేమీ కాదు. విగ్రహాలు రెండూ కూడా కొండలో తొలిచి తయారుచేసినవి, దృఢంగా ఉన్నాయి. శతఘ్ని గుళ్ళతో నాశనం అయేవి కావవి" అని సమాచార మంత్రి కుద్రతుల్లా జమాల్ వాపోయాడు.[28] తరువాత విగ్రహాల పీఠాల వద్ద ట్యాంకు విధ్వంసక మందుపాతరలను అమర్చారు. దీంతో, శతఘ్ని దాడులతో విగ్రహాలు దెబ్బతిని ముక్కలు ఆ మందుపాతరలపై పడి మరిన్ని పేలుళ్ళు జరిగి ధ్వంసం త్వరితమౌతుంది. చివరిగా, కొండ మీదుగా మనుష్యులను దించి, రంధ్రాల్లో పేలుడు పదార్థాలను అమర్చారు.[29] పేలుడు ఒక బుద్ధ విగ్రహపు ముఖాన్ని పూర్తిగా నాశనం చెయ్యలేకపోయినందున, ఒక రాకెట్‌ను కూడా విగ్రహంపై పేల్చారు. అది ముఖాన్ని పూర్తిగా నాశనం చేసి పెద్ద రంధ్రాన్ని చేసింది.[30]

2001 మార్చి 6 న ముల్లా ఒమర్ ఇలా చెప్పాడని ది టైమ్స్ రాసింది "విగ్రహాల విధ్వంసం పట్ల ముస్లిములు గర్వపడాలి. ఈ విధ్వంసంతో అల్లాకు జయం కలిగింది"[31] మార్చి 13 న జపాను పత్రిక మయినిచి షింబున్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్ఘను విదేశాంగ మంత్రి వకీల్ అహ్మద్ ముత్తావకీల్, ఇది అంతర్జాతీయ సమాజం మాపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా చేసిన పని కానే కాదు, "ఇస్లామిక్ చట్ట ప్రకారం మాత్రమే ఈ పని చేస్తున్నాం, ఇది పూర్తిగా మత వ్యవహారం." అని చెప్పాడు.

విగ్రహాల తలలను పునరుద్ధరిస్తామని కొందరు స్వీడిషు పండితులు ప్రతిపాదించాక వాటిని ధ్వంసం చెయ్యాలని నిర్ణయించామని అప్పటి తాలిబాన్ రాయబారి సయ్యద్ రహ్మతుల్లా హషేమి చెప్పాడు. అతడు ఇలా చెప్పాడు: "పిల్లల ఆహారం కోసం డబ్బు ఇవ్వమని ఆఫ్ఘను కౌన్సిలు వాళ్ళను అడిగినపుడు వాళ్ళు తిరస్కరించారు. ఆ డబ్బు విగ్రహాల కోసమే, పిల్లల ఆహారం కోసం కాదు' అని వాళ్ళు చెప్పారు. అప్పుడు విగ్రహాలు ధ్వంసం చెయ్యాలని కౌన్సిల్ నిర్ణయించింది"; అయితే, ఓ విదేశీ మ్యూజియమ్ ఆ విగ్రహాలను కొనేందుకు ముందుకు వచ్చినపుడు, ఆ డబ్బుతో పిల్లలకు ఆహారం కొనవచ్చు గదా అని ప్రశ్నించినపుడు అతడు సమాధానం చెప్పలేదు.[32]

బుద్ధ విగ్రహాల విధ్వంసం మత స్వేచ్ఛ అణచివేతకు చిహ్నంగా మారింది. ఆఫ్ఘన్లు చాలావరకూ ముస్లిములైనప్పటికీ, వారు తమ చారిత్రిక వారసత్వాన్ని ప్రేమించారు. ఈ విధ్వంసం చూసి వాళ్ళు విషాదంలో మునిగిపోయారు.[33][34]

మరో భారీ విగ్రహాన్ని కనుగొన్నారు[మార్చు]

2008 సెప్టెంబరు 8 న పురాతత్వవేత్తలు ఓ 300 మీటర్ల భారీ విగ్రహం కోసం, విగ్రహాలను ధ్వంసం చేసిన స్థలంలో వెతుకుతూండగా, ఓ 19 మీటర్ల పొడవున్న బుద్ధ విగ్రహంలోని భాగాలను కనుగొన్నారు. అది పడుకున్న స్థితిలో ఉన్న బుద్ధుడి విగ్రహం. ఇది బుద్ధుని మహాపరినిర్వాణాన్ని సూచిస్తుంది.[35]

