Jump to content

ఎడ్తనూర్

అక్షాంశ రేఖాంశాలు: 17°38′40″N 78°09′09″E / 17.644572°N 78.152482°E / 17.644572; 78.152482
వికీపీడియా నుండి
ఎడ్తనూర్
—  రెవిన్యూ గ్రామం  —
ఎడ్తనూర్ is located in తెలంగాణ
ఎడ్తనూర్
ఎడ్తనూర్
అక్షాంశరేఖాంశాలు: 17°38′40″N 78°09′09″E / 17.644572°N 78.152482°E / 17.644572; 78.152482
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం సంగారెడ్డి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,346
 - పురుషుల సంఖ్య 1,194
 - స్త్రీల సంఖ్య 1,152
 - గృహాల సంఖ్య 544
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఎడ్తనూర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంది మండలంలోని గ్రామం.[1] ఇది మండల కేంద్రమైన కంది నుండి 11 కి. మీ. దూరంలో ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సంగారెడ్డి మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన కంది మండలంలోకి చేర్చారు.[2]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 544 ఇళ్లతో, 2346 జనాభాతో 789 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1194, ఆడవారి సంఖ్య 1152. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 424 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 693. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 573879[3].పిన్ కోడ్: 502296.

రాతిపుటల్లో రాసిన చరిత్ర

[మార్చు]

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని ఎడితనూర్ గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ పాతరాతి యుగం నుండి రాచరిక యుగాల దాకా విలసిల్లిన అఖండ నాగరికత గురించిన ఆనవాళ్లు మాలో ఆనందాన్ని నింపాయి. అదే సమయంలో ఇది పలు చారిత్రిక సందేహాల్ని పెంచింది. ఎడితనూరు గోదావరి నది, ఉపనది మానేరుకు పిల్ల నదులైన వాగులో ఒకటైన నక్కవాగు ఒడ్డున ఉంది. ఇప్పుడున్న ఎడితనూర్ గ్రామానికి ఉత్తరాన కొండల గుంపు ఉంది. ఆ కొండల్లో తూర్పు దిక్కున ఎత్తయిన బండలతో కూడిన ప్రాకారం లాంటిది ఉంది. లోపలికి దారి చేసుకుని వెళితే గుట్ట అంచున తూర్పువైపు ఒక పడిగెరాయిలో లోపలివైపు రాతి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రిత శిలాశ్రయం మధ్య శిలాయుగాల (Mesolithic Period) నాటిదిగా తెలుస్తోంది. ఆ చిత్రాలలో వేదిలో ఉన్న ఆదిమానవుల చేతుల్లో వలరి, రాగోల వంటి పనిముట్లు బరిసె, వలలున్నాయి. మూపురాలున్న ఎద్దులు, ఆవులు, ఎడ్లబండి, బండి కిరువైపుల ఆవు, ఎద్దు, ఆవుదూడ, తాబేలు బొమ్మలు కన్పిస్తున్నాయి. మరికొన్ని రాతి పెచ్చులూడి వర్షానికి తడిసి పాడైపోయి తేటగా కన్పించడం లేదు. ఈ బొమ్మల వల్ల అప్పటి మనుషులు జంతువులను మచ్చిక చేసుకుని ఉంటారని, వేట, వ్యవసాయాలు తెలిసిన వారై ఉంటారని, ప్రాచీనులనీ తెలుస్తున్నది. ఈ చిత్రిత శిలాశ్రయానికి కొంచెం వెనక పడమరగా లోపలికి ఒక గుహ ఉంది. అందులో గంటు బొమ్మలు ఫెంచిలో పెట్రోైగ్లెఫ్స్ అని పిలుస్తారు) మూడు దిక్కులా ఉన్నాయి. ఈ తొలువుడు బొమ్మల్లో పుల్లగీతల వంటి ఆకతిలో మనుషులు, చేతి ఆకారాలు, గణిత సంబంధమైన అనేక రూపాలున్నాయి. అయితే, ప్రపంచంలోని అనేక ఆదిమానవుల ఆవాసాల్లో ఇటువంటి గంటు బొమ్మలు అగుపిస్తుంటాయి. మన దేశంలో లడఖ్‌లో, గోవా - ఉస్గరిమల్, తమిళనాడు - పెరుముక్కల్, కేరళ - ఎడక్కల్‌లలోనూ ఈ గంటు బొమ్మలున్నాయి. ఇవన్నీ ఆదిమానవుల ప్రతీకాత్మక ( Symbolic) రేఖారూప భాషలు. గుహలోని Rock carvings మాత్రమేకాక బయట గుట్టలమధ్య లోయలో మరోచోట మరొక గంటు బొమ్మల శిల ఉంది. దానిమీద రేఖాకతులు సంక్లిష్టంగా ఉన్నాయి.

