కళ్ళం అంజిరెడ్డి

వికీపీడియా నుండి
(కల్లం అంజిరెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కళ్ళం అంజిరెడ్డి
జననం1940
మరణం2013 మార్చి 15
జాతీయతభారతీయుడు
వృత్తిహైదరాబాద్, డా.రెడ్డీస్ ల్యాబ్స్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్
నికర విలువ(USD) $1.39 బిలియన్

కల్లం అంజిరెడ్డి డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందిన అంజిరెడ్డి జన్మస్థలం గుంటూరు జిల్లా తాడేపల్లి. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన డా. రెడ్డీస్ ల్యాబ్స్ అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.

ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం... అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు చేయటం భారతదేశం నుంచి ఏ పారిశ్రామికవేత్తకైనా సాధ్యపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం డాక్టర్‌ కల్లం అంజిరెడ్డి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు. ఒక మధ్యతరగతి పసుపు రైతు కుటుంబంలో జన్మించి, వీధి బళ్లో అక్షరాలు దిద్దిన ఆయన ఔషధ ప్రపంచాన్ని శాశించే స్థాయికి ఎదుగుతారని ఎవరూ వూహించి ఉండరు. పరిశోధననే ప్రాణపదంగా ఎంచుకొని అవిశ్రాంతంగా శ్రమించి ప్రపంచానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ రూపంలో ఒక అరుదైన సంస్థను అందించిన డాక్టర్‌ అంజిరెడ్డి

విద్య,ఉద్యోగం[మార్చు]

1941 జనవరిలో తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి అక్కడి పాఠశాలలోనూ, మంగళగిరి మడలం నూతక్కి లోనూ ప్రాథమిక విద్యపూర్తిచేసారు. ఈయన భార్య సామ్రాజ్యం, వీరికి ఇద్దరు పిల్లలు సతీష్, అనూరాధ. ఆయన పూణె లోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ(NCL) నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. హైదరాబాద్ ఐ.డి.పి.ఎల్ లో ఫోర్ మెన్ ఉద్యోగం చేసారు. రైతు కుటుంబంలో పుట్టి, రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన అంజిరెడ్డి ఐడీపీఎల్‌ ఉద్యోగిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు.

కంపెనీ స్థాపన[మార్చు]

పలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో 1984లో రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను స్థాపించారు. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతుల ద్వారా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాణాధార ఔషధాలకు జనెరిక్‌ రూపాలను రూపొందించి, తృతీయ ప్రపంచ దేశాలకు ఆపద్బాంధవుడు అయ్యారు. బడా కంపెనీలతో పోటీపడి అనేక మందులకు పేటెంట్లు సాధించారు. రు.25 లక్షల పెట్టుబడితో మొదలైన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రు.వేల కోట్ల టర్నోవర్‌తో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజిలో నమోదైన తొలి ఆసియా ఫార్మా కంపెనీ ఇదే.


అభివృద్ది[మార్చు]

అంజిరెడ్డి తండ్రి పసుపు రైతు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పసుపు పొలాల్లో తిరుగుతూ అంజిరెడ్డి అక్కడే పాఠశాల విద్య పూర్తిచేశారు. చిన్నతనంలో పుస్తకాల పురుగుకాదు. ఆటపాటల్లోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు. కాకపోతే అమోఘమైన జ్ఞాపకశక్తి ఆయనకు ఉండేది. ఒక్కసారి చూసిన, విన్న విషయాన్ని మరచిపోయేవారు కాదు. అందుకే తన తోటి విద్యార్థులు పరీక్షల్లో తప్పితే, తాను మాత్రం మంచి మార్కులు కొట్టేసేవారు. ఉన్నత విద్యాభ్యాసం 1958లో గుంటూరు ఏసీ కాలేజీలో సాగింది. అక్కడి నుంచి ఫార్మాసూటికల్స్‌ కెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్య కోసం బాంబే విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తర్వాత పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబరేటరీలో పీహెచ్‌డీ చేశారు. ఔషధ శాస్త్రవేత్తగా ఆయన రూపుదిద్దుకుంది అక్కడే. తర్వాత ఐడీపీఎల్‌లో పూర్తిస్థాయి ఔషధ నిపుణుడిగా తయారయ్యారు. ఆయన విజయప్రస్థానానికి పునాది పడింది ఐడీపీఎల్‌లోనే నని పలు సందర్భాల్లో అంజిరెడ్డి స్పష్టం చేయటం గమనార్హం.

