Jump to content

ఉప్పెన

వికీపీడియా నుండి
2004-tsunami.jpg

చరిత్ర

[మార్చు]

రక్తాక్షి నామ సంవత్సరంలో, 1 నవంబర్ 1864 న, బందరులో సముద్రం పొంగి, ఊరు ములిగిపోయిందని చెప్పుకుంటారు. “స్థలపూరాణం” ప్రకారం “ఉమ గోల్డ్ కవరింగ్” వారి భవనం మొదటి అంతస్తు అంతా ములిగిపోయి, నీరు రెండవ అంతస్తు వరకు వచ్చేసిందిట. వివరాలకి ఇప్పుడు సాక్షులు దొరకరు కాని వినికిడి కబుర్లే నిజం అయితే 30, 000 మంది చచ్చిపోయారుట. సముద్రం చెలియలికట్టని దాటి, నాలుగైదు కిలోమీటర్లు లోపలికి చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచేసిందన్న మాట! దీనిని "బందరు ఉప్పెన" అని ప్రజలు అభివర్ణిస్తారు.

ఇటీవల, అనగా 19 నవంబర్ 1977 న, కృష్ణా డెల్టాలోని దివిసీమ ములిగిపోయి 10, 000 మందికి పైబడి చచ్చిపోయారుట. అపారమైన ధన నష్టంతో పాటు, 10 లక్షల పశువులు కూడ అసువులు బాసేయని వార్తా పత్రికలలో వచ్చింది. దీనిని "దివిసీమలో ఉప్పెన" అని పత్రికలు రాసేయి.

ఇటీవల, అనగా 26 డిసెంబరు 2004 తేదీన, ఇండోనేసియా దగ్గర హిందూ మహాసముద్రంలో భూకంపం కారణంగా వచ్చిన సునామీ వల్ల 30 మీటర్లు ఎత్తున్న కెరటాలు వచ్చి మీద పడడంతో శ్రీలంక తూర్పు తీరం, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ సునామీ తాకిడి ఆఫ్రికా ఖండపు పశ్చిమ కోస్తా వరకు ప్రయాణించింది. దీని బీభత్సాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు టెలివిషన్ తెరల మీద చూసేరు కనుక ప్రత్యేకించి వివరణ రాయక్కరలేదు.

విశాఖపట్నం మీద 12 అక్టోబరు 2014 న విరుచుకుపడ్డ హుద్‌హుద్ అనే తుపాను తాకిడితో మరో రకం భయానక దృశ్యాన్ని చూసేం.

సుమారు 1956 ప్రాంతాలలో ఒకనాడు రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి కాని, వాన కాని లేవు. కాకినాడ ఇంజనీరింగు కాలేజీ ప్రాంగణంలోకి “టైడల్ వేవ్ వస్తోంది” అన్న గాలి వార్త విని చాల మంది విద్యార్థులు హాస్టల్ వదిలిపెట్టి పై ఊళ్లు వెళ్లిపోయేరు. తెల్లారి లేచి చూసుకుంటే టైడల్ వేవూ రాలేదు, చిట్టి కెరటమూ రాలేదని తేలింది.

ఈ అనుభవాల నేపథ్యంలో ఆటుపోట్లు (tides) , తుపాను (cyclone) , ఉప్పెన, టైడల్ వేవ్, సునామీ, చక్రవాతం (tornado) అన్న మాటలకి నిర్దిష్టమైన అర్థాలు ఉన్నాయా లేక ఒక మాటకి బదులు మరొక మాట వాడెయ్య వచ్చా అన్న అనుమానం రాక మానదు. పామరులు, పాత్రికేయులు, పండిత వర్గాలు ఈ మాటలని అజాగ్రత్తగా వాడి కొంత గందరగోళానికి కారకులయ్యారు.

శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. అంతే కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అంటే, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం.

