కె.ఆర్.కె.మోహన్
కే.ఆర్.కే.మోహన్ (కంచి రామకృష్ణ మోహన్) సైన్స్ ఫిక్షన్ రచయితగా సుప్రసిద్ధులు. ఈయనకృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 1933, నవంబర్ 18న జన్మించారు.[1] ఆయన తండ్రిగారు శ్రీ జగన్నాధ రావు గారు, తల్లి మాణిక్యమ్మ. ఆయన తాతగారు కుప్పురావు గారు, ముత్తాత రామారావు గారు. విష్ణువర్ధన గోత్రం.
బాల్యం
[మార్చు]శ్రీ కే ఆర్ కే మోహన్ గారి విద్యాభ్యాసం బి. ఎ. వరకు జరిగింది. డాక్టర్ అయ్యి పేదలకి ఉచితంగా సేవచేయాలన్న చిరకాల వాంఛ నెరవేరలేదు. ఎందుకంటే ఆయన తండ్రిగారు శ్రీ జగన్నాథ రావుగారు, మోహన్ గారు పదవ తరగతి చదువుతున్నప్పుడు కాలం చేయడంతో కుటుంబం నడపడంలో తానే ముఖ్య పాత్ర పోషించాల్సి వచ్చింది. ఇంటి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం తో చదువు అక్కడితో ఆపి ఇంటి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 1953 లో పోస్టల్ శాఖ లో చేరి తను ఉద్యోగం చేసుకుంటూ బి. ఎ. చదివారు. పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితివల్ల చిన్నతనమంతా లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేవారు. అలా లైబ్రరీలో ఉన్న దాదాపూ అన్ని పుస్తకాలూ చదివేసేవారు. చదవటంలో ఎంత లీనమైపోయే వారంటే ఒక రోజు మంగలి షాపుకి వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడం తో ఇంట్లోవాళ్ళు కంగారు పడి వాకబు చేస్తే మంగలి షాపులో పుస్తకాలు ఒకదాని తరువాత ఒకటిగా చదువుతూ కూర్చున్నారని కుటుంబ సభ్యులకి తెలిసింది. ఎన్నో పుస్తకాలు చదవడం అనే అలవాటు వల్లనే ఆయనకీ అంత మంచి పరిజ్ఞానం చేకూరింది. ఆయనని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు లివింగ్ ఎన్సైక్లోపీడియా అని పిలిచేవారు. తెలుగు సినిమా హీరో కృష్ణ ను పరిచయం చేసిన ‘తేనె మనసులు’ చిత్రానికి ఈయనే కథా రచన చేశారు. [2] 1991 లో ఆయన హెడ్ పోస్ట్ మాస్టర్ గా పదవీ విరమణ చేసారు.
అవార్డులు
[మార్చు]తెలుగు ఇంగ్లిషు భాషలు రెండింటిలోనూ విస్తారంగా రచనలు కథానికలు, నవలలు, నాటకాలు, కవితలు, వ్యాసాలూ, పుస్తక సమీక్షలు వంటి అనేక ప్రక్రియలలో ఐదు వేల వరకూ ఆయన రచనలు ముద్రిత మయ్యాయి. రెండు జాతీయ పురస్కారాలు పొందారు. 1971 లో వక్రించిన సరళరేఖలు నవల ఉర్దూ అనువాదానికి (రోషన్ సాయే) కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయ పురస్కారం అందింది. [3] ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తెలుగు, ఇంగ్లీషులలో 58 బహుమతులు, పురస్కారాలు పొందారు.
- 1996లో ఇంటర్నేషనల్ P.E.N. సియోల్, కొరియా వారు 22 ఆసియా దేశాల నుంచి ఎంపిక చేసిన కథలలో భారతదేశానికి చెందిన ఐదు కథలలో ‘The God Forsaken’ అన్న కథ ‘Asian Literature’ అన్న గ్రంథంలో ప్రచురితం.
- 1994లో ‘రెలెవెన్స్ ఆఫ్ వివేకానందాస్ మెసేజ్’ అన్న వ్యాసానికి సహారా ఇండియా కలకత్తా వారి ప్రత్యేక బహుమతి.
- ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వారి జాతీయ స్థాయి పోటీ లో ‘The Wheels of Lord Chariot’ అన్న కథకు తృతీయ బహుమతి.
- 1995లో భోపాల్ లోని అఖిల భారత భాషా సాహిత్య పరిషత్ వారిచే ‘సాహిత్య శ్రీ’ బిరుదు.
- 1996లో కలకత్తా లోని Indian Board of Alternative Medicine వారిచే వైద్యేతర రంగాలలో విశిష్ట కృషికి ‘శిరోమణి’ గౌరవ డాక్టరేటు.
