Jump to content

కందుకూరి వీరేశలింగం పంతులు

వికీపీడియా నుండి
(కందుకూరి వీరేశలింగము నుండి దారిమార్పు చెందింది)
కందుకూరి వీరేశలింగం పంతులు
నవయుగ వైతాళికుడు
జననం(1848-04-16)1848 ఏప్రిల్ 16
రాజమండ్రి
మరణం1919 మే 27(1919-05-27) (వయసు 71)
చెన్నై
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సంఘసంస్కర్త, రచయిత
బిరుదురావుబహద్దూర్
జీవిత భాగస్వామిబాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ)
తల్లిదండ్రులు
  • సుబ్బారాయుడు (తండ్రి)
  • పున్నమ్మ (తల్లి)

కందుకూరి వీరేశలింగం (1848 ఏప్రిల్ 16 - 1919 మే 27 ) సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ వ్యాసారంగమ్లో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టాడు.

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా లోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.

వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.

చదువుకునే రోజుల్లో కేశుబ్ చంద్ర సేన్ రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.

1867లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.

ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరులో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.

కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులుతో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.

యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.

వీరేశలింగము పగలు సంస్కరణవిషయములలో, బనిచేసి రాత్రులు గ్రంధరచనము సాగించుచుండు నలవాటుకలవాడు. నీరసరోగ పీడితులగుట రాత్రులు వీరికి నిద్రపట్టెడిదికాదు."కాడ్లివరునూనె" యాహారప్రాయముగా నుపయోగించుకొనుచు గ్రంధరచన చేయుచుండేవాడు. ఈయన రచనలపై సాంప్రదాయుకులు అభియోగాలు మోపారు. చివరికాలమున నపనిందలకు లోనయ్యాడు. పరువు నష్టం కేసులో ఓడిపోయాడు.[1] ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27 న మరణించాడు.[2]

సంఘ సంస్కరణ కార్యక్రమాలు

[మార్చు]

వీరేశలింగం హేతువాది . ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.

వివేకవర్ధని పత్రిక ద్వారా అవినీతిపరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. సంఘసంస్కరణ కై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాసాడు.

ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు. ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, ఆయన విద్యార్థులూ వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (అత్తగారు బాపమ్మకు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు.

విప్లవాత్మకమైన మార్పు

[మార్చు]

చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే కార్యదీక్ష, సాహసము, విజ్ఞాన తృష్ణలు. రామమోహనరాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర సేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ల బోధనలు, రచనలు ఇతని ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చాయి. 1887 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించి, మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై విప్లవం ప్రారంభించాడు. మూఢ విశ్వాసాలు, సనాతనాచారాలపై ఆయన పోరాటము జరిపాడు.

సాహితీ వ్యాసంగం

[మార్చు]

సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో ప్రతిభ కలవాడు కందుకూరి.

ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. అన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.

కందుకూరి రచనల జాబితా

[మార్చు]

పద్య కావ్యాలు

[మార్చు]
  • "మార్కండేయా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
  • "శ్రీరాజమహేంద్ర పురవర గోపాలా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
  • శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం (నల చరిత్ర) - మూడు ఆశ్వాసాల కావ్యం
  • రసికజన రంజనం (ప్రబంధం) - 1870 - చిత్ర కవిత్వం, శృంగారం ప్రధానంగా ఉన్నాయి. ఇటువంటివి రచించడం సరి కాదని కాలక్రమాన మానివేశానని స్వీయరచనలో పేర్కొన్నాడు
  • అభాగ్యోపాఖ్యానము - హేళనా పూర్వకమైన సంఘ సంస్కార దృష్టితో కూడిన వ్యంగ్య కావ్యం
  • శుద్ధాంధ్ర భారత సంగ్రహము - అచ్చతెలుగులో మూడు ఆశ్వాసాల కావ్యం
  • సరస్వతీ నారద విలాపము (1895) - పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనం - భాషా ప్రయోగం పట్ల కందుకూరి దృక్పథంలో వచ్చిన మార్పును ఈ కావ్యంలో చూడవచ్చును. అర్ధ సారస్యం లేని ఊహలతో, పాండిత్య ప్రకర్షతో ఇటు సరస్వతిని, అటు నారదుని అవమానిస్తున్నారని ఇందులో చూపాడు.
  • నీతి పద్యాలు
  • స్త్రీ నీతి దీపిక
  • జాన్ గిల్పిన్ - ఆంగ్లంలో "విలియమ్ కౌపర్" వ్రాసిన కావ్యానికి తెలుగు సేత
  • పథిక విలాసము - ఆంగ్లంలో "ఆలివర్ గోల్డ్‌స్మిత్" వ్రాసిన "ది ట్రావెలర్" కావ్యానికి తెలుగు సేత

