ఎం.మాణిక్ రావు
మల్కోడ్ మాణిక్ రావు | |||
నియోజకవర్గము | తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | శశిప్రభ |
మల్కోడ్ మాణిక్ రావు (M.Manik Rao) రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 3 సార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్రమంత్రిగా, విధానమండలి సభ్యుడిగా వ్యవహరించాడు. ఇతను బషీరాబాద్ గ్రామ వాస్తవ్యుడు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడిగా ఉన్న మాణిక్ రావు తన ఇద్దరు సోదరులను కూడా శాసనసభ్యులుగా గెలిపించుకున్నాడు. తాండూరు ప్రాంతంలో నాపరాతి పరిశ్రమ ఇతనే ఆద్యుడు.
రాజకీయ రంగం[మార్చు]
ఇతడు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు. పి.వి.నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి ల హయాంలో వివిధ శాఖల మంత్రిగా 14 ఏళ్లు పనిచేశాడు. 1964లో ఇతడు శాసనమండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అరెస్ట్ అయి 3 నెలలు కారాగారవాసం అనుభవించాడు. తరువాత జరిగిన ఉప ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా, తాండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిచి శాసనసభకు ఎన్నికయ్యాడు. పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేశాడు.
మాణిక్ రావు రెండవసారి 1972లో తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. జలగం వెంగళరావు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, సమాచారశాఖల మంత్రిగా బాధ్యతలను నిర్వహించాడు. 1978లో మూడవసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు. మర్రిచెన్నారెడ్డి మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖను, వాణిజ్యశాఖను సమర్థవంతంగా నడిపాడు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి వరుసగా 4వ పర్యాయం గెలుపొందాడు. ఆ తర్వాత తమ్ముడు ఎం.చంద్రశేఖర్‌కు అవకాశం ఇచ్చి ఇతను తాత్కాలికంగా తప్పుకున్నాడు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభ ఎన్నికలలో పాల్గొని పరాజయం పాలయ్యాడు. మరో సోదరుడు ఎం.నారాయణరావు కూడా 2004లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినాడు. తాండూరు నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు ఎమ్మెల్యేలుగా పనిచేసి రికార్డు సృష్టించారు.[1] 2009లో మాణిక్ రావు కుమారుడు ఎం.రమేష్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమి చెందినాడు. విధానమండలి పునర్వ్యవస్థీకరణ అనంతరం రెండేళ్ళు మాణిక్ రావు విధానమండలి సభ్యుడిగా కొనసాగాడు.
కుటుంబం[మార్చు]
ఇతని భార్యపేరు శశిప్రభ. ఇతనికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
మరణం[మార్చు]
ఇతని చివరిదశలో పక్షవాతంతో బాధపడుతూ, పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తన 86వ యేట 2016, సెప్టెంబరు 8 వ తేదీన మరణించాడు[2].
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 2-4-2009
- ↑ మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత - సాక్షి దినపత్రిక - 2016 సెప్టెంబరు 09