గాలివాన, తుపాను, చక్రవాతం

[మార్చు]

గాలితో వచ్చే వాన గాలివాన. ఈ గాలి వేగం ఒక హద్దు మీరి (ఉరమరగా గంటకి 75 మైళ్లు) ఉంటే అది తుపాను. హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులని "సైక్లోనులు" (cyclones) అంటారు. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుపానులని “హరికేన్” (hurricane) అనిన్నీ, పసిఫిక్ మహాసముద్రంలో - అంతర్జాతీయ తేదీరేఖకి తూర్పున - పుట్టేవాటిని “టైఫూన్” (typhoon) అనిన్నీ అంటారు. అనగా, మౌలికంగా ఈ మూడు మాటల అర్థాలలోను తేడా లేదు. ఈ తుపానులలో వీచే గాలి జోరు ఒక హద్దు (గంటకి 40 మైళ్లు) దాటితే దానికి నామకరణం చేస్తారు. అంటే, అన్ని గాలివానలూ తుపానులు కావు, అన్ని తుపానులకీ పేర్లు పెట్టరు.

కొన్ని చోట్ల వాన ఉన్నా లేకపోయినా కేవలం సుడిగాలి అతి వేగంతో తిరుగుతూ వస్తుంది. గరాటు ఆకారంలో ఉన్న ఆ సుడిగాలి అడుగు భాగం భూమిని తాకుతూ, పై భాగం మేఘాలని తాకుతూ ఉంటుంది. ఆ సుడిగాలి వేగం ఒక హద్దు (సుమారుగా గంటకి 40 మైళ్లు) దాటినప్పుడు దానిని చక్రవాతం (tornado) అంటారు. చక్రవాతానికీ తుపానుకీ ఒక ఉమ్మడి లక్షణం ఉంది; రెండింటి మధ్య ఒక అల్ప పీడన ద్రోణి (low pressure trough) ఉంటుంది.

సాధారణంగా తుపాను (cyclone) వచ్చినప్పుడు ఆ గాలి తాకిడికి సముద్రంలో పెద్ద కెరటాలు లేస్తాయి. ఈ కెరటాల వల్ల తీర ప్రాంతాలలో ముంపు కలుగుతుంది: ఈ కెరటాలు భూమి లోపుకి ఎక్కువగా చొచ్చుకుని రావు. గాలివాన, తుపానుల వల్ల కలిగే నష్టం ముఖ్యంగా గాలి వల్ల, కొంత వరకు వాన వల్ల; సముద్రపు కెరటాల వల్ల కాదు. హుద్ హుద్ వల్ల విశాఖ ప్రాంతాలకి కలిగిన నష్టం ఇటువంటిదే.

టైడల్ వేవు, ఉప్పెన

[మార్చు]

అమెరికాలో, 1960 దశకంలో, “టైడల్ వేవ్” (tidal wave) అన్న మాటే వాడుకలో ఉండేది. సునామీ అన్న మాట పరిశోధన పత్రాలలో 1976 తరువాత కనబడడం మొదలుపెట్టింది. జపానీ భాషలో సునామీ అంటే “రేవులని ముంచేసే పెద్ద కెరటం” అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపానుకీ అమెరికాకి సత్సంబంధాలు, రాకపోకలు పెరగటంతో జపానీతో పరిచయం పెరిగి ఈ “సునామీ” ఇంగ్లీషులో ప్రవేశించడంతో అప్పటివరకు వాడుకలో ఉన్న “టైడల్ వేవ్” కీ, కొత్తగా ప్రవేశించిన సునామీకి మధ్య తేడా తెలియక కొంత తికమకకి దారి తీసింది.

