Jump to content

ఇమ్మడి జగదేవరావు

వికీపీడియా నుండి

ఇమ్మడి జగదేవరావు సదాశివరాయల పాలనాకాలం నుండి ఆరవీటి వంశపు తొలిరోజుల వరకు, దక్షిణాపథ రాజకీయ చరిత్రలో ప్రముఖ వ్యక్తి[1] పెనుగొండ నుండి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఆరవీటి వెంకటాపతి అల్లుడు. 1580లో చెన్నపట్నంలో (ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలోని పట్టణం) కోటను కట్టించి, చెన్నపట్నం రాజధానిగా బారామహల్ ప్రాంతాన్ని పాలించాడు. జగదేవరావు తొలుత గోల్కొండలో కుతుబ్‌షాహీల సేవలోనూ, ఆ తర్వాత బేరార్లో ఇమాద్‌షా సేవలోనూ పనిచేశాడు.

సుల్తానుల సేవలో

[మార్చు]

పదహారవ శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలోని కోటలను రక్షించడానికి నాయక్వారీలనే హిందూ సైనికదళముండేది. వారి నాయకుడైన జగదేవరావు ధైర్యవంతుడు, చురుకైనవాడు. తొలుత జంషీద్ కులీ కుతుబ్‌షా వద్ద పనిచేసి కార్యదక్షతతో మంచిపేరు తెచ్చుకున్నాడు. 1550లో జంషీద్ కులీ కుతుబ్ షా మరణించిన తర్వాత కొడుకు సుభాన్‌ను రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ఐనుల్ ముల్క్‌గా అహ్మద్‌నగర్ నుండి సైఫ్ ఖాన్‌ను గోల్కొండకు పంపించారు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు విజయనగరంలో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా రహస్య వర్తమానాన్ని పంపారు.

గోల్కొండలో ఉన్న జగదేవరావు, రాజ్యపాలన క్షీణించడం, సైఫ్ ఖాన్ పాలనపై ఉన్న అసంతృప్తిని గమనించి, ఇదే అదనుగా పిచ్చి యువరాజుగా పేరొందిన దౌలత్ ఖాన్ (కులీ కుతుబ్‌షా యొక్క మరో కుమారుడు) ను నామమాత్రపు సుల్తానును చేసి అధికారం చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఆ అనిశ్ఛిత పరిస్థితుల్లో భువనగిరికి వెళ్ళి అక్కడ బందీగా ఉన్న దౌలత్ ఖాన్‌ను విడిపించాడు. జగదేవరావు పన్నాగాన్ని పసిగట్టిన సైఫ్‌ఖాన్ భువనగిరి కోటపై ముట్టడి చేసి జగదేవరావును తెచ్చి గోల్కొండ కోటలో బంధించాడు.

గోల్కొండ సేనానులు ఇబ్రహీంను రాజ్యం చేపట్టడానికి రావలసిందిగా ఆహ్వానించారు కానీ ఇబ్రహీంకు సై‌ఫ్‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు సైనిక సహాయం కావలసి ఉంది. అటువంటి సహాయం కేవలం నాయక్వారీల నుండి కానీ విజయనగరం రాజునుండి కానీ అందగలదు. విజయనగరం రాజు నుండి సహాయం తీసుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఇక నాయక్వారీల నాయకున్ని సైఫ్‌ఖాన్ బంధించడంతో వాళ్లను సై‌ఫ్ ఖాన్ వ్యతిరేకంగా కూడగట్టడానికి అట్టే సమయం పట్టలేదు. నాయక్వారీలతో ఒప్పందం కుదరగానే ఇబ్రహీం విజయనగరం నుండి బయలుదేరి గోల్కొండ రాజ్యపు సరిహద్దులలో కోయిలకొండలో ముస్తఫా ఖాన్, సలాబత్ జంగ్ తదితర సేనానులను కలుసుకొని, కోయిలకొండలోని నాయక్వారీ సైన్యంతో గోల్కొండ వైపు కదిలాడు. ఇబ్రహీం వస్తున్నాడన్న వార్త అందగానే గోల్కొండ కోటలోని నాయక్వారీలు తిరగబడి, సుభాన్ కులీని బంధించి,[2] జగదేవరావును చెరనుండి విడిపించారు. అలా నాయక్వారీలు, ఇతర సేనానుల మద్దతుతో ఇబ్రహీం, సైఫ్ ఖాన్ ను ఓడించి, గోల్కొండను చేజిక్కించుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన సైఫ్‌ఖాన్ పారిపోయి బీదరులో తలదాచుకున్నాడు. కోటలోకి అడుగుపెట్టి ఇబ్రహీం పట్టాభిషిక్తుడయ్యాడు.