నాటకాలు

[మార్చు]

నవలలు

[మార్చు]
  • రాజశేఖర చరిత్రము - తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. "పంతులుగారి మహాయశస్సునకు శరత్కౌముది వంటిది" అని అక్కిరాజు రమాపతిరావు అన్నాడు. ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను విమర్శించాడు. చక్కని తెలుగు సామెతలను, లోకోక్తులను ప్రయోగించి ముందుతరం నవలలకు మార్గదర్శకంగా నిలచాడు.
  • సత్యరాజా పూర్వదేశ యాత్రలు - ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.
  • సత్యవతీ చరిత్రము (1883) - స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల - ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందింది.
  • చంద్రమతీ చరిత్రము (1884) - మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.

ప్రహసనాలు

[మార్చు]

సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా, వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు. చాలా ప్రహసనాలను "వివేక వర్ధిని" పత్రికలో ప్రచురించాడు. "ప్రహసనము ఆయన కరములకు ఉచితపరికరమయ్యెను. శైలి సొంపులతోను, హాస్యంపుదళులతోను శోభిల్లెడి ఈ ప్రహసనావళియందు దుష్టాంగమును ఖండించి శేషాంగ స్ఫూర్తికి రక్షణ చేయు శస్త్ర చికిత్సకునివలె ఈ రచయిత సాంఘిక అనర్ధములను దునుమాడెను" అని "రాయసం వెంకట శివుడు" ప్రశంసించాడు. సుమారు 50 కి పైగా వ్రాసిన ప్రహసనాలలో 10 వరకు ఆంగ్లమూలాలపై ఆధారపడినాయి. తక్కినవి స్వతంత్ర రచనలు. ప్రహసనాలు "హాస్య సంజీవని" పేరుతో మూడు భాగాలుగా ప్రచురితమయ్యాయి. కొన్ని ప్రసిద్ధ ప్రహసనాలు

  • పెళ్ళి వెళ్ళిన తరువాత పెద్ద పెళ్ళి, లోకోత్తర వివాహము - వేశ్యాభిమానం, చాదస్తపుటాచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్థం వంటి అంశాలు కలగలిపినవి.
  • జమా బందీ, యోగాభ్యాసము - కులాచారాన్ని నిరసించిన రచన
  • వేశ్యా విషయ సంవాదము
  • చంద్ర గ్రహణం
  • తేలు మందు
  • హిందూ మతసభ
  • బహుభార్యాత్వం
  • బాల భార్యా వృద్ధ భర్తృ సంవాదం
  • మ్యునిసిపల్ నాటకము
  • కామరూప ప్రహసనము
  • కలిపురుష శనైశ్చర విలాసము - కలి, శని కలిసి దేశంలో ప్రజలను అజ్ఞానులుగా, మూఢులుగా, మద్యపాన ప్రియులుగా చేస్తున్నారని
  • వేశ్యాప్రియ ప్రహసనం - 5 అంకాల ప్రహసనం, ఎంతో హాస్యం మిళితమైనది. ఆనాటి భోగం ఆచారాలను గురించి
  • అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం
  • విచిత్ర వివాహ ప్రహసనం

కథలు

[మార్చు]

అధికంగా కందుకూరి కథలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కాని అధికంగా స్వతంత్ర రచనలే. "సతీ హిత బోధిని" అనే పత్రికలో ఎక్కువగా ప్రచురించాడు. "నీతి కథా మంజరి" అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు.

