యామినీ కృష్ణమూర్తి
మంగరి యామినీ కృష్ణమూర్తి | |
---|---|
జననం | 1940 డిసెంబరు 20 |
మరణం | 2024 ఆగస్టు 3 | (వయసు 83)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | భారతీయ నృత్యకళాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 1957–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
యామినీ కృష్ణమూర్తి (1940 డిసెంబరు 20 - 2024 ఆగస్టు 3) ఒక భారతీయ నర్తకి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టింది. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది. ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. అటుపై వాళ్ల కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో పేరు పొందినది.
బాల్యము
[మార్చు]ఈమె పూర్తి పేరు యామినీ పూర్ణతిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో తన 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరత నాట్యము నేర్చుకోవడము ప్రారంభించింది. భరత నాట్యంలో ఈమె గురువులు కాంచీపురం ఎల్లప్ప పిళ్ళై, చొక్కలింగం పిళ్లై, బాలసరస్వతి, తంజావూర్ కిట్టప్ప, దండాయుధపాణి, మైలాపూర్ గౌరి అమ్మ మొదలైనవారు. ఈమె వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి వారి వద్ద కూచిపూడి నేర్చింది. పంకజ చరణ్‌దాస్, కేలూచరణ్ మహాపాత్రల వద్ద ఒడిస్సీ నేర్చుకొన్నది. ఎం.డి.రామనాథన్ దగ్గర కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకొంది. ఈమె తన తొలిప్రదర్శనను తన 17వ యేట చెన్నైలో 1957వ సంవత్సరంలో ఇచ్చింది. ఈమెకు 20సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఈమె ఒక ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందింది. ఆ క్రమంలో ఈమె తన మకామును ఢిల్లీకి మార్చింది.[1]
నాట్య ప్రస్థానం, గుర్తింపు
[మార్చు]వివిధ రకాల నృత్యాలను హేమాహేమీలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా, ఈమె తన కళతో ప్రేక్షకులను నిలవేసి "ఇది నా ఒరవడి" అని చాటే ఒకానొక విశిష్ట బాణీ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈమె ఏ బాణీ నృత్యం చేసినా వివిధ నృత్య రీతులను కలగాపులగం చేయకుండా ఆయా నృత్య సంప్రదాయాల పరిధిలోనే తన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నర్తనానికి ఖ్యాతి రావడానికి చాలా కాలం ముందే ఈమె అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇత్యాది ఎన్నోదేశాలు పర్యటించి ఆయా చోట్ల నృత్య ప్రదర్శనలిచ్చి, భారతీయ నాట్య ప్రచారం చేయడం జరిగింది.[1] ఢిల్లీలో నృత్యకౌస్తుభ కల్చరల్ సోసైటి - యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నది. ఈమె తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకి. "క్షీరసాగరమధన"మనే నృత్యరూపకాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆకాశవాణి కోసం రచించాడు. కాని దాన్ని కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో నాట్యాచార్యుడు చింతా కృష్ణమూర్తి ప్రిన్సిపల్‌గా ఉన్న రోజుల్లో అక్కడ ప్రదర్శించ తలపెట్టి ఈ రూపకానికి నృత్యం కూర్చవలసిందిగా ప్రఖ్యాత నర్తకుడు, నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంకు అప్పగించాడు. అప్పుడు ఆయన నేతృత్వంలో మొట్టమొదట ప్రదర్శించిన "క్షీరసాగరమథనం"లో యామినీ కృష్ణమూర్తి "విశ్వమోహిని" పాత్రలో, ధన్వంతరి, మహావిష్ణువు పాత్రల్లో వేదాంతం సత్యనారాయణ శర్మ నటించి ఈ ప్రదర్శనను రక్తి కట్టించారు. ఆనాటి నుండి ప్రజలు ఈమెను "విశ్వమోహిని" అని సంబోధించడం మొదలు పెట్టారు.