తన సన్నిహితుల వద్ద, కంపెనీలో జరిగే అంతర్గత సమావేశాల్లో అంజిరెడ్డి నోటివెంట అప్రయత్నంగా వచ్చే మాట ఫైజర్‌. ప్రపంచంలో అగ్రగామి ఔషధ కంపెనీ ఫైజర్‌. అటు అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఔషధ ప్రపంచంలో ఫైజర్‌కు తిరుగు లేదు. పుణెలో నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీస్‌లో 1969లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసే సమయంలో ఫైజర్‌ ప్లాంట్‌ను చూశారాయన. అప్పుడే నిర్ణయించుకున్నారు ఫైజర్‌ లాంటి సంస్థను నిర్మించాలని. ఆ తర్వాత ఐడీపీఎల్‌ (ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌) లో ఉద్యోగంలో చేరారు కానీ ఆయనలోని పరిశోధకుడు వూరుకోలేదు. త్వరలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్త అవతారం ఎత్తారు. 1976లో యూనిలాయిడ్స్‌ అనే ఔషధ కంపెనీతో మొదలైన ప్రస్థానం 1984లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏర్పాటుతో వేగాన్ని పుంజుకుంది. అప్పుడే పేటెంట్‌ గడువు ముగిసిన ఐబూప్రూఫెన్‌ (Ibuprofen) అనే నొప్పి నివారణ మందును సొంతంగా తయారు చేసి చాలా తక్కువ ధరలో ఏకంగా అమెరికాకే సరఫరా చేశారు. దాంతో విశ్వవిపణిలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సమరభేరి మోగించినట్లుయింది. తర్వాత ఇక అంజిరెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. నార్‌ఫ్లాక్సాసిన్‌, సిప్రోఫ్లాక్సాసిన్‌, వోమిప్రజోల్‌... ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలతో ఔషధ మార్కెట్‌ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని అప్రతిహతంగా ముందుకు సాగారు. తాను కంపెనీ స్థాపించే నాటికే దేశీయంగా స్ధిరపడి ఉన్న ర్యాన్‌బ్యాక్సీ, సిప్లా వంటి కంపెనీల ఆధిపత్యాన్ని అతితక్కువ సమయంలోనే సవాలు చేసే స్థాయికి ఎదిగారు. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. బిలియన్‌ డాలర్ల కంపెనీ గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వ్యాపారాన్ని స్థాపించటం, విజయవంతమైన వ్యాపరవేత్తగా ఎదగటం అంత సులువైన విషయం ఏమీ కాదు. అది కూడా ఒక తరంలోనే. ఏదో సాదాసీదా కంపెనీ అంటే సరేకానీ బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని (రూ. 5,000 కోట్లకు పైనే) సంపాదించే స్థితికి ఎదగటం కొంతమంది వల్లే అవుతుంది. అటువంటి వారిలో డాక్టర్‌ అంజిరెడ్డి ఒకరు. మన రాష్ట్రం నుంచి బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎదిగిన రెండు సంస్థల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒకటి. మరొకటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌. 2005-06లో బిలియన్‌డాలర్ల టర్నోవర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ నమోదు చేసింది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత నాలుగేళ్లకే ర్యాన్‌బ్యాక్సీని అధిగమించి దేశంలో వార్షిక టర్నోవర్‌ పరంగా అగ్రగామి కంపెనీగా ఎదిగింది. మన రాష్ట్రం నుంచి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజిలో నమోదైన తొలి కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ఒక బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసే స్థాయికి ఎగదటానికి డాక్టర్‌ రెడ్డీస్‌కు దాదాపు పాతికేళ్లు పడితే, ఆతర్వాత రెండు బిలియన్‌ డాలర్ల కంపెనీ కావటానికి మాత్రం ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. 2012 నాటికే రెండు బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయం స్థాయిని అధిగమించి ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతోంది. 5 బిలియన్‌ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేయటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఎంతో దూరంలో లేదనే విశ్లేషణలు ఉన్నాయి.

కొత్త ఔషధాల రూపకల్పన[మార్చు]

మనదేశం నుంచి ప్రపంచానికి ఏదైనా కొత్త ఔషధాన్ని అందించాలనేది అంజిరెడ్డి కల. ఒక అణువు (మాలిక్యూల్‌) ను కనుగొనటం నుంచి దాన్ని అభివృద్ధి పరచి, తయారు చేసి, ఔషధ పరీక్షలు నిర్వహించి ప్రపంచ మార్కెట్లో విడుదల చేసేంత శక్తి ప్రస్తుతం బహుళ జాతి కంపెనీలకు మాత్రమే ఉంది. మొదటి అడుగు నుంచి చివరి దాకా ఒక ఔషధాన్ని రూపొందించి మార్కెట్‌ అందించే శక్తి ఇప్పటిదాకా మనదేశంలోని కంపెనీలకు లేదు. అందుకు ఎన్నో ఏళ్ల శ్రమ, వేల కోట్ల రూపాయిల ఖర్చు ఇమిడి ఉంటుంది. సగం దూరం వెళ్లాక అపజయాలు సైతం తప్పవు. దాన్ని తట్టుకునే శక్తి మన కంపెనీలకు లేదు. అందువల్ల ఇటువంటి పూర్తిస్థాయి పరిశోధనలు ఇప్పటికే మనదేశంలోని ఔషధ కంపెనీలకు అందని ద్రాక్షగానే ఉంది. ఆమాట కొస్తే ఇలాంటి శక్తి ప్రపంచంలోనే ఐదు పది కంపెనీలకు మించి లేదు. డాక్టర్‌ అంజిరెడ్డి దీన్ని సాధించాలని అనుకున్నారు. ఈ దిశగా ఎంతో ముందుకు సాగారు. కానీ అర్ధాంతరంగానే ఈ లోకాన్నే విడిచిపెట్టారు. కానీ ఔషధ రంగంపై ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆయన సాధించిన విజయాలు, అనుసరించిన మార్గం ఇతర ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