- సైన్సు ఫిక్షన్ లో 80 కథలు, ౩ నవలలూ, 6 నాటకాలు.
- ఇండియన్ అసోసియేషన్ ఫర్ సైన్స్ ఫిక్షన్ స్టడీస్ కి వైస్ ప్రెసిడెంట్ గా సేవ.
- అనేక రచనలు, విదేశీ పత్రికలూ, పుస్తకాలలో ప్రచురితం.
- పలు రచనలు, ప్రథాన భారతీయ భాషలతో పాటూ ఇంగ్లీషు, డానిష్ (హంగేరియన్) భాషలలోకి అనువాదం.
- సైన్స్ ఫిక్షన్ నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారం.
- 2000 సంవత్సరంలో ఊయల కమ్యూనికేషన్స్ వారిచే ‘బాల సాహితీ విభూషణ’ బిరుదు.
- ‘రాజతంత్రం’ అన్న కథకు 1984లో బాలజ్యోతి కథానికల పోటీలో ప్రథమ బహుమతి.
- 1988లో బాలజ్యోతి పత్రిక నిర్వహించిన పోటీలో ‘యే ఆవ్ రా బావా’ అన్న కథలు ద్వితీయ బహుమతి.
- ‘పసి మనసులు’ నవలకు అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా 1979లో ‘ప్రభవ’ మాస పత్రిక ప్రత్యేక అనుబంధ నవలగా ప్రచురణ.
- ‘మరువదగని యాత్ర’ నవలకు ‘మా బడి’ మాస పత్రిక నిర్వహించిన పోటీలో 1980లో ప్రథమ బహుమతి.
- ‘చరిత్రలో ఒక బంగారు పుట’ నవలకు విశ్వసాహితి వారు నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి.
- ‘ఒక పల్లె కథ’ కు 1997లో SRC (స్టేట్ రిసోర్స్ సెంటర్) హైదరాబాద్ వారు వయోజనుల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో ప్రథమ బహుమతి.
- ‘తెలుగు మే బాల సాహిత్య’ అనే హిందీ వ్యాసం లక్నో నుంచ్ వెలువడే ‘భారత భారతి’ ప్రత్యేక సంచికలో ప్రచురితం.
- కృష్ణా పత్రిక, చుక్కాని, సితార వంటి పత్రికలలో ఎన్నో చిత్ర సమీక్షలు.
- ఎన్నో పత్రికలలో, సావనీర్ లలో సంపాదకుల కోరిక మేరకు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రత్యేక వ్యాసాలూ, విశ్లేషనాత్మక రచనలూ.
- చిత్ర పరిశ్రమకు చెందిన ఎన్నో విషయాలు 1980 దశకంలో ‘శివరంజని’లో ఇంచుమించు ప్రతి వారం అలాగే ‘జ్యోతిచిత్ర’ ‘సితార’లలో గణనీయమైన సంఖ్యలో ప్రచురణ.
- బల్గేరియాలోని ‘వరల్డ్ హ్యుమర్ సొసైటీ’ వారు ప్రచురించిన ‘Anthology of World Humour’ లో ‘ది స్టోరీ ఆఫ్ ఏ పాం ట్రీ’ ప్రచురితం.
- ‘ఊరగాయ నవ్వింది’ అనే కథకు 1990లో ‘స్వాతి’ వార పత్రిక హాస్య కథల పోటీలో బహుమతి.
- ‘దశమ గ్రహ గ్రహణం’ కథకు 1998లో ‘విశాఖ సోమేశ్వర’ సాహితీ కథల పోటీలో బహుమతి.
- ‘ముప్పు తెచ్చిన మూడు ప్రశ్నలు’, ‘వ్రతం అయ్యింది కానీ...’ కథలు జాగృతి, విశ్వరచన పత్రికల బహుమతులు పొందాయి.
- ‘ఓ ధృతరాష్ట్రుని కథ’ 1984లో ‘ఆంధ్రప్రభ’ జన్మదిన ప్రత్యేక సంచికలో ప్రచురితం.
- ‘ఊరగాయ నవ్వింది’ కథ యొక్క ఇద్దరు కన్నడ రచయితలు చేసిన వేర్వేరు అనువాదాలు ప్రసిద్ధ కన్నడ పత్రికలలో ప్రచురితం.
- ‘పేరు తెచ్చిన పేచీ’, ‘అద్దాల మేడ’ నాటికలు ఆంధ్రప్రదేశ్ ఆకాశవాణి కేంద్రాల నుంచే కాక, మద్రాసు కేంద్రం నుంచి కూడా పలుమార్లు ప్రసారం.