వ్యాసాలు

[మార్చు]

వివిధ అంశాలపై వీరేశలింగం 190 దాకా వ్యాసాలు / ఉపన్యాసాలు వ్రాశాడు. సత్య వాదిని, వివేక వర్ధిని, సతీహితబోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా నంటి పత్రికలలో ఇవి ప్రచురితమైనాయి. ఉదాహరణకు కొన్ని వ్యాసాల శీర్షికలు

  • దేశీయ మహాసభ - దాని యుద్దేశ్యములు
  • రాజ్యాంగ సంస్కరణము - కులాచార సంస్కరణము
  • ఇంగ్లీషు ప్రభుత్వము వలన లాభములు
  • నీతి, విద్య కంటే నీతి ముఖ్యము, మానుష ధర్మము, ఈశ్వరోపాసనము
  • చదువెఱుగని స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు
  • అత్తగారి కోడంటికము, భార్యా భర్తల ఐకమత్యము, స్త్రీపునర్వివాహ శాస్త్ర సంగ్రహము, స్త్రీ పునర్వివాహ విషయకోపన్యాసము

చరిత్రలు

[మార్చు]
  • ఆంధ్ర కవుల చరిత్రము [5][6][7] - ఈ గ్రంథ రచన ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. సమగ్రమైన, పరిశోధనాత్మకమైన, ప్రణాళికా బద్ధమైన కవుల చరిత్ర రచనకు ఆది యత్నము. అనేక తాళపత్రాలను, శాసనాలను, ముద్రిత అముద్రిత గ్రంథాలను పరిశీలించి వెలువరించిన గ్రంథము. 1886 నుండి 1917 వరకు ఇది విస్తరింపబడింది. ఇది మూడు భాగాలుగా వెలువడింది.
  • స్వీయ చరిత్ర [8]- 1903- 1915 మధ్య సాగిన రచన. నిష్పక్షపాతంగా, వచన శైలిలో సాగిన రచన. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రికా గ్రంథమాల వారు దీనిని ప్రచురించారు. ఇది ఆనాటి సామాజిక స్థితికి అద్దం పట్టే రచన. తెలుగులో వచన స్వీయ చరిత్రకు ఇదే మొదలు.
  • దేశ చరిత్ర
  • నాయకుల చరిత్ర
  • ఉత్తమ స్త్రీల జీవిత చరిత్రలు

ఇతర రచనలు

[మార్చు]
  • సంగ్రహ వ్యాకరణం - లక్షణ గ్రంథం
  • కావ్య సంగ్రహం - లక్షణ గ్రంథం
  • తర్క సంగ్రహానికి ఆంధ్రీకరణం
  • ఋగ్వేదానికి తాత్పర్యం
  • శరీర శాస్త్ర సంగ్రహము
  • జ్యోతిశ్శాస్త్ర సంగ్రహము
  • జంతు స్వభావ చరితము

వీరేశలింగం నడిపిన పత్రికలు

[మార్చు]
  • వివేక వర్ధిని
  • సతీహిత బోధిని
  • సత్య సంవర్ధిని
  • సత్యదూత
  • చింతామణి
  • తెలుగు జనానా

విశిష్టత

[మార్చు]

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:

  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
  • తెలుగులో తొలి నవల వ్రాసింది ఆయనే
  • తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కందుకూ
  • ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది.

వీరేశలింగంకు నివాళులు

[మార్చు]
రాజమండ్రి కోటిపల్లి బస్సు నిలయం కూడలిలో వీరేశలింగం విగ్రహం

కొటికెలపూడి సీతమ్మ ఇలా చెప్పింది.