“అసలు టైడల్ వేవ్ (tidal wave) అన్న మాటే తప్పుడు ప్రయోగం, అది వాడకూడదు, సునామీ అన్నదే సరి అయిన ప్రయోగం” అని అమెరికాలో కొందరు వాదించటం మొదలుపెట్టేరు. “ఉప్పెన అన్నా, సునామీ అన్నా టైడల్ వేవ్ కి పర్యాయ పదాలు" అనుకునేవారు, సామాన్యులు. కాని “దివిసీమలో ఉప్పెన," "బందరు ఉప్పెన" అన్న ప్రయోగాలు వార్తాపత్రికలలో చూసిన తరువాత, నిలకడ మీద ఆలోచించి చూడగా బందరులోనూ దివిసీమలోనూ వచ్చినది ఉప్పెన అనే తీర్మానించుకున్నవారు ఉన్నారు - అనగా సునామీ కాదని తాత్పర్యం. ఉప్పెన అంటే సముద్రం పోటు పెడుతూన్న (high tide) సమయంలోనే తుపాను కారణంగా వచ్చిన ముంపు అని నిర్వచనం చెయ్యవచ్చు. బందరు, దివిసీమ - ఈ రెండూ - సముద్రమట్టంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రావడానికి అవకాశం ఎక్కువ. ఈ రకం ముంపుని ఇంగ్లీషులో "టైడల్ వేవ్" అంటారు. ఎందుకుట? సముద్రపు పోటు (tides) , తుపానువల్ల వచ్చే కెరటాలు (waves) కలిసిపోయాయి కనుక! ఇలా ఆలోచిస్తే టైడల్ వేవ్ అన్న ఇంగ్లీషు మాటకి ఉప్పెన సమానార్థకమైన తెలుగు మాట. అనగా, సముద్రానికి పోటు వచ్చే తరుణంలోనే తుపాను కూడా వస్తే ఆ రెండింటి ప్రభావం వల్ల పల్లపు ప్రాంతాలు ములిగిపోతే దానిని ఉప్పెన అంటారు.

సునామీ

[మార్చు]

మిగిలినది సునామీ. సముద్ర గర్భంలో, ఎక్కడో, భూమి కంపించడం వల్ల సముద్రం అడుగున ఉన్న భూమి కుంగి, కూలిపోయిన సందర్భంలో, పరిస్థితులు అనుకూలిస్తే ఒక మహత్తర కెరటం పుట్టుకొచ్చి అది మహా వేగంతో ఒడ్డుని ఢీకొంటుంది. అదీ సునామీ అంటే! సునామీ ఒక ఊరికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు; సునామీ వల్ల భౌగోళికంగా చాల ప్రాంతాలు దెబ్బ తింటాయి. సముద్రపు ఆటుపోట్లకీ సునామీకి సంబంధం లేదు. వాతావరణంలో వచ్చే అల్పపీడనానికీ సునామీకి సంబంధం లేదు.

కాసింత భౌతిక శాస్త్రం

[మార్చు]

సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటే కెరటాలు నెమ్మదిగా పైకి లేచి, ఒడ్డుని తాకినప్పుడు విరిగి, నురుగలు కక్కుకుంటూ గట్టుని చేరుకుంటాయి. ఈ కెరటాలు తయారవడానికి, పెరగడానికి, విరగడానికి కారణం గాలి. తుపాను సమయంలో గాలి జోరుకి ఈ కెరటాలు కూడ పెద్దగా పైకి లేస్తాయి, జోరుగా ముందుకి వస్తాయి. అప్పుడు అవి తీర ప్రాంతాలని ముంచెయ్యవచ్చు. ఈ కెరటాలకి మరొక లక్షణం ఉంది. కెరటాలతో సముద్రం ఎంత కల్లోల భరితంగా ఉన్నా ఆ కల్లోలం అంతా పైపైనే – అందంలా. ఒకటి రెండు మీటర్లు లోతుకి వెళితే అక్కడ సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది – పైన ఎంత కల్లోలంగా ఉన్నా!