- ‘గబ్బిలాలు’ ‘అద్దాలమేడ’ నాటికలు పలు విద్యార్ధి సాంస్కృతిక సంఘాలచే స్టేజీ మీద ప్రదర్శించ బడ్డాయి.
- ‘స్వయంకృతం’ అనే (బోనస్) ప్రత్యేక నాటికను పోస్టల్ డిపార్టుమెంటు కోరిక పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసింది.
- మనదేశంలో టెలిఫోన్ శాఖ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ‘జనరల్ మేనేజర్’ గారి కోరిక మేరకు ‘టెలిఫోన్ వచ్చింది’ అనే కథ ప్రత్యేకించి వ్రాయబడింది.
- కొన్ని నాటికలను అమృతవాణి సంస్థ ప్రత్యేకంగా వ్రాయించి ‘మనీలా’, ఫిలిప్పీన్స్ కేంద్రం నుంచి ప్రసారం చేసింది.
- ‘గాలివాన’ కథకు 1963 ‘జాగృతి’ దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి. ఈ కథ ఉర్దూ అనువాదం ‘తూఫాన్ కే బాద్’ అన్న పేర 1977 బొంబాయి లోని ‘షాయర్’ మాసపత్రిక జాతీయ సమైక్యతపై వెలువరించిన ప్రత్యేక సంచికలో ప్రచురితం.
- ‘శిక్ష పడని నేరం’ కథకి 1988లో పర్లాకిమిడి, ఒరిస్సా లోని చైతన్య సాహితి వారి కథానికల పోటీలో ప్రథమ బహుమతి.
- అనేక కథలు ఇండియా టుడే, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, జాగృతి మొదలైన ప్రామాణిక పత్రికలలో ప్రచురితం.
- ‘తేజోలింగ రహస్యం’ నవల ఆంధ్రభూమి మాస పత్రిక నవంబర్ 1990లో పూర్తి నవలగా ప్రచురితం.
- ‘అంతరిక్షంలో అంతర్ధానం’ నవలకు 1970లో సాహిత్య అకాడమీ బహుమతి.
రచనలు
[మార్చు]ఈయన రచనలు అనామిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆకాశిక్, ఆదివారం, ఆనందజ్యోతి, ఇండియా టుడే, ఈవారం, ఉదయం, కథాకేళి, చతుర, చుక్కాని, జనసుధ, జయశ్రీ, జలధి, జాగృతి, జ్యోతి, తెలుగు, తెలుగు విద్యార్థి, నివేదిత, పల్లకి, పుస్తకం, ప్రగతి, ప్రభవ, భారతమిత్రం, భారతి, మయూరి, మూసీ, యువ, యోజన, రచన, విజయ, విశ్వరచన, వీచిక, సెల్యూట్, సౌమ్య, స్వాతి, హాస్యప్రభ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
ఈయన ముద్రిత గ్రంథాలు:
- ఊరగాయ నవ్వింది (కథాసంపుటం)
- కె.ఆర్.కె.మోహన్ కథలు (కథాసంపుటం)
- జారుడు మెట్లు జారని కాళ్లు (కథాసంపుటం)
- తుషార బిందువులు (కథాసంపుటం)
- పిల్లల కథలు (కథాసంపుటం)
- మణి మంజీరాలు (కథాసంపుటం)
- రాగ రేఖలు (కథాసంపుటం)
- రామాయణం తిరగబడింది (కథాసంపుటం)
- సుమసౌరభాలు (కథాసంపుటం)
- సైన్స్ ఫిక్షన్ కథలు (కథాసంపుటం)
- బాబాసాహెబ్ అంబేద్కర్ (అనువాదం)
- ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము
- శతాబ్దాలుగా తెలుగు భాషాస్వరూపం
- అద్దాల మేడ (రెండు నాటకాలు - రెండు ఏకపాత్రాభినయములు)
- పాశ్చాత్యులు - తెలుగు భాషాసంస్కృతులు
- వైకుంఠపాళీ
- చిత్రరంగ (వి)చిత్రాలు
- వక్రించిన సరళరేఖలు (నవల)
- తేజోలింగ రహస్యం (సైన్స్ నవల)
- అంతరిక్షంలో అంతర్ధానం (సైన్స్ నవల)
- పిల్లల కోసం తెలుగు సాహిత్య చరిత్ర
- కనకపు సింహాసనమున
- కనువిప్పు
- ఏడు పిల్ల(ల) నవలలు[4]
- Tomorrow's Truths about The Moon Told Today
పురస్కారాలు
[మార్చు]- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్(NCSTC) జాతీయ పురస్కారం 1993లో.[5]