కుసుమ జగదీశ్
కుసుమ జగదీశ్ | |||
| |||
ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్
| |||
పదవీ కాలం 2019 జూన్ 8 – 2023 జూన్ 11 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | మల్లంపల్లి, ములుగు మండలం, ములుగు జిల్లా, తెలంగాణ | 1976 ఆగస్టు 28||
మరణం | 2023 జూన్ 11 హన్మకొండ | (వయసు 46)||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | ఆదినారాయణ - సులోచన | ||
జీవిత భాగస్వామి | రమాదేవి | ||
సంతానం | ఒక కుమారుడు (వెంకట సత్యదేవ్) ఒక కుమార్తె (హరిచందన) | ||
నివాసం | హన్మకొండ |
కుసుమ జగదీశ్వర్ (1976, ఆగస్టు 28 - 2023, జూన్ 11) తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. 2019 జూన్ 8[1] నుండి 2023 జూన్ 11 వరకు ములుగు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.[2]
జననం, విద్య
[మార్చు]జగదీశ్ 1976, ఆగస్టు 28న ఆదినారాయణ - సులోచన దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, ములుగు మండలం లోని మల్లంపల్లి గ్రామంలో జన్మించాడు.[3] 1991లో మల్లంపల్లి పాఠశాలలో 10వ తరగతిని, ములుగు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తిచేశాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]జగదీశ్ కు రమాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (వెంకట సత్యదేవ్), ఒక కుమార్తె (హరిచందన) ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం
[మార్చు]తొలినాళ్ళలో పీపుల్స్‌వార్ సానుభూతిపరుడిగా ఉన్న జగదీశ్, తెలంగాణ జన సభలో కీలక నేతగా పనిచేశాడు. 1991 నుండి 1994 వరకు గ్రామంలో విశ్వభారతి యూత్ ఆసోసియేషన్ ఏర్పాటుచేసి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, హైదరాబాదులోనే ఉంటూ తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో యూత్ ఆర్గనైజేషన్ లో పనిచేయడంతోపాటు అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టాడు.[5]
రాజకీయ జీవితం
[మార్చు]తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, నాయకులు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించాడు. 2019 ఆగస్టులో ములుగు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏటూరునాగారం నుంచి అధిక మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొంది, జెడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. ములుగు జిల్లా తొలి జడ్పీచైర్మన్‌గా నాలుగున్నర సంవత్సరాలపాటు పనిచేశాడు. భారత్ రాష్ట్ర సమితి ములుగు జిల్లా అధ్యక్షుడిగా, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టాడు.[6]
మరణం
[మార్చు]2023, ఏప్రిల్ 1న జగదీశ్ కు తొలిసారి గుండెపోటు వచ్చింది. అతని భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడగా, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు.
2023, జూన్ 11న ఉదయం 10:30 నిమిషాలకు హనుమకొండ స్నేహనగర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురవ్వడంతో మొదట హనుమకొండలోని లైఫ్‌లైన్ ఆసుపత్రికి, అక్కడినుండి మరో ఆసుపత్రి అజరకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే జగదీశ్ మరణించాడు.[6]
జగదీశ్ మరణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించాడు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మల్లంపల్లిలో జగదీశ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జూన్ 12న మల్లంపల్లిలో జరిగిన జగదీశ్ అంత్యక్రియలలో పాల్గొన్నాడు.[7]
తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి జగదీశ్ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థికసాయాన్ని అందజేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
- ↑ Sakshi (12 June 2023). "రాలిన పోరాట కుసుమం". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ "Mulugu ZP chairman Kusuma Jagadish dies of heart attack". The Times of India. 2023-06-12. ISSN 0971-8257. Archived from the original on 2023-06-12. Retrieved 2023-06-15.
- ↑ Namasthe Telangana (12 June 2023). "జగదీశ్ ఇక లేరు". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ Andhra Jyothy (12 June 2023). "గుండెపోటుతో ములుగు జడ్పీచైర్మన్ జగదీశ్ మృతి". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ 6.0 6.1 Eenadu (12 June 2023). "విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలే". Archived from the original on 12 June 2023. Retrieved 12 June 2023.
- ↑ telugu, NT News (2023-06-13). "కుసుమ జగదీశ్వర్‌కు కన్నీటి వీడ్కోలు". www.ntnews.com. Archived from the original on 2023-06-15. Retrieved 2023-06-15.
- ↑ Namasthe Telangana (7 July 2023). "సాయిచంద్ సతీమణి వేద రజనీకి గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ నియామక పత్రం అందజేత". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.