పరిశోధనలు-పేటెంట్లు[మార్చు]

ఔషధ మార్కెట్‌లో రక్షణాత్మక ధోరణులు పెరగటాన్ని, పేటెంట్ల పేరుతో అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా మార్కెట్లలో కొత్తవారికి ప్రవేశం కష్టం కావటాన్ని గుర్తించి ముందుగా మేల్కొన్న పారిశ్రామికవేత్త డాక్టర్‌ అంజిరెడ్డి అంటే అతిశయోక్తి కాదు. అమెరికా అతిపెద్ద ఔషధ మార్కెట్‌. స్వదేశంలో ప్రజలకు చౌకగా మందులు అందించిన ఆయన, సంస్థ కోసం.... భవిష్యత్తు పరిశోధనల కోసం డబ్బు సంపాదించాలంటే అమెరికా మార్కెట్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ అంతా పేటెంట్ల రాజ్యం. బహుళ జాతి సంస్థలు ఒక పట్టాన ఇతర కంపెనీలను అక్కడికి రానివ్వవు. అయినా తన పరిశోధన నైపుణ్యంతో అమెరికా మార్కెట్‌ను సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనువుగా ఎంతో కీలకమైన గుండె, డయాబెటిస్‌, క్యాన్సర్‌ తదితర విభాగాలను ఎంచుకున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌కు పరిశోధన విభాగంలో వెన్నుదన్నుగా నిలిచేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. వందల మంది యువ శాస్త్రవేత్తలను నియమించి వారిలో ఒకడిగా కలిసిపోయి రాత్రింబవళ్లూ పరిశోధన కార్యకలాపాల్లో మునిగితేలారు. అమెరికా ఔషధ సంస్థ వద్ద పెద్దఎత్తున పేటెంట్‌ దరఖాస్తులు దాఖలు చేశారు. అక్కడ ఎన్నో న్యాయవివాదాలను ఎదురీదారు. దాని ఫలితాలు త్వరలోనే కనిపించాయి. పేటెంట్‌ గడువు తీరిన ఎన్నో ఔషధాలను అమెరికా మార్కెట్‌కు అందించటం ఒక ఎత్తయితే, ఆరు నెలల పాటు ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులతో అమెరికాలో తన ఔషధాలను విక్రయించే అనుమతి పొందిన అతికొద్ది భారతీయ కంపెనీల్లో ఒకటిగా నిలిచారు. ఆ తర్వాత ఐరోపా, రష్యా, మధ్యప్రాచ్యం... ఇలా డాక్టర్‌ రెడ్డీస్‌ విస్తరించని దేశం అంటూ లేదు. పరిశోధన లేనిదే ప్రగతి లేదని గట్టిగా విశ్వసించటంతో పాటు, దాని తూచ తప్పకుండా ఆచరణలో పెట్టిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. పరిశోధన కోసం వందల కోట్ల రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎదురుదెబ్బలు కూడా తప్పవు. ఇటువంటి అనుభవాలు ఆయనకూ ఎదురయ్యాయి. కానీ వాటికి ఎదురునిలిచారు. సమయానుకూలంగా వ్యాపార వ్యూహాలను మార్చుకున్నారు కానీ, పరిశోధన పథం నుంచి మాత్రం వైదొలగలేదు.

రెడ్డేస్ ల్యాబ్స్ మైలు రాళ్ళు[మార్చు]

  • భారత్లో ముఖ్యమైన 300 బ్రాండ్ లలో రెడ్డీస్ వారివి 8 ఉన్నాయి.
  • దేశంలో డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ చేపట్టిన తొలి కంపెనీ
  • జపాన్ బయట నమోదైన తొలి ఆసియా కంపెనీ, 2001లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ప్రవేశించినది.

