Jump to content

అసంగుడు

వికీపీడియా నుండి
క్రీ. శ. 1208 లో జపాన్ లో కోఫుకూజి ఆలయం వద్ద దారువుతో చెక్కబడిన అసంగుని శిల్పం
అసంగుడు, మైత్రేయనాధుని టిబెటన్ల చిత్రం

సా.శ. 4 వ శతాబ్దానికి చెందిన అసంగుడు గొప్ప బౌద్ధ తాత్వికుడు. యోగాచార దర్శన ప్రవర్తకుడు. సుప్రసిద్ధ నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. అసంగుని 'యోగాచార భూమి శాస్త్రం' చాలా గొప్ప గ్రంథం. ఇతని వలనే బౌద్ధంలో విజ్ఞానవాదానికి కీర్తిప్రతిష్ఠలు కలిగాయి. అసంగుడు, ఆచార్య వసుబంధువుకు జేష్ఠ సోదరుడు. అసంగుడు తన తమ్ముడు వసుబంధుని ప్రభావితం చేసి అతన్ని బౌద్ధంలోని వైభాషిక సాంప్రదాయం (స్థవిరవాద సంప్రదాయం) నుంచి యోగాచార సంప్రదాయానికి మార్చాడు. ఈ ఇరువురి సోదరుల కాలంలో యోగాచార దర్శనం లేదా విజ్ఞానవాద సంప్రదాయం అత్యున్నత శిఖరానికి చేరుకొంది. బౌద్ధధర్మంలో ఆరు ఆభరణాలుగా (Six Ornaments) ఖ్యాతి పొందిన ఆరుగురు గొప్ప వ్యాఖ్యాతలలో (Six Great Commentators) అసంగుడు ఒకడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

అసంగుడు పెషావర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు.[2] ఆ కాలంలో పెషావర్ లేదా పురుషపురం ప్రాచీన గాంధార రాజ్యంలో ఒక భాగంగా ఉంది. నేడు పెషావర్ పాకిస్తాన్ లో ఉంది. ఇతను బ్రాహ్మణ తల్లికి, క్షత్రియ తండ్రికి జన్మించాడు.[3] అసంగుని తమ్ముడు వసుబంధువు. అన్నదమ్ములిరువురూ చిన్నతనంలోనే సకల శాస్త్రాలలోను నిష్ణాతులైనారు. వీరిని బౌద్ధధర్మం అమితంగా ఆకర్షించింది. ఇరువురూ హీనయాన బౌద్ధం స్వీకరించారు.

అసంగుడు బహుశా తొలుత మహీశాసక పాఠశాల లేదా మూలసర్వాస్థివాద సంప్రదాయానికి చెందినవాడు. కాని తర్వాత మహాయాన శాఖకు మారాడు.[4] కొందరి పండితులు ప్రకారం అభిధర్మం మీద రాసిన ఇతని రాతలలో మహీశాసక లక్షణాలు కనిపిస్తాయి.[5] సా.శ. 640 లో భారతదేశంలో పర్యటించిన హుయాన్ త్సాంగ్ (యువాన్ చాంగ్ - Xuanzang) వంటి సుప్రసిద్ధ చైనా యాత్రికుడు సైతం అసంగుడు తొలుత మహీశాసక బిక్షువు అని తరువాత మహాయాన బోధనల వైపుకు మరలాడని తన గ్రంథంలో పేర్కొన్నాడు.[6] అసంగుడు తాను మహాయనంలో మారినపిదప తన తమ్ముడు వసుబంధుని ప్రభావితం చేసి అతన్ని వైభాషిక సాంప్రదాయం నుంచి మహాయానం లోని యోగాచార సంప్రదాయానికి మార్చాడు.

ధ్యానం, బోధనలు

[మార్చు]

అసంగుడు ధ్యానంలో మమేకమై అనేక సంవత్సరాలు గడిపేవాదాని తెలుస్తుంది. సంప్రదాయం ప్రకారం అసంగుడు మైత్రేయ బోధిసత్వుని నుండి బోధనలు స్వీకరించడానికి ధ్యాన సమయంలో తరుచుగా తుషిత స్వర్గం సందిర్శించేవాడని చెప్పబడింది. తుషిత స్వర్గంలో ప్రవేశించడానికి ధ్యానం ద్వారా వీలవుతున్నదని దీనికి సంబంధించిన వివరణలు చైనాలో నివసించిన ప్రసిద్ధ భారతీయ బౌద్ధ సన్యాసి పరమార్ధుని (సా.శ. 6 వ శతాబ్దం) యొక్క రచనల ద్వారా తెలుస్తున్నది.[7] హుయాన్ త్సాంగ్ కూడా ఈ సంఘటనలకు సంబంధించి ఇదే రకమైన వివరణలు పేర్కొన్నాడు.[6]

