కూచి నరసింహం

వికీపీడియా నుండి
(కూచి నరసింహము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కూచి నరసింహం
Kuchi Narasimham Pantulu 1911 (page 278 crop).jpg
జననండిసెంబర్ 17, 1866
మరణంఅక్టోబరు 7, 1940. 1940 అక్టోబరు 7(1940-10-07) (వయసు 73)
పౌరసత్వంభారతదేశం
విద్యబి.ఎ., ఎల్.టి.
వృత్తిబోధన
తల్లిదండ్రులువెంకనార్యుడు, పుల్లమాంబ

కూచి నరసింహం (డిసెంబర్ 17, 1866 - అక్టోబరు 7, 1940) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత.

జీవిత సంగ్రహం[మార్చు]

వీరు డిసెంబరు 17, 1866న పిఠాపురంలో జన్మించారు. యాజ్ఞవల్క్య గోత్రుడు. తండ్రి వెంకనార్యుడు. తల్లి పుల్లమాంబ. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత 1888లో బి.ఏ. డిగ్రీ పొందారు. తర్వాత ఎల్.టి. పూర్తిచేశారు. కందుకూరి వీరేశలింగము ఇతని గురువు. వీరికి ఆంగ్ల సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. వీరు ఎలమంచిలి, నరసాపురం, నూజివీడు పట్టణాలలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. తరువాత పిఠాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చాలాకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.

ఆకాలంలో కూచి నరసింహమును, పానుగంటి లక్ష్మినరసింహరావును, చిలకమర్తి లక్ష్మినరసింహమును గలిపి 'సింహత్రయ' మని వ్యవహరించిరి. ఈ సింహత్రయమును పీఠికాపుర సంస్థానము భరించింది.

అనంతరం పిఠాపురం మహారాజా వారి సూర్యారాయాంధ్ర నిఘంటువు కార్యాలయంలో కొంతకాలం పనిచేశారు. వీరు శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, గౌరాంగ చరిత్ర (1912) లను రచించారు. ప్రముఖ ఆంగ్ల నాటకకర్త విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. వనవాసి, రూపలత అనే రెండు నాటకాలను రచించాడు.

వీరు అక్టోబరు 7, 1940న పరమపదించారు.

సాహిత్య సేవ[మార్చు]

ఉపాధ్యాయులలో నింత చండశాసను డుండడని వారి శిష్యులవలన వినికి. ఆయన యనపత్యుడు. శిష్యసంతానమే వారి సంతానము. విద్యార్థుల పురోభివృద్ధికి, వారి విజ్ఞానాభివృద్ధకి బంతులుగారనేక విధముల బరిశ్రమించెడి వారు. నయముననో భయముననో విద్యార్థుల నుద్ధరించుటయే ప్రధానాశయముగ బెట్టుకొనినారు. వీరు పెద్ద తరగతివారికంటే జిన్నతరగతివారికే యెక్కువశ్రద్ధ తీసుకొని పాఠము చెప్పుచుండువారు.పునాది దిట్టముగ నుండినగాని గోడ నిలబడ దని వీ రెఱుగుదురు. పిఠాపురోన్నత పాఠశాలను బ్రశంసించుచు 1907 లో జెన్నపుర పరీక్షా శాఖాధికారులు యోగ్యతాపత్ర మొసగిరన్న సంగతి తెలుగువారింకను మఱచియుండరు. మన నరసింహము పంతులుగారి ప్రధానోపాధ్యాయత్వమే యీ పాఠశాలకీ గౌరవము దెచ్చింది. పంతులుగారు పనిచేయుచున్నపుడు మెట్రిక్యులేషన్‌లో నూటికి నరువదిడెబ్బదివఱకు నుత్తీర్ణులసంఖ్య పెరిగింది. పంతులుగారు విద్యార్థులను బై తరగతిలోనికి బంపుట కెంతకార్కశ్యము కనబఱిచెడివారో, దానికి బదిరెట్లుత్తీర్ణులను జేయుటలో గారుణ్యము కనబఱచెడివారు. వీరికి శిష్యులయందెట్టి యాదరమో, వీరిపై వీరి శిష్యుల కట్టి భక్తి గౌరవములు. వీరి శిష్యులు నేడు మహాపదవులలో నుండి గౌరవింపబడుచున్నారు.

1938 లో నొకమారు పంతులుగారికి గొప్ప జబ్బుచేసింది. అది తెలిసికొని కాకినాడనుండి ముగ్గురు శిష్యులు రాత్రికి రాత్రి బయలుదేఱి వచ్చి వీరి చేతిలో నూఱురూపాయలు పెట్టి 'తమ రివి స్వీకరింపక తప్పదు. మాప్రార్థనము విని నిఘంటుకార్యాలయములో నింక బనిచేయవలదు. నిరంతర భాషావ్యాసంగమే మీయనారోగ్యమునకు హేతువు' అనిచెప్పి వెళ్ళిపోయిరట. శిష్యప్రేమ యిట్టిదని పంతులుగారు మాటలవరుసలో నీవిషయము చెప్పిరి.

పీఠికాపురాధీశ్వరులు గంగాధర రామారావుగారు పంతులుగారి చదువు చెప్పించి వీరి యభ్యుదయమునకు సర్వధా తోడ్పడిరి. 1888 లో బి.ఎ. ప్రథమశ్రేణి నుత్తీర్ణులైరి. నరసింహము పంతులుగారి వంటి శ్రీరామభక్తుని మఱియొకని మనము చూడము. ఆయన గ్రంథములన్నియు రామాంకితములే చేసెను. పంతులుగారి యభిమానవిషయము వేదాంతము. కళాశాలలో వీరి గురువులు కందుకూరి వీరేశలింగముగారు, మెట్కాఫ్‌ దొరగారు. విలియమ్స్‌పిళ్ల మున్నగువారు. కవితాగురువులు వీరేశలింగ కవిగారేయట. ఈ సంగతి పంతులుగారు తమ 'రామకృష్ణ పరమహంస చరిత్రము' న నిటులు చెప్పినారు.

అందఱును నన్ను నరసింహ మండ్రు; కవిత
యందు నాసక్తి బుట్టించినట్టి గురుడు
కందుకూరి వీరేశలింగ కవిమౌళి
స్థితిగతులు నీకు విన్నవించితిని రామ!

పీఠికాపుర సంస్థానాశ్రయణము పంతులుగారికి గవులలో బెద్దపేరు తెచ్చింది. వీరువ్రాసిన గ్రంథములు చాల బాఠ్యములుగా నిర్ణయింపబడినవి. 1904 లో శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్రము పద్యకావ్య ముగ నావిష్కరించిరి. ఈకబ్బమున గవిత్వమునుగూర్చిన తమ యభిప్రాయము నిటులు వెల్లడించికొనిరి.

శిశిరకుమారఘోషు ఆంగ్లములో రచించిన దానినిబట్టి 'గౌరాంగచరిత్రము' పద్యకావ్యముగ బంతులుగారు సంతరించిరి. పద్యకావ్యములేగాక 'వనవాసి' 'రూపలత' మున్నగు నాటకములు వచనకృతులు బెక్కులు రచియించిరి. మొత్తము వీరికృతులలో నాంగ్లానుకరణముసా లెక్కువయనవచ్చును. ఈయన గ్రాంథికభాషా ప్రియుడు.

మూలాలు[మార్చు]