Jump to content

బూదరాజు రాధాకృష్ణ

వికీపీడియా నుండి
బూదరాజు రాధాకృష్ణ
జననంబూదరాజు రాధాకృష్ణ
(1932-05-03)1932 మే 3
వేటపాలెం
మరణం2006 జూన్ 4(2006-06-04) (వయసు 74)
ఇతర పేర్లుసి.ధర్మారావు (కలం పేరు)
వృత్తితెలుగు అధ్యాపకుడు, పాత్రికేయుడు
ఉద్యోగంతెలుగు అకాడమీ, ఈనాడు జర్నలిజం స్కూల్
ప్రసిద్ధితెలుగు భాషపై పుస్తకాలు
మతంహిందూ

బూదరాజు రాధాకృష్ణ (1932 మే 3 - 2006 జూన్ 4) భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడు. పాత్రికేయులకు, భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించాడు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించాడు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.

1932 మే 3ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామంలో రాధాకృష్ణ జన్మించాడు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్‌స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా అందుకున్నాడు. చీరాల వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టరుగా పనిచేశాడు. 1988లో తెలుగు అకాడమీలో పదవీ విరమణ చేశాక, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ గా పదేళ్ళకు పైగా పనిచేశాడు. ఈనాడు పత్రికలో పుణ్యభూమి శీర్షికన సి.ధర్మారావు పేరుతో వందలాది వ్యాసాలు రాశాడు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించాడు.

మహాకవి శ్రీశ్రీ అనే పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించాడు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించాడు. కేంద్ర సాహిత్య అకాడమీ ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించారు. [1]

రాధాకృష్ణ ప్రసిద్ధ రచనలు

[మార్చు]
  1. వ్యావహారిక భాషా వికాసం
  2. సాహితీ వ్యాసాలు
  3. భాషా శాస్త్ర వ్యాసాలు
  4. పురాతన నామకోశం
  5. జర్నలిజం - పరిచయం
  6. నేటి తెలుగు - నివేదిక
  7. మాటల మూటలు
  8. మాటల వాడుక: వాడుక మాటలు
  9. తెలుగు జాతీయాలు
  10. ఈనాడు వ్యవహారకోశం
  11. మాండలిక వృత్తి పదకోశం
  12. తెలుగు శాసనాలు
  13. సాగర శాస్త్రం
  14. మహాకవి శ్రీ శ్రీ (ఇంగ్లీషు)
  15. పరవస్తు చిన్నయ సూరి (ఇంగ్లీషు)
  16. అకేషనల్ పేపర్స్
  17. మంచి జర్నలిస్టు కావాలంటే
  18. ఆధునిక వ్యవహార కోశం
  19. మాటలూ - మార్పులూ
  20. విన్నంత-కన్నంత (ఇది ఆయన ఆత్మకథ)
  21. పుణ్యభూమి (ఈనాడులో వచ్చిన వ్యాసాల సంకలనం)
  22. "మహాకవి శ్రీశ్రీ" - శ్రీశ్రీ జీవిత చరిత్ర (ఇంగ్లీషు). ఈ పుస్తకపు తెలుగు అనువాదం కూడా బూదరాజే చేశారు.

పురస్కారాలు

[మార్చు]
  • 1993లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.[2]

మరణం

[మార్చు]

2006, జూన్ 4 న బూదరాజు రాధాకృష్ణ మరణించాడు. మరణానంతరం ఆయన స్మృతి సంచికగా ఆయన శిష్య బృందం "సదా స్మరామి" అన్న పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకానికి గల ప్రత్యేకత ఏమిటంటే - ఆయన మరణించిన అయిదు రోజుల తరువాత అంటే జూన్ 9 న పుస్తకం ఆలోచన రూపుదిద్దుకుంటే, జూన్ 16 కల్లా ఆ పుస్తకం ముద్రణ పూర్తి అయి, విడుదలైంది.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ. న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. Retrieved 9 December 2014.
  2. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
  1. ఈనాడులో మరణవార్త ఈ లింకు ప్రస్తుతం లభ్యం కాదు
  2. ఈమాట నివాళి
  3. మాటలూ-మార్పులూ పుస్తకం వెనుక అట్టపై గల రచయిత జీవిత విశేషాలు.

బాహ్య లింకులు

[మార్చు]
  1. బూదరాజు గారి ఈ-పుస్తకాలు కినిగెపై