తనకు సహాయం చేసిన జగదేవరావును ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే కొంతకాలానికి జగదేవరావు ఇబ్రహీం కులీని గద్దెదించి యువరాజు దౌలత్ ఖాన్‌ను సుల్తాను చేసే తన పథకాన్ని తిరగదోడాడు. అది ఇబ్రహీం కులీ కుతుబ్‌షాకు తెలియగానే కుట్రలో పాలుపంచుకొన్నవారందరిని హతమార్చాడు. ప్రాణ భయంతో జగదేవరావు ఎలగందలకు పారిపోయి అక్కడ నుండి కుతుబ్‌షాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించాడు. అక్కడ పెద్దగా సహకారం లభించక, బేరారు రాజ్యంలోని ఎలిఛ్‌పూరులో దర్యా ఇమాద్‌షాను ఆశ్రయించాడు.[3] 1556లో ఎలగందల్పై తిరిగి దాడిచేశాడు కానీ కుతుబ్‌షా సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.[2] జగదేవరావు తన కలలు సాకారం చేసుకోవటానికి బేరారు సరిపోదని గ్రహించి ఒక చిన్న బృందంతో విజయనగరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో గోల్కొండ రాజ్యం గుండా వెళుతూ అనేక గ్రామాలను నేలమట్టం చేశాడు. ఆయన్ను ఎదిరించడానికి కుతుబ్‌షా ముస్తఫాఖాన్ ను పంపించాడు. ముస్తఫా ఖాన్ చేతిలో ఖమ్మంమెట్టు వద్ద ఓడిపోయి జగదేవరావు విజయనగరంలో ఆశ్రయం పొందాడు.

విజయనగర సేవలో

[మార్చు]

రామరాయలకు, ఇబ్రహీం కులీ కుతుబ్‌షా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి జగదేవరావుకు విజయనగరంలో ఆశ్రయం ఇవ్వటం కూడా ఒక కారణమని చరిత్రకారులు భావిస్తారు. 1563లో రామరాయలు తన తమ్ముడు ఆరవీడు వెంకటాద్రిని, ఇమ్మడి జగదేవరావును, ఐనుల్ ముల్క్ కనానీని గోల్కొండ రాజ్యపు దక్షిణ, తూర్పు సరిహద్దు ప్రాంతాలపై దండయాత్రకు పంపాడు. గోల్కొండ రాజ్యంలోని కోటలలో సైన్యమంతా నాయక్వారీలు కావడంతో వారు తమ పూర్వ నాయకుడు విజయనగరానికి మద్దతునిస్తున్నాడని తెలియగానే, కుతుబ్‌షాకు ఎదురుతిరిగి తమ కోటలను విజయనగర పరం చేశారు. పరిస్థితి ఎంతగా విషమించిందంటే ఒకసారి ఇబ్రహీం కుతుబ్‌షా వేట వినోదంపై గోల్కొండ కోట బయటికి వెళితే, కోటలోని నాయక్వారీలు ఎదురుతిరిగి కుతుబ్‌షా కోటలోకి తిరిగి అడుగుపెట్టకుండా కోట ద్వారాలు మూసేశారు. కుతుబ్‌షా కోటపై ముట్టడి చేసి రాజధానిని సంపాదించుకోవలసి వచ్చింది. కుతుబ్‌షా, తనకు ఎదురుతిరిగిన హిందూ సైనికులనందరినీ హతమార్చాడు. రామరాయలు దండయాత్రతో చేసేదేమీ లేక ఇబ్రహీం కుతుబ్‌షా రామరాయలతో సంధి కుదుర్చుకుని కొన్ని ప్రాంతాలను విజయనగర పరం చేశాడు.

బారామహల్

[మార్చు]

1589లో పెనుగొండ దుర్గాన్ని గోల్కొండ సుల్తాను ముట్టడినుండి వీరోచితంగా పోరాడి కాపాడినందుకు వెంకటాపతి తన అల్లుడైన జగదేవరావుకు బారామహల్ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చాడు. జగదేవరావు1580లో చెన్నపట్నంలో కోటను కట్టించి, చెన్నపట్నం రాజధానిగా ఆ ప్రాంతాన్ని పాలించాడు. ఈయన ఆధీనంలో ముల్బగళ్, పెరియపట్నం, కంకణహళ్ళి, బుధిహల్ మొదలైన ప్రాంతాలలో విస్తరించి ఉన్నవి. ఇమ్మడి జగదేవరావు కుటుంబము తెలుగు బనజిగ (బలిజ) కులానికి చెందినదని బుకానన్ ప్రస్తావించాడు.[4] జగదేవరావు చెన్నపట్నాన్ని పదిహేను సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తరువాత ఈయన వారసులు 1630లో రాజ్యం చామరాజ వొడయారు చేతుల్లోకి వెళ్ళే వరకు పాలించారు.

మూలాలు

[మార్చు]