గాలి వల్ల కెరటాలలో కలిగే చలనం ఒక రకం అయితే సూర్య చంద్రుల ఆకర్షణ వల్ల మరొక రకం చలనం కలుగుతుంది. బీచికి షికారుకి వెళ్లినప్పుడు ఈ రకం చలనం కనిపించదు. కాని సముద్రంలో ప్రయాణం చేసే పడవలకి ఇది ముఖ్యం. ఇంగ్లీషులో ఈ రకం చలనాన్ని టైడ్స్ (tides) అంటారు. టైడ్స్ అని బహువచనం వాడినప్పుడు దాని అర్థం సముద్రంలో వచ్చే ఆటుపోటులు. ఇవి కెరటాలు కావు; కెరటాలలా జోరుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకోవు. టైడ్స్ అంటే ఒక రకమైన “పొంగు.” సముద్రం ఇలా పొంగినప్పుడు సముద్ర మట్టం అంతా పైకి లేస్తుంది – పాలు పొంగినట్లు. ఇలా సముద్రం పొంగినప్పుడు దానిని తెలుగులో “పోటు” అంటాం, ఇంగ్లీషులో, ఏకవచనంలో, “టైడ్” (tide) అని కానీ, “ఫ్లో” (flow) అని కాని అంటాం. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లు పైకి లేచిన పొంగు పడి, కిందకి దిగాలి. అలా సముద్ర మట్టం తగ్గడాన్ని “ఆటు” అని కాని “తీత” అని కాని తెలుగులోనూ, “ఎబ్” (ebb) అని ఇంగ్లీషులోనూ అంటారు.

పర్వ దినాలలో సముద్ర స్నానానికి వెళ్లినప్పుడు “సముద్రం పొంగుతోంది” అనే పదబంధం వినబడేది.. అంటే సముద్రపు నీటి మట్టం పైకి లేస్తోంది అని అర్థం. పొంగు అంటే జోరుగా కాకుండా నెమ్మదిగా సముద్రమట్టం లేవడం; రోజుకి రెండు సార్లు లేస్తుంది మన సముద్రం. లేచిన మట్టం మళ్లా తరుగుతుంది. ఈ ఆటుపోట్లు ఏ వేళప్పుడు వస్తాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని వాడుకుని రేవులోకి పడవలు ఎప్పుడు వస్తే సదుపాయంగా ఉంటుందో నావికులు నిర్ణయిస్తారు. కనుక సముద్రంలో వచ్చే ఆటుపోట్లు ప్రమాదం కాదు, మనకి ఎంతో ఉపయోగం.

ఆటుపోట్ల వల్ల సముద్రమట్టం లేచినప్పుడు సముద్రం ముందుకి వస్తుంది, పడినప్పుడు వెనక్కి వెళుతుంది. ఇలా ఎంత ముందుకి వస్తుంది, ఎంత వెనక్కి వెళుతుంది అనేది ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమరిక మీద కొంతా, ఆ రోజు పౌర్ణమా, అమావాశ్యా, గ్రహణమా అనే ఖగోళ పరిస్థితుల మీద కొంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే ఈ ఆటుపోట్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు; వీటి రాకపోకలని మనం లెక్క కట్టి చెప్పవచ్చు. టూకీగా ఇదీ “టైడ్స్” కథ.

ఇప్పుడు ఆటుపోట్లు ఎక్కువగా వచ్చే సమయంలోనే తుపాను కూడా వచ్చిందనుకుందాం. "అసలే కోతి, కల్లు తాగింది, నిప్పు తొక్కింది" అన్న సామెతలా పోటుతో పైకి లేచిన సముద్రం వేగంగా వీచే గాలి తాకిడికి భూమి మీదకి చొచ్చుకు రావచ్చు. అప్పుడు గాలి, వానతో పాటు ముంపు కూడా వస్తుంది. ఈ పరిస్థితిని "ఉప్పెన" అని తెలుగు లోనూ, "టైడల్ వేవ్" అని ఇంగ్లీషులోనూ అనొచ్చు.