[1] తరువాత ఈమె క్షీరసాగరమథనం నృత్యనాటికను అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ముందు ప్రదర్శించి అతని నుండి భామావేణీ బిరుదును అందుకున్నది. అంతే కాక ఈమె "భామాకలాపం"లో సత్యభామగా అవతరించే వైఖరి, "మండూక శబ్దం"లో కృష్ణదేవరాయల ప్రశస్తిని లీలగా చూపే అభినయం, భంగిమల్లోని ఠీవి, ఔచిత్యం, "సింహాసనస్థితే" శ్లోకంలో దేవిని కళ్ళకు కట్టిస్తూ పట్టే భంగిమలు, "కృష్ణశబ్దం"లో భావతీవ్రత, లాలిత్యం, వైవిధ్యం ఈమె ప్రతిభకు తార్కాణాలు. వేదాలకు కొన్ని పసందైన జతులతో ఈమె కూర్చిన నృత్యం ఈమె పాండిత్యానికి ఉదాహరణ.[1] యామిని సేవలను గుర్తించిన ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ 2016లో పద్మవిభూషణ్[2] పురస్కారాలను ప్రదానం చేసింది. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. ఆపై యామిని కూచిపూడి నృత్యానికి సంబంధించి డీవీడీలు విడుదల చేసింది. తన నృత్యప్రస్థానాన్ని "రేణుకా ఖాండేకర్" సహకారంతో "ఎ ప్యాషన్ ఆఫ్ డాన్స్" పేరుతో పుస్తకంగా రాసింది. నృత్యకళ పట్ల జనసామాన్యంలో అవగాహన కలిగించడానికి అభిరుచి పెంచడానికి సుమారు మూడేండ్ల పాటు పరిశోధన చేసి "నృత్యమూర్తి" సీరియల్‌ను పదమూడు భాగాలుగా దూరదర్శన్ ప్రసారం చేసింది. మన సంస్కృతీ వైభవానికి గోపురమై నర్తనశిల్పాల ఆధారంగా, స్థలపురాణాలు, చరిత్ర జోడించి వ్యాఘ్రపాద, పతంజలి సూక్తులు, కర్ణాటక సంగీతం రుచిచూపిస్తూ ఈ సీరియల్‌లో నృత్య సర్వస్వాన్ని ఇమిడ్చి చూపించింది.[1] 2017లో విశాఖపట్నంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు ఈమెకు స్వర్ణకమలం బహూకరించి "నాట్య విద్యాభారతి" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.[3]. న్యూఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు ఈమె డైరెక్టరుగా సేవలను అందించింది. ఈమె వివాహం చేసుకోకుండా అవివాహితగానే వుండి నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేసింది.[4]
- అవార్డులు [5]
- పద్మశ్రీ (1968)
- సంగీతనాటక అకాడమీ అవార్డు (1977)
- పద్మభూషణ్ (2001)
- పద్మవిభూషణ్ (2016)
ఫిలింస్ డివిజన్ ఆఫ్ ఇండియా 1971లో ఏల్చూరి విజయరాఘవ రావు సంగీత దర్శకత్వంలో "యామినీ కృష్ణమూర్తి" పై 20 నిమిషాల ఒక డాక్యుమెంటరీ సినిమా తీసింది.[6]. ఈమె ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలో వెలువడిన చందనీర్ అనే బెంగాలీ సినిమాలో తన పాత్రలోనే (డా.యామినీ కృష్ణమూర్తి) నటించింది.[7]
మరణం
[మార్చు]యామినీ కృష్ణమూర్తి 84 సంవత్సరాల వయసులో 2024 ఆగస్టు 3న ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూసింది. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 టి.ఉడయవర్లు (1 February 2017). "యామిని - కూచిపూడి నృత్యభామిని, విశ్వమోహిని". సృజన రంజని. 13 (2). Retrieved 22 March 2018.
- ↑ 2016 పద్మపురస్కారాల జాబితా
- ↑ Yamini Krishnamurthy honoured
- ↑ Dance of Life
- ↑ తెలుగు వెలుగు మార్చి 2016 పత్రికా సంచిక
- ↑ సర్కారీ షార్ట్స్ ఇండియన్ మ్యూజిక్ ఫిలింస్
- ↑ IMDbలో యామినీ కృష్ణమూర్తి పేజీ
- ↑ "Yamini Krishnamurthy: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత | yamini-krishnamurthy-dies". web.archive.org. 2024-08-03. Archived from the original on 2024-08-03. Retrieved 2024-08-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
ఇతర లింకులు
[మార్చు]- Commons category link is on Wikidata
- 1940 జననాలు
- నృత్యకళాకారులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ మహిళలు
- పద్మభూషణ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు
- మహిళా భరతనాట్య కళాకారులు
- చిత్తూరు జిల్లా మహిళా నాట్య కళాకారులు
- మహిళా కూచిపూడి నృత్య కళాకారులు
- మహిళా ఒడిస్సీ నాట్య కళాకారులు
- 2024 మరణాలు