ఒకయెడ స్త్రీ పునరుద్వాహమును గూర్చి
వాదించు పండిత వరులతోడ
సరగ నింకొక దెస సంఘ సంస్కరణచే
చెలగు సభనుపన్యసించుచుండ
పఱగ వేరొక దెస పత్రికా ప్రకటన
భారంబు వహియించు ప్రజ్ఞ మీర
రహి నొక్క తఱి గ్రంథ రచనా విశేషంబు
నను దెల్పు జనుల దుర్నయములెల్ల

నొక నిమేషమైన విశ్రాంతినొందకుండ
పరహితార్ధంబు కొరకునై పాటు పడుచు
కాలమెంతయో విలువగా గడుపునహహ
ఘనుడు వీరేశలింగాఖ్య కవివరుండు


ఆరుద్ర ఇలా అన్నాడు (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)

" అదేం చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్ఠం చేసి దేశాభివృద్ధిని, భాషాభివృద్ధిని సాధించిన మనోబల భీములలో పంతులుగారు ప్రథములు. రెండోవారు గురజాడవారు. అటువంటి ఉజ్వల చారిత్రకుని ఏ బిరుదుతో వర్ణించినా అది అసమగ్రమే. అయినా నవ్యాంధ్ర నిర్మాతలనే నిర్మించినవారిగా నేను పంతులుగారిని భావిస్తున్నాను. అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ"

అక్కిరాజు రమాపతిరావు ఇలా ఆయనను కీర్తించాడు

"వీరేశలింగం పంతులుగారు బహుయోజన శాఖా సంయుతమైన వటవృక్షము వంటి వారు. నేడీ దేశీయుల యొక్క సాంఘిక చైతన్యమునకు, సారస్వత వైవిధ్యమునకు పంతులుగారు తమ కాలమునందు కావించిన కృషియే మూలాధారము. వారితో ఆధునిక యుగము ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును."

చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధిపై ఈనాటికీ కనిపిస్తుంది.

తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులార!

దృశ్యమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. టంగుటూరి, ప్రకాశం (1972). నా జీవిత యాత్ర. మతిలీపట్టణం: ఎమెస్కో. pp. 127–129. Retrieved 2 April 2018.
  2. మధునాపంతుల, సత్యనారాయణ శాస్త్రి (1950). ఆంధ్ర రచయితలు. రాజమహేంద్రవరము: అద్దేపల్లి అండ్ కో. pp. 82–88. Retrieved 2 April 2018.
  3. వీరేశలింగం, కందుకూరి. అభిజ్ఞాన శాకుంతలం.
  4. తెలుగు వెలుగు, వ్యాసాలు. "నాటకానికి అడుగుజాడ కందుకూరి". www.teluguvelugu.in. డా. కందిమళ్ళ సాంబశివరావు. Archived from the original on 23 ఏప్రిల్ 2020. Retrieved 23 April 2020.
  5. వీరేశలింగం పంతులు, కందుకూరి. ఆంధ్రకవుల చరిత్రము.
  6. వీరేశలింగం పంతులు, కందుకూరి. ఆంధ్ర కవుల చరిత్రము(రెండవ భాగము).
  7. వీరేశలింగం పంతులు, కందుకూరి. ఆంధ్ర కవుల చరిత్రము(మూడవ భాగము).
  8. వీరేశలింగం పంతులు, కందుకూరి. ఆంధ్ర కవుల చరిత్రము(మూడవ భాగము).
  • అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు పుస్తకం.
  • తెలుగు సాహిత్య చరిత్ర - డాక్టర్ ద్వా.నా.శాస్త్రి - ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
  • కందుకూరి వీరేశ లింగం - డాక్టర్ అక్కిరాజు ఉమాపతి రావు - "తెలుగు వైతాళికులు" లఘుగ్రంథాల పరంపరలో ముద్రింపబడినది - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006)

ఇంటర్నెట్‌లో లభించే పుస్తకాలు

[మార్చు]

ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్న పుస్తకాలు

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.