పునరుద్ధరణ[మార్చు]

పారిస్‌లో 2011 మార్చి 3,4 తేదీల్లో జరిగిన యునెస్కో వర్కింగ్ గ్రూప్ సమావేశంలో విగ్రహాల పునరుద్ద్ధరణ గురించి చర్చించారు. ఆర్గానిక్ సిలికాన్ కాంపౌండుతో చిన్న విగ్రహాన్ని పునరుద్ధరించవచ్చని ఎర్విన్ ఎమ్మెర్లింగ్ ప్రకటించాడు.[36] సమావేశం బమియాన్ స్థల పరిరక్షణకు 39 సూచనలు చేసింది. పెద్ద విగ్రహ స్థలాన్ని అలాగే వదిలెయ్యాలనేది వాటిల్లో ఒకటి. విధ్వంసానికి స్మృతిగా అలా వదిలెయ్యాలని ఆ సూచన. చిన్న విగ్రహాన్ని పునర్నిర్మించడం, ఒక కేద్రీయ మ్యూజియం, కొని చిన్న చిన్న మ్యూజియముల నిర్మాణం మిగతా సూచనల్లో కొన్ని.[37]

కొన్నాళ్ళకు పునరుద్ధరణ పని మొదలైంది. ఒరిజినల్ విగ్రహ శకలాలను ఆధునిక పదార్థాలతో కలిపి ఈ పునరుద్ధరణ సాగింది. పనిలో పాలుపంచుకున్న జర్మను చ్రిత్రకారుడు బెర్ట్ ప్రాక్సెన్‌థేలర్, విగ్రహాల్ల శకలాలు సగం వరకూ తిరిగి ఉపయోగించవచ్చని అంచనా వేసాడు. స్థానిక ప్రజలను శిల్పాలు చెక్కడంలో శిక్షణ ఇచ్చి వారిని పునరుద్ధరణ పనిలో వాడుకోవడం కూడా ఇందులో భాగమే.[38] ఈ ప్రాజెక్టును యునెస్కో, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ICOMOS) సంయుక్తంగా చేపట్టాయి.

పునరుద్ధరణ పని కొంత విమర్శకు కూడా లోనైంది. మానవ హక్కుల కార్యకర్త అబ్దుల్లా హమాదీ, తాలిబాన్ల మూఢత్వానికి గుర్తుగా ఆ ఖాళీలను అలాగే వదిలెయ్యాలని అభిప్రాయపడ్డాడు. ఆ డబ్బుతో ఆ ప్రాంతంలో గృహ, విద్యుత్ సౌకర్యాల కల్పనకు వినియోగించాలని మరికొందరు సూచించారు.[39] ఆ ప్రాంత గవర్నరు హబీబా సరాబీతో సహా ఇంకొందరు, విగ్రహ పునర్నిర్మాణం వలన పర్యాటకం వృద్ధి చెంది, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు లాభిస్తుందని భావించారు.[39]

3D కాంతి ప్రొజెక్షనుతో విగ్రహాల పునరుజ్జీవం[మార్చు]

2015 జూన్ 7 న చైనా దంపతులు షిన్యు ఝాంగ్, హోంగ్ లియాంగ్ విగ్రహాల ఖాళీలను 3D కాంతి ప్రొజెక్షను సాంకేతికతతో నింపారు. $120,000 డాలర్ల విలువైన ఆ ప్రొజెక్టరును వాళ్ళు విరాళమిచ్చారు. విగ్రహాలకు జ్ఞాపికగా ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు వాళ్ళు ఆఫ్ఘను ప్రభుత్వాన్ని, యునెస్కోనూ అనుమతి తీసుకున్నారు. ఆ రోజున హోలోగ్రాఫిక్ విగ్రహాల ఆవిష్కరణను చూసేందుకు 150 మంది వరకూ స్థానికులు వచ్చారు.[40][41]

పాకిస్తాన్‌లో బుద్ధుని అవశేషాల విధ్వంసం[మార్చు]

పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో అనేక బౌద్ధ స్థూపాలు, విగ్రహాలూ ఉన్నాయి. జెహానాబాద్‌లో కూర్చున్న భంగిమలోని బుద్ధ విగ్రహం ఉంది.[42] స్వాత్ లోయలోని బౌద్ధ స్థూపలు, విగ్రహాలను తాలిబాన్ ధ్వంసం చేసింది. జెహానాబాద్ బుద్ధ విగ్రహాన్ని కూడా రెండు సార్లు ప్రయత్నించి డైనమైట్లతో ధ్వంసం చేసారు.[43][44][45] స్వాత్ లోయలోని మంగలూరులో తాలిబాన్లు ధ్వంసం చేసిన బుద్ధ విగ్రహాల కంటే పెద్దవి బమియాన్ విగ్రహాలే.[46] విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు మొదటిసారి విఫల ప్రయత్నం చేసాక, దాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. దాంతో రెండో దాడి జరిగి, దానిలో విగ్రహపు కాళ్ళు, భుజాలు, ముఖమూ నాశనమయ్యాయి.[47] తాలిబాన్లు, ఇతర ఇస్లామిస్టులూ పాకిస్తాన్లోని బౌద్ధ గాంధార నాగరికతకు చెందిన అనేక బౌద్ధ అవశేషాలను ధ్వంసం చేసారు.[48] తాలిబాన్లు కావాలని బౌద్ధ గాంధార అవశేషాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు.[49] స్మగ్లర్లు ఈ అవశేషాలను దోపిడీ చేసారు.[50] లాహోరుకు చెందిన క్రిస్టియన్ ఆర్చ్‌బిషప్ లారెన్స్ జాన్ సల్దానా పాకిస్తాను ప్రభుత్వానికి రాసిన ఉత్తరంలో, స్వాత్ లోయలో బౌద్ధ విగ్రహాలపై, హిందువులు, క్రైస్తవులు, సిక్ఖులపై తాలిబాన్లు చేస్తున్న దౌర్జన్యాలను ఖండించాడు.[51]

మూలాలు[మార్చు]