సునామీ అన్న మాట అజంతం కనుక తెలుగులో తేలికగా ఇమిడిపోతుంది. అందుకని దీనిని యథాతథంగా తెలుగులోకి దింపేసుకోవచ్చు. ఇంతకీ సునామీ అంటే ఏమిటి? మొదటగా, ఇది చాల జోరుగా ప్రయాణం చేసే కెరటం. ఇది చాల “పొడవైన” కెరటం. ఇక్కడ “జోరు”, “పొడవు”, “కెరటం” అన్న మాటలకి నిర్దిష్టమైన సాంకేతిక అర్థాలు ఉన్నాయి. కొంచెం శాస్త్రం, పరిభాష ఉపయోగించి చెప్పటం అవసరం. మనకి తెలుగులో అల, కెరటం, తరంగం అనే మాటలు వాడుకలో ఉన్నాయి. నిర్ధిష్టత కోసం వీటికి శాస్త్రీయమైన అర్థాలు ఇద్దాం. సముద్రపుటొడ్డున నిలబడి చూస్తూ ఉంటే నీరు ఉవ్వెత్తున పైకి లేచి, విరిగి పడుతూ ఉంటుంది. అలా పైకి లేచినప్పుడు దాని గరిష్ఠ ఊర్ధ్వభాగానికి “శిఖ” (peak) అని పేరు పెడదాం. ఈ శిఖ వెనక నీటి మట్టం లోతుగా దిగిపోతుంది. ఇక్కడ గరిష్ఠ అధో భాగానికి “గర్త” (trough) అని పేరు పెడదాం. ఒక శిఖ, ఒక గర్త ఆక్రమించిన ప్రాంతాన్ని కెరటం అందాం. మరి కొంచెం విశదంగా, “కెరటం” (wavelet) అంటే ఒక విశ్రమ స్థానం నుండి (నీటి) మట్టం పైకి లేచి, గరిష్ఠ పరిమితి చేరుకుని, కిందకి దిగి, కనిష్ఠ పరిమితి చేరుకుని మళ్లా విశ్రమ స్థానాన్ని చేరుకున్న మేర. ఈ కెరటం వెనక మరో కెరటం వస్తుంది. దానికీ శిఖ, గర్త ఉంటాయి. ఇలా నిర్విరామంగా వచ్చే కెరటాల సమాహారాన్ని “తరంగం” (wave or wavetrain) అందాం. ఒక తరంగంలో ఒక శిఖ నుండి దాని వెనక వచ్చే శిఖకి మధ్య దూరాన్ని ఆ తరంగం “పొడుగు” అంటారు. దీన్నే తరంగ దైర్ఘ్యం అని పాఠ్య పుస్తకాలలో అంటున్నారు. మనం “తరంగం పొడుగు” అనేసి ఊరుకుందాం. దీనినే ఇంగ్లీషులో “వేవ్ లెంగ్త్” (wavelength) అంటారు.

ప్రతి తరంగానికి పొడుగు (wavelength) , డోలన వ్యాప్తి లేక ప్రవర్ధమానం లేక ఎత్తు (amplitude) ఉంటాయి. సాధారణంగా సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే ఈ ఎత్తు సుమారు రెండో, మూడో మీటర్లు ఉంటుంది. పొడుగు మహా ఉంటే 50 మీటర్లు ఉండొచ్చు. కాని ఇది సునామీ అయితే ఆ కెరటం ఎత్తు సుమారు 10 మీటర్లు (30 అడుగులు) , పొడుగు సుమారు 15 కిలోమీటర్లు ఉండొచ్చు.