ఈ ఆదిమానవుల ఆవాసాల నుండి కొంచెం పడమరగా ముందు కెళితే 30, 40 అడుగుల ఎత్తున్న ఏటవాలు కొండగుహలలో చౌడమ్మ తల్లి వెలసింది. అమ్మ దేవతల ఆరాధనలకు ప్రతీక ఈ చౌడమ్మ దేవత. ఆమె పేరు మీదే ఈ గుట్ట చౌడమ్మ గుట్ట అయింది. ఈ తల్లి గిరిజనుల దేవతే. తర్వాత ఎవరో దుర్గ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుంది. ఇక్కడ ఏటేటా జాతర చేస్తారు . ఈ గుహాలయం పక్క మరొక సన్నని దోనెలో భైరవుని (బయ్యన్న) విగ్రహం ఉంది. ఈ శిల్పాన్ని బట్టి 5, 6 శతాబ్దాల కిందటిది అనిపిస్తుంది.చౌడమ్మ, బయ్యన్నల గుళ్ళ ముందరి విశాలమైన వేదిక వంటి బండ మీద కప్పులేని మంటపం ఒకటి ఉంది. పడమట శివాలయంగా మార్చబడ్డ ఒక రాతిగూడు ఉంది. లోపల రాష్ట్ర కూటుల నాటి పానవట్టంపై శివలింగం, బయట మెడ తెగిపోయిన ఇసుకరాతి నంది ఆకారం ఉన్నాయి. ఆ పక్కనే చిన్న జలాశయం. పడమటి వైపు గుట్ట దిగబోతుంటే ఏదుల బండగా పిలువబడే నీటి చెలిమె సొరికె ఉంది. దాంట్లోంచి ప్రవహించే నీటితో అక్కడొక రైతు రెండు ఎకరాలు పండించుకుంటున్నాడు. మిగిలిన నీరు కొండదిగి కట్టుకాలువ ద్వారా చెరువులోకి పోతున్నది.ఆ పొలం దాటి గుట్టల నడుమ లోయలోకి ప్రవేశించగానే ఎదుట మూడు రాళ్ళ వరుస గుండు కన్పిస్తుంది. అదే గద్ద గుండు. దీని గురించే కౌశీ పాండ్యన్ తన పుస్తకం మరుగున పడ్డ వారసత్వంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ గుండుకు పడమటి వైపు ఎనుపోతు ఆకారం (గీత రూపంలో) చెక్కి ఉంది. ఈ మహిషం బొమ్మ ఇక్కడ వేలాది ఏళ్ళుగా జీవించి రాజ్యాల నేలిన మహిష గణం -టోటెం, ఒక జాతి చిహ్నం. ఆదిలాబాద్‌లో భైంసా వంటి గ్రామాలైనా, మన వూర్లలోని మైసమ్మలైనా మహిషకుల ప్రతినిధులే కదా!Ancient Society అనే పుస్తకంలో రచయిత మోర్గాన్ జాతుల పేర్లు ఆయా జాతుల చిహ్నాలనుబట్టి వచ్చాయని, ఈ పేర్లన్నీ పక్షులు, జంతువులవిగానే ఉన్నాయని చెబుతూ, ఆదిమ సమాజాలు ఆటవిక దశలో తమకు పక్షినో, జంతువునో తమ గుర్తు (టోటెం) గా పెట్టుకునే వారంటూ, ఆ గుర్తులతోనే ఆయా గణసముదాయాలన్నీ గుర్తించబడ్డాయనీ రాశారు.ఎడితనూరు గుట్టల వరుస చౌడమ్మ గుట్టనుండి సిద్ధ్దేశ్వరుని గుట్టవరకు 6 గుట్టలుగా విస్తరించి ఉంది. చౌడమ్మ గుట్ట, దేవతల కుచ్చె, వెంకన్న గుట్టల మధ్య గద్ద గుండు ఉంది. దానికి తూర్పు, పడమరలుగా విస్తరించిన విశాలమైన లోయను ఏనుగుల లోద్ది అని పిలుస్తారు. ఈ లోయలో రాజుల కాలంలో ఏనుగుల సంత జరిగేదని పెద్దలు చెబుతుంటే విన్నామని మాకు గైడ్‌గా వచ్చిన యం. నరేందర్ తెలిపారు. ఏనుగుల లోద్దిలో కొంత దూరంలో ఒక Ringing rock లేదా Musical stone ఉండేదట. అది తర్వాత కాలంలో క్వారీ పనుల వల్ల పాడైపోయిందని, దానిమీద నిలబడి రాయిని తొక్కుతూ ఊపితే చప్పుళ్ళొచ్చేవని ఆయన వివరించారు. పూర్వం ఒంటరిగా ఉన్న రాయసగాండ్రు రాయిని ఊపి పుట్టించిన నాదంతో వారకాంతలను తమ ఏకాంత సేవలకు రమ్మని పిలుచుకునే వారట. దానిని గ్రామస్థులు లంజగుండు అని పిలుస్తారు. ఇది ఒకప్పటి ఆదిమానవులు, ఆపై గిరిజనులు వార్తలు పంపుకునే తుడుం వంటి రాతివాద్యమే. ఆదిమానవుల ఆవాసాలున్న ఇట్లాంటి Ringing stones గల అనేక ప్రాంతాలు తాజాగా వెలుగుచూస్తున్నాయి.