  1. Research of state and stability of the rock niches of the Buddhas of Bamiyan in "Completed Research Results of Military University of Munich" Archived 2016-03-04 at the Wayback Machine
  2. "Computer Reconstruction and Modeling of the Great Buddha Statue in Bamiyan, Afghanistan" (PDF). Archived from the original (PDF) on 16 డిసెంబరు 2013. Retrieved 9 October 2013.
  3. Researchers Say They Can Restore 1 of Destroyed Bamiyan Buddhas. AOL News, 1 March 2011.
  4. "Bamiyan Buddhas Once Glowed in Red, White and Blue". Sciencedaily.com. 25 February 2011. Retrieved 9 October 2013.
  5. Yamada, Meiji (2002). Buddhism of Bamiyan, Pacific World, 3rd series 4, 109-110
  6. "Bamiyan and Buddhist Afghanistan". Depts.washington.edu. Retrieved 9 October 2013.
  7. 7.0 7.1 "Xuan Zang and the Third Buddha". Laputanlogic.com. 9 March 2007. Archived from the original on 27 జనవరి 2013. Retrieved 9 October 2013.
  8. Gall, Carlotta (6 December 2006). "From Ruins of Afghan Buddhas, a History Grows". The New York Times. Retrieved 6 January 2008.
  9. "Bamiyan and Buddhism Afghanistan". Depts.washington.edu. Retrieved 9 October 2013.
  10. "Remembering Bamiyan". Kashgar.com.au. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 9 October 2013.
  11. Asian Art, chap. "History of attacks on the Buddhas"
  12. "Ancient Buddhas Will Not Be Rebuilt – UNESCO". Ipsnews.net. Archived from the original on 13 సెప్టెంబరు 2011. Retrieved 9 October 2013.
  13. "Photogrammetric Reconstruction of the Great Buddha of Bamiyan" (PDF). Archived from the original (PDF) on 2015-08-24. Retrieved 2016-11-01.
  14. Semple, Michael Why the Buddhas of Bamian were destroyed Archived 2011-07-07 at the Wayback Machine, Afghanistan Analysts Network 2 March 2011
  15. Harding, Luke (3 March 2001). "How the Buddha got his wounds". London: The Guardian. Archived from the original on 28 February 2006. Retrieved 23 March 2008.
  16. Semple, Michael Why the Buddhas of Bamian were destroyed Archived 2011-07-07 at the Wayback Machine, Afghanistan Analysts Network 2 March 2011
  17. Vawda, Moulana Imraan. "The Destruction of Statues Displayed in an Islamic State". Ask-Imam.com. Archived from the original on 14 మార్చి 2005. Retrieved 6 January 2008.
  18. Mohammad Shehzad (3 March 2001). "The Rediff Interview/Mullah Omar". The Rediff. Kabul. Retrieved 27 October 2010.
  19. "World appeals to Taliban to stop destroying statues". CNN. 3 March 2001. Archived from the original on 24 December 2007. Retrieved 6 January 2008.
  20. Bearak, Barry (4 March 2001). "Over World Protests, Taliban Are Destroying Ancient Buddhas". The New York Times. Archived from the original on 2 March 2014. Retrieved 13 July 2008.
  21. "General Assembly "Appalled" By Edict On Destruction of Afghan Shrines; Strongly Urges Taliban To Halt Implementation". Un.org. 2 January 2013. Retrieved 9 October 2013.
  22. Zaeef, Abdul Salam, My Life with the Taliban eds Alex Strick van Linschoten and Felix Kuehn, p.120, C Hurst & Co Publishers Ltd, ISBN 1-84904-026-5
  23. Abdul Salam Zaeef (7 January 2011). My Life with the Taliban. Oxford University Press. pp. 127–. ISBN 978-1-84904-152-2.
  24. "Japan offered to hide Bamiyan statues, but Taliban asked Japan to convert to Islam instead". JAPANTODAY. 27 February 2010.
  25. "Destruction of Giant Buddhas Confirmed". AFP. 12 March 2001. Retrieved 6 January 2008.
  26. Zaeef p.126
  27. ""Taliban destroy ancient Buddhist relics – International pleas ignored by Afghanistan's Islamic fundamentalist leaders"". Archived from the original on 2011-01-06. Retrieved 2016-11-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  28. "Photos document destruction of Afghan Buddhas". Archived from the original on 2007-03-13. Retrieved 2016-11-01.
  29. "Destruction and Rebuilding of the Bamyan Buddhas". Slate Magazine.
  30. Bergen, Peter. "The Osama bin Laden I Know", 2006. p. 271
  31. Markos Moulitsas Zúniga (2010). American Taliban: How War, Sex, Sin, and Power Bind Jihadists and the Radical Right. Polipoint Press. ISBN 1-936227-02-9.
  32. Kassaimah, Sahar (12 January 2001). "Afghani Ambassador Speaks At USC". IslamOnline. Archived from the original on 8 October 2007. Retrieved 6 January 2008.
  33. "Buddhas of Bamiyan". Hazaristantimes.wordpress.com. Retrieved 9 October 2013.
  34. TIM MCGIRK/Bamiyan (20 May 2002). "What Lies Beneath". Time.com. Archived from the original on 24 ఆగస్టు 2013. Retrieved 9 October 2013.
  35. New Bamiyan Buddha find amid destruction, AFP, 8 November 2008.
  36. Researchers Say They Can Restore 1 of Destroyed Bamiyan Buddhas. AOL News, 1 March 2011.
  37. Expert Working Group releases recommendations for Safeguarding Bamiyan 27 April 2011
  38. Graham-Harison, Emma (16 May 2012)Stone carvers defy Taliban to return to the Bamiyan valley The Guardian
  39. 39.0 39.1 Kakissis, Joanna (27 July 2011). "Bit By Bit, Afghanistan Rebuilds Buddhist Statues". National Public Radio. Retrieved 22 April 2013.
  40. Mary-Ann Russon (12 June 2015). "Afghanistan: Buddhas of Bamiyan resurrected as laser projections". International Business Times. Retrieved 16 June 2015.
  41. PAULA MEJIA (15 June 2015). "Afghanistan Buddha Statues Destroyed by Taliban Reimagined as Holograms". News Week. Retrieved 16 June 2015.
  42. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-19. Retrieved 2016-11-01.
  43. Malala Yousafzai (8 October 2013). I Am Malala: The Girl Who Stood Up for Education and Was Shot by the Taliban. Little, Brown. pp. 123–124. ISBN 978-0-316-32241-6.
  44. Wijewardena, W.A. (17 February 2014). "'I am Malala': But then, we all are Malalas, aren't we?". Daily FT.
  45. Wijewardena, W.A (17 February 2014). "'I am Malala': But Then, We All Are Malalas, Aren't We?". Colombo Telegraph.
  46. "Attack on giant Pakistan Buddha". BBC NEWS. 12 September 2007.
  47. "Another attack on the giant Buddha of Swat". AsiaNews.it. 10 November 2007.
  48. "Taliban and traffickers destroying Pakistan's Buddhist heritage". AsiaNews.it. 22 October 2012.
  49. "Taliban trying to destroy Buddhist art from the Gandhara period". AsiaNews.it. 27 November 2009.
  50. Rizvi, Jaffer (6 July 2012). "Pakistan police foil huge artefact smuggling attempt". BBC News.
  51. Felix, Qaiser (21 April 2009). "Archbishop of Lahore: Sharia in the Swat Valley is contrary to Pakistan's founding principles". AsiaNews.it.