సునామీ సముద్రం మధ్యలో ఎక్కడో పుట్టి గంటకి సుమారు 500 కిలోమీటర్ల వేగంతో (అంటే విమానం వేగంతో) ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎదట గర్త, దాని వెనక శిఖ ఉంటాయి కనుక ఒడ్డున ఉండి చూసేవాళ్లకి ముందస్తుగా గర్త తగులుతుంది. అందువల్ల సముద్రం బాగా వెనక్కి వెళ్లిపోతూ కనిపిస్తుంది. దాని వెనక ఎక్కడో 15 కిలోమీటర్లు దూరంలో కొండంత ఎత్తు ఉన్న శిఖ జోరుగా వస్తోందన్న విషయం ఒడ్డున ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది? తెలియదు. అమాయకంగా సముద్రం ఎందుకు వెనక్కి తగ్గిపోతోందా అని ఆశ్చర్యపడి కళ్లప్పగించి చూస్తూ ఉంటాడు. ఆ వెనక నుండి విమానం జోరుతో వస్తూన్న శిఖ ఒడ్డు చేరుకోడానికి 2 నిమిషాలు కూడ పట్టదు. ఆ వచ్చే కెరటం ఎత్తు 10 మీటర్లు అనుకుంటే నీటి మట్టం క్షణానికి 8 సెంటీమీటలు (2 అంగుళాలు) చొప్పున పెరుగుతుంది అన్నమాట. అంటే ఇరవై అంకెలు లెక్కపెట్టే లోగా నిలువెత్తు మనిషి ములిగి పోతాడు. కనుక ప్రాణం మీద ఆశ ఉంటే సముద్రం తీతని చూడగానే కాలికి బుద్ధి చెప్పో, కారు ఎక్కో, ఎత్తయిన ప్రదేశానికి పారిపోవాలి.

ఈ సునామీలు పుట్టడానికి ముఖ్య కారణం సముద్ర గర్భంలో భూకంపం. భూమి కంపించడానికి కారణం సముద్రపు అడుగున ఉన్న నేల "విరిగి కూలిపోవడం." మనం డాబా మీద ఉన్నప్పుడు మన కాలి కింద నేల విరిగి కూలిపోతే మనం అమాంతం కింద పడిపోయినట్లే సముద్రపు అడుగున నేల కూలి పోయినప్పుడు సముద్రం పేద్ద గోతిలోకి పడిపోతుంది. ఈ తాకిడికి సముద్రంలో పుట్టే చలనమే సునామీ తరంగం. ఇది జోరుగా అన్ని దిశలలోకీ వ్యాపించడం మొదలు పెడుతుంది. సముద్రం లోతుగా ఉన్న చోట ఈ తరంగం చాప కింద నీరులా వెళిపోతుంది; పైన నీటిలో తేలియాడే పడవ ఈ తరంగం ప్రభావానికి కంగనైనా కంగదు. ఈ తరంగం ఒడ్డు చేరుకునే దరిదాపుల్లో నేల రాపిడికి జోరు తగ్గి ఉవ్వెత్తున కొండంత ఎత్తుకి లేస్తుంది. దీనిని చెలియలికట్ట ఆపలేదు. ఇది ఊళ్లల్లోకి విరుచుకుపడి మార్గంలో ఉన్న సమస్థాన్నీ సర్వనాశనం చేసేస్తుంది.

కొన్ని నిర్వచనాలు

[మార్చు]

ముక్తాయింపుగా, నిర్దిష్టత కొరకు ఈ దిగువ కొన్నినిర్వచనాలు:

  • టైడల్ వేవ్ ని తెలుగులో ఉప్పెన అందాం. ఉప్పెన అంటే సముద్రపు పోటుకి తుపాను తోడయినప్పుడు సముద్రపు మట్టం బాగా పెరిగి, సముద్రం చెలియలికట్టని దాటి, పల్లపు భూములని ముంచేయడం. ఇంగ్లీషు మాటలో “వేవ్” అని ఉన్నా ఇది కెరటం కాదు.
  • పూర్వపు రోజుల్లో టైడల్ వేవ్ అన్నా సునామీ అన్నా ఒకటే అనుకుని వీటిని పర్యాయపదాలుగా వాడేవారు; కాని ఇది సరి కాదు. సునామీకి ఆటుపోట్లకి ఏ విధమైన సంబంధం లేదు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉప్పెన&oldid=3183536" నుండి వెలికితీశారు