అనుజ చౌహాన్
అనుజ చౌహాన్ (జననం 1970) భారతీయ రచయిత్రి, ప్రకటనకర్త, స్క్రీన్ రైటర్. [1] ప్రముఖ ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీ జె.వాల్టర్ థామ్ప్సన్ ఇండియాలో, దాదాపు 17 ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేసింది. ఆమె ఆ ఏజెన్సీకి వైస్-ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ వంటి పెద్ద హోదాలలో కూడా పనిచేసింది. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం 2010లో రాజీనామా ఇచ్చేసింది. ఆమె తన కెరీర్ లో పెప్సి, కుర్ కురే, మౌంటైన్ డ్యూ, నోకియా వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన బ్రాండ్లకు పనిచేసింది. ఆమె పెప్సీకి చేసిన "నథింగ్ అఫీషియల్ ఎబౌట్ ఇట్" ప్రచారం చాలా విజయవంతమైనది. అంతే కాక పెప్సీ కంపెనీకే ఆమె ఇచ్చిన యే దిల్ మాంగే మోర్, ఒయ్ బబ్లీ ప్రకటన నినాదాలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి.
ఇప్పటి వరకూ ఆమె రాసిన ఐదు నవలలు ది జోయా ఫాక్టర్ (2008), బ్యాటిల్ ఫర్ బిట్టోరా (2010), దోజ్ ప్రీసీ ఠాకూర్ గర్ల్స్ (2013), ది హౌస్ దట్ బిజె బిల్ట్ (2015), "బాజ్" (2017) చాలా ప్రసిద్ధి పొందాయి. ఇందులో ది జోయా ఫాక్టర్, బ్యాటిల్ ఫర్ బిట్టోరా నవలలు సినిమాలుగా రానున్నాయి. దోజ్ ప్రీసీ ఠాకూర్ గర్ల్స్ నవలను జీ చానల్ సీరియల్ గా తీసి ప్రసారం చేస్తోంది.
తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం[మార్చు]
అనుజ ఉత్తర ప్రదేశ్లోని చిన్న పట్టణమైన మీరట్లో రాజ్ పుత్ కుటుంబంలో జన్మించింది[2] ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేయడంతో, చిన్నతనం మొత్తం ఉత్తర భారతంలోని వివిధ సైనిక కంటోన్మెంట్ పట్టణాల్లో గడిచింది. లెఫ్టెనెంట్ కల్నల్ గా కూడా పనిచేసిన అనుజ తండ్రి, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడు. ఆమె నలుగురు అక్కా చెల్లెళ్ళలో చివరిది. ఆమెకు పద్మిని, రోహిణి, నందిని అని ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆమె అక్క నందిని బాజ్ పేయ్ కూడా రచయిత్రి కావడం విశేషం.[3]
ఆమె ఢిల్లీలోని భారత సైనిక పాఠశాల, మీరట్ కంటోన్మెంట్ లోని సోఫియా బాలికల పాఠశాల, ఢిల్లీ పబ్లిక్ పాఠశాలల్లో చదువుకుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన మిరండా హౌస్ అనే కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో బి.కాం చదివింది. ఆ తరువాత రాయల్ మెల్బార్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్ కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా పూర్తి చేసింది.
వ్యక్తిగత జీవితం[మార్చు]
అనుజ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నిర్మాత నీరెట్ అల్వాను 1994లో వివాహం చేసుకుంది. ఆమె భర్త అల్వా ప్రముఖ రియాలిటీ షోలను నిర్మించాడు. సోనీ టీవీలో ప్రసారమైన ఇండియన్ ఐడెల్, స్టార్ ప్లాస్ లో పెర్ఫెక్ట్ బ్రైడ్, ఎంటీవీలో ప్రసారమైన రోడీస్ షోలను అతనే నిర్మించాడు. 1989లో ఢిల్లీలో, ఒక కళాశాలలో జరిగిన నాటకానికి నిర్మించడానికి వచ్చినప్పుడు వారిద్దరూ కలుసుకుని, 1994లో పెళ్ళి చేసుకున్నారు.[4] అనుజ అత్తగారు మార్గరెట్ అల్వా ప్రముఖ రాజకీయ వేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ జనరల్ సెక్రటరీ, రాజస్థాన్కు మాజీ గవర్నర్. అనుజ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు నిహారిక మార్గరెట్, నయనతార వయొలెట్, ఒక కొడుకు దైవిక్ జాన్. 2002లో వీరి కుటుంబం ఢిల్లీలోని గుర్‌గావ్కు మకాం మార్చారు.[5] 2011లో అనుజను ఫెమీనా పత్రిక 50 అత్యంత అందమైన భారత మహిళల జాబితాలో చేర్చింది. అదే ఏడాది ఎం.ఎస్.ఎన్ పత్రిక ఆమెను 50 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పేరొంది. 2017లో సాహిత్యం విభాగంలో ఆమెకు ఫెమినా మహిళా సాధకుల పురస్కారం లభించింది. 2018లో ఎఫ్.ఐ.సి.సి.ఐ లేడీస్ ఆర్గనైజేషన్ అనుజకు సాహిత్యం విభాగంలో పురస్కారం ఇచ్చి, సత్కరించింది.
మూలాలు[మార్చు]
- ↑ http://www.caravanmagazine.in/essay/terms-endearment-indian-romance-writers
- ↑ "'Failure helps you keep your feet on the ground'". Rediff.com. Retrieved 12 August 2013.
- ↑ Venkatraman, Janane (8 July 2013). "Band, Bajaa, Books?". Indian Express.
- ↑ "Love Story". India Today. 9 July 2009.
- ↑ "Splashing out". The Telegraph. 21 December 2008.