సురభి కమలాబాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురభి కమలాబాయి
సురభి కమలాబాయి
జననంసురభి కమలాబాయి
1907
మరణంమార్చి 30, 1971
ప్రసిద్ధితెలుగు సినిమా నటీమణి
తండ్రికృష్ణాజీరావు
తల్లివెంకూబాయి

సురభి కమలాబాయి, (1907 - 1971) తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని.[1] ఈమె 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించింది.

జననం

[మార్చు]

కమలాబాయి 1907లో సురభి నాటక కళాకారుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కృష్ణాజీరావు. తల్లి వెంకూబాయి కమలాబాయితో గర్భవతిగా ఉండి ఒక నాటకములో దమయంతి పాత్ర వేస్తున్నప్పుడు పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలంమీదే కమలాబాయిని ప్రసవించడం విశేషం. ప్రేక్షకులు ఇదికూడా నాటకంలో ఒక భాగమనుకొన్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకులు చంటిబిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు.

రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండే నటన అలవాటయ్యింది. బాల్యంలో కృష్ణుని, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. అందరూ మహిళలే నటించి విజయవంతమైన సావిత్రి నాటకంలో ఆమె సావిత్రి పాత్రను పోషించింది.

భక్త ప్రహ్లాద

[మార్చు]

బాల్యం నుంచి రంగస్థల నటిగా ఎదుగుతూ హెచ్‌.ఎం.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' లో హిరణ్యకశపునిగా నటించిన మునిపల్లె వెంకటసుబ్బయ్య సరసన లీలావతిగా పరిచయమయ్యారు. తరువాత సర్వోత్తమ బదామి దర్శకత్వంలో సాగర్‌ ఫిలింస్‌ రూపొందించిన 'పాదుకా పట్టాభిషేకం'లో సీతగా అద్దంకి శ్రీరామమూర్తి సరసన, సాగర్‌ ఫిలింస్‌ బాదామి సర్వోత్తంతో రూపొందించిన 'శకుంతల'లో శకుంతలగా యడవల్లి సూర్యనారాయణతో నటించారు. బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలింస్ నిర్మించిన 'సావిత్రి'లో సావిత్రిగా టైటిల్‌ రోల్‌ పోషించారు. సరస్వతి సినీ టోన్‌ నిర్మించిన 'పృథ్వీపుత్ర'లో ఓ ముఖ పాత్ర పోషించారు.

సినీ ప్రస్థానం

[మార్చు]

కమలాబాయి ప్రతిభ గురించి విని, ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని బొంబాయికి ఆహ్వానించాడు. అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది. మహాభారతం వంటి 25 చిత్రాలలో నటించింది. హిందీ సినిమాలలో నటిస్తున్నప్పుడే ఈమెకు సిగరెట్లు త్రాగటం అలవాటయ్యింది. షాట్ షాట్కి మధ్యలో ఆదరాబాదరాగా వెళ్ళి సిగరెట్టు త్రాగేది. సిగరెట్టు తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకునేది.

1938లో విడుదలైన భక్తజయదేవ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడం ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. ఈ రెండు భాషలలోనూ కమలాభాయే కథానాయకి. ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే బెంగాలీ ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది కమలాబాయి. అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది.[2]

అలాగే తొలి ద్విభాషా చిత్రమైన తుకారాం (1940) తెలుగు వెర్షన్లో ఈమె నటించింది. అప్పటి వరకు కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించి. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, పాతాళభైరవి, సంక్రాంతి, అగ్నిపరీక్ష ముఖ్యమైనవి.

కమలాబాయి సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు ముప్ఫై వేలను భవిష్యత్తు అవసరాలకై ఒక బ్యాంకులో డిపాజిట్టు చేయగా, ఆ బ్యాంకు దివాళా తీసి, తన డబ్బు కోల్పోయి చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది. వయసు మీదపడి సినిమాలలో అవకాశాలు సన్నగిల్లినా ఇంట్లో ఊరకే కూర్చోలేక తన అక్క కూతురైన సురభి బాలసరస్వతితో పాటు షూటింగులకు వెళుతుండేది. అలా ఆర్థిక ఇబ్బందులో అవసాన దశలో 1971, మార్చి 30న మరణించింది.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. కుటుంబరావు, కొడవటిగంటి (2000). వ్యాస ప్రపంచం 4, సినిమా వ్యాసాలు - 1 (మొదటి ed.). విశాఖపట్నం: విప్లవ రచయితల సంఘం. p. 7. Retrieved 2020-07-11.
  2. "శిరాకదంబం: ఎప్పుడో ' లేచింది మహిళాలోకం '". Archived from the original on 2012-01-18. Retrieved 2013-03-10.