ఇంకా ఇక్కడ ఆ లోయ పరిసరాల్లో పాటిగడ్డలు (పాత ఊరి దిబ్బలు) రెండు చోట్ల కనిపించాయి. అక్కడ మొద్దు పెంకలు, రాతి పనిముట్లు దొరికాయి. నాలుగైదు రక్కసి గూళ్ళు (సిస్త్‌లు) కొత్తరాతి యుగపు ఆనవాళ్ళుగా మిగిలి కనిపించాయి. ఆ పక్కన చిన్నగుట్ట్ట, గుట్టకొక గుహ. ఆ గుహలో వెంకన్నగా పిలువబడే రెండు చేతుల దేవుడు, కుడి పక్కనే ఒక స్త్రీ మూర్తి ఉబ్బెత్తు బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. దానికున్న ద్వారం చౌడమ్మ తల్లి గుడికున్న మాదిరే చిన్నదిగా ఉంది. పరిశీలనగా చూస్తే ఆ దేవుడి చేతిలో శంఖుచక్రాలు లేవు. ఫలమో, తామర మొగ్గో ఉన్నట్టుగా ఉంది. ఏదైనా, జైనయక్షిణులై ఉండొచ్చు! అక్కడికి దగ్గరలో రెండు నాగయక్షిణుల బొమ్మలు దొరికాయి. ఇక్కడున్న గుహాలయాల్లో మరొకటి సిద్ధేశ్వరుని గుట్టపై ఉంది. ఇప్పుడా గుడిలో శివలింగం లేదు. ముస్లింల సమాధి రాయొకటి, ఊదు పాత్రలు ఉన్నాయి. రాజులు మారినప్పుడల్లా వారి మతాధిపత్యాలు కూడా మారిపోతాయి, దేవుళ్ళు కూడా, అనిపించింది, చూస్తుంటే! ఎడితనూరు గ్రామానికి వాయవ్యాన వున్న చెరువుకు అంచున జంగిడి గుళ్ళుగా పిలువబడే చోట రెండు వీరగల్లున్నాయి. ఇద్దరు గిరిజన వీరుల, (స్త్రీ పురుషుల) వీరగల్లులలో విల్లమ్ములు, గొడ్డలి ఆయుధాలున్నాయి. తలకట్టు, ఆభరణాలు గిరిజన సంప్రదాయాలే. మరొక వీరగల్లు 6, 7 శతాబ్దాల కాలం నాటి ఆహార్యం ధరించిన వీరుని స్మారక శిలగా ఉంది.జంగిడిగుళ్ళు అనగానే మా ఊళ్ళో మా చిన్నప్పుడు బలాదూరుగా తిరిగే పిల్లల్ని ఏమిరా! మిమ్మల్ని జంగిడి కొదిలిన్రా అనేవాళ్ళు. జంగిడికి విడవడం అంటే జన్నె (యజ్ఞం) కొదిలిన అర్థంలో దేవుడికి అంకితం చేసినట్టా లేక జంగిడి అంటే జంగల్ (అడవి) అనే అర్థంలోనా? ఆలోచించాల్సిన మాటే!

