Jump to content

ఎడ్మండ్ హిల్లరీ

వికీపీడియా నుండి
సర్ ఎడ్మండ్ హిల్లరీ
జననం(1919-07-20)1919 జూలై 20
మరణం2008 జనవరి 11(2008-01-11) (వయసు 88)
జీవిత భాగస్వామిలూయిస్ మేరీ రోస్ (1953-1975), జూన్ మల్‌గ్రూ (1989-)
పిల్లలుపీటర్ (1954), సారా (1955), , బెలిండా (1959-1975)
తల్లిదండ్రులుపర్సీవల్ అగస్టస్ హిల్లరీ , గెట్రూడ్ హిల్లరీ (క్లార్క్)

సర్ ఎడ్మండ్ పర్సీవల్ హిల్లరీ, కె.జి, ఓ.ఎన్.జి, కె.బి.ఈ (జూలై 20, 1919 – జనవరి 11, 2008) [1][2] న్యూజిలాండ్కు చెందిన పర్వతారోహకుడు, అన్వేషకుడు. 33 యేళ్ళ వయసులో 1953, మే 29న షేర్పా పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కేతో పాటు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకొని ప్రపంచములో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. వీరు జాన్ హంట్ నాయకత్వములోని తొమ్మిదవ బ్రిటీషు అధిరోహణా బృందములో భాగంగా ఎవరెస్టును ఎక్కారు.

బాల్యం

[మార్చు]

ఎడ్మండ్ హిల్లరీ 1919 జూలై 20న న్యూజిలాండ్‌ లోని ఆక్లాండ్‌లో జన్మించాడు. 1920లో వారి కుటుంబం ఆక్లాండ్‌కు దక్షిణంగా ఉన్న త్వాకౌ పట్టణానికి నివాసం మార్చారు. హిల్లరీ విద్యాభ్యాసం త్వాకౌ ప్రాథమిక పాఠశాలలోను, ఆక్లాండ్ గ్రామర్ పాఠశాలలోనూ కొనసాగింది.

పర్వతారోహణ

[మార్చు]

16 సంవత్సరాల వయస్సులోనే హిల్లరీ పర్వతారోహణపై మక్కువ చూపినాడు. 1939లో దక్షణ ఆల్ప్స్ పర్వతాలలో ఉన్న ఆలివర్ పర్వత శిఖరాన్ని అధిరోహించడం అతని జీవితంలో తొలి ప్రధాన సాహస కృత్యం. ఎవరెస్ట్ అధిరోహణే కాకుండా హిమాలయ పర్వతాలలో ఉన్న ముఖ్యమైన మరో 10 శిఖరాలను కూడా హిల్లరీ అధిరోహించాడు.

ఎవరెస్టు అధిరోహణ

[మార్చు]

8848 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగల హిమాలయ పర్వతాలలోని ఎవరెస్టు శిఖరం అధిరోహణ అత్యంత సాహసమైన కృత్యం. టెన్సింగ్ నార్కేతో పాటు ఎడ్మండ్ హిల్లరీ 1953, మార్చి 29 నాడు ఈ శిఖరాన్ని చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తులలో ఒకడిగా అవతరించాడు.

నేపాలీల మానవతా మూర్తి

[మార్చు]

ఎడ్మండ్ హిల్లరీ నేపాలీల ముఖ్యంగా షెర్పాల దృష్టిలో దైవసమానుడు. ఎవరెస్టు అధిరోహణ సమయంలో అక్కడి షెర్పాల దయనీయ జీవితాన్ని చూసి చలించిపోయాడు. అక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి షెర్పాల జీవితంలో వెలుగులు నింపినాడు. హిల్లరీ మరణానంతరం షెర్పాలు వెన్నతో దీపాలు వెలిగించి ప్రత్యేక బౌద్ధ ప్రార్థనలు చేశారు.

గుర్తింపులు

[మార్చు]
  • ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తమ దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు న్యూజీలాండ్ ప్రభుత్వం 5 డాలర్ల కరెన్సీ నోటుపై హిల్లరీ బొమ్మను ముద్రించి అతని ప్రతిభను గౌరవించింది.
  • బ్రిటన్ జట్టులోని సభ్యుడిగా హిల్లరీ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ హిల్లరీని సత్కరించింది.
  • న్యూజిలాండ్ లోని ఎన్నో పాఠశాలలకు, సంస్థలకు హిల్లరీ పేరు పెట్టినారు.
  • భారత్ లోని డార్జిలింగ్లో సెయింట్ పౌల్ పాఠశాలలోని ఒక భవనానికి కూడా హిల్లరీ పేరు పెట్టబడింది.

విషాదకర సంఘటన

[మార్చు]

1975లో ఎడ్మండ్ హిల్లరీ నేపాల్లో సేవాకార్యక్రమాలలో భాగంగా ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నప్పుడు తనను కలుసుకోవడానికి వస్తున్న భార్య, కుమారై ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి మరణం చెందడం హిల్లరీ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన.

మరణం

[మార్చు]

2008, జనవరి 11 న హిల్లరీ ఆక్లాండ్‌లో మరణించాడు. అప్పుడు అతని వయస్సు 88 సంవత్సరాలు. న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న హిల్లరీకి గుండెపోటు రావడంతో ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Radio New Zealand News website". Archived from the original on 2011-11-26. Retrieved 2008-01-11.
  2. New Zealand Herald News website