Jump to content

కణ్వశ్రీ

వికీపీడియా నుండి

కణ్వశ్రీ నాటక రచయిత, సినీ రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం.[1] చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతడు నెల్లూరు జిల్లా, కోట గ్రామంలో జన్మించాడు. కణ్వశ్రీ తొలిరచన సత్యాగ్రహి అనే పద్యకావ్యం. కాశీ విశ్వవిద్యాలయంలో సాహిత్యరత్న పట్టాపొందారు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు నెల్లూరులో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్రాసిన తొలి రచయితగా ప్రసిద్ధుడు. ఇతని నాటకాలన్నీ లలితకళానిలయం పక్షాన రాష్ట్రమంతటా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. 1940 నుండి 55 వరకు నెల్లూరులో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఇతని బాలనాగమ్మ, మాయాబజార్ నాటకాలను నేటికీ సురభి నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు మద్రాసులో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు.

రచనా వ్యాసంగం

[మార్చు]

విశేష ప్రజాదరణ పొందిన పద్యనాటకాలలో బాలనాగమ్మ ఒక్కటే జానపద ఇతివృత్త నాటకం. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం నాటకాలను జానపద పాటలు, కళారూపాల ఆధారంగా వ్రాయబడినా ఆ కథ చారిత్రకం. అందులో ఉన్న పాత్రలన్నీ చారిత్రకాలే. బాలనాగమ్మ నాటకాన్ని తన 15వ యేట (బాలనాగమ్మ రచనా కాలం 1935. కణ్వశ్రీ జనన, మరణాల తేదీలు ఎంత ప్రయత్నించినా లభించలేదు. బాలనాగమ్మ రచనా కాలం ఆధారంగా కణ్వశ్రీ 1920 ప్రాంతంలో జన్మించినట్లుగా భావించవచ్చు.) వ్రాసినట్లు కణ్వశ్రీ స్వయంగా పేర్కొన్నారు. ఆ కాలానికి జంగం కథల్లో బాలనాగమ్మ ఇతివృత్తం సామాన్య ప్రజానీకంలో విశేష ప్రచారంలో ఉంది. అద్భుత, భయానక, కరుణ, హాస్యరస సమ్మిళితమైన ఈ కథను రంగస్థలంపై ప్రదర్శనానుకూలంగా తీర్చిదిద్దడంలో కణ్వశ్రీ తన ప్రతిభను ప్రదర్శించారు. ఈ నాటకం ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. "భవిష్యత్ ప్రపంచంలో మానవుడు మానవాతీతమైన విజ్ఞానాన్నీ, శక్తినీ సంపాదించి ఆ మహత్తర సాధనాలను మానవ కళ్యాణానికీ, విశ్వశాంతికీ వినియోగించకుండా నాలా స్వార్ధానికో, విశ్వనాశనానికో వినియోగిస్తారు. అలాంటి దుర్మార్గులకు నాలాగే అథః పతనమూ, సర్వనాశనము తప్పదనే" గొప్ప సందేశాన్ని మాయలఫకీరు పాత్ర ద్వారా వ్యక్తీకరించాడు. 1970 లో లవ్ ఈజ్ బ్లైండ్ అనే నాటికను వ్రాసి స్వీయ దర్శకత్వంలో మద్రాసులో ప్రదర్శించాడు.

రచనలు

[మార్చు]

పద్యకావ్యాలు

[మార్చు]
  • సత్యాగ్రహి

నాటకాలు

[మార్చు]
  • అజాతశతృ[2] (1948)
  • ఆనాడు (1948)
  • ఇదా ప్రపంచం (1950)
  • బాలనాగమ్మ (1950)
  • మాయాబజారు (1950)

నాటికలు

[మార్చు]
  • లవ్ ఈజ్ బ్లైండ్ (1970)

సినీరచనలు

[మార్చు]

ఈ క్రింది సినిమాలకు వ్రాశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. దాసరి, నల్లన్న (2008). నాటక విజ్ఞాన సర్వస్వం (1 ed.). హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 240.
  2. చంద్రశేఖర, కణ్వశ్రీ (1948). అజాతశత్రు (1 ed.). నెల్లూరు: వి.వి.నాయుడు అండ్ సన్స్.
  3. ఘంటసాల గళామృతం బ్లాగునుండి[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=కణ్వశ్రీ&oldid=4653232" నుండి వెలికితీశారు