వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 29వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు.

తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్ట లో కనుగొని,ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రతిష్టించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితులు యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి.


దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి.


క్రీ.శ.614లో పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయం లోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధ యాదవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

పూర్తి వ్యాసము, పాతవి