అరుదైన వ్యక్తిత్వం[మార్చు]

అంజిరెడ్డికి ఆలకించే గుణం ఎక్కువ. ఎక్కువగా మాట్లాడడమన్నా, ఎక్కువగా మాట్లాడే వారన్నా ఆయనకు ఇష్టం ఉండదు. చెప్పదలచిన మాటలు సూటిగా, స్పష్టంగా, పదునుగా చెప్పటం ఆయనకు అలవాటు. ఉదయం వేళ నడకలో తనతో కలిసి వచ్చే వ్యక్తి తనను అవీ ఇవీ అడుగుతున్నారని ఇష్టపడక ఆయనను మార్చేసి అసలు ప్రశ్నలే అడగని వ్యక్తిని నడకలో సహచరుడిగా ఎంచుకున్న తత్వం ఆయనది. ఔషధ మార్కెట్లో ఏదైనా అరుదైన ఘనత సాధించినప్పుడు విజయ గర్వం ఆయన మొహంలో దరహాసమాడుతుంది కానీ బయటకు అంతగా కనిపించినివ్వరు. అదేవిధంగా ఏదైనా అపజయం ఎదురుపడినప్పుడు కుంగిపోవడం అనేదే ఉండదు. కొన్ని ఔషధాల విషయంలో వైఫల్యం ఎదురైనా, కొత్త ఔషధాలను ఆవిష్కరించి ప్రపంచానికి అందించాలనే ప్రయత్నంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చినా కంగారుపడలేదు. మొండిగా ముందుకు వెళ్లటమే ఆయన నైజం. ఏదైనా విషయాన్ని వెంటనే గ్రహిస్తారు. ఎన్నో ఏళ్లుగా మీ కంపెనీలో వాటాదారుడిగా ఉన్నాం, కానీ ఈ కంపెనీ ఏయే మందులు తయారు చేస్తుందనేది మాకు తెలియటం లేదు, వార్షిక నివేదికలో ఆ విషయం లేదు అని ఒకసారి కంపెనీ వార్షిక సమావేశంలో ఒక వాటాదారుడు ప్రశ్నించారు. దాన్ని సరిదిద్దుతామని డాక్టర్‌ రెడ్డి బదులివ్వడమే కాక ఆ మరుసటి ఏడాది వార్షిక నివేదికలో డాక్టర్‌ రెడ్డీస్‌ తయారు చేసే ఔషధాల జాబితా కనిపించింది.

సేవా కార్యక్రమాలు[మార్చు]

అంజిరెడ్డికి ప్రజలకు ఔషధాలు విక్రయించి బాగా లాభాలు ఆర్జిస్తున్నారు, బదులుగా వారికేమైనా చేయాలనుకోరా? అని ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన ఆలోచనలో పడిపోయారు. ఆ తర్వాత స్వల్పకాలంలో పలు సామాజిక కార్యకలాపాలు రూపుదిద్దుకున్నాయి. ప్రజలకు ఉచితంగా ఏదైనా ఇవ్వడం కంటే వారిలో నైపుణ్యాన్ని పెంచితే సొంతంగా పైకి వస్తారని విశ్వసించి, దానికి అనుగుణంగా

  • గ్రామీణ నిరుపేద యువకుల ఉపాధి శిక్షణ కోసం ల్యాబ్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
  • 1998లో సేవాకార్యక్రమాలు ప్రారంభించిన రెడ్డీస్ సంస్థ మొదటగా నాంది పౌండేషన్ ప్రారంభించి కొన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నది.
  • రెడ్డీస్ అనుబంధ సంస్థ హ్యూమన్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.

చివరి రోజులు[మార్చు]

అంజి రెడ్డి మార్చి 15, 2013 న అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు, తెలుగు రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి కంపెనీ సృష్టి, ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం దక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు 16-03-2013 హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరిగాయి.

ప్రస్తుతం కుమారుడు సతీష్‌రెడ్డి కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, అల్లుడు జి.వి.ప్రసాద్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

అవార్డులు[మార్చు]

అంజిరెడ్డి కొంతకాలంగా కంపెనీ కార్యకలాపాలకు దూరంగా ఉంన్నా సేవారంగంలో తన కృషిని చివరి వరకు కొనసాగించారు. రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జాతికి ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

  • 1984, 1992 సర్, పి.సి. రాయ్ అవార్డు
  • 998 ఫెడరల్ ఆఫ్ ఏషియన్ ఫార్మాసూటికల్ అసోషియేషన్ అవర్డు
  • 2000 కెంటెక్ పౌండేషన్ అచీవర్ ఆఫ్ ద ఇయర్
  • 2001 బిజినెస్ ఇండియా మ్యాగజైన్ నుండి బిజినెస్ మ్యాల్ ఆఫ్ ద ఇయర్
  • 2011 పద్మశ్రీ
  • 2005 హాల్ ఆఫ్ ఫేం
  • 2011 పద్మభూషన్

మూలాలు[మార్చు]