అయోధ్య నగరానికి నైరుతి దిక్కున అయిదు లేదా ఆరు లీ ప్రమాణ దూరంలో మామిడి తోటలో, మైత్రేయ బోధిసత్వుని నుండి సూచనలను గ్రహించిన అసంగుడు సాధారణ ప్రజలను బౌద్ధ ధర్మంలో నడిపించిన ఒక పురాతన బౌద్ధ మఠం వుంది. రాత్రిపూట ఆతను (అసంగుడు) యోగాచార భూమి శాస్త్ర జ్ఞానం, మహాయాన సూత్ర, అలంకార సూత్ర తదితర విషయాలను తెలుసుకోవడానికి తుషిత స్వర్గంలో మైత్రేయ బోధిసత్వుడు వుండే స్థలానికి వెళ్ళేవాడని, పగటిపూట ఆ అధ్బుత సూత్రాలను శ్రోతలకు అందించేవాడు.

అసంగుని తాత్వికత

[మార్చు]

మహాయాన బౌద్ధంలో సా.శ. 2 వ శతాబ్దంలో మాధ్యమిక వాదం ఏర్పడింది. అనంతరం సా.శ. 3 వ శతాబ్దంలో విజ్ఞానవాదం ఏర్పడింది. బౌద్ధంలో విజ్ఞానవాదానికి మరో పేరు యోగాచారం. ఈ యోగాచారం (విజ్ఞానవాదం) ను విస్తరించి బహుళ ప్రచారంలోకి తీసుకొని వచ్చిన వాడు అసంగుడు. అసంగుడు పరమ సత్యం చేరుకోవడానికి యోగం (ధ్యానం) పరమ మార్గమన్నాడు. భోది కలగడానికి ముందు బోధిసత్వుడు ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో పది దశల గుండా పయనించాడని చెప్పబడింది.

అసంగుడు విశ్వం యొక్క మూల ఉపాదాన తత్వం విజ్ఞానమే అని భావించాడు. అయితే ఆ విజ్ఞానం కూడా క్షణక్షణం మార్పు చెందేది. అనిత్యమైనది.[2] అసంగుడు అనిత్యత గురించి ఇలా అన్నాడు - "ఇతరులెవ్వరూ దీన్ని జన్మింపచేయరు. ఇది స్వయంగాను జన్మించదు. ప్రత్యయం (హేతువు) వున్నప్పుడు భావాలు (వస్తువులు) పాతవిగా జన్మించవు. సరికోత్తవిగా జన్మిస్తాయి... ప్రత్యయం (హేతువు) వున్నప్పుడు భావాలు (వస్తువులు) ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి చెంది స్వతహాగానే క్షణభంగురాలుగా వుంటాయి."[8] క్షణభంగురత లేక క్షణికతనే ‘ ప్రతీత్య సముత్పాదం ’ అంటారు. ప్రతీత్యం గడిచిపోయిన (నశించిపోయిన) తరువాతి ఉత్పాదనం లేక ఉత్పత్తి ప్రతీత్య సముత్పాదం. దీన్ని వివరిస్తూ అసంగుడు ఇలా అన్నాడు – "అనిత్యము, దుఃఖము, శూన్యము, ఆత్మా రాహిత్యము (నిజమైన ఆత్మా అస్తిత్వాన్ని నిరాకరించడం) అనే అర్ధాలున్నందువల్ల బుద్ధ భగవానుడు ప్రతీత్య సముత్పాదాన్ని గురించి చెప్తూ ప్రతీత్య సముత్పాదంచాలా గంభీరమైనది అని అన్నాడు.[8] వస్తువులు క్షణ-క్షణం కొత్త-కొత్త రూపాలలో జీవనయాత్ర (ప్రవృత్తి) సాగిస్తాయి."

శంకరుని గురువు అయిన గౌడపాదుడు బౌద్ధదర్శనంలోని ఏ ఆలోచనా పద్ధతిని స్వేకరించాడో, అది అసంగుని దర్శనమే. బౌద్ధంలోని అసంగుని ఈ విజ్ఞానవాదాన్నే గౌడపాదుడు తన మాండూక్యకారికలో స్వీకరించాడు. అయితే అసంగుని ప్రకారం ఈ విజ్ఞానం క్షణ క్షణం మార్పు చెందేది. అనిత్యమైనది కాగా గౌడపాదుడు దాన్ని అలాతచక్రం లాంటిదని చెప్పి దాన్ని గతిశీలమైనదిగా భావించాడు.[2]

ప్రధాన రచనలు

[మార్చు]

యోగాచారభూమి శాస్త్రం, మహాయాన సంగ్రహం వంటి కీలకమైన గ్రంథాలను అసంగుడు రచించాడు.[9] అయితే ఇతర రచనలలో ఏవి అసంగునివి ఏవి మైత్రేయనాధునివి అన్న విషయంలో చైనీయులు, టిబెటన్ సంప్రదాయాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.