ఎడితనూరు వేలయేళ్ళుగా వర్థిల్లిన గిరిజన రాజ్య కేంద్రమని, పాతరాతి యుగం నుండి ఆధునిక రాజ్యాలదాకా చారిత్రిక కాలాన్ని తనలో దాచుకుని రాతిపుటల్లో రాసుకున్నదని ఈ ఊరిని సందర్శించిన వాళ్ళకెవరికైనా అనిపిస్తుంది.ఈ ఊరిలో ఎక్కడా శాసనాలు లభించలేదు. కాని, ఊరికి దక్షిణాన చెరుకు తోటలో ఒక శిథిల దేవాలయం బయటపడింది. ఆలయ ద్వారబంధం మీద వేణు వూదుతున్న కష్ణుడు, ఇరువైపుల గోపికలు, గోవులు అందంగా చెక్కబడి ఉన్నాయి. అంతరాళం పూర్తిగా తవ్వేయబడి ఉంది. ఆ ద్వారానికి ఆరాకుల పువ్వు చెక్కబడి ఉంది. ఇట్లాంటి చిహ్నాలే ఉన్న ఆలయాలు రాష్ట్రకూటుల కాలం నాటివని, వర్గల్‌లో కూడా ఇట్లాంటి గుర్తులున్నాయని మా గురువు విరువంటి గోపాలకష్ణ (కొలనుపాక) చెప్పారు. అట్లే, ఎడితనూరు గురించి 50 ఏళ్ళ కిందటే సంగనభట్ల నరహరి పరిశోధించి వివరాలు రాసిన ఆయన డైరీలవల్ల తెలుస్తున్నదని చారిత్రక పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ అన్నారు. ఆ విషయాలు వెల్లడైతే భారతదేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయంగా ఎడితనూరు లిఖించబడుతుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి సంగారెడ్డిలోను, మాధ్యమిక పాఠశాల ఇస్మాయిల్‌ఖాన్‌పేట్లోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సంగారెడ్డిలోను, ఇంజనీరింగ్ కళాశాల ఫసల్వాడిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఫసల్వాడిలోను, పాలీటెక్నిక్‌ సంగారెడ్డిలోను, మేనేజిమెంటు కళాశాల కందిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం సంగారెడ్డిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఎద్తనూర్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఎద్తనూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 261 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 103 హెక్టార్లు
  • బంజరు భూమి: 130 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 288 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 477 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 43 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఎద్తనూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 43 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఎద్తనూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

విశేషాలు

[మార్చు]

ముంబాయి జాతీయ రహదారికి 54 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఊరిలో 20 అడుగుల ఎత్తయిన శనీశ్వరుని ఏక శిలా విగ్రహాన్ని 2013 ఫిబ్రవరి 16 నాడు ప్రతిష్ఠించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-16.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ది హిందూ, ఫిబ్రవరి-17, 2013, పేజీ.7

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎడ్తనూర్&oldid=4332418" నుండి వెలికితీశారు