Jump to content

అజితనాథ దిగంబర జైన దేవాలయం, పెనుకొండ

వికీపీడియా నుండి
జైన తీర్థంకరుడు అజితనాధుడు

అజితనాథ దిగంబర జైన దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనంతపురం జిల్లా, పెనుకొండ గ్రామంలో గలదు.[1]

ఆలయ విశేషాలు

[మార్చు]

ఈ దేవాలయం పెనుకొండకు దక్షిణ ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్య కాలంలో 14వ శతాబ్దంలో నిర్మితమైనది. ఇది 19వ శతాబ్దంలో పునర్నిర్మించి ఆధునీకరించబడింది. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో జైన మతం ఆంధ్ర ప్రదేశ్లో ఉనికిలో ఉన్నదనడానికి చారిత్రాత్మక సాక్ష్యంగా నిలుస్తుంది.

ఈ దేవాలయం 19వ శతాబ్దంలో అమరపురానికి చెందిన గౌడనాకుంటే కుటుంబంచే ఆధునీకరించబడింది. తరువాత వారు అనంతపురంలోని అమరపురంలో ఆధినాథ దేవాలయాన్ని కూడాఅ నిర్మించిరి. ఈ దేవాలయం 30 సంవత్సరాలకు పైగా శ్రీ లక్ష్యసేన భట్టారక పీఠం అధీనంలో ఉండి అమరపుర జైన సమాజంచే నిర్వహింపబడుతుంది.

1966-67 లో గుదిబండే యొక్క పూజారి దిగంబర ముని దీక్షను తీసుకొని శ్రీ అజితకీర్తి మహరాజ్ గా నామకరణం గావింపబడి ఈ దేవాలయంలో గడిపారు. ఆయన సమాధి చెందిన తరువాత ఈ దేవాలయానికి సంరక్షణ కరువయింది. బంగారంతో చేయబడ్డవిగా భావిస్తున్న ఈ దేవాలయ విగ్రహాలు కూడా దొంగిలింపబడ్డాయి. జైన తీర్థంకరుని విగ్రహం యొక్క ఎడమ చేతిని విరిచిన తరువాత ఆ విగ్రహాలు బంగారంతో చేయలేదని భావించి వాటిని వదిలి వేసినారు. అప్పటి నుండి పూజాకార్యక్రమాలు జరుగుటలేదు.

ఈ దేవాలయం విశాలంగా ఉండి 12800 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అజితనాథ విగ్రహాలలో ముఖ్యమైన ఆకర్షణలు శ్రుతదేవి (సరస్వతి) కుడివైపున 5 అడుగుల ఎత్తుగానూ, ఆమె రెండు దళాలు గల కమలంపై లలితాసనంలో కూర్చున్నట్లు ఉంది. అజితనాథ విగ్రహానికి ఎడమవైపు నీలమణి పార్శ్వనాథుని విగ్రహం 6 అడుగుల ఎత్తుగానూ ఉంది. ఈ రెండు విగ్రహాలు గర్భగృహ ప్రవేశద్వారానికి ఇరువైపుల ఉన్నాయి. ఆలయంలో గల శాసనాలను బట్టి ఈ ప్రవేశద్వారానికి ఇరువైపుల గల విగ్రహాలను శ్రీ మఘనంది సిద్ధాంత చక్రవర్తి యొక్క ఆరాధకులైన శ్రీ కరనాధికార ప్రతిష్ఠించారు.

ఈ దేవాలయం 2016, 2016లలో శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ధర్మోతన ట్రస్టు, అజితనాథ దిగంబర జైన మత ఛారిటబుల్, ఎడ్యుకేషన్ ట్రస్టుల ద్వారా ఆధునీకరింపబడింది.

ఈదేవాలయములోని నేటి శిల్పము ఈ రకానికే చెందినది. ఇక్కడ జినుడు దిగంబరుడిగా కాయోత్సర్గ భంగిమలో (నిశ్చలముగా నిలబడిన) చెక్కబడినాడు. తక్కిన 23 జైనులు ఇతని చుట్టూ ఉన్నారు. ఆజైనుని పాదాలవద్ద ఇద్దరు చామరులు ధరించి ఉన్నారు. జైనుల మత సాంప్రదాయ చిహ్నమైన త్రిఛత్రము జైనుని తలపైన చెక్కబడింది. అడుగున సింహం మలచబడింది.

తీర్ధంకరుల చిత్రాలు శుద్ధంగా మానవుల్లాగే ఉండటం గమనించతగ్గ విషయము. వరాహమిహిరుడు బృహత్సంహిత ప్రకారం అర్హతులు (జైనులు) దేవతలు దిగంబరంగా ఉండాలి. యుక్తవయస్సు కలిగి సౌందర్యవంతులుగా కనబడాలి. ముఖం ప్రసన్నంగా కనబడాలి. అజానబాహువై ఉండాలి. వక్షస్థలం శ్రీవత్స గుర్తు కలిగి ఉండాలి. మరొకగ్రంధం ప్రతిష్ఠాపదలో తీర్ధంకరుడు ముసలివాడుగా కాని పసిపిల్లవానిగా కాక యువకుడిగా చిత్రించబడాలని పేర్కొన్నది. బౌద్ధ శిల్పంలో ఈ త్రిఛత్రము ఉండదు. తరువాత 24 తీర్ధంకరులకు 24 గుర్తులు, 24 యక్షులుగాని, యక్షిణులు కాని ఉంటారు. సామాన్యంగా ఈ గుర్తులు జైనశిల్పాల పాదాల దగ్గర చెక్కబడి ఉంటాయి.

ఈఅజితనాధ దేవాలయములోని శిల్పం సింహచిహ్నాన్ని కలిగి ఉన్నందువలన ఆశిల్పం సింహచిహ్నితుడైన మహావీరునిదని చెప్పవచ్చును. దీనికి సంబంధించి చిన్న శాసనం శిల్పానికి అడుగు భాగంలో ఉంది. శాసనం రెండు పంక్తులలో ఉన్న కన్నడం లిపిలో ఉంది.

జైనులు 24 తీర్ధంకరులు పద్మాసన, కాయోత్సర్గ భంగిమలలో ముక్తిపొందినట్లు నమ్ముతారు. కాబట్టి జైనశిల్పాలన్నీ ఈరెండు భంగిమలలోనే చెక్కబడినవి. అంతేకాక, 24 తీర్ధంకరులలో ఋషభ, నేమినాధ, మహావీరులు మాత్రమే తామరపుష్పం మీద కూర్చొని ముక్తిపొందినట్లు ఇతరులు కాయోత్సర్గ భంగిమలో ముక్తిపొందినట్లు కూడా జైనుల నమ్మకము. దీనికి వ్యతిరేకముగా ఈదేవాలయములో మహావీరుడు నిలబడి ఉన్నాడు. ఈ అసాధారణ చిత్రణయే ఈదేవాలయముకున్న విశిష్టత లేదా విలక్షణత.

మూలాలు

[మార్చు]
  1. "History - Sri Ajithanatha Digambar Jain Temple Penkonda". Sri Ajithanatha Digambar Jain Temple Penkonda. Archived from the original on 2018-08-21. Retrieved 2018-03-10.