  • యోగాచారభూమి శాస్త్రం
  • మహాయాన సంగ్రహం (Summary of the Mahayana)
  • అభిధర్మసముచ్చయం (Compendium of Abhidharma)
  • ప్రకరణ ఆర్యవాదం
  • మహాయాన సూత్రాలంకారం

వీటిలో యోగాచారభూమి శాస్త్రం మహాయానంలోని యోగాచార సంప్రదాయానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం. దీనిలో విజ్ఞాన శాస్త్ర వివేచనా ఉంది. దీని మూల సంస్కృత ప్రతి రాహుల్ సాంకృత్యాయన్ కృషి ఫలితంగా లభ్యమైనది. దీనిలో 17 పరిచ్చేదములు (భూములు) ఉన్నాయి.
మహాయాన సంగ్రహం పేరుకు తగినట్లుగానే మహాయాన సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా వివరిస్తుంది. దీని మూల సంస్కృత గ్రంథం అలభ్యం. అయితే దీనికి రెండు చినా అనువాదాలు లభిస్తున్నాయి. అవి 1.పరమార్ధుని అనువాదం (సా.శ. 560 ప్రాంతానిది) 2.హుయాన్ త్సాంగ్ అనువాదం (సా.శ. 650 ప్రాంతానిది)
అభిధర్మసముచ్చయం అనేది అసంగుని మరొక ప్రసిద్ద గ్రంథం. బౌద్ధ ధర్మానికి సంబంధించి టిబెట్ కు చెందిన 13 ఉత్కృష్ట గ్రంథాలలో (Thirteen great texts) ఇది ఒకటి.[10]
ప్రకరణ ఆర్యవాదం అనేది యోగాచారమున వ్యవహారిక నైతిక రూపం యొక్క వ్యాఖ్య. దీనిని చైనాలో హుయాన్ త్సాంగ్ అనువదించాడు.
అసంగుని మరొక గ్రంథం మహాయాన సూత్రాలంకారం. అయితే దీని కర్త మైత్రేయనాధుడు అయి ఉండవచ్చు. దీనిలో 21 పరిచ్చేదములు (అధికరములు) ఉన్నాయి.

రిఫరెన్సులు

[మార్చు]
  • Keenan, John P. (1989). Asaṅga's Understanding of Mādhyamika: Notes on the Shung-chung-lun, Journal of the International Association of Buddhist Studies 12 (1), 93-108
  • విశ్వా దర్శనం - భారతీయ చింతన నండూరి రామమోహనరావు, 2014 ముద్రణ
  • మహామానవ బుద్ధ (తెలుగు) -రాహుల్ సాంకృత్యాయన్ - ధర్మదీపం ఫౌండేషన్, హైదరాబాద్

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dignaga". Rigpa Shedra. Archived from the original on 27 జూన్ 2017. Retrieved 23 June 2017.
  2. 2.0 2.1 2.2 Rahul Sankrutyaayan. Mahamanava Buddha (Telugu). Hyderabad: Dharnadeepam Foundation. p. 136.
  3. Tsoṅ-kha-pa Blo-bzaṅ-grags-pa, Robert A. F. Thurman (Page 28)[full citation needed]
  4. 'Doctrinal Affiliation of the Buddhist Master Asanga' - Alex Wayman in Untying the Knots in Buddhism, ISBN 81-208-1321-9
  5. Anacker, Stefan (1984). Seven Works Of Vasubandhu: The Buddhist Psychological Doctor. p. 58
  6. 6.0 6.1 Rongxi, Li (1996). The Great Tang Dynasty Record of the Western Regions., Numata Center, Berkeley, p. 153.
  7. Wayman, Alex (1997). Untying the Knots in Buddhism: Selected Essays. p. 213
  8. 8.0 8.1 Rahul Sankrutyaayan. Mahamanava Buddha (Telugu). Hyderabad: Dharnadeepam Foundation. p. 137.
  9. Keenan, John P. (2003). "The summary of the Great Vehicle by Bodhisattva Asaṅga", transl. from the Chinese of Paramārtha (Taishō vol. 31, number 1593). Berkeley, Calif: Numata Center for Buddhist Translation and Research. ISBN 1-886439-21-4
  10. "Dignaga". Rigpa Shedra. Archived from the original on 15 జూన్ 2017. Retrieved 26 June 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=అసంగుడు&oldid=3499841" నుండి వెలికితీశారు